మహిళా రిజర్వేషన్ బిల్లు: పార్లమెంటు ఆమోదించింది... కానీ, అమలయ్యేది ఎప్పుడు?

మహిళా రిజర్వేషన్ బిల్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మయూరేష్ కొన్నూర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పార్లమెంటు, అసెంబ్లీలలో మహిళా రిజర్వేషన్‌కు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మార్గం సుగమం కాగా....నెరవేరిన కల వాస్తవరూపానికి వచ్చేదెన్నడు అన్న ప్రశ్న మాత్రం మిగిలే ఉంది.

మహిళా రిజర్వేషన్లకు 2023లో ఆమోదం తెలిపారు. మరి 2024 నుంచి అమలులోకి వస్తుందా లేక 2029లోనా, లేదంటే 2034 వరకూ ఆగాలా ఇంకా ఎక్కువ సమయం పడుతుందా? ఇన్ని అనుమానాలకు ప్రధాన కారణం డీలిమిటేషన్. అంటే నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ.

పార్లమెంటులో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి బిల్లును పాస్ చేశారు కాబట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికలు అంటే 2024 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడమే కదా అని చాలామంది అనుకుని ఉంటారు.

కానీ, ఈ చట్టంలో ఉన్న సమస్య ఏంటంటే, నియోజక వర్గాల పునర్విభజన తర్వాతనే దీని అమలు జరుగుతుందని బిల్లులో పేర్కొన్నారు. అంటే ఇప్పుడు జనాభా లెక్కలు జరగాలి. వాటి ఆధారంగా నియోజక వర్గాలను పునర్వ్యవస్థీకరించాలి. ఆ తర్వాతే రిజర్వేషన్ల అమలు మొదలవుతుంది.

బిల్లులో ఏముందంటే ‘‘రాజ్యాంగ సవరణ (128 వ రాజ్యాంగ సవరణ) చట్టం-2023 అమలులోకి వచ్చిన తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా నియోజక వర్గాలను పునర్విభజించి, 15 ఏళ్లపాటు రిజర్వేషన్ అమలు చేస్తాం’’ అని పేర్కొంది.

ఈ బిల్లుకు మద్ధతు తెలిపిన రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నాయి. ప్రత్యేక సెషన్ పెట్టి మరీ బిల్లును పాస్ చేయించారు. కానీ దీని అమలు ఎప్పుడు అన్నదాని మీద ఎవరికీ క్లారిటీ లేదు.

‘‘నాకో సందేహం ఉంది. భారతీయ మహిళలు ఈ బిల్లు కోసం గత 13 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇంకా కొన్నాళ్లు ఆగాలని అంటున్నారు. అది ఎన్ని సంవత్సరాలు , రెండు సంవత్సరాలా, నాలుగేళ్లా, ఆరేళ్లా లేక ఎనిమిదేళ్లా?’’ అని లోక్‌సభలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రశ్నించారు.

పార్లమెంటులో చర్చ సందర్భంగా ఇతర ప్రతిపక్ష ఎంపీలు కూడా ఇదే సందేహాన్ని వ్యక్తం చేశారు. బిల్లులో పేర్కొన్న రెండు షరతులు ఎప్పుడు నెరవేరతాయో ఖచ్చితమైన కాలపరిమితి లేదు.

జనాభా లెక్కల ప్రక్రియ, ఆపై రాజ్యాంగ నిబంధనల ఆధారంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఎప్పుడు పూర్తి చేయాలనే దానిపై నిర్దిష్టమైన తేదీలేమీ లేవు.

ఇది ఒక రకంగా ట్రయాంగిల్‌ లాంటిది. జనాభా లెక్కలు, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్...ఇలా సాగుతుంది.

మహిళా రిజర్వేషన్ బిల్లు

ఫొటో సోర్స్, Getty Images

డీలిమిటేషన్ అంటే ఏంటి?

భారతదేశంలో లోక్‌సభ, శాసనసభల నియోజక వర్గాలు జనాభా ప్రాతిపదికన కాలానుగుణంగా పునర్వ్యవస్థీకరిస్తారు. దీన్నే డీలిమిటేషన్ అంటారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాల సంఖ్య కూడా కాలక్రమేణా పెరుగుతుంది. ప్రతి ఒక్కరికీ పార్లమెంటు, అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండేలా చూసేందుకు రాజ్యాంగ నిర్మాతలు ఈ ఏర్పాటు చేశారు.

