నరేంద్ర మోదీని ఆర్ఎస్‌ఎస్‌లోకి తెచ్చి గుజరాత్ సీఎం అయ్యేందుకు కారణమైన ఆ వకీల్ సాబ్ ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి 2023 సెప్టెంబర్ 17న 73వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మూడు వారాలపాటు పలు కార్యక్రమాలను చేపట్టింది.
మోదీ రాజకీయ ప్రవేశం నుంచి రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యేవరకు సాగిన ఆయన ప్రయాణంపై బీబీసీ జర్నలిస్ట్ రేహాన్ ఫజల్ కథనం ఇది.
2014 ఎన్నికలకు ముందు ఒక సంఘటన జరిగింది.
ఎన్నికల ర్యాలీలో ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌ను గుజరాత్‌గా మార్చే శక్తి నరేంద్ర మోదీకి లేదని అన్నారు.
మరుసటి రోజు జరిగిన ఎన్నికల ర్యాలీలో నరేంద్ర మోదీ కూడా అదే స్థాయిలో స్పందించారు. ''ఉత్తర్ ప్రదేశ్‌ను మరో గుజరాత్‌గా మార్చే శక్తి నరేంద్ర మోదీకి లేదని నేతాజీ అంటున్నారు. మరో గుజరాత్‌గా మార్చడానికి అవసరమైనది ఏంటో తెలుసా? యాభై ఆరు అంగుళాల ఛాతీ'' అని మోదీ అన్నారు.
ఈ ఒక్క మాట మోదీని మ్యాచో మ్యాన్‌గా మార్చేసింది. దాని ద్వారా ఆయన హిందూ ఓటర్లను కూడా ప్రభావితం చేయగలిగారు.
మోదీ జీవిత చరిత్ర రాస్తున్న సమయంలో రచయిత నీలాంజన్ ముఖోపాధ్యాయ ఆయన నిజమైన ఛాతీ కొలత తెలుసుకోవాలనుకున్నారు. అందుకోసం అహ్మదాబాద్‌లో 'జాడే బ్లూ' పేరుతో దుకాణం నిర్వహిస్తున్న మోదీ టైలర్ బిపిన్ చౌహాన్‌ను ఆమె సంప్రదించినప్పుడు మౌనం వహించిన చౌహాన్, అది 56 అంగుళాలు అని మాత్రమే చెప్పాడన్నది వేరే విషయం. ఇక్కడ దాని ప్రస్తావన అంతగా అవసరం లేదు.
ఆ తర్వాత, మోదీకి అచ్‌కన్ (షేర్వాణీ లాంటి పొడవైన వస్త్రం) కుట్టే బాధ్యతలను భీంరావ్ అంబేడ్కర్ యూనివర్సిటీ అధికారులు ఓ టైలర్‌కి ఇచ్చారు. అప్పుడు ఆయన ఛాతీ 50 అంగుళాలు అని టైలర్‌కి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మొసళ్ల సరస్సులో ఈదుకుంటూ వెళ్లి...
పాఠశాలలో చదువుకునే రోజుల్లో నరేంద్ర మోదీ ఓ మోస్తరు విద్యార్థి.
మోదీ చదువుకున్న బీఎన్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేసిన ప్రహ్లాద్ భాయ్ పటేల్‌తో నీలాంజన్ ముఖోపాధ్యాయ మాట్లాడారు. ఆయన తన పుస్తకంలో 'నరేంద్ర మోదీ - ది మ్యాన్, ది టైమ్స్' అని రాసుకున్నారు. ''నరేంద్ర మోదీ ఎప్పుడూ వాదిస్తుండేవాడు, ఒకసారి నేను ఇచ్చిన వర్క్‌ను క్లాస్ మానిటర్‌కి చూపించమని చెప్పాను.''
''నా వర్క్ గురువుకి చూపించమంటే చూపిస్తాను. మరెవరికీ కాదు నిర్మొహమాటంగా చెప్పేశాడు.''
