'రా' ఏజెంట్లను ఎలా ఎంపిక చేస్తారు? ఎలాంటి శిక్షణ ఇస్తారు?

గూఢచారి

ఫొటో సోర్స్, Getty Images

కెనడాలో సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్‌-కెనడాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.

ఈ సందర్భంలో భారత గూఢచార సంస్థ అయిన రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (R&AW)ను ఇజ్రాయెల్ నిఘా సంస్థ ‘మొసాద్‌’తో అంతర్జాతీయ మీడియా పోల్చింది. తాజాగా ఆర్‌ఏడబ్ల్యూ ఇంటెలిజెన్స్ గురించి ఆసక్తిగలవారు ఇంటర్నెట్‌లో వెతుకుతున్నారు.

ఇంతకూ ఆర్‌ఏడబ్ల్యూ ఏజెంట్లను ఎలా ఎంపిక చేస్తారు? దానిలో చేరిన తర్వాత ఏం చెయ్యాలి? వారి గూఢచర్యం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.

విదేశీ గూఢచార కార్యకలాపాల కోసం అమెరికాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA), బ్రిటన్‌కు MI6, రష్యాకు SVR, చైనాకు గ్వాన్‌పు , పాకిస్తాన్‌కు ISI మాదిరి ఇండియాకు కూడా ప్రత్యేక నిఘా ఏజెన్సీ ఉంది. అదే రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (R&AW). దీనిని సాధారణ వ్యావహారికంలో ‘రా’ అని పిలుస్తారు.

ఇంటెలిజెన్స్

ఫొటో సోర్స్, Getty Images

'రా'కి ఆఫీసులు ఉంటాయా?

భారత RAW ఇంటెలిజెన్స్ యూనిట్ దిల్లీలోని కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్ కింద పనిచేస్తుంది.

దీని ప్రధాన అధికారిని సెక్రటరీ (R) అంటారు. ఆ ఆఫీసర్ కింద ప్రత్యేక కార్యదర్శి, అదనపు కార్యదర్శి, స్పెషల్ ఆపరేషన్స్ విభాగం, డిఫెన్స్ డివిజన్ డైరెక్టర్ జనరల్ తదితరులు ఉంటారు.

ఈ అధికారులు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), భారత అంతర్గత భద్రతా సంస్థ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, డిఫెన్స్ , మిలిటరీ ఇంటెలిజెన్స్ తదితర విభాగాలతో సమన్వయం చేసుకుంటూ గూఢచర్యం చేస్తూ, సమాచారం పంచుకుంటారు.

ఈ అదనపు కార్యదర్శుల కింద దేశ, ప్రాంతాల వారీగా ప్రత్యేక విభాగాలు ఉంటాయి. వాటిని RAW భాషలో 'డెస్క్‌లు' అంటారు.

RAW సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీలు ప్రధాని, జాతీయ భద్రతా సలహాదారుతో నేరుగా టచ్‌లో ఉంటారు.

దిల్లీలో ఉన్న ప్రధాన కార్యాలయంలో పాకిస్తాన్ , చైనా, ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాలు, ఇతర దేశాల డెస్క్‌లు, స్పెషల్ ఆపరేషన్స్ డెస్క్ వంటి ప్రత్యేక విభాగాలు ఉన్నాయి.

ఈ యూనిట్లతో పాటు RAW ప్రధాన కార్యాలయంలో ఒక ఎలక్ట్రానిక్, సాంకేతిక విభాగం కూడా ఉంది.

ఇది విదేశీ అనుమానాస్పద సంస్థలు, వ్యక్తుల టెలికమ్యూనికేషన్‌, వారి కమ్యూనికేషన్ పరికరాలపై (ఇంటెలిజెన్స్, శాటిలైట్ సహాయంతో) నిఘా పెడుతుంది.

విమానాలు

ఫొటో సోర్స్, Getty Images

‘రా’ వ్యవస్థకు ప్రత్యేక విమానం ఉందా?

ప్రత్యేక విమానం ఉంటుంది. అత్యవసర మిషన్లు, ఉన్నత స్థాయి అధికారుల ప్రత్యేక కార్యకలాపాల కోసం భారత వైమానిక దళానికి చెందిన విమానాలు ఉంటాయి.

