మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... ఈ బిల్లు గురించి తెలుసుకోవాల్సిన 6 కీలక అంశాలు

మహిళా రిజర్వేషన్ బిల్లు

ఫొటో సోర్స్, Getty Images

లోక్ సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ కల్పించే బిల్లును మంగళవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పార్లమెంట్‌లోని లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

ఈ రాజ్యాంగ (128వ సవరణ) బిల్లు-2023పై లోక్‌సభలో సుమారు 8 గంటలపాటు చర్చ జరిగింది. ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, ఇద్దరు మాత్రం వ్యతిరేకంగా ఓటేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం.

సవరణ ఏం చెబుతోంది?

లోక్‌సభ, రాష్ట్రాల్లోని అసెంబ్లీలు, జాతీయ రాజధాని ప్రాంతం దిల్లీ అసెంబ్లీలో మూడో వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయని ఈ బిల్లు చెబుతోంది. అంటే, 543 లోక్‌సభ స్థానాల్లో 181 సీట్లు మహిళలకు రిజర్వ్ చేస్తారు.

పుదుచ్చేరి వంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు సీట్లు రిజర్వ్ చేయలేదు.

మహిళా రిజర్వేషన్ బిల్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఎస్సీ, ఎస్టీ మహిళల సంగతి ఏంటి?

ప్రస్తుతం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ)ల కోసం రిజర్వ్ చేసిన సీట్లు ఉన్నాయి.

ఆ రిజర్వ్‌ చేసిన స్థానాల్లో ఇప్పుడు మూడోవంతు సీట్లను మహిళలకు కేటాయిస్తారు.

ప్రస్తుతం ఎస్సీలు, ఎస్టీల కోసం 131 సీట్లను రిజర్వ్ చేశారు. వీటిల్లో నుంచి సుమారు 43 సీట్లు మహిళలకు కేటాయించనున్నారు.

ఈ 43 సీట్లను కూడా సభలో మహిళలకు రిజర్వ్ చేసిన మొత్తం సీట్లలో భాగంగానే లెక్కిస్తారు.

అంటే, మహిళలకు రిజర్వ్ అయ్యే 181 స్థానాల్లో, 138 సీట్లు జనరల్ కేటగిరీ మహిళలకు అందుబాటులో ఉంటాయి.

అయితే, ఈ లెక్కలన్నీ ప్రస్తుతం లోక్‌సభలో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య ఆధారంగా చేసినవే. ఒక్కసారి డీలిమిటేషన్ కసరత్తు మొదలైతే ఈ గణాంకాలు మారొచ్చు.

మహిళా రిజర్వేషన్ బిల్లు

ఫొటో సోర్స్, Getty Images

ఈ చట్టం ఎప్పటినుంచి అమల్లోకి వస్తుంది?

మొదట, పార్లమెంట్‌లోని ఉభయసభలు ఈ బిల్లును మూడింట రెండొంతుల (2/3) మెజారిటీతో ఆమోదించాలి.

జనగణన (సెన్సస్) తర్వాత డీలిమిటేషన్ జరగాల్సి ఉంటుంది.

డీలిమిటేషన్ అంటే జనాభా ప్రకారం నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించే ప్రక్రియ.

దేశవ్యాప్త డీలిమిటేషన్ ప్రక్రియ చివరిసారిగా 2002లో జరిగింది. ఇది 2008లో అమల్లోకి వచ్చింది.

డీలిమిటేషన్ జరిగిన తర్వాత లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు అయ్యాక మహిళా రిజర్వేషన్ అమల్లోకి రావొచ్చు.

ప్రాక్టికల్‌గా చూస్తే, ఈ రిజర్వేషన్ల అమలు 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందువరకు సాధ్యం కాదని అనిపిస్తోంది.

మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాక 15 ఏళ్ల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఎస్సీ, ఎస్టీలకు కూడా ఒక పరిమిత సమయం వరకే సీట్లను రిజర్వ్ చేస్తారు. తర్వాత వాటిని పదేళ్లపాటు పొడిగిస్తారు.

మహిళా రిజర్వేషన్ బిల్

ఫొటో సోర్స్, Getty Images

రిజర్వ్‌డ్ సీట్లను ఎలా నిర్ణయిస్తారు?

ప్రతీ డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత రిజర్వ్‌డ్ సీట్లను రొటేట్ చేస్తామని బిల్లులో పేర్కొన్నారు. ఈ వివరాలను పార్లమెంట్ తర్వాత నిర్ణయిస్తుంది.

పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళా రిజర్వేషన్లను ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వానికి ఈ రాజ్యాంగ సవరణ అధికారాన్ని కల్పిస్తుంది.

అయితే సీట్ల రొటేషన్‌, డీలిమిటేషన్ చేపట్టడానికి ఒక ప్రత్యేక చట్టం, నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.

పంచాయతీలు, మున్సిపాలిటీలు వంటి స్థానిక సంస్థల్లో కూడా మూడోవంతు సీట్లు మహిళల కోసం కేటాయించారు. ప్రతీ ఎన్నికల సందర్భంగా ఇవి కూడా మారుతుంటాయి.

ఎస్సీలకు నియోజకవర్గాల్లో వారి జనాభా ఎక్కువగా ఉన్నచోట సీట్లను రిజర్వ్ చేశారు.

మోదీ

ఫొటో సోర్స్, LOKSABHA TV

చిన్న రాష్ట్రాల్లో సీట్లను ఎలా రిజర్వ్ చేస్తారు?

లడఖ్, పుదుచ్చేరి, చండీగఢ్ వంటి కేవలం ఒక ఎంపీ సీటు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజర్వేషన్ ఎలా ఉంటుందో ఇంకా నిర్ణయించలేదు.

ఈశాన్య రాష్ట్రాలైన మణిపుర్, త్రిపురల్లో రెండు చొప్పున, నాగాలాండ్‌లో ఒకే ఎంపీ స్థానం ఉంటుంది.

అయితే, మునుపటి మహిళా రిజర్వేషన్ బిల్లులో ఈ అంశానికి ఒక పరిష్కారం చూపారు.

ఒకే సీటు ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో... ఒక లోక్‌సభ ఎన్నికల్లో ఆ సీటును మహిళలకు కేటాయించి, తర్వాతి రెండు ఎన్నికలకు దాన్ని రిజర్వ్ చేయకూడదని 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లులో పేర్కొన్నారు.

రెండు సీట్లు ఉన్న రాష్ట్రాల్లో ఒక సీటును రెండు లోక్‌సభ ఎన్నికల వరకు రిజర్వ్ చేసి, మూడో ఎన్నికలో మహిళలకు ఎలాంటి రిజర్వేషన్ కేటాయించకూడదని నిర్ణయించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు

ఫొటో సోర్స్, BBC/GOPALSHUNYA

మహిళల ప్రాతినిధ్యం ఎంత?

ప్రస్తుతం, లోక్‌సభలో 82 మంది మహిళలు ఉన్నారు. అంటే మొత్తం సంఖ్యలో దాదాపు 15 శాతం.

19 రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిధ్యం 10 శాతం కంటే తక్కువే ఉంది.

ప్రపంచవ్యాప్తంగా పార్లమెంట్‌లలో మహిళా ప్రాతినిధ్యం సగటున 26.5 శాతంగా ఉందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)