రూపర్ట్ మర్డాక్: ఫాక్స్ న్యూస్ చైర్మన్ పదవికి గుడ్ బై చెప్పిన మీడియా మొగల్

ఫొటో సోర్స్, Getty Images
ఫాక్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రూపర్ట్ మర్డాక్ రాజీనామా చేశారని ఆ సంస్థ ప్రకటించింది. అలాగే, న్యూస్ కార్ప్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి కూడా ఆయన తప్పుకున్నారు.
మీడియా బేరన్‌గా ప్రసిద్ధుడైన రూపర్ట్ మర్డాక్ సంస్థల నుంచి బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన న్యూస్ బ్రాండ్స్ నడుస్తున్నాయి.
ఈ రెండు బాధ్యతల నుంచి రూపర్ట్ మర్డాక్ అధికారికంగా నవంబర్ నెలలో తప్పుకుంటారు. ఈ బాధ్యతలను ఆయన కుమారుడు లాక్‌లన్ స్వీకరిస్తారు.
ఈ 92 ఏళ్ళ మీడియా మొగల్ మంచి ఆరోగ్యంతో ఉన్నారని, “గత కొన్ని దశాబ్దాలలో సాధించిన అనేక విజయాలకు తామెంతో గర్వపడుతున్నాం” అని సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.
మర్డాక్ 22 ఏళ్ళ వయసులో పత్రికా రంగంలోకి అడుగుపెట్టారు. అడిలైడ్‌లోని రెండు పత్రికలు ఆయనకు వారసత్వంగా లభించాయి. అలా ప్రారంభమైన మర్డాక్ గత ఏడు దశాబ్దాలలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి మీడియా వ్యాపారవేత్తగా ఎదిగారు.
చైర్మన్ ఎమిరిటస్...
ఫాక్స్ కార్పొరేషన్, న్యూస్ కార్ప్ సంస్థలకు మర్డాక్ చైర్మన్ ఎమిరిటస్‌గా వ్యవహరించబోతున్నారు.
“నా వృత్తి జీవితంలో నేను ఎల్లప్పుడూ వార్తలు, కొత్త ఐడియాలతోనే గడిపాను. ఆ విషయంలో ఎలాంటి మార్పూ ఉండదు” అని మర్డాక్ అన్నారు.
“అయితే, ఇది నాకు విభిన్నమైన పాత్రలు స్వీకరించడానికి తగిన సమయమని భావిస్తున్నాను. ఇప్పుడు మా సంస్థలలో ప్రతిభావంతమైన బృందాలున్నాయి. పట్టుదల, నిబద్ధత కలిగిన లాక్‌లన్ ఇకపై రెండు సంస్థలకూ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు” అని ఆయన వివరించారు.
తన లేఖలో ఆయన పేపర్లు పంపిణీ చేసిన ట్రక్ డ్రైవర్లు, ఆఫీసునంతా చెత్తతో నింపేసి వెళ్ళిపోతే శుభ్రం చేసే క్లీనర్లు, కెమెరాల వెనుక నిలబడిన ఎంతో మంది నిపుణులు అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
“మా సంస్థలు నాలాగే ఆరోగ్యంగా, తిరుగులేని సంపదతో ఉన్నాయి” అని మర్డాక్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Reuters
“మా నాన్నది 70 ఏళ్ళ అద్భుతమైన కెరీర్” – లాక్‌లన్
తన తండ్రిది 70 ఏళ్ళ అద్భుతమైన కెరీర్ అని మర్డాక్ పెద్ద కుమారుడు లాక్‌లన్ అన్నారు.
“ఆయన దూరదృష్టికి, మార్గదర్శకత్వానికి, చెక్కు చెదరని దీక్షకు మేం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉంటాం. ఈ కంపెనీలు ఆయన స్ఫూర్తిమత్వానికి, అజేయమైన వారసత్వానికి సంకేతాలు. ఆయన ఎంతో మందిని ప్రభావితం చేశారు” అని లాక్‌లన్ అన్నారు.
లాక్‌లన్ మర్డాక్ 2014లో కుటుంబ వ్యాపారంలోకి తిరిగి అడుగుపెట్టారు. దానికి పదేళ్ళ ముందు ఆయన తన సంస్థల నుంచి బయటికి వెళ్ళినప్పుడు రూపర్ట్ మరో కుమారుడు జేమ్స్ మర్డాక్ కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు.

ఫొటో సోర్స్, Reuters
ఎవరీ లాక్‌లన్...
తండ్రి స్థానంలో బాధ్యతలు చేపట్టబోతున్న లాక్‌లన్ ఫాక్స్ కార్పొరేషన్, నోవా ఎంటర్‌టైన్మెంట్ సంస్థలకు ఎగ్జిక్యూటివ్ చైర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఫాక్స్ సంస్థను స్వతంత్ర పబ్లిక్ కంపెనీగా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కొత్త పెట్టుబడులు పెట్టడం, పబ్లిషింగ్ బిజినెస్ ఆపరేషన్స్ విస్తరించడంలో ఆయన చాలా చురుగ్గా వ్యవహరించారని చెబుతుంటారు.
1971లో పుట్టిన లాక్‌లన్ సంపద, ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూ ప్రకారం 330 కోట్ల డాలర్లు.
ఇవి కూడా చదవండి:
- మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎదురయ్యే అడ్డంకులు ఇవే...
- కాంగ్రెస్ 6 గ్యారెంటీలు: కర్ణాటక ఫార్ములా తెలంగాణలో నడుస్తుందా?
- హైదరాబాద్ సంస్థానం భారత్‌లో ఎలా అంతర్భాగమైంది? నిజాం ఎందుకు లొంగిపోయారు? చరిత్ర ఏం చెబుతోంది?
- పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల: ఇంకా పూర్తికాని ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించారా?
- సెప్టెంబర్ 17: అటు అమిత్ షా, ఇటు సోనియా గాంధీ, హైదరాబాద్‌లో ఏం జరగబోతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