1976లో జరిగిన రాజ్యాంగ సవరణ తర్వాత 2001 వరకు లోక్‌సభ నియోజకవర్గాల విస్తరణ నిలిపి వేశారు. అలాగే 2001లో జరిగిన రాజ్యాంగ సవరణ ద్వారా 2026 వరకు లోక్‌సభ నియోజక వర్గాల విస్తరణను నిలిపేశారు.

2008లో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగి, దాని ప్రకారం 2009 నుంచి తదుపరి ఎన్నికలు జరిగాయి. కానీ సీట్ల సంఖ్య పెరగలేదు. దీంతో లోక్‌సభ సభ్యుల సంఖ్య 543గానే ఉండిపోయింది.

దేశ జనాభా పెరిగింది. భారతదేశం చైనాను అధిగమించింది. పట్టణీకరణ కూడా వేగంగా జరుగుతోంది. ఫలితంగా ప్రతి ఓటరుకు సరైన ప్రాతినిధ్యం లభించాలంటే లోక్‌సభ సంఖ్యను పెంచాల్సిన అవసరం ఏర్పడింది.

మహిళా రిజర్వేషన్ బిల్లును చేసిన ఆమోదించిన ప్రభుత్వం డీలిమిటేషన్ తర్వాత నుంచి దీన్ని అమలు చేస్తామని చెబుతోంది. అంటే సీట్లు పెరిగిన తర్వాత...మహిళా రిజర్వేషన్లు అమలులోకి వస్తాయి.

జనాభా గణన నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రాతిపదికగా అవుతుంది. జనాభా లెక్కలను ప్రతి పదేళ్లకొకసారి నిర్వహిస్తారు. భారతదేశంలో చివరిసారి 2011లో జనాభా లెక్కలు జరిగాయి. మళ్లీ 2021లో జరగాల్సి ఉండగా, కోవిడ్ కారణంగా వాయిదా వేశామని ప్రభుత్వం చెప్పింది. అయితే, కుల గణన చేయాల్సి వస్తుందన్న భయంతో ప్రభుత్వం దీన్ని చేపట్టడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మొత్తం మీద మళ్లీ జనాభా గణన ఎప్పుడన్నదానిపై స్పష్టత లేదు.

వాస్తవానికి, 2001లో చేసిన రాజ్యాంగ సవరణ ప్రకారం లోక్‌సభ సీట్ల సంఖ్యను 2026 తర్వాత పెంచుకోవచ్చు. భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం, 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల ప్రకారం అంటే 2031లో జరిగే సెన్సస్ ప్రకారం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. అప్పటి వరకు, 2001 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాలు కొనసాగుతాయి.

మహిళా రిజర్వేషన్ బిల్లు

ఫొటో సోర్స్, CENTRALVISTA.GOV.IN

డీలిమిటేషన్ ఎవరు చేస్తారు?

డీలిమిటేషన్ అనేది రాష్ట్రాల్లోని శాసన సభల నియోజకవర్గాల సంఖ్యను జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేసే ప్రక్రియ. ఇది మారుతున్న జనాభాకు అనుగుణంగా ఇది నిరంతరంగా జరిగేది. దీని కోసం ఒక చట్టం రూపొందించారు. దీని ప్రకారం డీలిమిటేషన్ కోసం కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు.

స్వాతంత్ర్యం వచ్చాక 1952లో తొలిసారి, తర్వాత, 1962, 1972, 2002 సంవత్సరాలలో కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌కు రాజ్యాంగం ద్వారా అనేక అధికారాలు, స్వయంప్రతిపత్తి ఉంటాయి. ఈ కమిషన్ తీసుకున్న నిర్ణయాలను ఏ కోర్టులోనూ సవాలు చేయలేరు.

ప్రతి రాష్ట్రానికి దాని జనాభా నిష్పత్తి ప్రకారం లోక్‌సభ స్థానాలను నిర్ణయిస్తారు. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి ఒక లోక్‌సభ నియోజకవర్గంగా మార్చారు.

