మహిళలు, బాలికలు దుస్తులు ‘సరిగా’ ధరించకపోతే పదేళ్ల జైలు.. వివాదాస్పద బిల్లుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం

ఫొటో సోర్స్, EPA
- రచయిత, డేవిడ్ గ్రిట్టెన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘించిన మహిళలు, బాలికల విషయంలో జైలు శిక్షలు, జరిమానాలను పెంచే వివాదాస్పద బిల్లుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
అనుచితంగా దుస్తులు ధరించిన వారు ఈ చట్టం ప్రకారం గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్షను ఎదుర్కొంటారు. ఈ చట్టం అమలు తీరును, ఫలితాలను మూడేళ్లపాటు పరిశీలించనున్నారు.
అయితే, ఇది చట్టంగా మారాలంటే గార్డియన్ కౌన్సిల్ ఆమోదం పొందాలి.
ఇరాన్‌లో మహ్సా అమిని పోలీస్ కస్టడీలో మరణించడంపై నిరసనలు చెలరేగిన ఏడాది తర్వాత ఈ బిల్లును తీసుకొచ్చారు. ఆమెను హిజాబ్ సరిగా ధరించలేదనే కారణంతో అప్పట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అమినీ మరణం అనంతరం మహిళలు తమ హిజాబ్‌లను గాలిలో ఊపుతూ, తగలబెడుతూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేశారు.
ఈ నిరసనల్లో వందల మంది భద్రతా బలగాల చేతిలో హతమయ్యారని వార్తాకథనాలు వెలువడ్డాయి.
నిరసనల తర్వాత దేశంలో జుట్టును వస్త్రంతో కప్పుకోవడం పూర్తిగా మానేసే మహిళలు, బాలికలు పెరుగుతున్నందున మొరాలిటీ పోలీసులు వీధుల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు.

ఫొటో సోర్స్, EPA
శిక్షలు పెంచిన 'హిజాబ్ అండ్ చాస్టిటీ' బిల్లు
షరియాపై ఆధారపడిన ఇరాన్ చట్టం ప్రకారం యుక్తవయస్సుకు పైబడిన మహిళలు, బాలికలు తమ జుట్టును హిజాబ్‌తో కప్పుకోవాలి. శరీర ఆకారాన్ని దాచడానికి పొడవాటి, వదులుగా ఉండే దుస్తులను ధరించాలి.
ఈ నిబంధనలు పాటించని వారికి 10 రోజుల నుంచి 2 నెలల వరకు జైలు శిక్ష, 5,000 రియాల్స్ నుంచి 5,00,000 రియాల్స్ వరకు జరిమానా విధించేవారు.
ఇపుడు ఈ శిక్షలు, జరిమానాలు పెంచే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన 'హిజాబ్ అండ్ చాస్టిటీ' బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 152 మంది, వ్యతిరేకంగా 34 మంది ఓటు వేశారు.
ఈ చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో అనుచితంగా దుస్తులు ధరించిన వ్యక్తులకు "నాలుగో డిగ్రీ" శిక్ష విధించనున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
శిక్షాస్మృతి ప్రకారం దోషులకు 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 3.5 లక్షల నుంచి 7 లక్షల వరకు జరిమానా విధించనున్నారు.
మీడియా, సోషల్ నెట్‌వర్క్‌లలో నగ్నత్వాన్ని ప్రోత్సహించడం లేదా హిజాబ్‌ను ఎగతాళి చేయడం, మహిళా డ్రైవర్ లేదా ప్రయాణికులు హిజాబ్ లేదా తగిన దుస్తులు ధరించకపోతే వాహన యజమానులకు జరిమానాలను కూడా ఈ బిల్లు ప్రతిపాదిస్తుందని ఏఎఫ్‌పీ వార్తాసంస్థ తెలిపింది.
విదేశీ లేదా శత్రు ప్రభుత్వాలు, మీడియా లేదా ఇతర సంస్థల సహకారంతో దుస్తుల కోడ్‌ను ఉల్లంఘించడాన్ని ప్రోత్సహించే ఏ వ్యక్తికైనా 5-10 ఏళ్ల మధ్య జైలు శిక్ష విధించనున్నారని పేర్కొంది.
ఈ బిల్లును ఇప్పుడు మతాధికారులు, న్యాయనిపుణుల సంప్రదాయవాద సంస్థ అయిన 'గార్డియన్ కౌన్సిల్' ఆమోదం కోసం పంపనున్నారు.
ఈ బిల్లు రాజ్యాంగానికి, షరియాకు విరుద్ధమని భావిస్తే దానిని వీటో చేసే అధికారం కూడా వారికి ఉంది.
ఇది వివక్ష: ఐరాస మానవ హక్కుల నిపుణులు
ఈ బిల్లు లింగ వివక్షకు రూపమని, మహిళలు, బాలికలను అణచివేయాలనే ఉద్దేశంతో అధికారులు వ్యవస్థాగత వివక్షతో పరిపాలిస్తున్నట్లు కనిపిస్తోందని ఎనిమిది మంది ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల నిపుణులు ఇటీవల అభిప్రాయపడ్డారు.
"నిర్దేశిత డ్రెస్ కోడ్‌ను స్త్రీలు, బాలికలు పాటించకపోతే ఈ బిల్లు ప్రకారం కఠినమైన శిక్షలు పడతాయి. దీని అమలు హింసాత్మకం కావొచ్చు" అని వారు తెలిపారు.
"లింగ వివక్ష నిషేధం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు, సామాజిక, విద్య, ఆరోగ్య సేవలను పొందే హక్కు సహా ప్రాథమిక హక్కులను ఈ బిల్లు ఉల్లంఘిస్తుంది" అని వారు విమర్శించారు.
ఇవి కూడా చదవండి
- మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎదురయ్యే అడ్డంకులు ఇవే...
- కాంగ్రెస్ 6 గ్యారెంటీలు: కర్ణాటక ఫార్ములా తెలంగాణలో నడుస్తుందా?
- హైదరాబాద్ సంస్థానం భారత్‌లో ఎలా అంతర్భాగమైంది? నిజాం ఎందుకు లొంగిపోయారు? చరిత్ర ఏం చెబుతోంది?
- పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల: ఇంకా పూర్తికాని ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించారా?
- సెప్టెంబర్ 17: అటు అమిత్ షా, ఇటు సోనియా గాంధీ, హైదరాబాద్‌లో ఏం జరగబోతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














