మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏంటి... ఇది ఇన్నేళ్ళుగా ఎందుకు పెండింగ్‌లో ఉంది?

మహిళా రిజర్వేషన్ బిల్

ఫొటో సోర్స్, Getty Images

మహిళలకు లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలలోరిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును మోదీ ప్రభుత్వం మంగళవారం నాడు పార్లమెంటులో ప్రవేశపెట్టింది.

సోమవారం కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరిగిన తరువాత ఈ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందనే వార్తలు వచ్చాయి. కానీ, అధికారిక సమాచారం ఏదీ అప్పటికి రాలేదు. మంగళవారం కొత్త పార్లమెంటు భవనంలో తొలి సమావేశాలు ప్రారంభమైన తరువాత ప్రభుత్వం ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టింది.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్‌సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ ఉభయ సభల్లో ఇప్పటి వరకు 7,500 మందికి పైగా ప్రజా ప్రతినిధులు పనిచేశారని, అందులో 600 మంది మహిళా ప్రతినిధులు ఉన్నారని చెప్పారు.

సభ గౌరవం పెరగడానికి మహిళల సహకారం దోహదపడిందని అన్నారు. ప్రధాని తర్వాత ప్రసంగించిన ప్రతిపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి 75ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాల పని తీరు గురించి వివరించారు.

ఆయన మాట్లాడుతున్న సమయంలోనే సోనియా గాంధీ, మహిళా రిజర్వేషన్ బిల్లును గుర్తు చేశారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

ఫొటో సోర్స్, PRALHAD JOSHI

మహిళా రిజర్వేషన్ బిల్లు కోసమే ప్రత్యేక సమావేశాలా?

నిజానికి, మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి కొన్ని వారాలుగా చర్చ జరుగుతోంది. ఇటీవల బీజేడీ, బీఆర్ఎస్ పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుని తీసుకు రావాలని డిమాండ్ చేశాయి.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్ బిల్లుని ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఈ ఏడాది మార్చ్ 10న దిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఒకరోజు నిరాహార దీక్ష చేశారు.

ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలోనూ ఇదే అంశంపై తీర్మానం చేశారు.

కొత్త బిల్లులో మహిళల కోసం ఎంత శాతం రిజర్వేషన్ కేటాయిస్తారనేది ఇంకా స్పష్టంగా తెలియకున్నప్పటికీ 2010లో ఆమోదించిన బిల్లులో 33 శాతం రిజర్వేషన్ కేటాయించారు.

యూపీఏ కూటమి అధికారంలో ఉన్న సమయంలో ఈ బిల్లుని సభలోకి తీసుకొచ్చారు.

మహిళా రిజర్వేషన్ బిల్

ఫొటో సోర్స్, BBC/GOPALSHUNYA

మహిళల ప్రాతినిధ్యం లెక్కలు...

ప్రస్తుతం లోక్‌సభలో 82 మంది, రాజ్యసభలో 31 మంది మహిళా సభ్యులు ఉన్నారు. మొత్తం 543 మందిలో వీరి సంఖ్య 15 శాతం కంటే తక్కువ.

రాజ్యసభలో మహిళల సంఖ్య 14.05శాతం మాత్రమే. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో అయితే మహిళల ప్రాతినిధ్యం పది శాతం కంటే తక్కువగా ఉంది.

శాసనసభలో మహిళా ప్రజా ప్రతినిధుల సంఖ్య సింగిల్ డిజిట్‌లో ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపుర్, మేఘాలయ, ఒడిషా, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, పాండిచ్చేరి ఉన్నాయి.

బిహార్, హరియాణా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, దిల్లీ అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిధ్యం 10 నుంచి 12 శాతం మధ్య ఉందని గతేడాది డిసెంబర్‌లో ప్రభుత్వం వెల్లడించిన వివరాలు చెబుతున్నాయి.

దేశంలో మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల విషయానికొస్తే చత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలు ముందున్నాయి.

ఈ రాష్ట్రాల అసెంబ్లీల్లో వరుసగా 14.44 శాతం, 13.7, 12.35 శాతం మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్

ఫొటో సోర్స్, Getty Images

27 ఏళ్లుగా కాగితాల్లోనే

మహిళా రిజర్వేషన్ బిల్లు 27 ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. మొదట ఈ బిల్లుని 1996లో పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. ఆ బిల్లును రూపొందించినప్పుడు గీతా ముఖర్జీ నాయకత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏడు సూచనలు చేసింది.

ఆ తర్వాత 1998, 1999తో పాటు 2008, 2010లో పార్లమెంట్‌లోకి వచ్చింది కానీ చట్టంగా మారలేదు. 1996లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేసిన ఏడు సూచనల్లో ఐదింటిని 2008 బిల్లులో చేర్చారు.