మోదీకి ఆత్మవిశ్వాసం ఎక్కువని ఆయన ప్రత్యర్థులు సైతం నమ్ముతారు.
మరో రచయిత ఆండీ మారినో 'నరేంద్ర మోదీ ఏ పొలిటికల్ బయోగ్రఫీ' పుస్తకం రాశారు. అందులో ''మోదీ చిన్నతనంలో శర్మిష్ట సరస్సు సమీపంలో ఒక ఆలయం ఉండేది. ఆ దేవాలయంపై ఉన్న జెండాను పవిత్రమైన రోజుల్లో మార్చడం ఆనవాయితీ. ఒకసారి భారీ వర్షాలు కురిసిన తర్వాత ఆ జెండా మార్చాల్సి వచ్చింది.''
''సరస్సులో ఈదుకుంటూ వెళ్లి ఆ జెండాను మారుస్తానని నరేంద్ర మోదీ నిర్ణయించుకున్నారు. అప్పట్లో ఆ సరస్సులో చాలా మొసళ్లు ఉండేవి. ప్రజలు ఒడ్డున నిల్చుని మొసళ్లను భయపెట్టేందుకు వాయిద్యాలు వాయిస్తూ ఉండగా, మోదీ సరస్సులో ఈదుకుంటూ వెళ్లి ఆలయంపై జెండాను మార్చారు. తిరిగి ఇవతలి ఒడ్డుకు చేరుకోగానే మోదీని ప్రజలు తమ భుజాలపైకి ఎత్తుకున్నారు'' అని రాశారు.
అయితే, అలాంటి సంఘటన జరగలేదని కొందరు చెబుతుంటారు.

ఫొటో సోర్స్, AFP
టీ దుకాణంలో పని...
నరేంద్ర మోదీ మొదటి నుంచి ఇంటి పనుల్లో సాయంగా ఉండేవారు. స్కూల్ నుంచి రాగానే వాద్‌నగర్ స్టేషన్ సమీపంలో ఉన్న తన తండ్రి టీ దుకాణానికి వెళ్లేవారు.
ఈ విషయాన్ని ఆయన ఎప్పుడూ గర్వంగా చెబుతుంటారు.
ఒకసారి అస్సాంలో టీ ఎస్టేట్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, "మీ అస్సాం టీ అమ్మడం ద్వారానే నేను ఇవ్వాళ ఇక్కడికి ఇలా రాగలిగాను'' అన్నారు.
మోదీ జీవిత చరిత్ర రాసిన వారిలో చాలా మంది ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఉన్నవారే. వాద్‌నగర్, అహ్మదాబాద్‌లలో మోదీ టీ అమ్మే రోజుల గురించి వారు వివరంగా రాశారు.
వాద్‌నగర్ రైల్వే స్టేషన్ దగ్గర టీ దుకాణంలో పని తర్వాత, అహ్మదాబాద్‌లోని గీతా మందిర్ బస్‌స్టాప్ దగ్గర ఉన్న తన మామ క్యాంటీన్‌లో ఆయనతో కలిసి పనిచేసేవారని మీడియా కథనాలు తెలిపాయి.
దూరవిద్య ద్వారా డిగ్రీ
ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత జామ్‌నగర్‌లోని సైనిక్ స్కూల్‌లో చదువుకోవాలన్న కోరిక మోదీకి బలంగా ఉండేది. కానీ, ఆ స్కూల్లో ప్రవేశం పొందేందుకు ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు.
రెండోది, చదువుల కోసమని మోదీని వాద్‌నగర్ నుంచి బయటి ప్రాంతాలకు పంపించడం ఆయన తండ్రికి ఇష్టం లేదు. దీంతో స్థానిక డిగ్రీ కాలేజీలోనే మోదీ చేరారు. అయితే, హాజరు తక్కువగా ఉండడంతో కాలేజీని విడిచిపెట్టాల్సి వచ్చింది.
ఆ తర్వాత ఆయన దూరవిద్య ద్వారా దిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ పూర్తి చేశారు. గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు.
