హిట్లర్ పర్సనల్ లైఫ్ గురించి నమ్మలేని నిజాలను బయటపెట్టిన 'వీడియో'

హిట్లర్
    • రచయిత, బీబీసీ రీల్స్
    • హోదా, ..

మారణహోమాలు, మానవ విషాదాలకు కారణమైన రాజులు, నియంతల గురించి చరిత్రలో అనేక కథనాలు ఉన్నాయి. వారి జీవితాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో మనం వాటిని చదవడానికి ఇష్టపడతాం. అలాంటి పుస్తకాల్లో అడాల్ఫ్ హిట్లర్ చరిత్ర కూడా ఉంటుంది.

1941 నుంచి 1945 వరకు రెండో ప్రపంచ యుద్ధంలో 60 లక్షల మంది యూదులను నిర్బంధ శిబిరాల్లో బంధించి, చంపించారు హిట్లర్.

అయితే, ఎవరైనా ఆయన గురించి ఎక్కువగా ఏం విని ఉంటారు? ఆయనో నియంత, ఒంటరివాడు, తన వ్యక్తిగత జీవితం పట్ల ఎప్పుడూ బాధతో ఉండేవాడు, ఎవరితోనూ కలవడూ అని.

కానీ, హిట్లర్ వ్యక్తిగత జీవితంపై ఆయన భార్య ఎవా బ్రౌన్ తీసిన ఓ వీడియో ఫుటేజ్ హిట్లర్‌ను భిన్నంగా పరిచయం చేస్తోంది.

ఇందులో హిట్లర్ తన భార్య, కుటుంబం, స్నేహితులతో కలిసి నవ్వుతూ, సంతోషంగా కనిపిస్తాడు. ఈ వీడియో హిట్లర్ వ్యక్తిగత జీవితంపై మన అభిప్రాయాన్నే మార్చేస్తుంది.

హిట్లర్

హిట్లర్ ఎవరితోనూ స్నేహం చేయలేదా?

1970లలో వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ప్రజలను షాక్‌కు గురిచేసింది.

కారణం ఏంటంటే, ఆ వీడియోలో హిట్లర్ నవ్వుతూ, జాలీగానే కాకుండా ఆప్యాయత కురిపించే వ్యక్తిగా కనిపించడం. అంతేకాదు హిట్లర్‌కు దగ్గరి స్నేహితులు కూడా ఉన్నట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.

హిట్లర్ చుట్టూ చాలామంది ఉండేవారని, ఆయన ఉండే ప్రదేశమంతా అతని స్నేహితులతో నిండి ఉంటుందని జర్మన్ చరిత్రకారిణి హేకే గోర్టెమేకర్ చెప్పారు.

ఆమె హిట్లర్, ఎవా బ్రౌన్ జీవిత చరిత్రలను పరిశోధించి, పుస్తకాలు రాశారు.

హిట్లర్ చుట్టూ ఉన్న పురుషులు, స్త్రీలు ఆయనను నిజంగా ప్రేమించేవారని గోర్టెమేకర్ అంటున్నారు.

“వారు హిట్లర్ రాజకీయ సిద్ధాంతాన్ని విశ్వసించారు, మద్దతిచ్చారు. దాన్ని సాధించడంలో ఆయనకు సాయం చేశారు” అని గోర్టెమేకర్ తెలిపారు.

కానీ 1945లో హిట్లర్ మరణానంతరం, ఆయనకు స్నేహితులు లేరని, విచారంగా ఉండేవారని, ఒంటరి వాడనే ప్రచారం జర్మనీలోని పలువురు వ్యాప్తి చేశారని ఆమె అన్నారు.

"హిట్లర్‌కు స్నేహితులు లేరని, ఆయనకు ప్రేమంటే తెలియని వ్యక్తిగా చిత్రీకరించి, నాజీ భావజాలం, నేరాల నుంచి తమను తాము దూరం చేసుకోవడానికి వారంతా ప్రయత్నించారు" అని గోర్టెమేకర్ ఆరోపించారు.

హిట్లర్

హిట్లర్ వాస్తవానికి ఎలా ఉండేవారు?

ఎవా బ్రౌన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ వీడియో ఫుటేజ్ హిట్లర్‌లో మరో కోణం బయటపెట్టింది. అయితే, హిట్లర్‌కు అభద్రతా భావం ఉండేదని గోర్టెమేకర్ చెప్పారు.

