అరుణాచల్‌ ప్రదేశ్ : బ్రహ్మపుత్ర నదిపై ఆనకట్టతో చైనాకు అడ్డుకట్ట వేయగలమా

సియాంగ్ నది

ఫొటో సోర్స్, GETTY IMAGES

    • రచయిత, దిలీప్ కుమార్ శర్మ
    • హోదా, బీబీసీ కోసం, గువాహటి

అరుణాచల్‌ ప్రదేశ్‌లో ప్రవహించే సియాంగ్ నది(బ్రహ్మపుత్ర నదినే ఈ రాష్ట్రంలో సియాంగ్ అంటారు) ప్రవాహంలో ఇటీవల కాలంలో అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి.

సియాంగ్ నది ప్రవాహంలోని ఈ అనూహ్య మార్పులతో కొన్నిసార్లు ఊహించని రీతిలో నీటి స్థాయిలు పెరిగిపోతున్నాయి.

దీంతో సరిహద్దు ప్రాంతాలు వరదల్లో కూరుకుపోతున్నాయి. కొన్నిసార్లు ఈ నది పూర్తిగా ఎండిపోవడాన్ని కూడా ప్రజలు చూస్తున్నారు.

చిన్నప్పటి నుంచి తాను సియాంగ్ నది తీరును గమనిస్తున్నట్లు తూర్పు సియాంగ్ జిల్లా మెబో తహశీల్‌కు చెందిన డాక్టర్ డాంగి పర్మే చెప్పారు.

కానీ, గత నాలుగైదు సంవత్సరాలుగా చాలా ఆందోళనకరంగా ఈ నది మారినట్లు ఆయన చెప్పారు.

‘‘అంతకుముందు సియాంగ్ నది నీరు చాలా స్పష్టంగా, నీలం రంగులో ఉండేది.

కానీ, గత కొన్నేళ్లుగా ఈ నది నీళ్లు పూర్తిగా బురదతో, మురికిగా ఉంటున్నాయి’’ అని పర్మే తెలిపారు.

‘‘సియాంగ్ నది(టిబెటన్ ఆటానమస్ రీజియన్) ఎగువ ప్రాంతంలో ఉన్న హైడ్రోపవర్ డ్యామ్‌లో ఎప్పుడైనా నిర్మాణ పనులు జరిగితే, రాళ్లు, బురద అంతా సియాంగ్ నదిలో దిగువకు కొట్టుకుని వస్తుందని నేను అనుకుంటున్నా’’ అని చెప్పారు.

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు

ఫొటో సోర్స్, ARUNACHAL PRADESH CM PEMA KHANDU TWITTER

ఫొటో క్యాప్షన్, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు

చైనా ప్రతిపాదిత డ్యామ్ ప్లాన్‌కి స్పందనగా..

సియాంగ్ నదిపై ఆనకట్ట కట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు గత బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత మరోసారి సియాంగ్ నది చర్చలోకి వచ్చింది.

సరిహద్దులో ఉన్న టిబెట్ ప్రాంతంలో యార్లుంగ్ త్సాంగ్పో నది(సియాంగ్ నది ఎగువ ప్రాంతం)పై చైనా అతిపెద్ద డ్యామ్‌ను కట్టేందుకు ప్రతిపాదించిన తర్వాత రాబోతున్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ ఆనకట్టను కట్టేందుకు ప్లాన్ చేస్తుందని ఖండు చెప్పారు.

ఈ ఆనకట్ట నిర్మాణంతో సియాంగ్ నదిని కాపాడవచ్చని ముఖ్యమంత్రి ఖండు అన్నారు.

చైనా ప్రభుత్వ మీడియా 2020 నవంబర్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, టిబెటన్ అటానమస్ రీజియన్(టీఏఆర్)లో యార్లుంగ్ సాంగ్సో నదిపై 60 వేల మెగావాట్ల డ్యామ్‌ను చైనా నిర్మించాలనుకుంటోంది.

యార్లుంగ్ సాంగ్సో నది టిబెట్‌లోని హిమాలయాలలో పుట్టింది. ప్రపంచంలోనే అతి పొడవైన నదుల్లో ఇది ఒకటి. 2,880 కి.మీల దూరం ఇది ప్రవహిస్తుంది. ఈ నది అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్‌లోకి ప్రవేశిస్తుంది. అరుణాచల్‌లో దీనిని సియాంగ్ నది అంటారు.. ఆ తర్వాత అస్సాంలో ప్రవేశించాక దీని పేరు బ్రహ్మపుత్రగా మారుతోంది.

భారత్ నుంచి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించాక చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది.

