ఆంధ్రప్రదేశ్: ఇసుక చుట్టూ వివాదాలు ఏంటి... ప్రభుత్వం చెప్పిన రేటుకే దొరుకుతోందా?

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం...
ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక వివాదాలకు కేంద్రంగా మారింది. గత ప్రభుత్వ హయంలో కూడా ఇసుక పాలసీ చుట్టూ దుమారం చెలరేగింది. జగన్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో అనేక వివాదాలకు ఆస్కారమిచ్చింది.
ఇసుక తవ్వకాల్లో అక్రమాలు అరికడతామంటూ 2019 నుంచి గడిచిన నాలుగేళ్లలో 3సార్లు పాలసీని సవరించారు. కానీ నేటికీ ఇసుక తవ్వకాలపై ఫిర్యాదులు, తరలింపులో అవకతవకలకు కొదవలేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) కూడా భావిస్తోంది. ఇప్పటికే ఏపీలోని ఇసుక ర్యాంపుల్లో అనుమతి లేకుండా జరుగుతున్న తవ్వకాలు నిలిపివేయాలని కూడా ఎన్జీటీ ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చింది.
ఈ ఉత్తర్వులు ఖాతరు చేయకుండా ఇసుక తవ్వకాలు చేస్తూ, అక్రమంగా వేల కోట్ల రూపాయలను కాజేస్తున్నారంటూ విపక్షం ఆరోపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఇసుక ర్యాంపుల వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి.

పేరుకే జేపీ వెంచర్స్... కానీ
ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక తవ్వకాలను ప్రజానుకూలంగా మారుస్తామనే పేరుతో జగన్ ప్రభుత్వం జేపీ పవర్ వెంచర్స్ సంస్థకు ఇసుక తవ్వకాలు అప్పగించారు. కేంద్రప్రభుత్వ రంగ సంస్థల పర్యవేక్షణలో టెండర్లు ఖరారు చేసి, వారికి ఇసుక క్వారీలు అప్పగించామని ప్రభుత్వం వెల్లడించింది.
ఇసుక ధరను టన్నుకు రూ. 375 చొప్పున నిర్ణయించింది, దానిపై అదనంగా రూ. 100 వరకూ సదరు కాంట్రాక్ట్ సంస్థ నిర్వహణ చార్జీలు కలిపి రూ. 475కి టన్ను ఇసుక అమ్మాలని నిర్ణయించింది.
కానీ, వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం వద్ద గోదావరిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలను బీబీసీ పరిశీలించింది. జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ తరుపున రశీదు ఇచ్చారు. దాని మీద టన్ను ఇసుక ధర రూ. 625గా పేర్కొన్నారు. ఇది కేవలం ర్యాంపు దగ్గర మాత్రమే.
ఇసుక అవసరమైన వారు సొంత వాహనం తీసుకుని ర్యాంపు వద్దకు వెళితే ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇసుక తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం చెబుతోంది. కానీ ర్యాంపు దగ్గర ఇసుక అమ్మకాలు మాత్రం జేపీ వెంచర్స్ కాకుండా సబ్ కాంట్రాక్ట్ సంస్థల ద్వారా, మధ్య వర్తుల ద్వారా జరుగుతున్నాయి. నేరుగా ఇసుక కొనాలని ఆశించిన వారికి అక్కడ ఇసుక ఉండదని నిర్వాహకులు బీబీసీ ప్రతినిధికి చెప్పారు.

