పూడిలంక: మా ఊరి కష్టాలు మరెవరికీ రాకూడదని ఈ గ్రామస్థులు ఎందుకు అంటున్నారు?

పూడిలంక
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

2018లో రోడ్డు మార్గం వేసేందుకు నిధులు మంజూరై పనులు ప్రారంభమయ్యాయి. దశాబ్దాల నాటి కల తీరబోతోందని గ్రామస్తులు అనుకునేలోపే పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. అప్పటి నుంచి ఏళ్ల తరబడి రోడ్డు ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నారు పూడిలంక వాసులు.

ఉత్తరాంధ్రలో ఉన్న ఏకైక లంక గ్రామం పూడిలంక. శ్రీకాకుళం జిల్లా వజ్రాపుకొత్తూరు మండలంలో ఉన్న ఈ లంక గ్రామానికి నలువైపులా ఉప్పుటేరు ఉంటుంది. ఈ గ్రామానికి రాకపోకలు సాగించడానికి పడవ ఒక్కటే మార్గం.

రోడ్డు లేకపోవడం వల్ల పూడిలంక వాసులు పడుతున్న కష్టాలపై రెండేళ్ల క్రితం బీబీసీ కథనం ప్రసారం చేసింది. టెండర్లు పిలిచాం రోడ్డు పనులు త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి సీదిరి అప్పలరాజు అప్పుడు బీబీసీతో చెప్పారు.

కానీ, ఇప్పటికీ ఆ పనులు ఏ మాత్రం జరగలేదు. మరి పూడిలంక రోడ్డుకు నిధులు మంజూరైన పనులు ఇప్పటికీ ఎందుకు పూర్తి కావడం లేదు?

పూడిలంక

ఆ పడవే వారి దైవం

పూడిలంకలో 350 మంది నివాసం ఉంటున్నారు. నలువైపులా నీటితో నిండి ఉన్న ఈ లంకకు రావాలన్నా, గ్రామం నుంచి బయటకు వెళ్లాలన్నా గ్రామానికి ఉన్న ఒకే ఒక్క పడవను పూడిలంక వాసులంతా దైవంగా భావిస్తారు.

“మీరు రెండేళ్ల క్రితం సెప్టెంబరులోనే మా గ్రామానికి వచ్చారు. అప్పుడెలా ఉందో, ఇప్పుడూ అలాగే ఉంది” అని పూడిలంక గ్రామానికి చెందిన ఉష అన్నారు. బీబీసీ 2021 సెప్టెంబర్‌లో పూడిలంక గ్రామానికి వెళ్లినప్పుడు ఆమె బీబీసీతో మాట్లాడారు.

“మీరు వచ్చి మా బాధలు మీద ఒక స్టోరీ ప్రసారం చేశారు. ఆ తర్వాత గవర్నమెంట్ తరపున మా గ్రామానికి ఒకతను వచ్చారు. ఆయన కూడా పడవ మీదే వచ్చారు. గ్రామంలోని కొందరితో మాట్లాడారు.

మీ గ్రామానికి రోడ్డు పనులు పూర్తవుతాయి. మీ కష్టాలు తీరుతాయని చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ ఏ అధికారి రాలేదు, పట్టించుకోలేదు. మేం మాత్రం ప్రాణాలను పణంగా పెట్టి పడవ ప్రయాణాలు చేస్తూనే ఉన్నాం” అని ఉష చెప్పారు.

పూడిలంక

పుట్టిన ఊరిని ఎలా వదిలేస్తాం?

రోడ్డు లేకపోతే ఈ గ్రామానికి రాకపోకలు చాలా కష్టమని అధికారులతో సహా అందరికీ తెలుసు. ఆ విషయాన్ని వాళ్ల దృష్టికి తీసుకెళ్తే... అంత కష్టం భరించే బదులు ఊరిని ఖాళీ చేసి చేసి వెళ్లిపోవచ్చు కదా అని సలహా ఇస్తున్నారని గ్రామస్థులు అంటున్నారు.

ఈ విషయంపై పూడిలంకకు చెందిన గ్రామస్థులు కొందరితో బీబీసీ మాట్లాడింది.

