టాలీవుడ్ డ్రగ్స్ కేసు: నటుడు నవదీప్ పరారీలో ఉన్నారా... ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు?

ఫొటో సోర్స్, Navdeep/FB
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. సినీ నటుడు నవదీప్ సహా కొందరు దర్శకులు, నిర్మాతలు డ్రగ్స్ వాడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
తెలంగాణ స్టేట్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరో(టీఎస్-న్యాబ్) విచారణలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
టీఎస్-న్యాబ్ డైరెక్టర్ సీవీ ఆనంద్ ఈ విషయాన్ని మీడియాకు వివరించారు.
ఈ కేసులో నటుడు నవదీప్ తోపాటు షాడో, రైడ్ చిత్రాల నిర్మాత ఉప్పలపాటి రవి, డియర్ మేఘ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డి, మోడల్ శ్వేత, మహబూబ్ నగర్ మాజీ ఎంపీ దేవరకొండ విఠల్ రావు కొడుకు సురేశ్ రావు తదితరులు ఉన్నట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు.
‘‘కేసులో సినీ ఫైనాన్షియర్ వెంకటరత్నారెడ్డి, కాప భాస్కర్ బాలాజీ, సురేశ్ రావు, అనుగు సుశాంత్ రెడ్డితోపాటు సినీ పరిశ్రమతో సంబంధాలున్న రాంచందర్, ముగ్గురు నైజీరియన్లతోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశాం.’’ అని టీఎస్- న్యాబ్ డైరెక్టర్ సీవీ ఆనంద్ చెప్పారు. నటుడు నవదీప్ సహా మిగిలిన వారు పరారీలో ఉన్నట్లు చెప్పారు.
‘‘రూ.1.1 కోట్ల విలువైన 8 గ్రాముల కొకైన్, 50 గ్రాముల ఎండీఎంఏ, ఎక్స్‌టీసీ మాత్రలు, కార్లు స్వాధీనం చేసుకున్నాం. వెంకట రత్నారెడ్డి ఖాతాలోని రూ.5.5 కోట్లు స్వాధీనం చేసుకున్నాం.’’ అని ఆనంద్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలేం జరిగింది?
టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసులు వెలుగు చూడటం ఇదే కొత్త కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో సినీ నిర్మాతలు, దర్శకులు, నటులు డ్రగ్స్ వాడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
కొందరు డ్రగ్స్ పెడ్లర్లుగా మారి అమ్ముతున్నట్లు తేలింది.
తాజా కేసును ఒక్కసారి పరిశీలిస్తే…ఆగస్టు 31 మాదాపూర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్టుమెంట్‌లో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో టీఎస్-న్యాబ్ సభ్యులు దాడి చేశారు. ఓ ఫ్లాట్‌లో జరుగుతున్న రేవ్ పార్టీని భగ్నం చేశారు.
ఈ కేసులో నెల్లూరుకు చెందిన నేవీ మాజీ అధికారి బి.బాలాజీ, గుంటూరు నెహ్రూనగర్‌కు చెందిన సినీ ఫైనాన్షియర్ కె.వెంకట రత్నా రెడ్డి సహా మరికొందర్ని అరెస్టు చేసినట్లు అప్పట్లో పోలీసులు ప్రకటించారు.
ఈ కేసు విషయమై టీఎస్-న్యాబ్ ఎస్పీ (వెస్ట్) డి.సునీతారెడ్డి మాట్లాడారు.
‘‘నేవీలో పనిచేసి బయటకు వచ్చిన బాలాజీ డ్రగ్ పెడ్లర్ గా పనిచేస్తున్నాడు. అతనికి సినీ ఫైనాన్షియర్ కె.వెంకట రత్నా రెడ్డి పాత పరిచయం ఉంది. ఇతను గతంలో ఢమరుకం, కిక్, బిజినెన్‌మేన్, లవ్లీ వంటి చిత్రాలకు ఫైనాన్స్ చేశాడు. స్నాప్ చాట్ సాయంతో కస్టమర్లతో బాలాజీ కాంటాక్టులో ఉన్నాడు. ర్యాంబో, కిమ్స్, కింగ్, క్యాచీ, సూపర్ వంటి కోడ్ నేమ్స్‌తో పేర్లు, డ్రగ్స్ వివరాలు రాసుకున్నట్లు తెలిసింది.’’ అని చెప్పారు.
బాలాజీ ఏర్పాటు చేసే రేవ్ పార్టీలకు వెంకట రత్నారెడ్డి ఫైనాన్స్ చేస్తుండేవారని పోలీసులు తెలిపారు. వీరికి నైజీరియాకు చెందిన ముగ్గురు వ్యక్తులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
బాలాజీ, వెంకట రత్నారెడ్డి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా దాదాపు 18 మంది డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించినట్లు పోలీసులు చెప్పారు.
వీరిలో హైదరాబాద్‌లో నర్సరీ వ్యాపారం చేస్తున్న కొల్లి రాంచందర్ కూడా ఉన్నారు. ఈయనది విశాఖపట్నం. ఈయన ద్వారానే నటుడు నవదీప్‌కు డ్రగ్స్ చేరుతున్నట్లు గుర్తించామని టీఎస్-న్యాబ్ డైరెక్టర్ సీవీ ఆనంద్ మీడియాకు చెప్పారు.