ప్రస్తుత నియోజకవర్గాలను 2001 జనాభా లెక్కల ప్రకారం 2002లో ఏర్పాటు చేసిన కమిషన్ ద్వారా ఏర్పాటు చేశారు. 2021లో జనాభా లెక్కల జరగలేదు కాబట్టి, వాటిని నిర్వహించాలన్న ఆలోచనను ప్రస్తుత ప్రభుత్వం చేయకపోతే తదుపరి జనాభా లెక్కలు 2031లో ఉంటాయి.

అంటే 2026 తర్వాత జరిగే మొదటి జనాభా గణన అంటే 2031లోనే. దీని తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుంది. దాని నిర్ణయం ప్రకారం మహిళలకు సీట్లను కేటాయిస్తారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు

ఫొటో సోర్స్, GETTY IMAGES

2024లో కాకపోతే మహిళలకు రిజర్వేషన్ ఎప్పుడు?

జనాభా లెక్కలకు ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకున్నా, దాని తుది నివేదిక రావడానికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత డీలిమిటేషన్‌ కమిషన్‌ పనులు ప్రారంభమవుతాయి. ఇదంతా సుదీర్ఘ సమయం పట్టే ప్రక్రియ. కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు.

2031లోనే జనాభా గణన జరుగుతుందనుకుంటే, మహిళ రిజర్వేషన్ అమలు 2029 సార్వత్రిక ఎన్నికల తర్వాతే సాధ్యమవుతుంది.

రాజకీయ విశ్లేషకుడు, యాక్టివిస్ట్ యోగేంద్ర యాదవ్ దీనిపై తన అభిప్రాయాలను ఎక్స్( ట్విటర్)లో పంచుకున్నారు. ఇదంతా జరగడానికి కనీసం పదేళ్లు పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘ ఆర్టికల్ 82 ( 2001లో సవరణ జరిగినది) ప్రకారం 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల కంటే ముందు డీలిమిటేషన్‌ను కుదరదు. అది 2031 జనాభా లెక్కల ప్రకారమే జరుగుతుంది. డీలిమిటేషన్ కమిషన్ తన తుది నివేదికను ఇవ్వడానికి 3 నుండి 4 సంవత్సరాలు పట్టొచ్చు. అంతేకాకుండా, జనాభా నిష్పత్తి మార్పులను బట్టి రాబోయే డీలిమిటేషన్‌లో చాలా వివాదాలు తలెత్తుతాయి. కాబట్టి ఇదంతా జరగడానికి 2037 లేదా 2039 వరకు పట్టొచ్చు’’ అని యోగేంద్ర యాదవ్ అన్నారు.

చివరిసారిగా జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియకు 5 సంవత్సరాలు పట్టింది.

మహిళా రిజర్వేషన్ బిల్లు

మోసమన్న ప్రతిపక్షం-పారదర్శకతన్న ప్రభుత్వం

జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్నిర్మాణం కోసం ఎదురుచూడకుండా తక్షణమే రిజర్వేషన్లు అమలు చేయాలని, రానున్న 2024 ఎన్నికలకు ఇది అమలయ్యేలా చూడాలని కాంగ్రెస్ సహా విపక్షాలు పార్లమెంటులో డిమాండ్ చేశాయి.

రిజర్వేషన్ల అమలును వాయిదా వేయాల్సిన అవసరం లేదని లోక్‌సభ ప్రసంగంలో రాహుల్ గాంధీ అన్నారు

ఈ రిజర్వేషన్ల ప్రక్రియను ఆలస్యం చేయడం వెనుక బీజేపీకి రాజకీయ ఉద్దేశంఉందని, వచ్చే ఎన్నికల్లో మహిళా ఓటర్ల ఓట్లను దృష్టిలో ఉంచుకుని తొమ్మిదిన్నరేళ్ల తర్వాత ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

కానీ, రాజ్యాంగంలో ఉన్న నిబంధల ప్రకారం పని చేస్తున్నామని ప్రభుత్వం అంటోంది.

పారదర్శకత కోసమే రిజర్వేషన్ల అమలు ఆలస్యమవుతుందని లోక్‌సభలో విపక్షాలకు ఇచ్చిన సమాధానంలో హోంమంత్రి అమిత్ షా అన్నారు. రిజర్వేషన్లను డీలిమిటేషన్ కమిషన్ స్వయంగా నిర్ణయిస్తుందని, 2001 నాటి రాజ్యాంగ సవరణ కారణంగా, 2026 తర్వాత నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం మాత్రమే కమిషన్ నివేదికను సిద్ధం చేయగలదని ఆయన చెప్పారు.