వీటితో పాటు ఆంగ్లో ఇండియన్లకు 15 ఏళ్ల పాటు రిజర్వేషన్, సబ్ రిజర్వేషన్ కల్పించాలనే ప్రతిపాదన కూడా ఉంది. 1996 సెప్టెంబర్ 12న దేవేగౌడ ప్రభుత్వం తొలిసారిగా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టింది. కానీ అది ఆమోదం పొందలేదు. ఈ బిల్లును 81వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టారు.

లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిల్లు ప్రతిపాదించింది. ఈ 33 శాతం రిజర్వేషన్‌లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ఉప-రిజర్వేషన్లు కల్పించే నిబంధన ఉంది. కానీ ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించలేదు.

ప్రతీ లోక్‌సభ ఎన్నికల తర్వాత రిజర్వ్‌డ్ స్థానాలను మార్చాలని బిల్లులో ప్రతిపాదించారు. రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని వివిధ నియోజకవర్గాలకు రొటేషన్ ద్వారా రిజర్వ్‌డ్ సీట్లను కేటాయించవచ్చని సూచించారు. ఈ సవరణ చట్టం అమలులోకి వచ్చిన 15 ఏళ్ల తర్వాత మహిళలకు సీట్ల రిజర్వేషన్ ముగుస్తుంది.

సుప్రియా సూలే
ఫొటో క్యాప్షన్, సుప్రియా సూలే

అన్ని పార్టీలు మద్దతిస్తున్నా దక్కని ఆమోదం

అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం 1998లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును లోక్‌సభలో మళ్లీ ప్రవేశపెట్టింది. అయితే, ఎన్డీయే కూటమికి మద్దతిస్తున్న కొన్ని పార్టీలు బిల్లుని వ్యతిరేకించాయి. దీంతో బిల్లు ఆమోదం పొందలేకపోయింది.

వాజ్‌పేయి ప్రభుత్వం 1999, 2002లతో పాటు 2003-2004లో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుని ఆమోదించడానికి ప్రయత్నించింది. కానీ, అవేవీ సఫలం కాలేదు.

2004లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు.

యూపీఏ ప్రభుత్వం ఈ బిల్లును 2008లో 108వ రాజ్యాంగ సవరణ బిల్లుగా రాజ్యసభలో ప్రవేశపెట్టింది. మార్చి 9, 2010న రాజ్యసభ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు బీజేపీ, వామపక్షాలు, జేడీయూ మద్దతు తెలిపాయి.

యూపీఏ ప్రభుత్వం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టలేదు. మహిళా రిజర్వేషన్ బిల్లుని సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్‌ వ్యతిరేకించాయి. ఈ రెండు పార్టీలు యూపీఏలో భాగం కావడంతో లోక్‌సభలో బిల్లును ప్రవేశపెడితే తమ ప్రభుత్వం ప్రమాదంలో పడుతుందని కాంగ్రెస్‌ భయపడింది.

2008లో బిల్లుని స్టాండిగ్ కమిటీ ఆన్ లా అండ్ జస్టిస్‌ పరిశీలనకు పంపారు. అయితే ఈ సంఘంలో ఇద్దరు సభ్యులు వీరేంద్ర భాటియా, శైలేంద్ర కుమార్ సమాజ్ వాదీ పార్టీ నాయకులే. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాకున్నప్పటికీ బిల్లును రూపొందించిన తీరుతో వారు ఏకీభవించలేదు.

పార్టీలు అభ్యర్థుల ఎంపికలో 20 శాతం మహిళలకు టిక్కెట్లు ఇవ్వాలని, మహిళా రిజర్వేషన్ 20 శాతం దాటకూడదని వాళ్లిద్దరూ సిఫార్సు చేశారు. 2014లో లోక్‌సభ రద్దయిన తర్వాత ఈ బిల్లు ఆటోమేటిక్‌గా రద్దయింది. కానీ రాజ్యసభ శాశ్వత సభ కావడంతో అది ఇప్పటికీ సజీవంగానే ఉంది.

అయితే, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుని చట్టంగా చేయాలంటే బిల్లుని మళ్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. లోక్‌సభ ఆమోదం పొందితే రాష్ట్రపతి సంతకంతో అది చట్టంగా మారుతుంది. ఈ బిల్లు చట్టంగా మారితే 2024 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభిస్తాయి. అప్పుడు లోక్‌సభలో ప్రతి మూడో సభ్యురాలు మహిళే ఉంటారు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన బీజేపీ

తాము అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్ బిల్లుకి మోక్షం కల్పిస్తామని బీజేపీ ఎన్నికల మేనిపెస్టోలో ప్రకటించినప్పటికీ 2014లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టించుకోలేదు.