అస్సాంలోకి ప్రవేశించడానికి ముందు, ఈ నది అరుణాచల్ ప్రదేశ్‌లో 300 కి.మీ. దూరం ప్రవహిస్తుంది.

సియాంగ్ నది

ఫొటో సోర్స్, DILIP SHARMA

చైనా డ్యామ్ ప్రమాదకరమా?

ఒకవేళ నిజంగానే చైనా ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్‌ను దీనిపై నిర్మిస్తే.. ఆ ప్రభావం వెంటనే దిగువన ఉన్న ప్రాంతాలకే కాకుండా వరద ముప్పునకు గురయ్యే అస్సాం, బంగ్లాదేశ్‌ల పరిస్థితి వినాశకరంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.

చైనా 14వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా నిర్మించే ఈ అతిపెద్ద డ్యామ్ విషయంపై అరుణాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే లాంబో తయెంగ్ జీరో అవర్‌‌లో చర్చకు పెట్టారు.

సియాంగ్ నది పదే పదే తన ప్రవాహాన్ని ఇలా మార్చుకుంటూ ఉంటే.. పంటలు పండే లక్షల కొద్ది హెక్టార్లు పెద్ద ఎత్తున కోతకు గురవుతాయంటూ ఆ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేశారు.

నది ప్రవాహంలో వస్తున్న ఈ మార్పులతో డీ’ఎరింగ్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రాంతం కూడా తగ్గిపోయిందన్నారు.

దిగువ ప్రాంతానికి సరిగ్గా నీటిని విడుదల చేయకపోవడం, నీటిని కిందకి రాకుండా అడ్డుకోవడం, నదిలో నిర్మాణ సామగ్రిని పడేయడం వంటి వాటిల్లో చైనా హస్తం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించారు.

సియాంగ్ లోయలో వచ్చే వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించి తగిన చర్యలను తీసుకోకపోతే... భవిష్యత్‌లో ఇది వినాశకరంగా మారనుందని హెచ్చరించారు.

దీనికి స్పందించిన అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఖండు.. సియాంగ్ నది పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం తన ఆందోళనను వ్యక్తం చేసిందని అన్నారు.

‘‘సియాంగ్ నదిని సజీవంగా ఉంచాలి. ఒకవేళ చైనా ఈ నది ప్రవాహాన్ని మళ్లిస్తే, సియాంగ్ సైజు తగ్గిపోతుంది. అంతేకాక, పెద్ద మొత్తంలో విడుదలయ్యే వరద నీటికి సియాంగ్ లోయ తీవ్రంగా ప్రభావితం కానుంది.

అస్సాం, బంగ్లాదేశ్‌ కూడా వరదల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఈ ప్రాంతాల్లో భారీ వరదలు సంభవిస్తాయి. అధిక నీటి విడుదలను అడ్డుకునేందుకు పెద్ద పెద్ద నిర్మాణాలు అవసరం’’ అని ముఖ్యమంత్రి ఖండు చెప్పారు.

సియాంగ్ నది

ఫొటో సోర్స్, DILIP SHARMA

‘చైనా డ్యామ్ సమాచారం లేకపోతే ఆనకట్ట పరిష్కారం కాదు’

చైనా కట్టబోతున్న 60 వేల మెగావాట్ల గురించి సరైన, పూర్తి సమాచారం అందుబాటులో లేనంత వరకు, ఏ డ్యామ్ గురించైనా చర్చించడం అనవసరం అని నిపుణులు అంటున్నారు.

పర్యావరణ పరిరక్షణ కార్యకర్త, దక్షిణాసియా నెట్‌వర్క్‌కు చెందిన నీటి నిపుణుడు హిమాన్షు ఠాకుర్ ఆనకట్టలు, నదులు, చైనా మెగా డ్యామ్, భారత ప్రభుత్వపు ప్రతిపాదిత భారీ ఆనకట్ట వంటి విషయాలపై బీబీసీతో మాట్లాడారు.

‘‘నా అవగాహన ప్రకారం, ఇది కేవలం ఒక ప్రాజెక్టునే. ఈ భారీ డ్యామ్ నిర్మించేందుకు అవకాశాలు కేవలం కొద్దిగానే ఉన్నాయి. ఎందుకంటే, ప్రపంచంలోనే ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రాజెక్టు. ఇక రెండోది, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్. ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. అది మాత్రమే కాక, ప్రస్తుతం ఎవరి వద్ద దీనికి సంబంధించి ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు’’ అని హిమాన్షు అన్నారు.