“అధికారులు చెప్పినంత సులువు కాదు పుట్టిన ఊరుని వదిలేసి వెళ్లిపోవడం. పైగా మా ఊరిలో ఏం తక్కువని, పంటలు, మత్స్య సంపద, పాడి అన్ని ఉన్నాయి. ఇక్కడ దేనికీ లోటు లేదు. ఒక్క రోడ్డే లేదు. ఉంటే మా ఊరికే అంతా వస్తారు. అంత అందమైన ఊరు మాది.

మా గ్రామానికి అత్యవసరం మీద వైద్యుడు రావాలన్నా కూడా పడవే మీదే రావాలి. ఉన్నది ఒకటే పడవ. ఆ పడవ ఒకసారి ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు వచ్చిన తర్వాత, మళ్లీ ఆ ఒడ్డుకు వెళ్లాలంటే రెండు గంటలు పడుతుంది. అప్పటి వరకు పడవ కోసం ఎదురు చూడటమే తప్ప మరో దారి లేదు.” అని శివకుమార్ బీబీసీతో చెప్పారు.

పూడిలంకలో పడవను అక్కడి స్థానిక యువకులే నడుపుతుంటారు. శివకుమార్ వారిలో ఒకరు.

పూడిలంక

అత్యవసరంగా వెళ్లాలంటే అంతే..

''మీ ఊరికి కోటి రూపాయలు పైగా డబ్బులు వచ్చాయి, మీ రోడ్డు పనులు పూర్తయిపోతాయని ఐదేళ్ల క్రితం అధికారులు చెప్తుండేవారు. మరి ఆ కోటి రూపాయలు ఏమైపోయాయో, మా ఊరికి రోడ్డు ఎందుకు రాలేదో మాకైతే అర్థం కాలేదు” అని పూడిలంక నుంచి రోజు వజ్రపుకొత్తూరు మండల కేంద్రానికి వచ్చి నత్తగుల్లలు, చేపలు అమ్ముకుని జీవించే శ్రీనుబాబు బీబీసీతో చెప్పారు.

''మామేమి భారీ రోడ్డు అడగలేదు. మాకు అవసరమైనది మట్టి రోడ్డే. దానిని కూడా కట్టడానికి ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు'' అని శ్రీనుబాబు అన్నారు.

పూడిలంక గ్రామం చేరుకోవాలంటే పల్లివూరు అనే గ్రామం నుంచి కిలోమీటరుకు పైగా బోటు ప్రయాణం చేయాలి.

ఊర్లో ప్రభుత్వ పాఠశాల ఉంది. అయితే, ఇక్కడకి ఉపాధ్యాయులు రావాలంటే పడవ ప్రయాణం చేయాలి. ఒకటే పడవ ఉండటంతో ఉపాధ్యాయులు స్కూలుకి సమయానికి రాలేకపోతున్నారని.. ఇది పిల్లల చదువులపై ప్రభావం చూపుతుందని గ్రామస్థుడైన సందీప్ చెప్పారు.

“గ్రామం నుంచి అత్యవసర పరిస్థితిపై బయటకు వెళ్లాలంటే మాత్రం చాలా కష్టం. మా ఊరి కష్టాలు మరెవరికీ రాకూడదు. కిలోమీటరు రోడ్డు వేయడం కోసం ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి? మాలా మీరు రోజూ పడవ ప్రయాణాల జీవితాన్ని ఊహించుకోండి, మీకు తెలుస్తుంది. దయ చేసి మా బాధని అర్థం చేసుకోండి” అని సందీప్ అధికారులను కోరారు.

పూడిలంక

ఉప్పుటేరులో ముగ్గురు చనిపోయారు

పూడిలంకలో పడవ లేకపోతే జీవితం లేదు. ఏ చిన్న అవసరానికైనా ఉప్పుటేరు దాటాల్సిందే. ప్రతిసారీ పడవ అందుబాటులో ఉండదు. దీంతో అత్యవసర సమయాల్లో పడవ అందుబాటులో లేకపోతే ఉప్పుటేరు నీటిలో నడుచుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంటాం. గత నాలుగేళ్లలో నాకు తెలిసి అత్యవసర సమయాల్లో నీటిలో దిగి ముగ్గురు చనిపోయారని పూడిలంకలో పడవ నడిపే హేమారావు బీబీసీతో చెప్పారు.