అయితే, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. అది కూడా త్వరలో ఎన్నికలు జరగనున్న సమయంలో ఈ అంశాన్ని తెరపైకి తెచ్చింది.

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 2017లో ప్రధానికి లేఖ రాస్తూ ఈ బిల్లుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందని చెప్పారు.

రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడైన తర్వాత 2018 జూలై 16నన ప్రధానమంత్రికి రాసిన లేఖలో తమ పార్టీ మద్దతును పునరుద్ఘాటించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు

ఫొటో సోర్స్, Getty Images

మహిళలకు రిజర్వేషన్లపై వ్యతిరేకత ఎందుకు

1975లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 'సమానత్వం వైపు' పేరుతో ఒక నివేదిక వెలువడింది. ఇందులో ప్రతి రంగంలో మహిళల స్థితిగతుల వివరాలను పొందుపరిచారు.

ఈ రిపోర్టులో మహిళలకు రిజర్వేషన్‌పై కూడా చర్చ జరిగింది. నివేదికను రూపొందించిన కమిటీలో మెజారిటీ సభ్యులు మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించారు.

మహిళలు స్వశక్తితో రాజకీయాల్లో ఎదగాలని, రిజర్వేషన్ల ద్వారా కాదని వాదించారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించడానికి ప్రయత్నించారు.

అయితే రాష్ట్ర అసెంబ్లీలు దానిని వ్యతిరేకించాయి. పీవీ నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పంచాయతీలు, స్థానిక సంస్థల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును సమాజ్ వాదీ పార్టీ, జేడీయూ, ఆర్జేడీ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. మహిళలకిస్తున్న 33 శాతం రిజర్వేషన్‌లో 33 శాతం వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ ఇవ్వాలనేది ఈ పార్టీల డిమాండ్.

1996లో దేవేగౌడ నాయకత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వానికి మద్దతిస్తున్న ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ బిల్లును వ్యతిరేకించారు.

జూన్ 1997లో ఈ బిల్లును ఆమోదించడానికి మళ్లీ ప్రయత్నం జరిగింది. ఆ సమయంలో శరద్ యాదవ్ బిల్లును వ్యతిరేకిస్తూ..” మా మహిళల గురించి అగ్రవర్ణాల మహిళలు ఏం అర్థం చేసుకుంటారు, ఏమనుకుంటారు?” అని ప్రశ్నించారు

మహిళా రిజర్వేషన్ బిల్లు

ఫొటో సోర్స్, Getty Images

1998లో 12వ లోక్‌సభలో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగా.. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు న్యాయశాఖ మంత్రి ఎన్ తంబిదురై ప్రయత్నించారు.

ఆ సమయంలో ఆర్జేడీ ఎంపీ ఒకరు వెల్‌లోకి దూసుకెళ్లి బిల్లు కాపీలను చించేశారు. 1999లో 13వ లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును రెండుసార్లు పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రయత్నించింది.

2003లో వాజ్‌పేయి ప్రభుత్వం మరోసారి మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించింది. అయితే ప్రశ్నోత్తరాల సమయంలోనే తీవ్ర గందరగోళం నెలకొనడంతో బిల్లు ఆమోదం పొందలేదు.

2010లో యూపీఏ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు తాము ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని సమాజ్‌వాది పార్టీ, ఆర్జేడీ బెదిరించాయి. ఆ తర్వాత బిల్లుపై ఓటింగ్ వాయిదా పడింది.

తరువాత అదే ఏడాది మార్చి 9 రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 186 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఒక్కరు ఓటు వేశారు. బిల్లును వ్యతిరేకించిన ఎంపీలను మార్షల్స్ సాయంతో బయటకు తీసుకెళ్లారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా అనేక వాదనలు ఉన్నాయి. అందులో ఒకటి మహిళలు ఒక కులం మాదిరిగా ఒక జాతి కాదని అలాంటప్పుడు వారికి రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

మహిళలకు రిజర్వేషన్ ద్వారా సీట్లు కేటాయించడం రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వ హక్కును ఉల్లంఘించడమే అనేది మరో వాదన.

ఆడవాళ్లకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తే ప్రతిభ ఆధారంగా పోటీ చెయ్యలేకపోవచ్చని.. రిజర్వేషన్లు ఇవ్వడం మహిళల్లో పోరాట స్ఫూర్తిని అణగదొక్కే ప్రయత్నం అనే వాదన కూడా ఉంది.

వీడియో క్యాప్షన్, మహిళా రిజర్వేషన్ బిల్లు ఏంటి... ఇది 27 ఏళ్ళుగా ఎందుకు పెండింగ్‌లో ఉంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)