పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల: ఇంకా పూర్తికాని ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించారా?

పాలమూరు రంగారెడ్డి

ఫొటో సోర్స్, TelanganaCMO

ఫొటో క్యాప్షన్, ఎత్తిపోతలను ప్రారంభించిన కేసీఆర్
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దక్షిణ తెలంగాణ వరదాయనిగా, మహబూబ్‌నగర్ వంటి కరువు సీమలో నీటిని పారించే ప్రాజెక్టుగా తెలంగాణ ప్రభుత్వం చెబుతోన్న పాలమూరు రంగారెడ్డి లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం ప్రారంభించారు.

మొత్తం పూర్తయితే దాదాపు 1,200 ఊళ్లకు తాగునీరు, 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వగలిగిన ప్రాజెక్టు ఇది. ఇందులో తాగునీటి కోసం ఉద్దేశించిన కొంత భాగం పూర్తయింది. ఇంకా పనులు జరుగుతున్నాయి. సాగునీటి కోసం కాలువల పనులు ఇంకా ప్రారంభమే కాలేదు.

అయితే పూర్తయిన మేరకు ప్రాజెక్టును ప్రారంభించారు కేసీఆర్. శనివారం లాంఛనంగా ప్రారంభమైనప్పటికీ, వాస్తవంగా ప్రాజెక్టు ఫలాలు అందడానికి తాగునీటికైతే కొన్ని నెలలు, సాగునీటికి కొన్ని సంవత్సరాలు పడుతుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఎత్తిపోతల ప్రాజెక్టు

ఫొటో సోర్స్, telanagangovernment

ఫొటో క్యాప్షన్, నార్లాపూర్ దగ్గర నుంచి కృష్ణా నీరు సరఫరా అయ్యే జలాశయం

అసలు ఎందుకీ ప్రాజెక్టు?

ఆంధ్రతో పోలిస్తేతెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నది ఎక్కువ దూరం ప్రవహిస్తుంది. కానీ ఆ కృష్ణా నదిని ఆనుకుని ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలలో కరవు, ఫ్లోరైడ్ సమస్యలు ఎక్కువగా ఉండేవి.

శ్రీశైలం, నాగార్జున సాగర్ అనే రెండు ప్రాజెక్టులు ఆంధ్ర, తెలంగాణల మధ్య ఉమ్మడిగా ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల వెనుక జలాశయాల్లో చేరిన నీటిని తమ ప్రాంతానికి తీసుకువెళ్లేందుకు ఆంధ్రకు కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి.

కానీ, తెలంగాణలో అటువంటి పెద్ద ఏర్పాట్లేమీ లేవు. కృష్ణా నది కంటే తెలంగాణ గట్టు ఎక్కువ ఎత్తులో ఉండడం వల్ల సహజంగా నీరు పారే అవకాశమూ లేదు. దీంతో దక్షిణ తెలంగాణ సమస్యను తీర్చడానికి కృష్ణా నదిలో మిగులు, వరద నీటిని మోటార్ల ద్వారా ఎత్తిపోసి నిల్వ చేసుకుని ఏడాది మొత్తం అవసరాలకు వాడుకోవాలనే ఉద్దేశంతో మొదలైన ప్రాజెక్టు ఈ ‘పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల’.

ఇప్పుడు శ్రీశైలం జలాశయం వెనుక ఉండే నీటిని చిన్న కాలువ ద్వారా నాగర్ కర్నూలు జిల్లా నార్లాపూర్ అనే గ్రామం దగ్గర నిర్మించిన పంపు హౌసుకు మళ్లిస్తారు. అక్కడి నుంచి నీటిని ఎత్తి అక్కడే నిర్మించిన రిజర్వాయరులోకి పంపిస్తారు.

నది మట్టం కంటే ఈ జలాశయం ఎత్తులో ఉంటుంది కాబట్టి అక్కడ పంపుహౌసు కావాలి. అక్కడి నుంచి నీరు సహజంగా కొంతదూరం పారుతుంది. అప్పుడు ఎదుల గ్రామం వరకూ పారిన తరువాత అక్కడ మళ్లీ పంపు హౌసు పెట్టి నీళ్లను తోడి ఎదుల జలాశయానికి పంపిస్తారు.

అక్కడ నుంచి కొంతదూరం నీరు సహజంగా పారితే, మరికొంత దూరం మోటార్లతో ఎత్తిపోస్తారు. అలా పాతాళంలోని కృష్ణమ్మ నీటిని పీఠభూమిలోకి పారించే పథకం ఇది. అంటే నీటిని ఏకంగా 672 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్తున్నారు.