ప్రభుత్వానికి కావాల్సింది డబ్బులే..
జేపీ పవర్ వెంచర్స్ స్థానంలో రాష్ట్రవ్యాప్తంగా సబ్ కాంట్రాక్టు సంస్థలు ఇసుక తవ్వకాల్లో పెత్తనం చేయడం మీద పలు విమర్శలు వచ్చాయి. కాంట్రాక్ట్ సంస్థ కాకుండా అధికార పార్టీకి చెందిన నేతల అనుచరులే ఇసుక తవ్వకాలు చేస్తున్నారనే వాదన కూడా ఉంది.
దీనిని ఏపీ భూగర్భ గనుల శాఖ తోసిపుచ్చుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ "ప్రభుత్వానికి కావాల్సింది డబ్బులే. అవి వస్తున్నాయా లేదా అన్నదే చూస్తాం. సబ్ కాంట్రాక్టు అప్రూవల్స్ మేమివ్వలేదు. డబ్బులన్నీ జేపీ పవర్ వెంచర్స్ కడుతోంది. వాళ్లు ఎవరి దగ్గరయినా తీసుకోనివ్వండి. మనకు రావాల్సింది వస్తుందా లేదా అన్నదే ముఖ్యం" అంటూ వ్యాఖ్యానించారు.
గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి కూడా స్పందించారు. "టెండర్ నిబంధనల ప్రకారం సబ్ కాంట్రాక్టులకు అవకాశం ఉంది. సదరు సంస్థ వెసులుబాటుని బట్టి ఇతర సంస్థలను ఏర్పాటు చేసుకోవడం వారి సొంత వ్యవహారం. సబ్ కాంట్రాక్టులు ఇవ్వడమే తప్పిదంగా చిత్రీకరించడం తగదు" అని అన్నారు.
ప్రభుత్వమే సబ్ కాంట్రాక్టులకు అవకాశం ఉందని చెబుతున్నప్పటికీ ఇసుక ర్యాంపుల వద్ద బిల్స్ మాత్రం జేపీ వెంచర్స్ పేరుతోనే జారీ అవుతుండడం విశేషం. తవ్వకాలు వేర్వేరు సంస్థలు చేపడుతూ బిల్లులు మాత్రం ఒకే సంస్థ పేరుతో ఇవ్వడం విశేషంగా కనిపిస్తోంది.

ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇసుక విధానంలో మార్పులు తీసుకొస్తూ 16-4-2021న జీవో నెం. 25ను విడుదల చేసింది. దానికి అనుగుణంగా జేపీ వెంచర్స్ ప్రవేశించింది. వాస్తవానికి అంతకుముందు మైనింగ్ వ్యవహారాల్లో ఆ సంస్థకు అనుభవమే లేదని విపక్షాలు వాదించాయి. అయినా, తాము పారదర్శకంగా టెండర్లు పిలిచి వారికి ఇసుక తవ్వకాలు అప్పగించామని ప్రభుత్వం వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా అనుమతులున్న ఇసుక ర్యాంపులు 110 ఉన్నాయి. వాటికి తోడుగా డీ సిల్టింగ్ పాయింట్ల పేరుతో బోట్స్ మెన్ సొసైటీలు వంటివి నిర్వహించే మరో 42 పాయింట్లు ఉన్నాయి. ఇసుకు రీచ్ ల ద్వారా 77 లక్షల టన్నులు, డీసిల్టింగ్ పాయింట్ల ద్వారా 90లక్షల టన్నుల ఇసుక తవ్వుకునేందుకు పర్యావరణ అనుమతులున్నట్టు ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
గడిచిన నాలుగేళ్లలో 6.7 కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలు జరిపినట్టు ఏపీ ప్రభుత్వం చెబుతోంది. దాని ద్వారా ప్రభుత్వానికి రూ. 2300 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించింది.
ఏడాదికి రూ. 765 కోట్ల చొప్పున జేపీ వెంచర్స్ నుంచి ఆదాయం వస్తుందని, తద్వారా అయిదేళ్లలో రూ. 3825 కోట్ల ఆదాయం ఇసుక ద్వారా వస్తుందని అంచనా వేసింది. అయితే ప్రభుత్వ అంచనాకి నాలుగేళ్లలో లభించిందని చెబుతున్న ఆదాయం లెక్కలకు చాలా వైరుధ్యం కనిపిస్తోంది.