సమాచార హకు చట్టం కింద మోదీ విద్యార్హతల వివరాలు తెలియజేయాలని కొందరు గుజరాత్ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకున్నారు. ఆయన 1983లో ఎంఏ డిస్టింక్షన్‌లో పాసయ్యారని యూనివర్సిటీ సమాధానమిచ్చింది.
అయితే ఆ తర్వాత, మోదీ పూర్తి చేసినట్లుగా చెబుతున్న డిగ్రీలో పేర్కొన్న సబ్జెక్టులు, ఎంఏ పొలిటికల్ సైన్స్ సిలబస్‌లోనే లేవని గుజరాత్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జయంతిభాయ్ పటేల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఆమె ఆరోపణలను గుజరాత్ యూనివర్సిటీ ఖండించింది.

ఫొటో సోర్స్, Getty Images
జశోదాబెన్‌తో వివాహం
మోదీకి 13 ఏళ్లు ఉన్నప్పుడు, 11 ఏళ్ల జశోదాబెన్‌తో వివాహం జరిపించారు. కుటుంబంతో కలిసి కొద్దిరోజులు మాత్రమే ఉన్న మోదీ ఆ తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయారు.
మోదీ వివాహం గురించి గుజరాత్ రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపించినా, 2014 ఎన్నికల అఫిడవిట్‌లో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించిన తర్వాతే ప్రపంచానికి తెలిసింది.
మోదీ ప్రధాని అయిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం జశోదాబెన్‌కి కూడా భద్రత కల్పించారు. అప్పుడు ఆమె ఒక వింత పరిస్థితిని ఎదుర్కొన్నారు.
ఫస్ట్ పోస్ట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తాను బస్సులో వెళ్తున్నా భద్రతా సిబ్బంది తమ వాహనంలో అనుసరించేవారని చెప్పారు.

ఫొటో సోర్స్, SANSKAR DHAM
మోదీ గురువు 'వకీల్ సాబ్'
మోదీని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లోకి తీసుకొచ్చిన ఘనత ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే అది లక్షణరావ్ ఇనాందార్ అలియాస్ వకీల్ సాబ్‌కే చెందుతుంది.
అప్పట్లో వకీల్ సాబ్ ఆర్ఎస్ఎస్ ప్రాంతీయ ప్రచారక్‌గా ఉండేవారు.
ఎంవీ కామత్, కాళిందీ రణ్‌దేరీ రాసిన 'నరేంద్ర మోదీ: ది ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడరన్ స్టేట్' పుస్తకంలో ''ఒకసారి దీపావళికి మోదీ ఇంటికి రానందుకు ఆయన తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. ఆ రోజే వకీల్ సాబ్ మోదీకి ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యత్వం ఇప్పించారు'' అని రాశారు.
వకీల్ సాబ్ 1984లో చనిపోయారు. అయినా మోదీ ఆయనను మర్చిపోలేదు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజాభాయ్ నేనేతో కలిసి మోదీ వకీల్ సాబ్‌పై 'సేతుబంధ్' అనే పుస్తకం రాశారు.
మోదీలో అందరినీ ఆకర్షించే గుణం ఆయన క్రమశిక్షణ.
''ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరాలని మోదీకి చిన్నప్పటి నుంచి కోరిక ఉందని, ఎందుకంటే అందులో కేవలం ఒకే వ్యక్తి మాత్రమే ఇన్‌ఛార్జిగా ఉండడం తనను ఎంతగానో ఆకట్టుకుందని మోదీ అన్నయ్య సోమాభాయ్ చెప్పినట్లు సమాచారం. ఒక్కరు ఆదేశిస్తే అందరూ పాటిస్తారు'' అని సీనియర్ జర్నలిస్ట్ జీ సంపత్ చెప్పారు.
