మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎదురయ్యే అడ్డంకులు ఇవే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
దశాబ్దాలుగా భారత రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం దక్కలేదనేది వాస్తవం. అందుకే మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించడం కోసం 'నారీ శక్తి వందన-2023' చట్టం ప్రతిపాదనను లోక్‌సభలో ప్రవేశపెట్టింది కేంద్రప్రభుత్వం. అయితే చట్టాల అమలనేది అటు ప్రభుత్వానికే కాదు, ఇటు రాజకీయ పార్టీలకు పరీక్షలాంటిదే.
ఇతర పని రంగాల మాదిరిగానే రాజకీయాల్లోనూ పురుషాధిక్యత ఉంది. రిజర్వేషన్ ద్వారా మహిళలు రాజకీయాల్లోకి రావడాన్ని గట్టిగా సమర్థించలేకపోయారు పురుష నాయకులు.
1992లోనే పంచాయతీ స్థాయిలో 33 శాతం రిజర్వేషన్ల చట్టం ఉంది. అయినా కూడా పార్లమెంటు, శాసనసభల్లో అదే రిజర్వేషన్‌పై ఏకాభిప్రాయం ఏర్పడేందుకు మూడు దశాబ్దాలకు పైగా సమయం పట్టింది.
మహిళలకు రాజకీయ అవగాహన లేదని, ఇన్నిరోజులు రిజర్వేషన్లు ఇవ్వడానికి నిరాకరించారు.
పంచాయతీల్లో సర్పంచ్‌లుగా ఎన్నికైన మహిళల పేర్లు కాగితాలపైనే నిలిచిపోయాయి. ఆ పదవిలో భర్తలు పెత్తనం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు 'సర్పంచ్-భర్త' అనే ముద్దుపేరు కూడా పెట్టారు జనం.

ఫొటో సోర్స్, Getty Images
పంచాయతీ రిజర్వేషనే పాఠం
'మహిళలు అసమర్థులు' అనే సాకుతో పురుషులు వారిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి లలిత కుమార మంగళం అభిప్రాయపడ్డారు.
అటువంటి పరిస్థితిలో, కఠినమైన ఆదేశాలు తప్ప మరో మార్గం లేదన్నారామె. మోదీలాంటి బలమైన, పార్టీ దిశానిర్ధేశకుడు ఆమోదించినపుడు మిగతావారూ అంగీకరించక తప్పదని ఆమె తెలిపారు.
మరోవైపు పంచాయతీల్లో రిజర్వేషన్ల అనుభవం నుంచి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉందని తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సుస్మితా దేవ్ తెలిపారు.
మహిళలకు మొదట్లో పంచాయతీల్లో రిజర్వేషన్ అంగీకరించలేదు, తర్వాత స్త్రీలకు పదవులు వచ్చినా అధికారం మాత్రం పురుషుల వద్దే ఉందనేది వాస్తవం.
మహిళా నాయకత్వాన్ని పెంపొందించుకోవడమనేది పెద్ద సవాలుగా మారిందని పుణేలోని కార్వే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీస్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగమణి రావు గుర్తించారు.
నాగమణి ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులపై అధ్యయనం చేశారు.
మహిళలు రాజకీయ సంబంధిత ఉద్యమాలలో పాల్గొంటారు, కానీ పురుషుల మాదిరిగా రాజకీయ పార్టీల్లో ఉండరని ప్రొఫెసర్ అభిప్రాయం.
ఎంపీగా పోటీ చేయాలంటే మహిళలు పార్టీలు మారాల్సిన పరిస్థితి కూడా ఉంది.
ఎంతమంది మహిళలను నిర్ణయాధికారం ఉండే ఉన్నత స్థానాల్లో నియమించారో రాజకీయ పార్టీలు తమను తాము ప్రశ్నించుకోవాలని ఈ సందర్భంగా సుస్మిత సూచిస్తున్నారు.
పంచాయతీల తరహాలో మహిళలు మళ్లీ రబ్బరు స్టాంపులుగా మారకుండా ఉండేందుకు పార్టీలు వారికి పెద్ద బాధ్యతలు అప్పగించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, UROOSA RANA
యూపీలో కాంగ్రెస్‌పై ప్రభావం
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ-2022 ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టిక్కెట్లు ఇస్తామని 2021లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రకటించారు.