‘అవస్థలు పడుతున్నాం...’
ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల పాటు ఇసుక విధానం రూపకల్పన కోసమంటూ తవ్వకాలు నిలిపివేయడం పెద్ద వివాదమయ్యింది. భవన నిర్మాణ కార్మికులు కూడా రోడ్డెక్కి ఉపాధి కోసం ఆందోళనకు దిగాల్సి వచ్చింది.
ఆ తర్వాత మరో రెండుసార్లు ఇసుక విధానంలో మార్పు తీసుకొచ్చిన తర్వాత కూడా ఈ వ్యవహారం సామాన్యులను సంతృప్తిపరచలేకపోతోంది. అందుకు ధర పెరిగిపోవడం ముఖ్య కారణం.
ప్రభుత్వం కేవలం టన్ను ఇసుక రూ. 475 కి మించి అమ్మడానికి లేదని, ఇసుక ధర లని ఎప్పటికప్పుడు పత్రికల ద్వారా ప్రచారం చేస్తున్నామని చెబుతోంది. కానీ ఆచరణలో అందుకు విరుద్ధంగా రాజమహేంద్రవరంలో ఇసుక కావాల్సిన వారికి కూడా టన్ను ఇసుక రూ. 600 దాటిపోతోంది. 5 టన్నుల వాహనంలో ఇసుక తరలిస్తే సుమారు రూ. 5వేలకి పైగా చెల్లించాల్సి వస్తోందని బిల్డింగ్ నిర్మాణదారులు అంటున్నారు.
"ఇసుక కావాలంటే కొందరు మధ్యవర్తులుంటారు. వాళ్లకి చెబితే వారి వాహనంలోనే పంపిస్తారు. రెండు, మూడు కిలోమీటర్ల దూరమయినా గానీ వాహనం అద్దెతో కలిపి టన్ను ఇసుక రూ. 800 వరకూ ఉంటుంది. అదే వరదలు పెరిగినప్పుడు స్టాక్ పాయింట్ వరకూ వెళితే టన్ను ఇసుక కోసం వెయ్యి రూపాయలు చెల్లించాల్సిందే. అత్యవసరం అయినప్పుడు ఎంత రేటయినా పెట్టి కొనాల్సిందే కాబట్టి సామాన్యులకు తప్పడం లేదు" అంటూ రాజమహేంద్రవరానికి చెందిన కాశి నవీన్ కుమార్ అనే బిల్డర్ బీబీసీకి తెలిపారు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు మార్పులు చేసినా ఇసుక సమస్య మాత్రం కొలిక్కిరాలేదని, ప్రభుత్వ మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

పెత్తనం చేస్తున్నదెవరు?
సహజసిద్దంగా దొరికే ఇసుక విషయంలో జేపీ వెంచర్స్ పేరుతో కొందరు ప్రైవేటు వ్యక్తుల పెత్తనం సమంజసం కాదని పర్యావరణవేత్తలు అంటున్నారు.
చంద్రబాబు ప్రభుత్వ హయంలో కూడా పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి ఫిర్యాదులు వెళ్ళాయి. అప్పట్లో రూ. 100 కోట్ల జరిమానా కూడా విధించారు.
ఇటీవల మరోసారి ఏపీలో ఇసుక తవ్వకాల తీరుని కొందరు పర్యావరణం కోసమంటూ ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్ళారు. వాటిపై కూడా ఎన్జీటీ స్పందించింది.
ఎన్జీటీకి వచ్చిన ఫిర్యాదులపై స్పందిస్తూ ఏపీలోని ఇసుక రీచ్‌లకు మంజూరయిన ఈసీలు( ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్) రద్దు చేసింది. సియా సెమీ మెకనైజ్డ్ పద్ధతుల్లో తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశించింది. ఇసుక తవ్వకాలకు కొత్తగా ఈసీలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో సహజంగా ఇసుక తవ్వకాలు జరిగే నదీ పాయల్లో ప్రస్తుతం వరదల సీజన్. దాంతో గోదావరి, కృష్ణా, పెన్నా వంటి ప్రధాన నదుల్లో ఇసుక తవ్వకాలు జరగడం లేదని ప్రభుత్వం చెబుతోంది. ఎన్జీటీ ఆదేశాలను అనుసరించి ఈసీలు తీసుకుని తవ్వకాలు ప్రారంభిస్తామని ప్రకటించింది.
అదే సమయంలో రాష్ట్రంలోని 136 శాండ్ స్టాక్ పాయింట్లలో సుమారుగా 70లక్షల టన్నుల ఇసుక నిల్వ చేసి, అక్కడి నుంచి ఇసుక అమ్మకాలు సాగిస్తోంది. అలాంటి స్టాక్ పాయింట్ల వద్ద కూడా విపక్షాలు నిరసనకు పూనుకున్నాయి.
"ప్రభుత్వం చెబుతున్న దానికి విరుద్ధంగా పెద్ద పెద్ద యంత్రాల సహాయంతో నదీ గర్భాన్ని కొల్లగొడుతున్నారు. టన్నుల కొద్దీ ఇసుక తరలిస్తున్నారు. వాటివల్ల నదీ ప్రవాహాల్లో వేగం, దిశ కూడా మారిపోతున్నాయి. పర్యావరణ హననం జరుగుతోంది. వాటికి అడ్డుకట్ట వేయాలి. లేదంటే ఇసుక పేరుతో నదులను ఇష్టారాజ్యంగా తొలిచేస్తే తీవ్ర నష్టం తప్పదు’’ అని పర్యావరణవేత్త రమేష్ కుమార్ అభిప్రాయపడ్డారు.
ఎన్జీటీ ఆదేశాలను పాటించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లాభాల కోసం ప్రైవేట్ వ్యక్తులు జరుపుతున్న తవ్వకాల్లో నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు.

