తుపాకీ తూటా కంటే 15 రెట్ల వేగంతో భూమిపైకి దూసుకొస్తున్న స్పేస్ క్యాప్సూల్, ఎక్కడ పడుతుందంటే..

ఫొటో సోర్స్, Nasa
- రచయిత, జోనాథన్ అమోస్
- హోదా, బీబీసీ సైన్స్ ప్రతినిధి
శాస్త్రవేత్తలు, అంతరిక్షంలోని రహస్యాలను తెలుసుకోవాలనుకునే ఔత్సాహికులు అమెరికాలోని యుటా రాష్ట్ర గగనతలంపై దృష్టి సారించారు. ఎందుకంటే అంతరిక్షం నుంచి ఓ క్యాప్సూల్ బుల్లెట్ కంటే 15 రెట్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోంది.
ఒసిరిస్ రెక్స్ అనే ఈ క్యాప్సూల్‌లో ఓ గ్రహశకలానికి సంబంధించిన రాళ్లు, ధూళి ఉన్నాయి. ఇది నాలుగేళ్ల ప్రయాణం తర్వాత భూమి మీదకు వస్తోంది.
అది తీసుకొచ్చే రాళ్లను, ధూళిని పరిశీలించడం ద్వారా కొన్ని లక్షల కోట్ల ఏళ్ల క్రితం భూ గ్రహం ఎలా ఏర్పడిందో తెలుసుకునే అవకాశముంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఐదు వందల మీటర్ల వెడల్పున్న బెన్ను అనే గ్రహశకలం అంతరిక్షంలో తిరుగుతోంది.
ఈ గ్రహశకలం ఉపరితలం అంతా బండరాళ్లుతో ఎగుడుదిగుడుగా ఉంటుంది. అంతేకాదు భూమికి ప్రమాదకరమైన గ్రహశకలాలపై నాసా విడుదల చేసిన జాబితాలో ఇది మొదటి స్థానంలో ఉంది.
ఈ గ్రహశకలం ఆధారంగా భూమి పుట్టుక తెలుసుకునే అవకాశమూ ఉందని అంటున్నారు. దాంతో నాసా ఈ గ్రహశకలంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది.
రెండేళ్ల ప్రయాణం తర్వాత ఒసిరిస్ రెక్స్ అనే ఈ నాసా వ్యోమనౌక బెన్నూ గ్రహశకలానికి చెందిన శిథిలాలను సేకరించింది. అందుకు సంబంధించి ఐదు సెక్లన వీడియోను వ్యోమనౌక కెమెరా రికార్డు చేసింది.
గ్రహశకలం ముక్కలను తీసుకుని ఒసిరిస్ రెక్స్ ఇపుడు భూమికి చేరుకుంటోంది.

ఫొటో సోర్స్, NASA/GODDARD/UNIVERSITY OF ARIZONA
250 గ్రాముల దుమ్ము, రాళ్లతో రాక
‘’భూమి ఏర్పడక ముందున్న మెటీరియల్ కోసం చూస్తున్నాం. భూమి మీద ప్రాణం పుట్టుకకు ముందు జరిగిన సంఘటనల కోసం చూస్తున్నాం. నిజానికి ఇందులో చాలాభాగం అసలు సౌర వ్యవస్థ పుట్టుకకు ముందే ఉండొచ్చు. కాబట్టి మన ప్రారంభ చరిత్రను అధ్యయనం చేస్తున్నాం. అసలు సౌర వ్యవస్థ ఎలా ఏర్పడింది? గ్రహశకలాలు ఎలా ఒకచోటుకు చేరాయి? బెన్నూ లాంటి గ్రహశకలాలే భూమిని నివాసయోగ్యంగా మార్చాయా’’ అని తెలుసుకోవాలనుకుంటున్నట్లు ఒసిరిస్ రెక్స్ మిషన్ ప్రధాన పరిశోధకులు డాంటే లారెట్టా చెప్పారు.
ఈ వ్యోమనౌక ల్యాండయ్యేందుకు విశాలమైన ఎడారి ప్రాంతాన్ని ఎంచుకున్నారు శాస్త్రవేత్తలు.
‘’అంతరిక్షంలో లక్షల మైళ్ల దూరం ప్రయాణించిన క్యాప్సూల్ ఇప్పుడు యుటా ఏడారిలో ఒకచోట ల్యాండ్ అవబోతుంది. దాని లోపల 250 గ్రాముల రాళ్లు, దుమ్ము ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే నమూనా పరిమాణం చేతి గుప్పిట్లో పట్టేంత మాత్రమే ఉంటుంది. కానీ ఇందులోని అణువణువు చాలా ముఖ్యమైంది. వీటి అధ్యయనం ద్వారా సౌర వ్యవస్థ పుట్టుక గురించి శాస్త్రవేత్తలు తెలుసుకోనున్నారు’’ అని బీబీసీ సైన్స్ ఎడిటర్ రెబెక్కా మొరేల్ తెలిపారు.
తిరుగు ప్రయాణం అంత తేలిక కాదు..
భూమి వాతావరణంలో క్యాప్సూల్ వేగం గంటకు 43 వేల కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉంటుంది.
భూమిపై ల్యాండ్ అయ్యే క్రమంలో మూడు వేల డిగ్రీల ఉష్ణోగ్రతలను ఇది తట్టుకోవాలి. పారాచ్యూట్‌ల ద్వారా దాని వేగం తగ్గుతుంది. కిందకు వచ్చాక గ్రహశకలాలున్న క్రాఫ్ట్‌ను జాగ్రత్తగా ఎలా తెరవాలో శాస్త్రవేత్తలు ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఎందుకంటే అందులో ఉన్న అంతరిక్ష శిథిలాలు కలుషితం కాకుండా చూడటం ముఖ్యమైన విషయం.
‘’భూమిపైన పడే ఉల్కలనూ అధ్యయనం చేస్తూ ఉంటాం. వాటి నుంచి చాలా తెలుసుకుంటాం కూడా. అయితే, అవి భూ వాతావరణంలో ప్రయాణించే క్రమంలో భూ పదార్థాల కారణంగా కలుషితమయ్యే ఆస్కారం ఉంటుంది. అందుకే గ్రహశకలం నుంచి కలుషితం కాని స్వచ్ఛమైన నమూనా కావాలి’’ అని ఒసిరిస్ రెక్స్ మిషన్ సిస్టమ్స్ ఇంజనీర్ అంజనీ పోలిట్ తెలిపారు.