''మోదీ మొదటి నుంచి ఏదైనా పనిని విభిన్నంగా చేసేందుకు ప్రయత్నిస్తారు. మనం ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుంటే, ఆయన హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసుకుంటారు. మనం ఖాకీ నిక్కరు వేసుకోవాలనుకుంటే, మోదీ తెలుపుని ఇష్టపడతారు'' అని గతంలో మోదీతో సన్నిహితంగా ఉండి, ఆ తర్వాత ఆయనకు ప్రత్యర్థిగా మారిన శంకర్ సింగ్ వాఘేలా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వాజ్‌పేయి ఫోన్ కాల్
2001 అక్టోబర్ ఒకటిన విమాన ప్రమాదంలో చనిపోయిన తన జర్నలిస్టు మిత్రుడి అంత్యక్రియల్లో మోదీ పాల్గొన్నారు. అప్పుడు ఆయన మొబైల్ ఫోన్ మోగింది.
అవతలి వైపు ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి. ''ఎక్కడున్నారు?'' అని అడిగారు. మోదీ సాయంత్రం వాజ్‌పేయిని కలిసేందుకు సమావేశం ఖరారైంది.
సాయంత్రం 7 గంటలకు మోదీ సెవెన్ రేస్ కోర్సు రోడ్డుకు చేరుకున్నారు. అప్పుడు వాజ్‌పేయి ఆయనతో జోక్ చేశారు. ''చాలా బలంగా ఉన్నావు. దిల్లీలోనే ఎక్కువగా ఉంటున్నట్టున్నావ్. పంజాబీ వంటకాలు తిని బరువు కూడా పెరిగావ్. గుజరాత్ వెళ్లి అక్కడ పనిచెయ్'' అన్నారు.
''తన సామర్థ్యాన్ని బట్టి బహుశా పార్టీ కార్యదర్శిగా వెళ్లమంటున్నారేమోనని మోదీ అనుకున్నారు. ఇప్పుడు నేను చూస్తున్న రాష్ట్రాల బాధ్యతలు ఇకపై చూడనవసరం లేదని దీనర్థమా? అమాయకంగా అడిగారు. కేశూభాయ్ పటేల్ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రివి నువ్వేనని వాజ్‌పేయి చెప్పినప్పుడు, మోదీ ఆ పదవి స్వీకరించేందుకు నిరాకరించారు'' అని ఆండీ మారినో తన పుస్తకంలో రాశారు.
''గుజరాత్‌లో పార్టీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు నెలలో పది రోజులు కేటాయిస్తాను. కానీ, ముఖ్యమంత్రి పదవి వద్దని మోదీ అన్నారు. వాజ్‌పేయి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత అడ్వాణీ ఫోన్ చేసి చెప్పారు. నీ పేరే ఖరారైంది. వెళ్లి ప్రమాణ స్వీకారం చెయ్యి.'' అని రాశారు.
వాజ్‌పేయి ఫోన్ చేసిన ఆరు రోజులకు 2001 అక్టోబర్ 7న నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
గుజరాత్ అల్లర్లు, వివాదాలు
సీఎం అయిన నాలుగు నెలలకే మోదీ నాయకత్వానికి పరీక్ష ఎదురైంది. అయోధ్య నుంచి తిరిగొస్తున్న కరసేవకుల రైల్వే బోగీని గోద్రాలో తగులబెట్టారు. ఈ ఘటనలో 58 మంది చనిపోయారు.
ఆ మరుసటి రోజు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. హిందూ, ముస్లింల మధ్య చెలరేగిన అల్లర్లలో 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు ఎలాంటి అత్యవసర చర్యలూ తీసుకోలేదని మోదీపై ఆరోపణలు వచ్చాయి.
అదే సమయంలో మీడియా సమావేశంలో మోదీ ఒక వివాదాస్పద ప్రకటన చేశారు. ''చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది'' అన్నారు.
ఆ మరుసటి రోజు మరో టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ''చర్య, ప్రతిచర్య అనేవి చైన్ లాంటివి. చర్య, ప్రతిచర్య రెండూ ఉండకూడదని మేం కోరుకుంటున్నాం'' అని అదే విషయాన్ని పునరుద్ఘాటించారు.

