ప్రాంక్ వీడియోలు పసిపిల్లలతోనా... ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా?

కారులో పిల్లలు

ఫొటో సోర్స్, Viral Video

ఫొటో క్యాప్షన్, వైరల్ వీడియో స్క్రీన్‌షాట్
    • రచయిత, ఆదర్శ్ రాథోడ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రాంక్ వీడియో బాగా వైరల్ అవుతోంది. పిల్లలను కారులో ఎక్కించుకుని.. కిడ్నాప్ చేశామని చెబుతున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. పిల్లలు భయపడి అరుస్తూ ఏడవడం వీడియోలో స్పష్టంగా అర్థమవుతుంది.

ఈ ప్రాంక్‌తో పిల్లలు అపరిచితుల కార్లలో ఎక్కకూడదనే అవగాహన కల్పిస్తున్నామని ఈ వీడియో తీసిన వారు చెబుతున్నారు.

అయితే తమ ఇష్టాలు, అభిప్రాయాల పేరుతో పిల్లలను వేధిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

అదే కాదు, మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే తల్లిదండ్రులు తమ పిల్లల తలపై గుడ్లు పగలగొట్టడం.

ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్ , ఇన్‌స్టాగ్రామ్‌లో #eggcrackchallenge హ్యాష్ ట్యాగ్‌తో వేలాది వీడియోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీటిని లక్షలాది మంది వీక్షించారు.

అయితే, ఈ వీడియోలలో కనిపించేవారిలో చాలామంది చిన్నవారే, ఐదారేళ్ల వయస్సు పిల్లలే.

తలపై గుడ్లు పగలడంతో కొందరు చిన్నారులు భయపడటం ఈ వీడియోలలో కనిపిస్తుంది.

కొందరు చిన్నారులు దెబ్బతాకిందని చెప్పడం, ఏడవడం, తల్లిదండ్రులను కోపంతో పక్కకు నెట్టివేయడం వీటిల్లో చూడొచ్చు.

తల్లిదండ్రులు నవ్వుతూ వీడియో తీస్తున్నప్పటికీ, ఆ చిలిపి పనిని పిల్లలు ఫన్నీగా భావించలేదని ఇది చెబుతోంది.

పిల్లలకు ఇలాంటి చిలిపి మాటలు, జోకులు అర్థం కావని, ప్రాంక్‌ల పేరుతో వారిని ఏడిపించడం ఏమాత్రం మంచిది కాదని సైకాలజిస్టులు చెబుతున్నారు.

ప్రాంక్

ఫొటో సోర్స్, Getty Images

ప్రయోగాలు చేయడంతోనే సమస్య..

ఈ వీడియోలు తీసేవారికి, చూసేవారికి సరదాగా అనిపిస్తాయి. కానీ, ఆ పిల్లలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఒక చిలిపి జోక్‌ కోసం ఎవరినైనా బలిపశువును చేస్తారని లఖ్‌నవూలోని సైకాలజిస్ట్ రాజేష్ పాండే అంటున్నారు.

చిలిపి పనుల్లో సరదా ఉంటుంది కానీ మనుషులు ఇందులో ప్రయోగాలు చేస్తున్నారు.

సమస్య ఏమిటంటే ఆ ప్రయోగంలో బాధితుడు గాయపడొచ్చు, భయపడొచ్చు లేదా బాధపడొచ్చు.

రాజేష్ పాండే ఒక ఉదాహరణ ఇస్తూ.. “క్లాస్‌లోకి ప్రవేశిస్తున్న పిల్లవాడిని ఎవరైనా గందరగోళ పరిచి, కిందపడేలా చేస్తే, అందరూ నవ్వుతారు. కానీ పడిపోయిన వ్యక్తి గాయపడొచ్చు. ఇది చిలిపి పనే, కానీ దీన్ని సరైన వినోద రూపంగా పరిగణించలేం'' అని అన్నారు.

ప్రాంక్

ఫొటో సోర్స్, Getty Images

చిలిపి, వేధింపుల మధ్య తేడా..

పిల్లలతో చిలిపి పనులను చూసిన కొంతమంది అసౌకర్యానికి గురవుతుంటారు.

ఎందుకంటే చిలిపి, వేధింపుల మధ్య చాలా సూక్ష్మమైన వ్యత్యాసం ఉంది. బాధితుడు బలహీనుడిగా ఉన్నప్పుడు ఆ చిలిపి వేధింపుగా మారుతుంది.

