న్యూస్ యాంకర్ల బహిష్కరణతో 'ఇండియా' కూటమి సాధించేదేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, చందన్ కుమార్ జజ్వాడే
- హోదా, బీబీసీ ప్రతినిధి
కొందరు న్యూస్ యాంకర్లు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు తమ నాయకులెవరూ హాజరుకాకూడదని ప్రతిపక్ష పార్టీల కూటమి 'ఇండియా' నిర్ణయించింది.
వివిధ వార్తా ఛానళ్లకు చెందిన 14 మంది యాంకర్ల జాబితాను కూడా విడుదల చేసింది.
'ద్వేషపూరిత' చర్చలు నిర్వహిస్తున్న కొందరు టీవీ యాంకర్లను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.
దేశంలో ఒక రాజకీయ పార్టీ లేదా ఒక కూటమి మూకుమ్మడిగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి.
ఇది 'ఎమర్జెన్సీ మనస్తత్వం' అంటూ అధికార బీజేపీ విమర్శించింది.
ప్రతిపక్షాల కూటమి తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా మాట్లాడుతూ “రోజూ సాయంత్రం ఐదు గంటలకు, కొన్ని వార్తా ఛానళ్లలో విద్వేషపూరిత మార్కెట్ ప్రారంభమవుతుంది. తొమ్మిదేళ్లుగా ఇదే జరుగుతోంది. వివిధ పార్టీలకు చెందిన కొందరు ప్రతినిధులు ఈ మార్కెట్‌కు వెళ్తారు. కొందరు నిపుణులు, కొందరు విశ్లేషకులు కూడా ఆ మార్కెట్‌కు వెళ్తారు. కానీ, నిజం ఏంటంటే, ఆ ద్వేషపూరిత మార్కెట్‌లో మనమందరం వినియోగదారులం అవుతాం'' అని అన్నారు.
ఆ యాంకర్లు నిర్వహించే కార్యక్రమాల్లో తమ నేతలు పాల్గొనకూడదని విపక్ష కూటమి నిర్ణయించింది. ఆ యాంకర్లలో అదీతీ త్యాగి, అమన్ చోప్రా, అమిష్ దేవ్‌గణ్, ఆనంద్ నరసింహన్, అర్నాబ్ గోస్వామి, అశోక్ శ్రీవాస్తవ, చిత్ర త్రిపాఠి, గౌరవ్ సావంత్, నవికా కుమార్, ప్రాచి పరాశర్, రుబికా లిమాఖత్, శివ్ అరూర్, సుధీర్ చౌధురి, సుశాంత్ సిన్హా ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
యాంకర్లపై వచ్చిన ఆరోపణలు
ద్వేషంతో నిండిన కథనాలు సమాజాన్ని నిర్వీర్యం చేస్తాయని పవన్ ఖేడా అన్నారు.
అయితే, విపక్ష కూటమి తీసుకున్న ఈ నిర్ణయంపై చాలా మంది జర్నలిస్టులు, ముఖ్యంగా టీవీ ఛానళ్లకు సంబంధించిన జర్నలిస్టులు, బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.
"ఇలా న్యూస్ యాంకర్ల జాబితాను విడుదల చేయడం నాజీలను గుర్తు చేస్తోంది. అందులో ఎవరిని టార్గెట్ చేయాలో నిర్ణయించుకున్నారు. ఇప్పటికీ ఆ పార్టీల్లో ఎమర్జెన్సీ నాటి మనస్తత్వం అలాగే ఉంది'' అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.
