కెనడా: సిక్కు నేత నిజ్జర్ హత్యలో ఇండియా పాత్ర ఉందన్న ప్రధాని ట్రూడో.. దౌత్యవేత్తలను బహిష్కరించిన ఇరు దేశాలు

భారత్ కెనడా

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, జస్టిన్ ట్రూడో
    • రచయిత, నదీన్ యూసఫ్, అలీమ్ మక్బూల్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

భారత్-కెనడా సంబంధాలు మరింత సంక్షోభంలో పడినట్లుగా కనిపిస్తున్నాయి. ఇరు దేశాలూ దౌత్యవేత్తలను బహిష్కరించేంత తీవ్ర స్థాయికి ఇవి చేరుకున్నాయి.

తమ దేశంలో సిక్కు నాయకుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత ప్రభుత్వ హస్తం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో సోమవారం ఆరోపించారు.

జూన్ 18న కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో ఓ సిక్కు దేవాలయం దగ్గర హర్‌దీప్ సింగ్‌ను కాల్చిచంపారు.

ఆయన హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయంపై కెనడా ఇంటెలిజెన్స్‌కు విశ్వసనీయమైన సమాచారం ఉందని ట్రూడో వెల్లడించారు.

ఇటీవల జరిగిన జీ20 సదస్సులో భారత ప్రధానితో కూడా ట్రూడో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

‘‘కెనడా గడ్డపై ఒక కెనడియన్ పౌరుడిని విదేశీ శక్తులు హత్య చేయడం మా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే’’ అని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ట్రూడో వ్యాఖ్యానించారు.

"ఇది స్వేచ్ఛా, ప్రజాస్వామిక సమాజాలు అనుసరిస్తున్న ప్రాథమిక నియమాలకు విరుద్ధం’’ అని ట్రూడో అన్నారు.

అయితే, కెనడా ప్రధాని, విదేశాంగ మంత్రి చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమైనవని, నిరాధారమని భారత విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

‘‘కెనడాలో హత్యలు, మానవ అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాల వంటి కార్యకలాపాలను అనుమతించడం కొత్తేమీ కాదు. అలాంటి కార్యకలాపాలలో భారత ప్రభుత్వం పాల్గొందన్న ఆరోపణలను మేము తిరస్కరిస్తున్నాము. అలాగే కెనడా భూభాగం నుంచి జరుగుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలపై సమర్థవంతమైన, చట్టపరమైన చర్యలు చేపట్టాలని మేం కోరుతున్నాం’’ అని బాగ్చీ తన ట్వీట్‌లో రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

భారత్ కెనడా

ఫొటో సోర్స్, SIKH PA

ఫొటో క్యాప్షన్, హర్‌దీప్ సింగ్ నిజ్జర్

దౌత్యవేత్తలను బహిష్కరించిన ఇరు దేశాలు

నిజ్జర్ హత్య విషయంలో సోమవారం తమ దేశంలోని భారత డిప్యూటీ హైకమిషనర్ పవన్ కుమార్ రాయ్‌ను బహిష్కరించినట్లు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ విలేఖరులతో అన్నారు.

కెనడా ప్రభుత్వ చర్యలపై స్పందన కోసం కెనడాలోని భారత హైకమిషన్‌ను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది.

ఈ హత్యపై విచారణ కొనసాగుతున్నందున కెనడా అధికారులు దీనిపై మాట్లాడబోరని మెలానీ జోలీ అన్నారు.

నిజ్జర్ హత్యను ‘టార్గెటెడ్ ఇన్సిడెంట్’గా దీనిపై విచారణ జరుపుతున్న అధికారులు గతంలో అనుమానం వ్యక్తం చేశారు.

తాజా పరిణామాల నేపథ్యంలో భారత్‌లోని కెనడా హైకమిషనర్ కామెరాన్ మెక్‌కే‌ను భారత విదేశీ వ్యవహారాలశాఖ పిలిపించి, మాట్లాడింది. భారత్‌లోని కెనడా సీనియర్ దౌత్యవేత్త ఒకరిని బహిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయనకు తెలియజేసింది. సదరు దౌత్యవేత్త ఐదు రోజుల్లో ఇండియా విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది.

భారత అంతర్గత వ్యవహారాల్లో, భారత వ్యతిరేక కార్యకలాపాల్లో కెనడా దౌత్యవేత్తల జోక్యం పెరుగుతోందని, దీనిపై భారత ప్రభుత్వంలో పెరుగుతున్న ఆందోళనను తాజా నిర్ణయం సూచిస్తోందని విదేశీ వ్యవహారాలశాఖ మంగళవారం ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది.

భారత్ కెనడా

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఖలిస్తాన్ ఉద్యమానికి హర్‌దీప్ సింగ్ నిజ్జర్ మద్దతుదారు అని భారత్ ఆరోపిస్తోంది.