హాస్యానికి ఒక నియమం ఉంది. 'పంచ్ అప్, నాట్ కిక్ డౌన్'. అంటే హాస్యంతో మనిషిని కొట్టినట్లుండాలి కానీ, కిందపడేసినట్లు కాదు. ఈ సందర్భంలో బలవంతులు వ్యంగ్యానికి గురవుతారేమో, బలహీనమైన వ్యక్తులు కాదు.

అయితే, పిల్లలపై చేసే చిలిపి పనుల్లో ఎక్కువగా పిల్లలే లక్ష్యంగా ఉంటున్నారు. చిలిపి చేష్టలనేవి యువకులకు, పెద్దలకు ప్రతీసారి వినోదాన్ని పంచకపోవచ్చు.

ఎవరిపైనైనా జోక్ వేస్తే, అది ఆ వ్యక్తికి హాని కలిగించని సందర్భంలో 'జోక్ చేసిన వ్యక్తి, దాన్ని ఎదుర్కొన్న వ్యక్తి' ఇద్దరూ నవ్వితే అది చిలిపి పని అని బ్రిటన్‌లోని చైల్డ్ సైకోథెరపిస్ట్‌ల సంఘం ప్రతినిధి రాచెల్ మెల్విల్లే-థామస్ అన్నారు.

“మేం కలిసి నవ్వాలనుకుంటున్నాం. దీనివల్ల సాన్నిహిత్యం పెరుగుతుంది. బాధితుడు వావ్.. ఎంత చిలిపి పని అని బదులిచ్చినపుడు మాత్రమే ఆ ప్రాంక్ హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ మీరు ఒకరి తలపై ఏదైనా పగలగొట్టినప్పుడు అది సులభం కాదు'' అని రాచెల్ అంటున్నారు.

చిన్న పిల్లలు

ఫొటో సోర్స్, Getty Images

పిల్లల మనసుపై ప్రభావం

ఏ హాస్యాన్నైనా వెంటనే అర్థం చేసుకోవడం పిల్లలకు కష్టం. అయితే, పిల్లలు చిన్నప్పటి నుంచే తమాషాలను నేర్చుకుంటారు.

ఐదారేళ్ల వయస్సులో పిల్లలు వ్యంగ్యాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారని పరిశోధకులు అంటున్నారు.

మరికొంతమంది పిల్లలు నాలుగేళ్ల వయసులోనే జోకులను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారని, ఈ అభ్యాస ప్రక్రియ కౌమారదశ వరకు కొనసాగుతుందని తెలిపారు.

దేన్నైనా తమాషాగా భావించడానికి అసంబద్ధం అనేది సాధారణ సూత్రం. అంటే అంచనాలకు భిన్నంగా ఉంటుంది. అందుకే కొందరు వ్యక్తులు కార్టూన్‌ల వంటి అసాధారణమైన లేదా అతిశయోక్తి చర్యలను ఫన్నీగా భావిస్తారు.

చిన్న పిల్లలు

ఫొటో సోర్స్, Getty Images

పిల్లల నమ్మకాన్ని దెబ్బతీస్తాయా?

చాలా సందర్భాల్లో ఏ విషయాలు కరెక్టుగా ఉన్నాయి? ఏవి లేవని పిల్లలు పరిశీలించడం ప్రారంభిస్తారు.

“ఉదాహరణకు ఏనుగు తలపై టోపీని పిల్లలు తమాషాగా చూస్తారు. కొన్నింటిలో పిల్లలకు ముందు ఆశలు కల్పించి తర్వాత షాక్ ఇస్తారు పెద్దలు. అంటే గుడ్డు పగలగొట్టడం లాంటి చిలిపి పనులు. అమ్మతో కలిసి వంట చేద్దాం, అని చెప్పి అకస్మాత్తుగా చిన్నారి తలపై గుడ్డు పగలగొట్టి గాయపరుస్తారు'' అని రాచెల్ అంటున్నారు.