ఫొటో సోర్స్, Getty Images
వాజ్‌పేయి ఏమన్నారు?
కొద్ది రోజుల తర్వాత, అల్లర్ల కారణంగా సహాయక శిబిరాల్లో ఉంటున్న ముస్లింలపై మరో అనుచిత వ్యాఖ్య చేశారు. ''మేం ఐదుగురం, మన వాళ్లు పాతిక మంది'' అన్నారు.
అయితే, సహాయక శిబిరాల్లో ఉంటున్న వారిని ఉద్దేశించి అనలేదని, దేశ జానాభా సమస్య గురించి ప్రస్తావించానని ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చారు.
గుజరాత్ అల్లర్లు జరిగినా మోదీని వాజ్‌పేయి ఎందుకు సీఎం పదవి నుంచి తొలగించలేదని ఒక జర్నలిస్ట్ వాజ్‌పేయి ప్రిన్సిపల్ సెక్రటరీ బ్రజేశ్ మిశ్రాని అడిగారు. అందుకు ఆయన బదులిస్తూ ''మోదీ రాజీనామా చేయాలని వాజ్‌పేయి కోరుకున్నారు. కానీ, ఆయన ప్రభుత్వానికి అధినేత, పార్టీకి కాదు. మోదీని తొలగించాలని పార్టీ అనుకోలేదు. పార్టీ నిర్ణయం ముందు వాజ్‌పేయి తలవంచాల్సి వచ్చింది. కాంగ్రెస్‌లా కాదు బీజేపీ. ఇప్పటికీ కూడా'' అన్నారు.
టోపీ ధరించనన్న మోదీ
ఒకసారి మౌలానా సయ్యద్ ఇమామ్ టోపీ ఇచ్చినప్పుడు, అది పెట్టుకునేందుకు మోదీ నిరాకరించారు. టోపీ పెట్టుకుంటేనే సెక్యులర్ కాదు అని ఆయన అన్నారు. 2014 ఎన్నికల ప్రచార సమయంలో సిక్కు టర్బన్‌తో సహా చాలా రకాల టోపీలు పెట్టుకున్నారనేది వేరే విషయం.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రసంగించేటప్పుడు మియాన్ ముషర్రఫ్, మియాన్ అహ్మద్ పటేల్ అనే పదాలను తన ప్రత్యర్థుల పేర్ల ముందు చేర్చి దాడికి దిగేవారు.
2014 ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీని హేళన చేసేందుకు ఉర్దూ పదం 'షాహజాదె'(రాచరిక వారసుడు) ని ఉపయోగించేవారు. రాజ్ కుమార్ అనే పదాన్ని కూడా చాలాసార్లు వాడారు.
భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేకుండా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏకైక పార్టీగా నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ అవతరించింది.
ఆ తర్వాత ముగ్గురు ముస్లిం నేతలను క్యాబినెట్‌లో చేర్చుకున్నప్పటికీ, ఒక్కరు కూడా లోక్‌సభ సభ్యులు కాదు.

ఫొటో సోర్స్, Getty Images
గుజరాత్ మోడల్
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రం సాధించిన ఆర్థికాభివృద్ధిని షోకేస్‌గా చూపిస్తూ అల్లర్ల కారణంగా అంటుకున్న అప్రతిష్ట మరకలను కడుక్కునే ప్రయత్నం చేశారు.
దానిపేరే 'గుజరాత్ మోడల్'. ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహం, ప్రభుత్వ కంపెనీల సమర్థ నిర్వహణతో ఆకర్షణీయమైన 10 శాతం వృద్ధి రేటు సాధ్యమైంది.
2008లో పశ్చిమ బెంగాల్‌లోని సింగూరులో టాటా మోటార్స్ ప్లాంట్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు జరగడంతో వెంటనే మోదీ ముందుకొచ్చారు. ప్లాంట్ గుజరాత్‌లో ఏర్పాటు చేయాలని ఆహ్వానించడమే కాకుండా అందుకు అవసరమైన భూమిని కేటాయించారు. పన్ను రాయితీలు, ఇతర సదుపాయాలు కల్పించారు.