"అందుకే హిట్లర్ ఇతరులపై ఆధారపడ్డారు. హిట్లర్ చేసే పనులు సరైనవని భరోసా ఇవ్వడానికి, నాయకుడిగా గుర్తించడానికి అతనికి స్నేహితులు అవసరం”అని ఆమె అంటున్నారు.

లక్షలాది మంది ఉన్న సభలో వేదికపై నుంచి ఉద్వేగభరితమైన ప్రసంగాలు చేసిన హిట్లర్‌కు, వ్యక్తిగత జీవితంలో తన స్నేహితులతో కలిసి ఉండే హిట్లర్‌కు చాలా తేడా ఉందని గోర్టెమేకర్ చెబుతున్నారు.

హిట్లర్ భార్య ఎవా బ్రౌన్ ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియో ఫుటేజీని 1930లలో బవేరియాలోని ఆల్ప్స్ పర్వతాలలో గల బెర్గోఫ్‌లో తీశారు.

హిట్లర్ 1920ల చివరలో మెయిన్ కామ్ఫ్ ఆత్మకథ పుస్తకం అమ్మకాల నుంచి వచ్చిన రాయల్టీతో అక్కడి ఇంటిని కొనుగోలు చేశారు.

ప్రారంభంలో ఇది ఆల్ప్స్‌లోని అన్ని ఇళ్ల మాదిరే చిన్నగా ఉండేది. కానీ, 1930లలో దాన్ని విస్తరించి, గొప్ప భవనంగా తీర్చిదిద్దారు. దాని రక్షణ కోసం ప్రత్యేక సైనిక శిబిరం ఉండేది.

ఈ విధంగా 1930ల నుంచి రాజధాని బెర్లిన్ తర్వాత బెర్గోఫ్ పవర్ హౌస్‌గా ఉండేది.

హిట్లర్ భార్య ఎవా బ్రౌన్

హిట్లర్ భార్యదే అజమాయిషీ

బెర్గోఫ్ నుంచి హిట్లర్ తన పాలనను కొనసాగించాలనుకున్నారు. అక్కడే ప్రపంచ నేతలనూ కలిసేవారు.

బ్రిటీష్ ప్రధాన మంత్రి నెవిల్లే చాంబర్‌లైన్, కింగ్ ఎడ్వర్డ్‌ (డ్యూక్‌ ఆప్ విండ్సర్‌)లను కలిశారు.

సమావేశం తరువాత ఎడ్వర్డ్ భార్య వాలీస్ (డచెస్ ఆఫ్ విండ్సర్) మాట్లాడుతూ హిట్లర్‌ మీద నుంచి కళ్లు తిప్పుకోలేకపోయానని, ఆయన దృఢ సంకల్పానికి ముగ్ధురాలినయ్యానని చెప్పారు.

అయితే, ఈ అతిథులెవరూ హిట్లర్ భార్య ఎవా బ్రౌన్‌ను కలవలేదు. అధికారిక ఫోటోల్లో ఆమె ఎక్కువగా కనిపించరు.

నిజానికి, హిట్లర్ ఇంటిలో భార్య ఎవా బ్రౌన్ అత్యంత ముఖ్యమైన, శక్తిమంతమైన వ్యక్తి.

“ఎవా బెర్గోఫ్ యువరాణి. అక్కడ జరిగే విందులకు ఎవరిని పిలవాలో నిర్ణయించేది ఆమె. అందరూ ఆమె మాట వినాల్సిందే. ఆమె అధికారాన్ని ఎవరూ ప్రశ్నించేవారు కాదు" అని గోర్టెమేకర్ చెప్పారు.

సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఎవా బ్రౌన్ ప్రాముఖ్యం కూడా పెరిగింది. బెర్గోఫ్ వద్ద హిట్లర్ దగ్గరి స్నేహితులకు ఆమెనే కేంద్రంగా ఉండేవారు.

హిట్లర్ వంటి నియంతకు స్నేహితులు ఉన్నారని, వారితో నవ్వుతూ సంతోషకరమైన రోజులను గడిపారని, ఆయన భార్య తీసిన ప్రైవేట్ వీడియో ఫుటేజ్ మనకు చెబుతోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)