కానీ ఏ ఏజెంట్ కూడా విమానం ఎక్కి తన ఇష్టానుసారం తిరగలేరు, తనకు తోచినప్పుడల్లా శత్రువులపై దాడి చేయకూడదు.

వైమానిక నిఘా, రక్షణ పనుల కోసం RAWలో ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ రీసర్చ్ సెంటర్ పనిచేస్తోంది. దీనికి ప్రత్యేక కార్యదర్శి నేతృత్వం వహిస్తారు.

అదనంగా విదేశాల్లో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్‌కు నాయకత్వం వహించడానికి ప్రత్యేక కార్యదర్శి హోదాలో సీనియర్ అధికారి ఉంటారు.

శిక్షణ

ఫొటో సోర్స్, Getty Images

‘రా’ విధులు రహస్యమా?

విదేశాలలో గూఢచార సేకరణ సున్నితమైన అంశం. భారత ప్రభుత్వం RAWని క్యాబినెట్ కింద ఒక ఏజెన్సీగా వర్గీకరించింది.

అలాగే, రా కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, ఆడిట్‌ తదితర అంశాలను పార్లమెంట్‌లో బహిరంగ పరచాల్సిన అవసరం లేదు.

అదే సమయంలో దాని కార్యకలాపాలు అంతర్గత ఆడిట్‌గా వర్గీకరించారు.

ప్రజలకు RAWకి సంబంధించిన సమాచారం ఇవ్వకుండా సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం మినహాయింపు ఉంది.

ముఖ్యమైన అధికారిక సమావేశాలు, కాన్ఫరెన్స్‌లకు RAWలోని ఉన్నతాధికారులు లేదా ఆహ్వానం అందిన అధికారులు మాత్రమే హాజరవుతారు.

అందువల్ల అధికారుల గుర్తింపు, కార్యకలాపాలు రహస్యంగా ఉంటాయి.

వీడియో క్యాప్షన్, RAW: ఈ భారత నిఘా సంస్థ ఎలా పనిచేస్తుంది?

'రా' కార్యాలయం భారతదేశంలో ఎక్కడ ఉంది?

భారతదేశంలో 'రా' కార్యాలయాలను ఏడు జోన్‌లుగా విభజించారు.

నార్త్ జోన్ (జమ్ము), ఈస్ట్ జోన్ (కోల్‌కతా), సౌత్ వెస్ట్ జోన్ (ముంబై), నార్త్ ఈస్ట్ జోన్ (షిల్లాంగ్), సౌత్ జోన్ (చెన్నై), సెంట్రల్ జోన్ (లగ్నెల్లా), వెస్ట్ జోన్ (జోధ్‌పూర్)లో కార్యాలయాలు ఉన్నాయి.

ఇవి కాకుండా ప్రధాన మెట్రో నగరాల్లో వివిధ పేర్లతో RAW కార్యాలయాలు పనిచేస్తున్నాయి. సంస్థ ఫీల్డ్ స్టాఫ్ అంటే ఏజెంట్లు అక్కడి నుంచే పని చేస్తారు.

RAW కార్యాలయాల్లో ముఖ్యంగా సెక్రటరీ, ప్రత్యేక కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, ట్రాన్స్‌ఫర్ ఆఫీసర్స్, సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్, ఫీల్డ్ ఆఫీసర్, డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్, మినిస్ట్రీ సిబ్బంది ఉన్నారు.

RAW ఏజెంట్లు విదేశీ మిషన్ల సమయంలో వారి సంబంధిత దేశాలలోని రాయబార కార్యాలయంతో నేరుగా కమ్యూనికేట్ చేస్తూ పనిచేస్తారు.

పరీక్షలు

ఫొటో సోర్స్, Getty Images

అధికారుల ఎంపిక ఎలా?

సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ నుంచి అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్ వరకు ఉద్యోగాల నియామకం ఎక్కువగా ఇంటర్వ్యూ ద్వారా నిర్వహిస్తారు. వీరి ఎంపిక కేబినెట్ సెక్రటేరియట్ ఆధ్వర్యంలో జరుగుతుంది.

దీంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగిన అధికారులు, కానిస్టేబుళ్లు, సైనికులు తదితరులను రా ఫీల్డ్ వర్క్‌లో నిమగ్నం చేసేందుకు ఎంపిక చేస్తారు.

ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ సర్వీసులకు ఎంపికైన వారిలో డిపార్ట్‌మెంట్‌లో చేరడానికి అర్హత ఉన్న అధికారిని RAW గుర్తిస్తుంది.

కొన్నిసార్లు యూపీఎస్సీ, ఎస్ఎస్సీ బోర్డ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, సంబంధిత విభాగంలో చేరిన తర్వాత అర్హత గల వారిని RAW సంప్రదించి, సంస్థలో చేరాలని ఆహ్వానిస్తుంది.

గ్రూప్-1 అధికారులకూ ఈ అవకాశం దక్కవచ్చు.

దీంతో పాటు RAW వ్యవస్థలో శాశ్వతంగా ఉద్యోగం పొందిన అధికారులకు IPS, IAS వంటి మెరిట్ సర్వీస్ కోడ్ 'RAS' ఇస్తారు.

కేంద్ర ప్రభుత్వ అధికారిక కమ్యూనికేషన్‌లలో ఈ కోడ్‌తో కూడిన పేర్లకు ప్రాధాన్యం ఇస్తారు.

ఎందుకంటే వారు RAW గూఢచారి సంస్థకు చెందినవారని సంబంధిత శాఖ సీనియర్ అధికారికి తెలుస్తుంది.

వీడియో క్యాప్షన్, రా ఏజెంట్లను ఎవరు ఎంపిక చేస్తారు? వారు విదేశాల్లో ఏం చేస్తారు?

‘రా’లో శిక్షణ కష్టమా ?

RAW వ్యవస్థలో ఫీల్డ్ ఆఫీసర్లు లేదా ఏజెంట్లుగా పనిచేసే వారికి అర్హతలు, శిక్షణ కఠినమైనవి. ప్రాథమికంగా వారికి మాతృభాష, ఇంగ్లిష్, హిందీ కాకుండా ఒకటి లేదా రెండు విదేశీ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి.

వారు RAW ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో చేరిన వెంటనే మొదటి సంవత్సరం గూఢచార సేకరణపై శిక్షణ పొందుతారు.

ఫైనాన్స్, ఎకనామిక్ అనాలిసిస్, స్పేస్ టెక్నాలజీ, శాటిలైట్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్, ఎనర్జీ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ ఫారన్ పాలసీ, డిప్లొమాటిక్ ఆపరేషన్స్‌లో శిక్షణ ఇస్తారు.

ఈ అధికారులు విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలలో సాధారణ జూనియర్ అధికారి, అసిస్టెంట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ లేదా అక్కడ ఏదైనా డిపార్ట్‌మెంట్‌లో మొదటి లేదా రెండో కార్యదర్శిగా పనిచేస్తూ నిఘా సమాచార సేకరణలో శిక్షణ పొందుతారు.

ఈ అధికారులకు దిల్లీ శివారులోని గురుగ్రామ్‌లో అంతర్గత శిక్షణ, భాషా శిక్షణ ఇస్తారు.

ఈ శిక్షణ పూర్తయిన తర్వాత ఫీల్డ్ ఆఫీసర్లకు తదుపరి రెండేళ్లపాటు అధునాతన శిక్షణ పేరుతో ఫీల్డ్ ఇంటెలిజెన్స్ శిక్షణ ఇస్తారు.

అసాధారణ పరిస్థితుల్లో ఎలా పనిచేయాలి? విదేశాల్లోకి ఎలా వెళ్లాలి? అక్కడి నుంచి తప్పించుకొని స్వదేశానికి ఎలా రావాలి? విదేశాల్లో పట్టుబడితే ఏం చెయ్యాలి? పరిచయాలు ఎలా ఉండాలి? మారువేషంలో జీవించడం ఎలా అనే అంశాలతోపాటు మార్షల్ ఆర్ట్స్, ఆయుధాల నిర్వహణ తదితర అంశాల్లో శిక్షణ అందిస్తారు.

శారీరక శిక్షణ కోసం వారిని కొన్ని నెలలు ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ కాలేజీకి కూడా పంపిస్తారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)