‘‘ఏయే సీట్లు రిజర్వ్‌ కావాలో ఎవరు నిర్ణయిస్తారు? ఆ పని ప్రభుత్వం చేయగలదా? వాయనాడ్‌ సీటు రిజర్వ్‌ అయినా, హైదరాబాద్‌లో ఒవైసీ సీటు రిజర్వ్‌ అయినా....రాజకీయ ఉద్దేశంతో చేశారంటూ ఆరోపణలు చేస్తారు. కాబట్టి ఈ ప్రక్రియను డీలిమిటేషన్ కమిషన్ ద్వారా నిర్ణయించడమే కరెక్ట్‌. ఈ కమిషన్ రిజర్వేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తుంది. ఇలాంటి నిర్ణయాల వెనుక పారదర్శకతే తప్ప పక్షపాతం ఉండకూడదు.’’ అని అమిత్ షా అన్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు

ఫొటో సోర్స్, SAM PANTHAKY

ఎన్నికల కోసమేనంటున్న ప్రతిపక్షాలు

రిజర్వేషన్‌కి, డీలిమిటేషన్‌కి సంబంధం ఏమిటి అన్నది విపక్షాల అభ్యంతరం.

‘‘ అసలు వాళ్లు (ప్రభుత్వం) మహిళా రిజర్వేషన్‌ అమలును డీలిమిటేషన్‌తో ఎందుకు లింకు పెడుతుందో చెప్పగలరా? 2010లో బీజేపీ ఎలాంటి షరతులు విధించకుండా బిల్లుకు మద్దతు ఇచ్చింది. ఇప్పుడు ప్రధానమంత్రి రిజర్వేషన్లు అమలు చేయకుండా 2024 ఎన్నికల్లో మహిళల ఓట్లను క్యాష్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు’’ అని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు.

ఈ రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయకపోతే ప్రభుత్వం ప్రత్యేకంగా పార్లమెంటు సెషన్‌ను ఏర్పాటు చేసి బిల్లును ఎందుకు ప్రవేశపెట్టిందన్న సందేహం అలాగే మిగిలిపోయింది.

‘‘2024 ఎన్నికల కోసం కాకుండా ఈ బిల్లును ప్రవేశపెట్టారని నమ్మడానికి లేదు. ఇది దేశంలోని సగంమంది జనాభాకు సంబంధించిన విషయం. నియోజకవర్గాల పెంపుపై 2026 వరకు ఉన్న నిషేధం తొలగిపోగానే వీటిని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలి. కానీ కనీసం వచ్చే రెండు సార్వత్రిక ఎన్నికలకైనా రిజర్వేషన్ సాకారమయ్యేలా కనిపించడం లేదు.’’ అని రాజకీయ విశ్లేషకుడు అభయ్ దేశ్‌పాండే అన్నారు.

మహిళా రిజర్వేషన్‌‌ తెచ్చిన క్రెడిట్‌ కోసం కాంగ్రెస్‌, ఇతర విపక్షాలు, బీజేపీ హోరాహోరీగానే తలపడ్డాయి. ఇప్పుడు మాత్రం ఈ రిజర్వేషన్లు అమలు ఎలా అన్నదే ప్రధానమైన ప్రశ్న వినిపిస్తోంది.

ఓట్ల కోణంలో చూస్తే ఇది చాలా కీలకమైనదే. ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన రిజర్వేషన్లు ఇప్పుడు ఇచ్చామని చెప్పుకుని ప్రభుత్వం లబ్ధి పొందుతుందా లేక త్వరగా అమలు చేయనందుకు ఆగ్రహానికి గురవుతుందా? అన్నది ఎన్నికల్లో తేలుతుంది.

రాబోయే ఎన్నికల్లో మహిళా అభ్యర్థులకు రిజర్వేషన్ ఉండదు. కానీ, ఈ అంశం మాత్రం చాలా వాడివేడిగా ఉంటుందని చెప్పవచ్చు.

వీడియో క్యాప్షన్, మహిళా రిజర్వేషన్ బిల్లులో ఏముంది? ఎప్పటి నుంచి అమలవుతుంది? అడ్డంకులేంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)