కానీ దాని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది ఆ పార్టీకి.
403 సీట్ల ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీలో కేవలం రెండు స్థానాల్లోనే గెలిచింది. అందులో ఒక స్థానంలో మహిళ గెలిచారు. అంతకముందు 7 స్థానాలుండేవి.
కొన్ని నిర్ణయాలు లాభ-నష్టాలకు అతీతంగా ఉంటాయి. మహిళలకు టిక్కెట్లు ఇవ్వాలన్న నిర్ణయం కూడా అలాంటిదేనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా అంటున్నారు.
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ మహిళా ఉపాధ్యక్షురాలు ఉరుసా రాణా ఉన్నావ్ జిల్లాలోని పూర్వా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
అయితే, ఆ అనుభవం నుంచి తాను నేర్చుకున్న పాఠాలు రెండోసారి మెరుగ్గా పోరాడేందుకు సహాయపడతాయని ఆమె నమ్ముతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రిజర్వేషన్లకు అనేక సవాళ్లు
మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టంగా మార్చేందుకు గతంలోనూ ప్రయత్నాలు జరిగాయి.
2010లో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని రాజ్యసభలో ప్రవేశపెట్టగా, లోక్‌సభలో సభ్యుల మద్దతు లేకపోవడంతో చట్టంగా మారలేదు.
ఈసారి చాలా పార్టీలు మహిళలకు రిజర్వేషన్ అంశాన్ని సమర్ధిస్తున్నాయి. బిల్లును ఆమోదించడానికి అవసరమైన మెజారిటీ బీజేపీకి ఉన్నప్పటికీ, జనాభా లెక్కలు, డీలిమిటేషన్ ప్రక్రియ ఒక అడ్డంకి.
ప్రతిపాదిత చట్టం ప్రకారం రిజర్వేషన్ అనేది తదుపరి డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత మాత్రమే అమలవుతుంది.
మహిళా రిజర్వేషన్ పోరాటంలో ఒక యుద్ధం మాత్రమే గెలిచామని, మరో పెద్ద యుద్దం మిగిలి ఉందని సుస్మితా అంటున్నారు. డీలిమిటేషన్‌పై ఏకాభిప్రాయం రావడం పెద్ద సవాల్ అన్నారామె.
జనాభా ప్రకారం సీట్లను నిర్ణయించే ప్రక్రియే ఇదని, అయితే జనాభా పెరుగుదలను నియంత్రించిన రాష్ట్రాలు తమ సీట్లు తగ్గుతాయని భయపడుతున్నాయని సుస్మితా తెలిపారు.
ఈ డీలిమిటేషన్ నిబంధనను సుస్మిత వ్యతిరేకించారు, ఇదే సమయంలో బీజేపీ రాజ్యసభ ఎంపీ సరోజ్ పాండే మాత్రం కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.
''డీలిమిటేషన్ ప్రక్రియపై ఎటువంటి సందేహం అవసరం లేదు. దానికి కాలపరిమితి ఉంది. ఇది దాని గమ్యాన్ని చేరుకుంటుందని నేను కచ్చితంగా అనుకుంటున్నా" అని బీబీసీతో చెప్పారు సరోజ్ పాండే.
ఇవి కూడా చదవండి
- నవాజ్ షరీఫ్: 'భారత్ చంద్రుడిపైకి చేరుకుంది, పాకిస్తాన్ మాత్రం డాలర్లు అడుక్కుంటోంది’
- కాంగ్రెస్ 6 గ్యారెంటీలు: కర్ణాటక ఫార్ములా తెలంగాణలో నడుస్తుందా?
- హైదరాబాద్ సంస్థానం భారత్‌లో ఎలా అంతర్భాగమైంది? నిజాం ఎందుకు లొంగిపోయారు? చరిత్ర ఏం చెబుతోంది?
- పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల: ఇంకా పూర్తికాని ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించారా?
- సెప్టెంబర్ 17: అటు అమిత్ షా, ఇటు సోనియా గాంధీ, హైదరాబాద్‌లో ఏం జరగబోతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














