ఇస్రో కోసం లాంచ్ ప్యాడ్ నిర్మించిన హెచ్‌ఈసీ కార్మికులు టీ, ఇడ్లీ అమ్ముకొంటున్నారు.. 18 నెలలుగా వారికి జీతాలు ఎందుకు రావడం లేదు?

ఇడ్లీ అమ్ముతున్న హెచ్‌ఈసీ టెక్నీషియన్ దీపక్ కుమార్

ఫొటో సోర్స్, ANAND DUTT

ఫొటో క్యాప్షన్, ఇడ్లీ అమ్ముతున్న హెచ్‌ఈసీ టెక్నీషియన్ దీపక్ కుమార్
    • రచయిత, ఆనంద్ దత్
    • హోదా, రాంచీ నుంచి బీబీసీ కోసం

ఈ ఏడాది ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రయాన్ 3 సురక్షితంగా దిగడంతో చంద్రుడి మీద అడుగు పెట్టాలన్న భారతదేశం కోరిక నెరవేరింది.

దక్షిణ ధ్రువ ప్రాంతంలో అడుగు మోపిన తొలి దేశంగా భారత్ ప్రత్యేక గుర్తింపు పొందింది.

మరోవైపు, గతంలో ఇస్రో కోసం రాకెట్ లాంచ్ ప్యాడ్‌ నిర్మించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఈసీ కార్మికులు, తమకు 18 నెలలుగా రావాల్సిన బకాయిల కోసం ఆందోళనలు చేశారు.

ఝార్ఖండ్‌లోని రాంచీకి సమీపంలో దూర్వాలో ఉన్న హెవీ ఇంజనీరింగ్ కార్పోరేషన్ లిమిటెడ్‌లో పని చేస్తున్న2800 మంది కార్మికులకు 18 నెలలుగా జీతాలు అందలేదు.

హెచ్‌ఈసీ 810 టన్నుల లాంచ్‌ప్యాడ్‌తో పాటు, చంద్రయాన్ కోసం ఫోల్డింగ్ ప్లాట్‌ఫామ్, స్లైడింగ్ డోర్లను తయారు చేసింది. దీంతోపాటు ఇస్రో కోసం ఈ సంస్థ మరో లాంచ్ ప్యాడ్ తయారు చేస్తోంది.

డిమాండ్లు తీర్చాలంటూ సంస్థ ఎదుట నిరసన తెలుపుతున్న ఉద్యోగులు

ఫొటో సోర్స్, ANAND DUTT

ఫొటో క్యాప్షన్, డిమాండ్లు తీర్చాలంటూ సంస్థ ఎదుట నిరసన తెలుపుతున్న ఉద్యోగులు

హెవీ ఇంజనీరింగ్ కార్పోరేషన్‌(హెచ్‌ఈసీ)లో టెక్నీషియన్ దీపక్ కుమార్ ఉపరారియా కొన్ని రోజులుగా ఇడ్లీలు అమ్ముకుంటున్నారు. ఆయన దుకాణం రాంచీలోని ధుర్వా ప్రాంతంలో పాత అసెంబ్లీకి ఎదురుగా ఉంది.

దీపక్ కుమార్ ఉదయం ఇడ్లీలు అమ్మి మధ్యాహ్నం ఆఫీసుకు వెళ్తారు. సాయంత్రం ఇడ్లీలు అమ్మిన తర్వాత ఇంటికి వస్తారు.

"ఇంటి అవసరాల కోసం నేను మొదట క్రెడిట్ కార్డు మీదనే ఆధారపడ్డాను. కార్డుతో రెండు లక్షల రూపాయలు అప్పు చేశాను. అది కట్టలేకపోవడంతో బ్యాంక్ నన్ను డిఫాల్టర్‌గా ప్రకటించింది. ఆ తర్వాత బంధువులు, తెలిసిన వారి నుంచి అప్పు తీసుకుని ఇంటి నిర్వహణ కోసం ఖర్చు చేస్తున్నాను" అని దీపక్ కుమార్ చెప్పారు.

‘‘ఇప్పటి వరకు నాలుగు లక్షల రూపాయలు అప్పు చేశాను. అప్పులు చెల్లించలేకపోవడంతో ఇప్పుడు ఎవరూ అప్పు కూడా ఇవ్వడం లేదు. దీంతో నా భార్య నగలు తాకట్టు పెట్టి కొన్నాళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చాను” అని ఆయన తన పరిస్థితిని వివరించారు.