ఈ మొత్తం ప్రాజెక్టులో ప్రస్తుత నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణ్ పేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాలు ఫలాలు పొందుతాయి. రోజుకు 1.5 టీఎంసీల వరకూ నీటిని ఎత్తిపోయవచ్చు.

ఐదు ఎత్తిపోతల పథకాలు అంటే ఐదు చోట్ల పంపు హౌసులు పెట్టారు. దీని కోసం ఆరు రిజర్వాయర్లు కడుతున్నారు. ఈ 6 జలాశయాలూ కలిపి 67.74 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసుకోగలవు.

ఈ నీటిని ఎత్తడం కోసం అన్ని పంపు హౌసుల్లో కలిపి 34 మోటార్లు పెడుతున్నారు. వాటిలో 31 మోటార్లు ఒక్కొక్కటీ 145 మెగావాట్ల సామర్థ్యం, మూడు 75 మెగావాట్ల సామర్థ్యంతో ఉంటాయి. ఈ మోటార్లు కాళేశ్వరంలో వాడిన వాటి కంటే పెద్దవి.

ఈ ప్రాజెక్టులో 61.57 కి.మీ సొరంగాలు, 915.47 కి.మీ పొడవైన కాలువలు ఉంటాయి. దీంతో ఎత్తిపోతల పథకంతో తాగు నీటికి 7.15 టీఎంసీలు, పరిశ్రమలకు 3 టీఎంసీలు, సాగునీటికి 75.94 టీఎంసీలు అందుబాటులోకి రానున్నాయి.

ఎత్తిపోతల ప్రాజెక్టు

ఫొటో సోర్స్, telanagangovernment

ఎన్నో వివాదాలు, అడ్డంకులు దాటుకుని

ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రాంతంలో నీటి కోసం కృష్ణా నదిలో ఒక ఎత్తిపోతల పథకం నిర్మించాలన్న డిమాండ్ ఇవాళ్టిది కాదు. మహబూబ్ నగర్ జిల్లాలో లక్షల ఎకరాల సాగు యోగ్యమైన భూమి ఉన్నప్పటికీ, నీటి వసతి లేక జనం వలస పోవడం దశాబ్ధాలుగా చూస్తున్నాం.

జూరాల, రాజోలిబండ, ఇతర చెరువుల ద్వారా కేవలం 2 లక్షల ఎకరాలకే నీరు అందేది. ఇక ఇక్కడ నిర్మించాలని ప్రయత్నించిన బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడులు పూర్తి కావడమే లేదు.

దీంతో మహబూబ్‌నగర్ నీటి సమస్య తీర్చడం కోసం పాలమూరు రంగారెడ్డి లిఫ్టు ప్రతిపాదన తెర మీదకు తెచ్చారు తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్లు. 2005 నుంచి ఈ డిమాండ్ ఉంది.

సరిగ్గా తెలంగాణ ఏర్పడే ముందు 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఎత్తిపోతల పథకానికి సర్వే నిమిత్తం ఒక జీవో ఇచ్చారు. అంతకుమించి ముందుకు వెళ్లలేదు.

‘‘తెలంగాణ ఉద్యమకారుల ఒత్తిడితో హడావుడిగా ఆ జీవో ఇచ్చారు తప్ప, వారికి నిర్మించే ఉద్దేశం లేదు. ఆ జీవోలో కూడా లోపాలున్నాయి.’’ అని ఆరోపించారు ప్రస్తుత తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చింది. రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే, అంటే 2014 ఆగష్టులోనే ఈ ప్రాజెక్టు అధ్యయనానికి మళ్లీ సర్వే చేయించింది తెలంగాణ ప్రభుత్వం.

మొదట్లో జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయాలి అనే ప్రతిపాదనలు వచ్చాయి. చాలా కసర్తతు చేసిన తరువాత, జూరాల కాకుండా శ్రీశైలం నుంచి ఎత్తిపోయాలనే నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం.

దాంతోపాటూ కొత్తగా ఆరు జలాశయాలు నిర్మించాలని నిర్ణయించారు. కొత్త డిజైన్ వల్ల ముంపు బాగా తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

పాలమూరు రంగారెడ్డి

ఫొటో సోర్స్, Telangana CMO

2015 జూన్‌లో శంకుస్థాపన

2015 జూన్‌లోనే దీనికి శంకుస్థాపన చేశారు. 2016 జూన్‌లో రూ. 32 వేల 500 కోట్ల ఖర్చుకు అనుమతి ఇచ్చారు. ప్రాజెక్టు పనులను 2 విభాగాలుగా విభజించారు. తాగునీటి పనులు మొదటి దశ, సాగునీటి పనులు రెండో దశ.