బ్రిటిష్ కొలంబియాలో ఏం జరిగింది?

వాంకోవర్‌కు తూర్పున 30 కి.మీ.ల దూరంలో ఉన్న సర్రేలోని గురునానక్ సిక్కు గురుద్వారా దగ్గర ఉన్న ఓ పార్కింగ్ ప్లేస్‌‌లో వాహనంలో ఉన్న హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌ను ముసుగు ధరించిన వ్యక్తులు కాల్చి చంపారు.

బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో నిజ్జర్ ప్రముఖ సిక్కు నాయకుడు. పంజాబ్‌ను స్వతంత్ర సిక్కు దేశంగా చేయాలని నినదించే ఖలిస్తాన్ ఉద్యమానికి ఆయన మద్దతుదారు. ఈ కారణంగానే ఆయనకు అనేకమార్లు బెదిరింపులు కూడా వచ్చాయని అనుచరులు చెబుతుంటారు.

వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న నాయకుడిగా నిజ్జర్‌ను భారత ప్రభుత్వం అభివర్ణించగా, ఈ ఆరోపణలు నిరాధారమని ఆయన మద్దతుదారులు వాదించారు.

భారత్ కెనడా

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, ఇటీవలి కాలంలో భారత్-కెనడాల మధ్య సంబంధాలు సరిగా లేవు.

ట్రూడో ఇంకా ఏమన్నారు?

నిజ్జర్ హత్య విషయంలో తమ ఆందోళనను భారత్‌లోని ఉన్నతస్థాయి భద్రతాధికారులు, గూఢచార సంస్థలకు తెలిపినట్లు ట్రూడో వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రుషి సునక్‌ దగ్గర కూడా ఈ విషయం ప్రస్తావించినట్లు ట్రూడో వెల్లడించారు.

‘‘ఈ వ్యవహారంలో భారత ప్రభుత్వం కెనడాకు సహకరించాలని నేను కోరుతున్నాను’’ అని ట్రూడో అన్నారు.

నిజ్జర్ హత్య కెనడియన్లకు ఆగ్రహం తెప్పించిందని, తమ భద్రత గురించి చాలా మంది ఆందోళనలో ఉన్నారని ఆయన తెలిపారు.

వరల్డ్ సిఖ్ ఆర్గనైజేషన్ సహా కెనడాలోని పలు సిక్కు గ్రూపులు ట్రూడో ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేశాయి. ఈ హత్య విషయంలో సమాజంలో ప్రబలంగా ఉన్న అనుమానాలను ప్రధాని ప్రకటన ధృవీకరించిందని వ్యాఖ్యానించాయి.

భారత్-కెనడా

ఫొటో సోర్స్, ParlVu

ఫొటో క్యాప్షన్, హౌస్ ఆఫ్ కామన్స్‌లో మాట్లాడుతున్న జస్టిన్ ట్రూడో

కెనడాలో 14-18 లక్షల మంది భారత సంతతి ప్రజలు

కెనడాలో భారత సంతతికి చెందిన వారు 14 నుంచి 18 లక్షల మంది ఉంటారని అంచనా. భారతదేశం వెలుపల అత్యధిక సిక్కులున్న దేశం కెనడాయే.

ఇటీవల దిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మోదీ, ట్రూడో సమావేశం అయ్యారు. అప్పుడు ఇరువురు నేతల మధ్య చర్చలు వాడివేడిగా జరిగాయి.

దేశంలోని సిక్కు వేర్పాటువాదాన్ని ప్రస్తావిస్తూ, భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే ఉగ్రవాద శక్తులను అణచివేసేందుకు కెనడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించినట్లు ఈ సదస్సు సందర్భంగా భారత ప్రభుత్వం చేసిన ఒక ప్రకటన పేర్కొంది.

కెనడా కూడా ఇటీవల భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలను నిలిపివేసింది. దీనికి కెనడా కొన్ని కారణాలను వివరించగా, ఇది రాజకీయ ప్రేరేపితమని భారత్ వ్యాఖ్యానించింది.

ఇటీవలి కాలంలో అనుమానాస్పదంగా మరణించిన సిక్కు నేతలలో నిజ్జర్ ఒకరు.

యూకేలో ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ అధిపతిగా చెప్పుకునే అవతార్ సింగ్ ఖండా బర్మింగ్‌హామ్‌లో అనుమానాస్పదన స్థితిలో మరణించారు.

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్‌లో ఈ ఏడాది మేలో ఉగ్రవాదిగా భారత్‌ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమజిత్ సింగ్ పంజ్వార్ కాల్చివేతకు గురయ్యారు.

వీడియో క్యాప్షన్, మంచు తుపాన్లు వచ్చే కెనడాలో వడగాడ్పులు..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)