‘‘సియాంగ్ నదిపై ఏదైనా డ్యామ్ నిర్మించాలంటే ముందు, ఎగువ ప్రాంతంలో చైనా నిర్మించే డ్యామ్ సైజు ఎంత అనే దానిపై మనకు సమాచారం కావాల్సి ఉంటుంది. ఎత్తు ఎంత? ఆనకట్ట నిల్వ సామర్థ్యం ఎంత? ఈ ఆనకట్ట నుంచి ఎంత విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు? ఎంత వరద నీటిని కిందకి వదులుతారు?.. వంటి ఈ సమాచారం లేకపోతే, ఈ డ్యామ్ ప్రభావం చెప్పడం కష్టమే’’ అని హిమాన్షు చెప్పారు.

‘ఇక్కడి విద్యుత్ ప్రాజెక్ట్ 11 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. చైనా, భారత్‌ల నుంచి ఈ ప్రాజెక్టుల గురించి స్పష్టమైన సమాచారం రానంతవరకు, సరైన అంచనాలనేవి చాలా కష్టం’’ అని అన్నారు.

ప్రస్తుతం టిబెటన్ అటానమస్ రీజియన్‌లో ఆరు డ్యామ్‌లను చైనా నిర్వహిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్‌కు మూడు డ్యామ్‌లున్నాయి. ఇందులో రెండు ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదు.

ముఖ్యమంత్రి ఖండు వ్యక్తిగతంగా సియాంగ్ లోయను సందర్శించనున్నట్లు అసెంబ్లీలో తెలిపారు.

స్థానికులు ప్రతిపాదిత ఆనకట్టకు సహకరించి, సర్వేకు, ఇన్వెస్టిగేషన్ పనులకు అనుమతించాలని అభ్యర్థించారు.

అరుణాచల్ ప్రదేశ్ స్థానికులు

ఫొటో సోర్స్, DILIP SHARMA

చైనా ముప్పుపై గ్రామస్తులకు వివరించాల్సి ఉంది..

‘‘సియాంగ్ నదిపై ప్రతిపాదిత ఆనకట్ట గురించి సరైన సమాచారం అందుబాటులో లేదు. కానీ, చైనా దూకుడుకు భారత్ సరైన సమాధానం ఇచ్చింది’’ అని సీనియర్ బీజేపీ నేత, అరుణాచల్ ప్రదేశ్‌లోని పార్టీ అధికార ప్రతినిధి డొమినిక్ టాడర్ అన్నారు.

ఈ ప్రతిపాది ఆనకట్ట నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారా? లేదా అన్న దానిపై ప్రస్తుతం తానేం చెప్పలేనన్నారు.

డ్యామ్‌ను, ఆనకట్టను స్థానికులు వ్యతిరేకిస్తున్నందున్న, వారికి చైనా నుంచి ఉన్న ముప్పును అర్థమయ్యేలా వివరించాల్సి ఉందని చెప్పారు.

అరుణాచల్ ప్రదేశ్ స్థానికులు

ఫొటో సోర్స్, DILIP SHARMA

భారత్-చైనాల మధ్య ఘర్షణలు

లద్దాఖ్‌లోని గాల్వాన్‌లో భారత్, చైనా సైనికుల మధ్యలో తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్న తర్వాత రెండు దేశాల మధ్యనున్న సంబంధాలు 2020లో దెబ్బతిన్నాయి.

చైనా చేపట్టే ఏ పనినైనా తిప్పికొట్టేందుకు వ్యూహ్యాత్మకంగా ముందుకు వెళ్లాలని భారత్ చూస్తోంది.

బ్రిటిష్ కాలం నుంచి భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం నలుగుతోంది.

రెండు దేశాల మధ్యలో 3,488 కి.మీల పొడవైన సరిహద్దు ఉంది.

1914లో, టిబెట్ ప్రతినిధులు, చైనా, బ్రిటీష్ ఇండియా ప్రతినిధులు షిమ్లాలో సమావేశమయ్యారు. సరిహద్దు రేఖను నిర్ణయించారు.

కానీ, చైనా దాన్ని అంగీకరించలేదు. అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా చైనా పిలుస్తోంది.

అరుణాచల్ ప్రదేశ్‌లోని సరిహద్దు గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఎన్నో పనులు నిర్వహించారు. కానీ, చైనా నుంచి ప్రమాదం మాత్రం అలానే ఉంది’’ అని భారత్ ఈశాన్య, ఆగ్నేయాసియాకు చెందిన ఇండిపెండెంట్ అనలిస్ట్ డాక్టర్ రుపక్ భట్టాఛార్జే చెప్పారు.

‘‘ఎగువ ప్రాంతంలో ఉన్నందున, చైనా డ్యామ్ నిర్మాణంలో ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా దూకుడు అడ్డుకట్ట వేసేందుకు సాంకేతిక, వనరుల విషయంలో భారత్ తన సామర్థ్యాన్ని పెంచుకోవాల్సి ఉంది’’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)