ఈ క్రమంలో కోర్టు కేసులు, ట్రిబ్యునల్ కేసులు అనేకం పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరం చెప్పింది.

తాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల నుంచి మినహాయింపు ఉందని, సాగునీటి పనులు మాత్రం పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతనే చేపడతామని తెలంగాణ ప్రభుత్వం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌కు తెలిపింది.

ట్రిబ్యునల్ అందుకు అంగీకరించి ప్రాజెక్టులో తాగునీటి పనులు చేసుకోవడానికి అనుమతించింది. సాగునీటి కేసు పెండింగ్‌లో ఉంది.

ఇదే ప్రాజెక్టు విషయమై ఆంధ్రా రైతులు వేసిన పిటిషన్లో గ్రీన్ ట్రిబ్యునల్ తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా వేసింది. ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగులో ఉంది.

సాంకేతికంగా ఈ ప్రాజెక్టుకు నికర జలాల కేటాయింపు లేదు. కృష్ణా నదిలో వరద వచ్చినప్పుడు వచ్చే మిగులు జలాలు వాడుకోవాలనేది ఉద్దేశం. కానీ నికర జలాలు లేని ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇవ్వదు.

దీంతో చిన్న నీటి పారుదల కోసం బచావత్ ట్రిబ్యునల్ తెలంగాణకు కేటాయించిన 90 టీఎంసీల నీటిలో 45 టీఎంసీలు కృష్ణా బేసిన్లో వాడుకోవడంలేదనీ, దానిని ఈ ప్రాజెక్టుకు వాడుకుంటున్నట్టుగా చూపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

దాంతో పాటూ పోలవరం నిమిత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన 45 టీఎంసీలు కూడా ఇదే ప్రాజెక్టు లెక్కలో వేసింది తెలంగాణ ప్రభుత్వం. 45 టీఎంసీలను నాగార్జునసాగర్ ఎగువన ఉన్న కృష్ణా ప్రాజెక్టుల్లోనే వాడుకోవాలి. ఆంధ్రకు కృష్ణాలో నాగార్జున సాగర్‌పైన ఎలాంటి ప్రాజెక్టులు లేవు కాబట్టి అవి సహజంగా తమకే దక్కుతాయని తెలంగాణ వాదన.

ఈ వాదనతో తెలంగాణ అనుమతుల కోసం ప్రయత్నించింది. ఆంధ్ర మళ్లీ ట్రిబ్యునల్‌కి వెళ్ళింది. కేసు కోర్టులో ఉంది కాబట్టి మేం అనుమతివ్వం అని కేంద్రం బదులిచ్చింది.

అయితే కేసు కోర్టులో ఉన్నప్పటికీ కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం అనుమతించింది. అదే పాయింట్ మీద తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరిపి అనుమతులు సాధించింది.

ఎత్తిపోతల పథకం

ఫొటో సోర్స్, telanagnagovernment

ఫొటో క్యాప్షన్, పంపుహౌసు సొరంగం

ఇంకా పూర్తి కాని ప్రాజెక్టు

ఇవాళ కేసీఆర్ లాంఛనంగా ప్రాజెక్టు ప్రారంభించారు. ఒక రకంగా ఆయన ఇచ్చిన మాట నెరవేర్చారు. 2015లో ప్రాజెక్టు శంకుస్థాపన సమయంలో ఆంధ్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు చెప్పింది.

అప్పటి ఆంధ్ర సాగునీటి మంత్రి దేవినేని ఉమ దీనిపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో స్వయంగా కేసీఆర్ ఆ శంకుస్థాపన సభలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

‘‘హరిహర బ్రహ్మాదులు దిగివచ్చినా, కోటి చంద్రబాబులు కొంగ జపాలు చేసినా, మీ కళ్ల ముందే పాలమూరు లిఫ్టు కట్టి తీరతాను.’’ అంటూ ఆరోజు కేసీఆర్ శపథం చేశారు.

ఈ ప్రాజెక్టు రెండో దశలో కేవలం కాలువల నిర్మాణం ఉంటుంది. ఆ కాలువల నిర్మాణం పూర్తయితేనే వాస్తవంగా సాగునీరు అందుతుంది. కానీ దానికి ఇంకా పర్యావరణ అనుమతులు రాలేదు.