అందుకు సంతోషించిన రతన్ టాటా మోదీని మోదీని విపరీతంగా పొగిడేశారు. అయినప్పటికీ, గుజరాత్ మోడల్‌పై విమర్శలు చేసే వారూ లేకపోలేదు.
''వైబ్రంట్ గుజరాత్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎనిమిది సార్లు జరిగిన కార్యక్రమాల్లో సుమారు 84 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు జరిగాయని, కానీ వాటిలో చాలా ఒప్పందాలు ఇప్పటికీ అమలు కాలేదు'' అని ప్రముఖ జర్నలిస్ట్ రూతమ్ ఓరా రాసిన కథనం హిందూ పత్రికలో ప్రచురితమైంది.
''తలసరి ఆదాయం ప్రకారం గుజరాత్‌లో ఐదో స్థానంలో ఉంది. మోదీ రాక కంటే ముందే భారత్‌లో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటిగా ఉంది.''
బ్రాండ్ మోదీ
మోదీపై భారత్‌లోనే కాకుండా ప్రపంచ స్థాయిలో వ్యతిరేక ప్రచారం జరిగింది. అమెరికా వీసా కూడా ఇవ్వలేదు. నరేంద్ర మోదీ, గుజరాత్ అల్లర్ల ప్రస్తావన లేకుండా పార్లమెంట్‌లో ఏ చర్చా ముగిసేది కాదు. అయినా మోదీకి ప్రజల నుంచి భారీ మద్దతు లభించింది. అంత మద్దతు ఎలా లభించిందనే ప్రశ్న తలెత్తుతుంది.
''మోదీని బ్రాండ్ మోదీగా మార్చేందుకు నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ చాలా కష్టపడ్డారు. ప్రతి సందర్భంలోనూ విజయానికి గుర్తుగా వీ సింబల్ చూపించేవారు. మాట్లాడే విధానం, ఆత్మవిశ్వాసం, నడక, హాఫ్ హ్యాండ్ కుర్తాలు, బిగుతుగా ఉండే పైజామాలు వేటి గురించి చెప్పాలి. ఆయన ప్రతి అడుగూ ఎంతో ఆలోచనతో వేసిందే'' అని మోదీ బయోగ్రఫీ 'సెంటర్‌స్టేజ్-ఇన్‌సైడ్ మోదీ మోడల్ ఆఫ్ గవర్నెన్స్' పుస్తక రచయిత ఉదయ్ మహుర్కర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మోదీ జీవనశైలి
నలిగిపోయిన ఖద్దరు చొక్కా వేసుకునే విలక్షణ సోషలిస్ట్ నేత కాదు మోదీ. అలాగని ఖాకీ ప్యాంటు, చేతిలో లాఠీ పట్టుకున్న ఆర్ఎస్ఎస్ ప్రచారక్ కూడా కాదు.
ఆయన ఖరీదైన బల్గరి కళ్లద్దాలు, ఆయన జేబులో మాన్ బ్లాన్ పెన్ను, చేతికి విలాసవంతమైన మొవాడో వాచీ ధరిస్తారు.
ఆయన చల్లటి నీళ్లు తాగరు. అందువల్ల ఆయన గొంతు సమస్య ఉండదు. ఇప్పటికీ ఆయన జేబులో దువ్వెన పెట్టుకుంటారు. ఆయన జుట్టు చెరిగిపోయిన ఒక్క ఫోటో కూడా కనిపించదు.
ఆయన రోజూ ఉదయం 4.30 గంటలకు నిద్రలేస్తారు. తర్వాత యోగా, వార్తాపత్రికలు చదువుతారు. రెండు దశాబ్దాలుగా ఆయన ఒక్క లీవ్ కూడా తీసుకోలేదు.
ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ కె జోస్ కారవాన్ మ్యాగజైన్‌లో రాసిన 'ది ఎంపెరర్ అన్‌క్రౌన్‌డ్: ది రైజ్ ఆఫ్ నరేంద్ర మోదీ' కథనంలో ''మోదీకి రంగస్థలంపై పూర్తి ప్రావీణ్యం ఉంది. స్వరం, దృఢత్వం, పూర్తి విశ్వాసం ఉన్న వ్యక్తి. తన ఏలుబడిలో ప్రతీదీ తన నియంత్రణలోనే ఉంటుందని తన అనుచరులకు భరోసా ఇవ్వగల నాయకుడు'' అని రాశారు.
ఆయన పేపర్ చూడకుండా ప్రజల కళ్లలోకి చూస్తూ మాట్లాడతారు. ఆయన ప్రసంగం మొదలుకాగానే ప్రజల్లో నిశ్శబ్దం నెలకొంటుంది. జనాలు తమ ఫోన్లతో ఫిదా చేయడం మానేశారు. చాలా మంది ఇంకా నోళ్లు బార్లాతెరిచే ఉన్నారు.'' అని ఆయన రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
బంధువులు లేరు, అవినీతి లేదు
మోదీ వ్యక్తిత్వం గురించి చెప్పేందుకు ప్రముఖ సోషియాలజిస్ట్ ప్రొఫెసర్ ఆశిష్ నంది ''ప్యూరిటానికల్ రిజిడిటి'' అనే పదాన్ని ఉపయోగిస్తారు.
''ఆయన సినిమాలు చూడరు. మద్యం తాగరు. సిగరెట్ అలవాటు లేదు. నోరూరించే ఆహారం జోలికి వెళ్లరు. అవసరమైతే సాధారణ కిచిడీనే తింటారు. అదీ ఒంటరిగా. ప్రత్యేక రోజుల్లో, అంటే నవరాత్రి వంటి పర్వదినాల సమయంలో ఆయన ఉపవాసం ఉంటారు. అలాంటి సమయాల్లో ఆయన కేవలం నిమ్మరసం, లేదా ఒక కప్పు టీ తాగుతారు.'' అని ఆయన వివరించారు.
''మోదీ ఒంటరిగానే ఉంటారు. తల్లి, తన నలుగురు సోదరులు, సోదరితో అప్పుడప్పుడూ మాట్లాడతారు. అయితే, ఒకటి, రెండుసార్లు తన తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. ఆమెను తన అధికారిక నివాసం చుట్టూ వీల్‌చైర్‌లో తిప్పారు. ఇలా తాను ధర్మబద్ధంగా జీవిస్తున్నట్టు చూపిస్తారు'' అని నంది రాశారు.
''నాకు కుటుంబం లేదు. నేను ఒంటరిని. నేను ఎవరి కోసం అవినీతి చేయాలి. నా దేహం, బుద్ధి అన్నీ ఈ దేశానికి అంకితం చేశాను'' అని హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ అన్నారు.
హసీనాపై ప్రశంసలు
మహిళా శక్తిని బహిరంగంగా ప్రశంసిస్తున్నట్లు కనిపించినప్పటికీ, బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా వాజెద్‌ను ప్రశంసిస్తూ మహిళ అయినప్పటికీ ఆమె చాలా ధైర్యంగా ఉగ్రవాదంపై పోరాడారని అన్నారు.
ఆ తర్వాత మహిళ అయినప్పటికీ అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. కానీ, అది మోదీపై ప్రభావం చూపించలేకపోయింది.
''మోదీ ప్రపంచంలోనే చెత్త పొగడ్త చేశారు'' అని వాషింగ్టన్ పోస్ట్ హెడ్‌లైన్ పెట్టింది.

ఫొటో సోర్స్, Getty Images
ఉద్యోగాలు సృష్టించలేకపోయారు..
నరేంద్ర మోదీ రెండు అంశాలతో 2014 ఎన్నికల్లో విజయం సాధించారు.
ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత దెబ్బతినడం ఒకటైతే, దేశంలోని యువతకు ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తానన్న హామీ రెండోది. అంటే, నెలకు 8 లక్షల 40 వేల ఉద్యోగాలు సృష్టిస్తానని హామీ ఇచ్చారు.