పిల్లలలో హాస్యాన్ని అభివృద్ధి చేసే విధానంపై పైజ్ డేవిస్ ఒక పుస్తకాన్ని రాశారు. పైజ్ ఇంగ్లండ్‌లోని యార్క్ సెయింట్ జాన్ యూనివర్శిటీలో డెవలప్‌మెంటల్ సైకాలజిస్ట్

“గుడ్డు పగలగొట్టే చిలిపి పనిలో ఏం చేయబోతున్నారో పెద్దలకు తెలుసు కానీ పిల్లవాడికి తెలియదు. గుడ్డు తన తలపై ఎందుకు పగిలిందో, చిన్నారికి అర్థం కాలేదు. చాలా వీడియోలలో పిల్లలు తమపై జోక్ చేస్తున్నారని అర్థం చేసుకోలేరు. ఇది వారి నమ్మకాన్ని దెబ్బతీస్తుంది” అని పైజ్ అభిప్రాయం వ్యక్తంచేశారు.

చైల్డ్ సైకియాట్రిస్ట్ రాచెల్ కూడా ఇదే ఆందోళనను వ్యక్తం చేశారు.

“ఐదేళ్లలోపు పిల్లలకు, మీరు ఒక కవచం లాంటివారు. మీరు తనను ఎప్పటికీ బాధించరని చిన్నారి నమ్మకం. కానీ మీరు తన తలపై గుడ్డు పగలగొట్టినట్లయితే, ఆ నమ్మకం దెబ్బతింటుంది'' అని అన్నారు.

చిన్న పిల్లలు

ఫొటో సోర్స్, Getty Images

తల్లిదండ్రులు ఎందుకు అర్థం చేసుకోలేరు?

మరో సమస్య ఏమిటంటే.. పిల్లల అనుమతి లేకుండానే ఈ వీడియోలను రికార్డు చేసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తున్నారు.

పిల్లలకు శారీరకంగా హాని కలిగించే చిలిపి పనులు వినోదాత్మకంగా ఎలా పరిగణిస్తారు? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇలాంటి వీడియోల్లో చాలామంది చిన్నారుల ఎక్స్ ప్రెషన్స్ పరిశీలిస్తే వారు బాధపడినట్లు తెలుస్తోంది.

ఇలాంటి చిలిపి వీడియోలకు పిల్లల స్పందన ప్రతికూలంగా ఉందని, అయితే తల్లిదండ్రులు, పెద్దలు నవ్వుకోవడం ఆశ్చర్యం కలిగించిందని రాచెల్ తెలిపారు.

పిల్లలకు గాయమైనపుడు తల్లి బాధపడకుండా నవ్వితే, అది చిన్నారుల భవిష్యత్ ప్రవర్తనపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.

“ఈ వీడియోల ద్వారా తల్లిదండ్రులు కొంత ప్రయోజనం పొందుతున్నారు. అయితే, తమ బిడ్డకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తుందో ఆలోచించడం లేదు. చిలిపి పనుల కోసం తల్లిదండ్రులు పిల్లల కంటే వారి సొంత అవసరాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు'' అని రాచెల్ ఆరోపిస్తున్నారు.

పిల్లలు బాధపడితే ఏం చెయ్యాలి?

ఇలాంటి చిలిపి పనులు పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి, తల్లిదండ్రులతో వారి సంబంధాలను కూడా దెబ్బతీస్తాయని రాచెల్ హెచ్చరిస్తున్నారు.

ఒకవేళ పిల్లలు బాధపడినట్లు కనిపిస్తే తల్లిదండ్రులు “ఒకరిని చూసి, అలా చేశానని, కానీ ఇప్పుడు అలా చేయకూడదని తెలుసుకున్నా, క్షమించు'' అని కోరవచ్చు అని రాచెల్ సూచిస్తున్నారు

తల్లిదండ్రులు పిల్లలకు రోల్ మోడల్స్. ఇలాంటి సందర్భంలో మీరు క్షమించమని అడిగితే, పశ్చాత్తాపపడినప్పుడు ఎలా స్పందించాలో పిల్లలకు నేర్పిస్తున్నారని తెలిపారు.

''నవ్వడానికి, ఆనందించడానికి ఇంకా చాలా సృజనాత్మక మార్గాలు ఉన్నాయి. మీరు చిలిపి పనిలో వినోదాన్ని ఆశిస్తున్నారు. కానీ ఆ చిలిపితనం అవతలి వ్యక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, ఎంత ప్రభావం చూపుతుందో మీరు గ్రహించలేరు. సరదా కోసం ఎవరినైనా భయపెట్టడం, షాక్‌కి గురిచేయడం, వేధించడం సరికాదు. ఇది పిల్లలు లేదా పెద్దలతో చేయకూడదు'' అని రాజేశ్ పాండే సూచించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ ‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.)