ఫిర్యాదులపై స్పందిస్తున్నాం..
రాష్ట్రంలో ఇసుక తవ్వకాల మీద పూర్తిస్థాయిలో పర్యవేక్షణ ఉంచామని అధికారులు అంటున్నారు. పారదర్శకంగా ఇసుక తవ్వకాలు, తరలింపు విషయంలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు దృష్టి సారించడం ఫలితాన్నిస్తోందని డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి అన్నారు.
‘‘ఎన్జీటీ ఆదేశాలు పాటిస్తాం. ఇసుక దందాని ఉపేక్షించడం లేదు. ఎస్ఈబీ నిఘా ఉంది. రూ. 2 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టాలున్నాయి. ఎస్ఈబీ ఇప్పటి వరకు 18వేల కేసులను నమోదు చేసింది. 6.36 లక్షల టన్నుల ఇసుక స్వాధీనం చేసుకున్నాం. పలువురికి శిక్షలు పడ్డాయి. కాబట్టి నిబంధనలు అనుసరించే విషయంలో ఫిర్యాదులకు సకాలంలో స్పందించే యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలిస్తున్నాయి’’ అని ఆయన వివరించారు.
అధికారిక లెక్కల ప్రకారం సుమారు 6 కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలు జరిపితే అక్రమంగా తరలిస్తున్న 6.36లక్షల టన్నుల ఇసుక పట్టుబడడం గమనిస్తే ఏపీలో ఇసుకని అక్రమార్కులు ఏ తీరున పక్కదారి పట్టిస్తున్నారో అర్థమవుతుంది. పట్టుబడిన ఇసుకనే అంత పెద్ద మొత్తంలో ఉంటే అధికారులకు చిక్కకుండా తరలిపోయింది ఎంత ఉంటుందోననే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇలాంటి వ్యవహారాల్లో పకడ్బందీ చర్యలు తీసుకుని పర్యావరణ పరిరక్షణ, ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఇసుక వ్యవహారంలో మరిన్ని మార్పులు అవసరం అనే వాదన వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- లిబియా వరదలు: సునామీ ముంచెత్తిందా అన్నట్లు ఎటు చూసినా శవాలే... రెండు వేలకు పైగా మృతులు, 10 వేల మంది గల్లంతు
- ఆవును చంపిన పులి... ఆ ఆవు యజమాని ఎలా పగ తీర్చుకున్నాడంటే
- పార్లమెంట్లో లైంగిక వేధింపులు: ‘అతను నా మెడకు దగ్గరగా ఊపిరి పీల్చుతూ, అసభ్యకరంగా మాట్లాడేవారు’
- యాంటీ బయాటిక్స్ వేసుకోవడం ప్రమాదకరమా,పేగు మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)















