మొరాకో భూకంపం: తన 32 మంది విద్యార్థుల కోసం ఆ టీచర్ ఎలా వెతికారంటే...

ఫొటో సోర్స్, ADASEEL SCHOOL
- రచయిత, యాస్మిన్ ఫరాగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మొరాకోలో 6.8 తీవ్రతతో భూకంపం రాగానే ఆ స్కూల్ టీచర్‌కు వెంటనే తన విద్యార్థులు గుర్తొచ్చారు.
పిల్లలకు అరబిక్, ఫ్రెంచ్ నేర్పే ఆ టీచర్ పేరు నస్రీన్ అబు ఎల్‌ఫాడెల్.
ఆమె మరాకేశ్‌లో ఉంటారు. కానీ, పర్వత గ్రామమైన అదాసీల్‌లో ఆమె పనిచేసే స్కూల్, విద్యార్థులు ఉంటారు. భూకంప కేంద్రానికి అదాసీల్ చాలా దగ్గరగా ఉంది.
భూకంపం వచ్చిన తర్వాత పిల్లల్ని వెతుకుతూ ఆమె అదాసీల్ గ్రామానికి వెళ్లారు.
అక్కడికి వెళ్లాక తన వద్ద రోజూ చదువుకునే 32 మంది విద్యార్థులు చనిపోయినట్లు ఆమె గుర్తించారు. వారందరి వయసు 6 నుంచి 12 ఏళ్ల వరకు ఉంటుంది.
‘‘నేను ఆ గ్రామానికి వెళ్లి నా పిల్లల (విద్యార్థులు) గురించి అడగడం మొదలుపెట్టా. సొమయా ఎక్కడ? యూసఫ్ ఎక్కడ? ఆ అమ్మాయి ఏది? ఈ అబ్బాయి ఎక్కడున్నాడు? అంటూ అందర్నీ అడిగాను. వాళ్లంతా చనిపోయినట్లు నాకు తెలిసింది.
వెంటనే నాకు స్కూల్‌లో క్లాస్ అటెండెన్స్ రిజిస్టర్ పట్టుకొని ఒక్కొక్కరిగా 32 మంది పేర్లు పిలుస్తూ వారి పేర్ల పక్కన మార్క్ చేసుకుంటున్న దృశ్యం ఒక్కసారిగా గుర్తొచ్చింది. కానీ, ఇప్పుడు వారందరూ చనిపోయారు’’ అని బీబీసీతో ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, ADASEEL SCHOOL
మొరాకోలో భూకంపం కారణంగా చనిపోయిన దాదాపు 3,000 మందిలో ఈ పిల్లలు కూడా ఉన్నారు. సెప్టెంబర్ 8వ తేదీన సాయంత్రం వచ్చిన ఈ భూకంపం, మొరాకోలో ఇప్పటివరకు వచ్చిన బలమైన భూకంపంగా రికార్డు అయింది.
దక్షిణ మరకేశ్ ఏరియా భూకంపానికి తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడి పర్వతాల్లోని చాలా గ్రామాలు పూర్తిగా నాశనం అయ్యాయి. ఆ ప్రాంతాల్లో అదాసీల్ ఒకటి.
తన విద్యార్థి, ఆరేళ్ల ఖదీజాకు ఏం జరిగిందో నస్రీన్ గుర్తు చేసుకున్నారు.
ఖదీజా మృతదేహం ఆమె తోబుట్టువులు మొహమ్మద్, మేనా, హనన్‌ల పక్కన పడి ఉండటాన్ని రెస్క్యూయర్లు గుర్తించారు.
వాళ్లంతా బెడ్‌మీదే ఉన్నారు. భూకంపం వచ్చినప్పుడు బహుశా వారంతా పడుకొని ఉంటారు. ఆ పిల్లలంతా నస్రీన్ స్కూలుకే వెళ్లి చదువుకునేవారు.