ఫొటో సోర్స్, Navdeep/FB
అది నేను కాదు: నవదీప్
ఈ కేసులో నటుడు నవదీప్, నిర్మాత ఉప్పలపాటి రవి పరారీలో ఉన్నట్లు సీవీ ఆనంద్ మీడియాకు చెప్పారు. డ్రగ్స్ కేసులో తన పేరు రావడంపై నటుడు నవదీప్ ఎక్స్ వేదికగా స్పందించారు.
‘‘అది నేను కాదు జెంటిల్ మేన్. నేను ఇక్కడే ఉన్నాను. దీనిపై స్పష్టత ఇవ్వండి.’’ అంటూ రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
హైకోర్టు నుంచి బెయిల్ ..
డ్రగ్స్ కేసులో తనను అరెస్టు చేయొద్దని కోరుతూ నవదీప్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, ఆయనకు బెయిల్ మంజూరు అయింది.
హైదరాబాద్ గుడిమల్కాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో నమోదైన క్రైం నం. 120/2023లో నవదీప్‌ను ఎ29 గా పోలీసులు చూపించారు.
ఈ కేసులో ఎ16గా ఉన్న వ్యక్తి రిమాండ్ రిపోర్టులో తనను వినియోగదారు(కన్య్సూమర్)గా చూపించారని హైకోర్టులో నవదీప్ సెప్టెంబరు 15న పిటిషన్ వేశారు.
ఈ కేసులో ఈ నెల 19 వరకు అరెస్టు చేయకుండా చూడాలని పిటిషన్ లో కోరారు.
నవదీప్ వేసిన పిటిషన్(10710/2023) పై విచారించిన తెలంగాణ హైకోర్టు.. ఈ నెల 19 వరకు అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించింది.
అయితే, పోలీసులు విచారణ కోసం పిలిస్తే మాత్రం హాజరు కావాలని నవదీప్‌ను కోర్టు ఆదేశించింది.
గతంలో సినీ ప్రముఖులు పూరి జగన్నాథ్, ఛార్మి, రవితేజ, నవదీప్, ముమైత్ ఖాన్ వంటి వారిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. ఈ విషయంపై ఈడీ సహా పలు దర్యాప్తు సంస్థలు కూడా విచారణ చేశాయి. కానీ తర్వాత కేసు విషయంలో పురోగతి లేదు.

ఫొటో సోర్స్, TWITTER/ANAND DEVERAKONDA
బేబీ సినిమా యూనిట్‌కు నోటీసులు
ఇటీవల విడుదలైన బేబీ సినిమాలో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు తీసిన సీన్ల విషయంలో సీవీ ఆనంద్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘‘బేబీ సినిమాలోని సీన్లు, మాదాపూర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్టుమెంట్‌పై టీఎస్-న్యాబ్ అధికారులు దాడి చేసినప్పుడు కనిపించిన సీన్లు ఒకేలా ఉన్నాయి. మత్తు పదార్థాల వినియోగాన్ని ప్రేరేపించేలా సీన్లు ఉండటంపై చిత్ర యూనిట్‌కు నోటీసులు జారీ చేశాం. యూనిట్ సభ్యులు వివరణ ఇచ్చారు. మేం చెప్పిన తర్వాతే అందులో ఉన్న దృశ్యాలకు వార్నింగ్ నోట్ పెట్టారు. అప్పటి వరకు అది కూడా లేదు.’’ అని ఆనంద్ వెల్లడించారు.
ఇకపై టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ చిత్రాల్లోనూ డ్రగ్స్‌ను ప్రేరేపించేలా సీన్లు లేకుండా చూడాలని, అలా ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోను కోరతామని ఆనంద్ చెప్పారు.

ఫొటో సోర్స్, CV Anand IPS/Twitter
డ్రగ్స్ వాడే వారికి, అమ్మేవారికి ఎలాంటి శిక్షలు ఉన్నాయి?
డ్రగ్స్ తీసుకొనేవారి కంటే అమ్మేవారికి కఠిన శిక్షలు ఉంటాయి. డ్రగ్స్ తీసుకునే వారు మత్తుకు బానిస అవుతున్నారు కాబట్టి వారిని బాధితులుగా పరిగణిస్తూ, వారిపట్ల కఠినంగా వ్యవహరించకూడదని చట్టాలు చెబుతున్నాయి .
1985లో వచ్చిన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టెన్స్ చట్టం ప్రకారం తక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకున్న వారికి ఏడాది జైలు శిక్ష లేదా రూ. 10,000 జరిమానా లేదా ఈ రెండు శిక్షలు విధించవచ్చు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
'మధ్యస్థ (ఇంటర్మీడియట్) మోతాదు' తీసుకున్న వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. లక్ష వరకు జరిమానా లేదా రెండు వేయవచ్చు.
అలాకాకుండా, కమర్షియల్ అంటే ఎక్కువ మోతాదు తీసుకున్న వారికి కనీసం 10 ఏళ్ల నుంచి గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు శిక్ష కూడా పడుతుంది.
అలాగే రూ. లక్ష నుంచి గరిష్ఠంగా రెండు లక్షల రూపాయల వరకు జరిమానా వేయవచ్చు.
ఇవి కూడా చదవండి:
- క్రాబ్ వాక్ చేస్తూ జైలు నుంచి పారిపోయిన ‘డేంజరస్ కిల్లర్’
- సైబర్ బుల్లీయింగ్ అంటే ఏంటి... పిల్లలు, టీనేజర్లు ఆ వలయంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ‘మీకో QR Code పంపిస్తాను. అది స్కాన్ చేయగానే మీకు డబ్బులొస్తాయి’
- క్లబ్‌హౌస్: ఈ యాప్‌లో యువతీ యువకులు సెక్స్ చాట్లు ఎందుకు చేస్తున్నారు? ఆ తర్వాత పరిణామాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