ఆజ్ తక్, ఇండియా టుడే, జీఎన్‌టీ వంటి వార్తా ఛానళ్ల న్యూస్ డైరెక్టర్ సుప్రియా ప్రసాద్ విపక్ష కూటమి నిర్ణయాన్ని ఖండిస్తూ ట్వీట్ చేశారు. "ఈ నిరంకుశ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా. ఏకపక్ష చర్యను వెంటనే ఉపసంహరించుకోవాలి'' అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''ఈ నిర్ణయం మీడియా గొంతునొక్కడం లాంటిది. ప్రజాస్వామ్య విలువలు, భావప్రకటనా స్వేచ్ఛ గురించి మాట్లాడే కూటమికి ఇది ముగింపులా ఉంది. అయినప్పటికీ మా షోలకు అందరినీ ఆహ్వానిస్తాం'' అని ఏబీపీ నెట్‌వర్క్ సీఈవో, ఎన్‌బీడీఏ అధ్యక్షులు అవినాష్ పాండే చెప్పారు.
ఎన్డీటీవీ మాజీ యాంకర్ రవీష్ కుమార్ కూడా ఈ నిర్ణయంపై స్పందించారు. "ఏడేళ్లపాటు బహిష్కరణను ఎదుర్కొన్నాం. ఏడు గంటలు కూడా గడవలేదు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని రేపు ప్రధానమంత్రి మొదటిసారి మీడియా సమావేశం పెడతారేమో..'' అని ఆయన ట్వీట్ చేశారు.
ఎన్డీటీవీలో జరిగే తన షోను బీజేపీ బహిష్కరించిందని, ఏ బీజేపీ నాయకుడూ తన షోలో పాల్గొనలేదని రవీష్ కుమార్ గతం నుంచీ ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతిపక్షానికి లాభమా?
యాంకర్ ద్వేషపూరిత ఉద్దేశాలతో, పక్షపాత వైఖరితో వ్యవహరించినా, ప్రతిపక్ష నేతలు లేకపోతే వాటి వల్ల లాభం ఏం ఉంటుంది? అలాగే, చర్చలో విపక్ష నేతలు లేకపోతే ప్రతిపక్షాలకు నష్టం కలగదా?
“యాంకర్‌ను బహిష్కరించడం ద్వారా ఛానళ్ల విశ్వసనీయతపై దెబ్బ పడింది. పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, తొమ్మిదేళ్లుగా ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని చెప్పినట్టైంది'' అని సీనియర్ జర్నలిస్ట్ ఎన్‌కే సింగ్ అభిప్రాయపడ్డారు.
''ఏ ప్రజాస్వామ్యంలోనైనా నాలుగు విషయాలు ముఖ్యం. మెజారిటీ పాలన, మైనారిటీలకు గుర్తింపు, రాజ్యాంగబద్దమైన ప్రభుత్వం, చర్చల ద్వారా మెరుగైన పాలన అందేలా చూడడం. న్యూస్ ఛానళ్ల పాత్ర ఏంటంటే చర్చల ద్వారా మెరుగైన పాలన అందేందుకు దోహదపడడం. ఇది ఐదేళ్లపాటు ఎవరికి ఏది కావాలంటే అది మాత్రమే చేసే కాంట్రాక్ట్ కాదు'' అని ఎన్‌కే సింగ్ అన్నారు.
''యాంకర్‌ను బహిష్కరించడం ద్వారా వారి నిరసన తెలియజేస్తున్నారు. మీరు చేస్తోంది సరైనది కాదని చెప్పాలనుకుంటున్నారు'' అని సీనియర్ జర్నలిస్ట్, టీవీ టుడే నెట్‌వర్క్ న్యూస్ డైరెక్టర్ ఖమర్ వహీద్ నఖ్వీ అభిప్రాయపడ్డారు.
''చాలా మంది యాంకర్లు నిర్వహిస్తున్న చర్చల్లో పక్షపాత ధోరణి కనిపిస్తోంది. ఒకరిని గొప్పగా చూపిస్తూ, మరొకరి వాదనకు కూడా సమప్రాధాన్యం ఇస్తున్నట్లు చూపించాలనుకుంటున్నారు. చర్చలు ఎలాంటి పక్షపాతం లేకుండా నిర్వహించడమే యాంకర్ పని'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియా ధైర్యమా?
