డిజిటల్ చెల్లింపులతో డబ్బును వృథాగా ఖర్చు చేయడం పెరుగుతోందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మురుగేష్
- హోదా, బీబీసీ తమిళ్
ఓ రోజు ఉదయం వాకింగ్ చేసి, ఎప్పుడూ టీ తాగే షాప్‌లో ఒక కప్పు టీ తాగి, బిస్కెట్లు తిన్నాను. మొబైల్‌లో యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించడానికి ప్రయత్నించాను. సాంకేతిక కారణాల వల్ల లావాదేవీ జరగలేదు.
మరొక యాప్ ద్వారా ప్రయత్నించినా పేమెంట్ కాలేదు. చాలారోజులుగా UPI లావాదేవీలకు అలవాటు పడ్డాను, వాకింగ్‌కు వచ్చాను కాబట్టి ఆ సమయంలో పర్స్ తీసుకెళ్లలేదు.
కొన్నినెలల క్రితం బస్సులో ప్రయాణిస్తుండగా “నేను ATM నుంచి డబ్బు తీసుకోవడం మర్చిపోయాను. టిక్కెట్లు కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బు లేదు. నువ్వు నాకు రూ. 500 నగదు చెల్లిస్తే యూపీఐ ద్వారా తిరిగి పంపిస్తాను” అని ఎవరో నన్ను అడగడం నాకు గుర్తొచ్చింది.
టీ షాప్ దగ్గర నగదు సాయం కోసం ఎవరినీ అడగలేకపోయా, దుకాణ యజమానితో “యూపీఐ పని చేయడం లేదు. డబ్బులు తర్వాత ఇస్తాను?” అని తడబడుతూ అన్నాను.
అతను 'తర్వాతే ఇవ్వు' అన్నప్పుడే నాకు రిలీఫ్ వచ్చింది. అది చిన్న మొత్తమే కాబట్టి సరిపోయింది, అదే పెద్ద మొత్తమో లేదా తెలియని ప్రదేశమో అయితే పరిస్థితేంటి?
నా మిత్రుడు తనకూ ఇలాంటి పరిస్థితే ఎదురైందని ఒకసారి చెప్పాడు. అలాగే, తన చేతిలో డబ్బులుంటే తక్కువ ఖర్చు చేసేవాడినని, యూపీఐకి మారిన తర్వాత వృథాగా ఖర్చు చేస్తున్నానని అన్నాడు.
"నా చేతిలో 100 రూపాయలుంటే, దాని ప్రకారం ఏదో హోటల్‌కి వెళ్లేవాడిని, కానీ ఇప్పుడు యూపీఐ కారణంగా ఎంతైనా ఆన్‌లైన్‌లోనే చెల్లించేస్తున్నా" అని అతను నాకు చెప్పాడు.
యూపీఐ కచ్చితంగా మంచి సదుపాయమే. రోడ్ సైడ్ షాపుల నుంచి పెద్ద మాల్స్ వరకు ఎక్కడైనా లావాదేవీలు చేయవచ్చు. అదే సమయంలో కొన్ని ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. మనం యూపీఐ లావాదేవీలపై ఎక్కువగా ఆధారపడుతున్నామా? ప్రత్యక్ష నగదు లావాదేవీలకు దూరం జరుగుతున్నామా? డబ్బు వృథా చేస్తున్నామా?.

ఫొటో సోర్స్, AFP
డీమానిటైజేషన్ పెద్ద మలుపు
2016లో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్)ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది.
మనం UPI ద్వారా ఏదైనా బ్యాంకు ఖాతాకు మొబైల్ నంబర్ ద్వారా డబ్బు పంపవచ్చు. దీనికి బ్యాంకు ఖాతా వివరాలు అవసరం లేదు.
యూపీఐ లావాదేవీలను ప్రవేశపెట్టిన అదే సంవత్సరం (2016) నవంబర్ 8న రాత్రి రూ. 500, 1000 నోట్లు చెల్లుబాటు కావని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు.
ఈ ప్రకటన తర్వాత డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా లావాదేవీలు పెరిగాయి. UPI లావాదేవీలు కూడా స్వల్పంగా పెరిగాయి.
2016 అక్టోబర్ నుంచి నవంబర్ వరకు UPI ద్వారా లావాదేవీలు ఒకే నెలలో రూ. 100 కోట్ల మార్కును దాటాయి.

ఫొటో సోర్స్, Getty Images
నెలకు రూ.15 లక్షల కోట్లు
యూపీఐ లావాదేవీల సంఖ్య పెరిగినప్పటికీ అది అన్ని చోట్లా అందుబాటులోకి రాలేదు.
యూపీఐ లావాదేవీల కోసం 2016 చివరలో కేంద్ర ప్రభుత్వం BHIM యాప్‌ను ప్రారంభించింది.
2017 జనవరిలో తొలిసారిగా యూపీఐ ద్వారా రూ.1,000 కోట్ల లావాదేవీలు జరిగాయి.
అదే ఏడాది డిసెంబర్‌లో ఈ మొత్తం రూ.10,000 కోట్లు దాటింది. 2018 డిసెంబర్‌లో రూ. లక్ష కోట్లు, 2022 మేలో రూ. 10 లక్షల కోట్లు దాటింది.
ప్రస్తుతం మెట్రో నగరాల నుంచి కుగ్రామాల వరకు యూపీఐ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి.
గత ఆగస్టులో యూపీఐ ద్వారా 100 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. ఇందులో మొత్తంగా రూ. 15 లక్షల కోట్ల విలువ గల లావాదేవీలు జరిగాయి.
పండుగల సీజన్ కావడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భారత్ మాత్రమే కాదు, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, సింగపూర్, నేపాల్, భూటాన్ సహా పలు దేశాలు యూపీఐ లావాదేవీలకు ఆమోదం తెలిపాయి.