ఫొటో సోర్స్, BBC/KEVIN CHURCH
అసలేంటి ఈ బెన్నూ గ్రహశకలం?
బెన్నూ గురించి ఇప్పటికే కొన్ని విషయాలు తెలిశాయి. అది గట్టి రాయి కాదు. చిన్న చిన్న శకలాలు కలిసి ఏర్పడిన వస్తువులా ఉంది.
ఈ మిషన్‌లో ముఖ్యమైన వ్యక్తులూ పాల్గొన్నారు.
బెన్నూ గ్రహశకలం నమూన సేకరణ సరిగ్గా ఎక్కడ చేయాలో శాస్త్రవేత్తలకు దిశానిర్ధేశం చేశారు క్వీన్ రాక్‌బ్యాండ్‌లో గిటారిస్ట్, ఆస్ట్రోఫిజిసిస్ట్ సర్ బ్రయిన్ మే. దాని కోసం ఆయన బెన్నూకి చెందిన స్టీరియోస్కోపిక్ 3D చిత్రాల సాయం తీసుకున్నారు.
‘’మొదట్లో 30 వరకూ వేర్వేరు ప్రాంతాలను ఎంచుకున్నాం. వాటిలో కొన్నింటిని పక్కనపెట్టాం. ఎందుకంటే అవి చాలా పెద్ద బండరాళ్లు. ఇంకొన్నింటిని తిరస్కరించడానికి కారణం అవి చాలా చిన్నవి. మరికొన్ని మెటిరీయల్స్ అధ్యయనానికి అంతగా ఉపయోగపడకపోవచ్చు’’ అని బీబీసీతో బ్రయిన్ మే చెప్పారు.
ప్రస్తుతం అందరి కళ్లూ యుటా ఏడారిపైనే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడే ఆ స్పేస్ క్రాఫ్ట్ ల్యాండవుతోది.
మనం ఎక్కడ నుంచి వచ్చామనే ప్రశ్నకు ఈ మిషన్‌తో సమాధానం లభిస్తుందనేది శాస్త్రవేత్తల ఆశ.

ఫొటో సోర్స్, Nasa
ఇవి కూడా చదవండి
- నేపాల్: లక్షమంది టీచర్లు వీధుల్లోకి ఎందుకు వచ్చారు... వారి ఆగ్రహానికి కారణమేంటి?
- డిజిటల్ చెల్లింపులతో డబ్బును వృథాగా ఖర్చు చేయడం పెరుగుతోందా?
- మహిళలు, బాలికలు దుస్తులు ‘సరిగా’ ధరించకపోతే పదేళ్ల జైలు.. వివాదాస్పద బిల్లుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం
- మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎదురయ్యే అడ్డంకులు ఇవే..
- కాంగ్రెస్ 6 గ్యారెంటీలు: కర్ణాటక ఫార్ములా తెలంగాణలో నడుస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