''ప్రతిపక్ష నేతలు ఛానళ్ల జాబితా విడుదల చేయలేదు. కేవలం యాంకర్ల పేర్లను మాత్రమే ప్రస్తావించారు. మరో విషయం ఏంటంటే ఇది సోషల్ మీడియా యుగం. సోషల్ మీడియా ప్రతి ఒక్కరికీ ప్రధాన ఆప్షన్‌గా మారింది. యాంకర్లను బహిష్కరించడం అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియా వ్యవహరిస్తున్న తీరుకు అద్దంపట్టింది. ప్రస్తుతం మెయిన్ స్ట్రీమ్ మీడియా పరిస్థితి కూడా గతంలో మాదిరిగా లేదు'' ఖమర్ వహీద్ నఖ్వీ అన్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాలు, ఎంతో మంది ప్రముఖ జర్నలిస్టులు, స్థానిక అంశాల నుంచి జాతీయ స్థాయి వరకూ అనేక అంశాలపై యూట్యూబ్ చానళ్లలో చర్చలు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా ఎంత ముఖ్యమైన విభాగంగా మారిందో అంచనా వేయొచ్చు.
ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రజలు యాక్టివ్‌గా ఉంటున్న రోజులివి.
ప్రస్తుతం ప్రజలు టీవీ ఛానళ్లను కాదని సోషల్ మీడియాకు మారిపోయారని ఎన్‌కే సింగ్ అన్నారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా తన 'భారత్ జోడో' పర్యటన సందర్భంగా యూట్యూబర్లకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా సోషల్ మీడియాకు ప్రాధాన్యం ఇస్తోంది.
యాంకర్లు పక్షపాత ధోరణితో, ఏకపక్షంగా వార్తలు చూపిస్తే ఎవరు చూస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ప్రశ్నించారు.
''ఉగ్రవాదులు ఆయుధాలతో హింస, ద్వేషాన్ని వ్యాప్తి చేస్తారని నా అభిప్రాయం. ఈ యాంకర్లు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మేధో ఉగ్రవాదుల పాత్ర పోషిస్తున్నారు. కోట్లు, ప్యాంట్లు, టైలు కట్టుకుని ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఈ నిషేధం నిర్ణయం ఇంతకు ముందే తీసుకుని ఉండాల్సింది'' అని సంజయ్ సింగ్ అన్నారు.

ఫొటో సోర్స్, REUTERS
భారత్‌లో టీవీ చర్చల సమయంలో చాలా సార్లు రెండు పార్టీల మధ్య గొడవలు కూడా జరిగాయి. అదే కాకుండా టీవీ చర్చల్లో ఉపయోగిస్తున్న భాష స్థాయిపై పలుమార్లు ప్రశ్నలు తలెత్తాయి.
టీవీ ఛానళ్లలో చర్చలు జరుపుతున్న విషయాలపై నిరుడు ఒక సందర్భంలో సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మూగప్రేక్షకుడిలా వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందా? దీన్ని చాలా చిన్న విషయంగా తీసుకుంటోందా? అంటూ పలు ప్రశ్నలను కూడా లేవనెత్తింది.
ఇప్పుడు విపక్షాల ఆరోపణలతో అందరి దృష్టి వారిపై పడిన నేపథ్యంలో ఆ యాంకర్ల షోలలో ఏమైనా మార్పు వస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి:
- నిపా వైరస్ కోవిడ్ కంటే ప్రమాదకరం - ఐసీఎంఆర్ హెచ్చరిక
- మార్క్ ఆంటోనీ రివ్యూ: విశాల్ చేయించిన టైమ్ ట్రావెల్ ఆకట్టుకుందా...
- అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామి చనిపోతే, శరీరాన్ని ఏం చేస్తారు?
- టాలీవుడ్ డ్రగ్స్ కేసు: నటుడు నవదీప్ పరారీలో ఉన్నారా... ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు?
- హౌరా రైల్వే స్టేషన్: 90 ఏళ్ల కిందట భారత్‌లో జరిగిన ఒక దారుణ బయో మర్డర్ కుట్ర
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