ఫొటో సోర్స్, Getty Images
యూపీఐ చెల్లింపులు సరైనవేనా?
గత రెండేళ్ల నుంచి నేను యూపీఐ ద్వారా ఎక్కువ లావాదేవీలు చేయడం మొదలుపెట్టాను.
ప్రస్తుతం నా లావాదేవీలన్నీ యూపీఐపైనే జరుగుతున్నాయి. నేను ఇంటి అద్దెనూ UPI ద్వారానే చెల్లిస్తాను.
ఉదయం షాప్‌కి వెళ్లి పాల ప్యాకెట్ కొనడం నుంచి కిరాణా, కూరగాయల వరకు అన్ని లావాదేవీలు యూపీఐ ద్వారానే చేస్తాను.
2 నెలలకోసారి మాత్రమే ఏటీఎంకి వెళ్లి డబ్బు విత్‌డ్రా చేసుకుంటున్నా.
యూపీఐ ద్వారా లావాదేవీలు జరపడం సరైనదేనా అని ఆర్థికవేత్త వివేక్‌ని అడిగినప్పుడు “అవును, యూపీఐ చాలా లాభదాయకం. అంతటా అదే నడుస్తోంది. అన్ని కంపెనీలు ఇలానే లావాదేవీలు చేస్తున్నాయి. మీ పర్సును ఎవరైనా దొంగిలిస్తే బాధపడాల్సిన అవసరమూ లేదు" అని అన్నారు.
టీ దుకాణంలో నా అనుభవాన్ని ఆయనతో చెప్పినప్పుడు.. “ఎప్పుడో ఒకసారి ఇలాంటివి జరిగినందుకు మీరు యూపీఐని నిందించలేరు. యూపీఐ వల్ల డబ్బులు మిగలవని చెప్పడం సరికాదు. మీరు ప్రయాణించేటప్పుడు ఏదో ఒకచోట యూపీఐ చేయలేకపోవచ్చు. అందుకే చిన్నమొత్తంలో డబ్బు ఉంచుకోవడం మంచిది” అని వివేక్ సూచించారు.
అలాగే ఏటీఎం సెంటర్‌లో యూపీఐ ద్వారా డబ్బును స్కాన్ చేసి డ్రా చేసుకునే సదుపాయం కూడా ఉంది.
కాబట్టి భవిష్యత్తులో డెబిట్ కార్డు వినియోగం తగ్గి, UPI, క్రెడిట్ కార్డ్‌లు ఎక్కువగా ఉపయోగిస్తారని ఆయన చెప్పారు.
డబ్బు వృథా చేస్తున్నామా?
'గతంలో చిరు, వీధి వ్యాపారులు నగదుతో వ్యాపారం చేసుకుంటే బ్యాంకు రుణాలు పొందడం కష్టతరంగా ఉండేది. ఎందుకంటే వారి సంపాదనకు సంబంధించిన అకౌంట్, రుజువులు వారి వద్ద లేవు. ఇప్పుడు యూపీఐ కారణంగా బ్యాంకు ఖాతాతో తమ ఆదాయాన్ని తెలుసుకోవచ్చు. దీంతో చిన్నపాటి రుణాలు పొందడం వారికి సులువవుతుంది' అని వివేక్ చెప్పారు.
ఇప్పుడు UPIకి క్రెడిట్ కార్డ్‌ని లింక్ చేసే సదుపాయం కూడా ఉంది. యూపీఐ కారణంగా గుడ్డిగా ఖర్చుపెడుతున్నామని, వృథా ఖర్చులు పెరిగే అవకాశం ఉందని కూడా వివేక్ అంటున్నారు. ఆ పద్దతిని నియంత్రించాలని ఆయన సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వివేక్ సలహా ఏంటి?
''UPI కారణంగా చాలా ఎక్కువ ఖర్చు చేస్తున్నామని భావిస్తే, మీరు జీతం నుంచి SIP రూపంలో కొంత పొదుపు చేయొచ్చు. ఇది యూపీఐ ద్వారా సులభంగా చేయవచ్చు. తద్వారా కొంత మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు’’ అని వివేక్ సలహా ఇస్తున్నారు.
ఇలా వృథా ఖర్చులు తగ్గించుకోవచ్చని ఆయన అంటున్నారు.
“మనం ఎంత ఖర్చు చేశామో ఎక్కువ తెలుసుకోం. అయితే, యూపీఐ ద్వారా మనం ఒక నెలలో ఎంత ఖర్చు చేశామో కొన్ని యాప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రతి నెలాఖరున మీరు దేనికి ఎంత ఖర్చు చేశారో చూడండి. ఒక నిర్దిష్ట వస్తువుపై అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు మీకనిపిస్తే, దాన్ని తగ్గించవచ్చు'' అని వివేక్ సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఇసుక చుట్టూ వివాదాలు ఏంటి... ప్రభుత్వం చెప్పిన రేటుకే దొరుకుతోందా?
- మహిళలు, బాలికలు దుస్తులు ‘సరిగా’ ధరించకపోతే పదేళ్ల జైలు.. వివాదాస్పద బిల్లుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం
- మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎదురయ్యే అడ్డంకులు ఇవే...
- కాంగ్రెస్ 6 గ్యారెంటీలు: కర్ణాటక ఫార్ములా తెలంగాణలో నడుస్తుందా?
- హైదరాబాద్ సంస్థానం భారత్‌లో ఎలా అంతర్భాగమైంది? నిజాం ఎందుకు లొంగిపోయారు? చరిత్ర ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