కాబట్టి ప్రాజెక్టు లాంఛనంగా ప్రారంభం అవుతున్నప్పటికీ, కాలువల తవ్వడం మొదలుపెట్టి, పూర్తయ్యాకే రైతులకు నీరు వస్తుంది.

‘‘దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని కాలువలు గతంలో తవ్వినవి ఉన్నాయి. కాబట్టి పర్యావరణ అనుమతులు వస్తే, కాలువలు పూర్తి చేయడం పెద్ద సమస్య కాదు.’’ అని బీబీసీతో చెప్పారు సాగునీటి శాఖకు చెందిన కొందరు ఇంజినీర్లు.

తాగునీటి నిమిత్తంతో పాటూ, భవిష్యత్తులో సాగునీరు తోడటానికి కావల్సిన పంపు సెట్లను మొదటి దశలో నిర్మించడం ప్రారంభించారు. కేవలం కాలువలు మాత్రమే రెండో దశలో పెట్టారు. ఈ మొదటి దశలో కూడా అన్ని రిజర్వాయర్లూ, అన్ని పంపు హౌజులూ వంద శాతం పూర్తి కాలేదు.

మొదటి విడతలోని నార్లాపూర్ పంపు హౌసులో 9 మోటార్లు ఉండగా, 3 మోటార్ల డెలివరీ పాయింట్లే పూర్తయ్యాయి. అందులో కేసీఆర్ ఒక మోటార్‌ను శనివారం ప్రారంభించారు. మరో మోటార్ 20 రోజుల సమయం పట్టవచ్చు.

అలాగే వేర్వేరు పంపుహౌసుల్లో పనులు వేర్వేరు దశల్లో ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నందునే పూర్తికాని ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఎత్తిపోతల ప్రాజెక్టు కాలువ
ఫొటో క్యాప్షన్, కృష్ణా నీళ్లు కాలువల ద్వారా పంపుల వద్దకు వస్తాయి.

అవగాహన లేని మాటలు: మంత్రి

నిజానికి అక్టోబరు చివరకు చాలా పనులు పూర్తవుతాయి కానీ అప్పటికి ఎన్నికల కోడ్ వస్తున్నందున ముందే ప్రారంభిస్తున్నట్టు బీబీసీతో చెప్పారు మరో సాగునీటి శాఖ ఇంజినీరు. ప్రభుత్వం మాత్రం పూర్తికాని ప్రాజెక్టు ఆరోపణలను ఖండిస్తోంది.

‘‘అవి అవగాహన లేని వారు చెప్పే మాటలు’’ అని మీడియాతో అన్నారు వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

‘‘మెయిన్ ట్రంక్ 80 శాతం పూర్తయింది. ఎదుల రిజర్వాయర్ 100 శాతం పూర్తయింది. వట్టెం, కరివెన రిజర్వాయర్లు 80-85 శాతాలు పూర్తయ్యాయి. ఉద్దండపూర్‌లో మాత్రం ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. మొత్తం 34 మోటార్లు ఏర్పాటు చేస్తున్నాం. వాటిలో ప్రతీ పంపుహౌసులోనూ రెండేసి, నాలుగేసి మోటార్లు ముందుగా బిగిస్తున్నాం.

నార్లాపూర్‌లో రెండు ఏర్పాటు చేస్తున్నాం. ఒకటి ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఆ తరువాత 10-20 రోజుల్లో రెండోది సిద్ధం అవుతుంది. ఎదులలో 10 మోటార్లకుగానూ 4 సిద్ధం అయ్యాయి. వట్టెం దగ్గర కూడా నాలుగు మోటార్లు సిద్ధం అయ్యాయి. అక్కడ సబ్ స్టేషన్ పనులు నడుస్తున్నాయి. మొత్తంమ్మీద ఒక నెల రోజుల్లోనే ఈ నార్లాపూర్ రిజర్వాయర్లో ఒకట్రెండు టీఎంసీల నీరు నిల్వ చేయవచ్చు. మొత్తంగా 2-3 నెలల్లో అన్నీ పూర్తవుతాయి. మేం ముందు అనుకున్నది కూడా అక్టోబరు చివరకు పూర్తి చేయాలనే. అక్టోబరు చివరకు కరివెనకు నీళ్లు వెళ్తాయి’’ అని బీబీసీకి వివరించారు ఈ ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజినీర్ సత్యనారాయణ రెడ్డి.

జలాశయాల వివరాలు :

ఎత్తిపోతల

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు జిల్లాల వారీ ఆయకట్టు వివరాలు :

పాలమూరు ప్రాజెక్టు
వీడియో క్యాప్షన్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభించిన కేసీఆర్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ ‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.)