అయితే, ఆ హామీని నెరవేర్చలేకపోయారని మోదీ మద్దతుదారులు కూడా అంగీకరిస్తారు.
దాదాపు 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో విద్యావంతుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ప్రతి నెలా కనీసం 5 లక్షల కొత్త ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉంది. ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోవడాన్ని మోదీ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యంగా చెప్పొచ్చు.
మోదీకి ప్రాణం పోసిన బాలాకోట్
అది మాత్రమే కాకుండా, దేశంలోని రైతులు కూడా మోదీ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు.
వేలాది మంది రైతులు నిరసన తెలిపేందుకు దేశ రాజధాని వైపు కవాతు చేసి ఎంతోకాలం కాలేదు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ విస్తృత ప్రచారం చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీ మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. దీంతో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని మోదీ గెలిపించగలరా? లేదా? అనే సందేహాలు మొదలయ్యాయి.
కానీ, కశ్మీర్‌లో జరిగిన తీవ్రవాద దాడి, పాకిస్తాన్‌తో వారం రోజుల ఉద్రిక్త పరిస్థితులు మద్దతు తగ్గుతున్న మోదీకి బలంగా మారాయి.

ఫొటో సోర్స్, Getty Images
యుద్ధానికి సిద్ధమైన మోదీ
పాకిస్తాన్‌లోని తీవ్రవాద సంస్థలే లక్ష్యంగా భారత వైమానిక దళం చేసిన దాడులు గురితప్పాయని కానీ, భారత యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ కూల్చివేసిందని కానీ భారతీయ ఓటర్లు ఆందోళన చెందడం లేదు.
తమ దేశంపై దాడులకు ప్రయత్నిస్తే మోదీ వెంటనే స్పందిస్తున్నారనేదే వారికి ముఖ్యం.
''సప్తసముద్రాల కింద దాక్కున్నా వాళ్లని పట్టుకుంటా. లెక్కలు తేల్చడం నాకు అలవాటు'' అని మోదీ తరచూ అంటుంటారు. జనం చప్పట్లు కొడతారు.
''పాకిస్తాన్ సంక్షోభం నరేంద్ర మోదీకి సువర్ణావకాశాన్ని అందించింది. జాతీయ భద్రతకు సంబంధించిన అంశం ఏంటంటే, త్వరగా నిర్ణయాలు తీసుకోవడం, ముందుండి నడిపించే సామర్థ్యం చాలా ముఖ్యం. అది మరింత ఆకర్షిస్తుంది.
అలాంటి లక్షణాలు తనకు పుష్కలంగా ఉన్నాయని చూపించుకోవడంలో మోదీ విజయం సాధించారు'' అని కార్నెజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ డైరెక్టర్ మిలన్ వైష్ణవ్ అన్నారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు మోదీ ఒక్కరికి మాత్రమే ఎజెండా ఉంది. మరి భారత ఓటర్లు ఆయనకు విజయం అందిస్తారో లేదో చూడాలి.
ఇవి కూడా చదవండి:
- చేతిలో కొబ్బరికాయ, చెంబులో నీళ్లు భూమి లోపల నీటి జాడను పసిగడతాయా... సైన్స్ ఏం చెబుతోంది?
- పసిఫిక్ మహా సముద్రంలో 'బ్లాక్ హోల్'... ఏమిటీ మిస్టరీ?
- పిల్లల దుస్తులపై స్టాంపులు అంటించి పోస్టులో పార్శిల్...ఎప్పుడు, ఎక్కడ?
- కాంగ్రెస్ 6 గ్యారెంటీలు: కర్ణాటక ఫార్ములా తెలంగాణలో నడుస్తుందా?
- పాకిస్తాన్: ఇంధనానికి డబ్బుల్లేక ఆగిపోతున్న ప్రభుత్వ ఎయిర్‌లైన్స్ విమానాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