దాదాపు 110 ఎకరాల విస్తీర్ణంలో పూడిలంక ఉంది. ఇక్కడ మహిళలు... గ్రామం చుట్టూ ఉన్న ఉప్పుటేరులో దొరికే ఆల్చిప్పలను సేకరిస్తారు. వీటి చిప్పల నుంచి మాంసాన్నీ వేరు చేసి అమ్ముతూ.. రోజుకు రూ. 50 రూపాయల వరకూ సంపాదిస్తారు.

“ఆల్చిప్పల మాంసాన్ని బయట అమ్ముకుంటే మూడు వందల వరకు వస్తాయి. రోడ్డు లేకపోవడంతో పడవ ప్రయాణాలు చేసి బయటకు వెళ్లలేకపోతున్నాం. గ్రామంలో పండే పంటలు కూడా బయటకు తీసుకుని వెళ్లలేక.. ఇక్కడే తక్కువ ధరకు అమ్మేస్తున్నాం. కొందరు వ్యాపారులు వచ్చి గ్రామంలోనే చేపలు, కూరగాయలు కొనుక్కుని పట్టుకుపోతారు” అని ఆల్చిప్పల మాంసం తీసే శేషమ్మ చెప్పారు.

రాకపోకలు తీవ్రమైన ఇబ్బంది ఉండే పూడిలంక గ్రామంలోని యువతీయువకులకు పెళ్లి సంబంధాలు కుదరడం కూడా కష్టంగా మారిందని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.

పూడిలంక

అధికారులేమంటున్నారు..

ఎన్నో వినతులు, ఆందోళనలు చేసిన తర్వాత పూడిలంక రోడ్డు కోసం 2018లో రూ. 1.30 కోట్లు నిధులు మంజూరయ్యాయి. అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు అదే ఏడాది మేలో శంకుస్థాపన చేసి రోడ్డు పనులు ప్రారంభించారు.

పనులు కొంత వరకు జరిగాయి. ఆ తర్వాత నిలిచిపోయాయి. కిలోమీటరు పైగా రోడ్డు నిర్మించాల్సి ఉండగా.. కేవలం 400 మీటర్లే వేశారు. మిగిలిన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు.

“రోడ్డు పనులు మొదలైనప్పుడు మా కష్టాలు తీరిపోయాయి అనుకున్నాం, కానీ ఆ పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఊరికి తుపాన్లు వచ్చినా, ఏ ఆపద వచ్చినా కూడా ఎవరు పట్టించుకోలేదు. రోడ్డు పనులు ఆగిపోయి ఐదేళ్లు అవుతుంది. మిగతా పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియదు. ఈలోపు వేసిన ఆ రోడ్డు కూడా పాడైపోతుంది” అని గ్రామానికి చెందిన సత్యం బీబీసీతో అన్నారు.

ఈ విషయంపై పంచాయితీరాజ్ శాఖాధికారులతో బీబీసీ మాట్లాడింది. రోడ్డు పనులు ఎందుకు నిలిచిపోయాయని, మళ్లీ ఎందుకు ప్రారంభం కాలేదని ప్రశ్నించింది.

పూడిలంక గ్రామానికి రోడ్డు నిమిత్తం 2018లో రూ.1.30 కోట్లు మంజూరైన మాట వాస్తవమేనని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు తెలిపారు.

“ఆ నిధులకు సరిపడా పనులు చేశాం. కానీ, ఆ తర్వాత నిధులు రాలేదు. వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పూడిలంక వాసుల ఇబ్బందులపై ఉన్నతాధికారులకు తెలియపరిచి, రోడ్డు పనులకు అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే ఆ పనులు పూర్తి చేస్తాం” అని పలాస పంచాయతీరాజ్ జేఈ నాగభూషణం చెప్పారు.

త్వరలోనే పూడిలంక రోడ్డు పనులు పూర్తవుతాయని 2021 సెప్టెంబర్‌లో బీబీసీతో చెప్పిన మంత్రి సీదిరి అప్పలరాజుతో మరోసారి మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)