‘‘ఖదీజా అంటే నాకు చాలా ఇష్టం. ఆమె చాలా యాక్టివ్, చక్కటి పిల్ల. తనకు పాటలంటే చాలా ఇష్టం. చదువుకోవడానికి మా ఇంటికి వచ్చేది. ఆమెతో మాట్లాడటాన్ని, చదువు చెప్పడాన్ని నేను బాగా ఆస్వాదించేదాన్ని’’ అని నస్రీన్ చెప్పారు.

తన విద్యార్థులంతా నేర్చుకోవడానికి చాలా ఉత్సాహం చూపేవారని, వారు ‘‘ఏంజెల్స్’’ అని ఆమె అభివర్ణించారు.
పేదరికంతో, పెరుగుతున్న జీవన వ్యయ సంక్షోభంతో సతమతం అవుతున్నప్పటికీ చదువుకోవడమే ప్రపంచలో అత్యంత ముఖ్యమైన అంశమని ఆ పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు భావించారని ఆమె తెలిపారు.
‘‘మా చివరి తరగతి శుక్రవారం రాత్రి జరిగింది. అంటే, భూకంపం రావడానికి సరిగ్గా అయిదు గంటల ముందు.
పిల్లలకు మొరాకో జాతీయ గీతం నేర్పిస్తున్నాం. సోమవారం ఉదయం స్కూల్లో పిల్లల అందరి ముందు వారితో జాతీయ గీతం పాడించాలని అనుకున్నాం’’ అని నస్రీన్ చెప్పారు.
నస్రీన్ మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ ఆమె వారి జ్ఞాపకాలతో సతమతం అవుతున్నారు.
తన స్కూల్‌కు, తన విద్యార్థులకు జరిగినదాన్ని ఆమె ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.
‘‘నేను నిద్రపోలేకపోతున్నా. ఇంకా షాక్‌లోనే ఉన్నా.
అదృష్టవంతుల్లో ఒకరిగా ప్రజలు నన్ను అనుకుంటున్నారు. కానీ, మిగతా జీవితం ఎలా బతకాలో నాకు తెలియట్లేదు’’ అని నస్రీన్ చెప్పారు.
అమజి జనాభా ఉన్న గ్రామాల్లోని పిల్లలకు అరబిక్, ఫ్రెంచ్ భాషలు నేర్పించడం అంటే నస్రీన్‌కు చాలా ఇష్టం. అమజి ప్రజలు ప్రధానంగా వారి సొంత భాష అయిన ‘టమాజియాట్’లో మాట్లాడతారు.
‘‘అరబిక్, ఫ్రెంచ్ భాషలు నేర్చుకోవడం చాలా కష్టం. కానీ, ఈ పిల్లలు చాలా తెలివైనవారు. వారు ఈ రెండూ భాషలపై దాదాపు పట్టు సాధించారు’’ అని ఆమె గుర్తు చేసుకున్నారు.
బోధననే తన వృత్తిగా కొనసాగించాలని ఆమె అనుకుంటున్నారు. భూకంపం వల్ల కూలిపోయిన అదాసీల్ స్కూల్‌ను అధికారులు పునర్నిర్మిస్తారని ఆమె ఆశిస్తున్నారు.
భూకంపంతో మొత్తం 530 విద్యా సంస్థలు వివిధ స్థాయిల్లో దెబ్బతిన్నాయి. వీటిలో కొన్ని పూర్తిగా కూలిపోయాయి. కొన్ని తీవ్రంగా ధ్వంసం అయ్యాయని అధికారులు చెప్పారు.
భూకంప ప్రభావానికి తీవ్రంగా లోనైన ప్రాంతాల్లో తరగతులను తాత్కాలికంగా నిలిపేశారు.
‘‘ఆ పాఠశాలను పునర్నిర్మించి, మళ్లీ తరగతులు ప్రారంభమైన రోజు బహుశా మేం ఈ 32 మంది పిల్లలను స్మరించుకొని వారి కథలు చెప్పుకుంటామేమో’’ అని నస్రీన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