"ఆకలితో చనిపోక తప్పదని అనుకుంటున్న సమయంలో ఇడ్లీ దుకాణం తెరిచాను, నా భార్య ఇడ్లీలు బాగా చేస్తుంది. ఇప్పుడు రోజూ 300 నుంచి 400 రూపాయల ఇడ్లీలు అమ్ముతున్నాను. ఖర్చులన్నీ పోను 50 నుంచి వంద రూపాయల వరకూ మిగులుతోంది. ఈ సంపాదనతోనే ఇల్లు గడుస్తోంది” అని ఆయన బీబీసీకి తన కుటుంబ పరిస్థితి గురించి చెప్పారు.

దీపక్ కుమార్

ఫొటో సోర్స్, Anand Dutt

ఫొటో క్యాప్షన్, ఆకలితో చనిపోవాల్సి వస్తుందేమో అని అనిపించినప్పుడు ఇడ్లీలు అమ్మడం మొదలుపెట్టానని దీపక్ కుమార్ చెప్పారు.

దీపక్ ఉపారియా స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లా.

ఆయన 2012లో ఓ ప్రైవేట్ సంస్థలో 25వేల రూపాయల జీతాన్ని వదులుకుని హెచ్‌ఈసీలో ఎనిమిది వేల రూపాయల జీతానికి చేరారు. ప్రభుత్వ సంస్థ కావడంతో భవిష్యత్ వెలిగిపోతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడంతా చీకటిగా మారింది.

"స్కూల్లోనా పిల్లలకు రోజూ అవమానాలు ఎదురవుతున్నాయి. నా కుమార్తెలు ఏడుస్తూ ఇంటికి వస్తారు. వారు ఏడుపును చూస్తే నా గుండె పగిలిపోతుంది, కానీ నేను వారి ముందు ఏడవలేను" అంటూ దీపక్ కన్నీరు పెట్టుకున్నారు.

‘‘నాకు ఇద్దరు ఆడపిల్లలు. స్కూలుకు వెళుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ వాళ్ల ఫీజు కట్టలేదు. ప్రతీ రోజూ స్కూలు వాళ్లు నోటీసులు పంపిస్తున్నారు. క్లాసులో టీచర్ కూడా హెచ్‌ఈసీలో పని చేస్తున్న వాళ్ల పిల్లలు లేచి నిల్చోండి అని అంటున్నారు’’ అని ఆయన చెప్పారు.

టీ అమ్ముతున్న ప్రసన్న బోయ్

ఫొటో సోర్స్, ANAND DUTT

ఫొటో క్యాప్షన్, టీ అమ్ముతున్న ప్రసన్న బోయ్

జీతాలు రాక 14 వేల మందికి కష్టాలు

ఈ పరిస్థితి కేవలం దీపక్ ఉపరారియాది మాత్రమే కాదు. ఆయనలాగే మరి కొంతమంది హెచ్‌ఈసీ ఉద్యోగులు ఏదో ఒక పని చేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు.

మధుర్ కుమార్ మోమోలు అమ్ముతున్నారు.

ప్రసన్న బోయ్ టీ అమ్ముతున్నాడు.

మిథిలేష్ కుమార్ ఫోటోగ్రఫీ చేస్తున్నారు.

కారు రుణం చెల్లించనందుకు బ్యాంకు సుభాష్ కుమార్‌ను డిఫాల్టర్‌గా ప్రకటించింది.

సంజయ్ టిర్కీ 6 లక్షల రూపాయలు అప్పు చేశారు. డబ్బులు లేకపోవడం, సరైన వైద్యం అందకపోవడంతో శశికుమార్ తల్లి చనిపోయారు.

సంస్థలో పని చేస్తున్న 2,800 మంది ఇలాంటి ఇబ్బందుల్నే ఎదుర్కొంటున్నారు. ఒక్కో కుటుంబంలో సగటున ఐదుగురిని తీసుకుంటే జీతాలు రాకపోవడం వల్ల మొత్తం 14,000 మందికి పైగా కష్టాలు పడాల్సి వస్తోంది.

ఉద్యోగుల ఆందోళన

ఫొటో సోర్స్, Anand Dutt

ఆందోళనకారులకు ఇండియా కూటమి పార్టీల అండ

సెప్టెంబరు 14న రాజ్‌భవన్ సమీపంలో పీసీసీ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ నాయకత్వంలో ఇండియా కూటమి పార్టీల నేతలు హెచ్ఈసీ కార్మికుల తరపున నిరసన ప్రదర్శన నిర్వహించారు.

హెచ్‌ఈసీ నెహ్రూ దేశానికి ఇచ్చిన బహుమతి అని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ అన్నారు.

‘‘ఈ సంస్థను కాపాడుకోవడం మన బాధ్యత. కార్మికుల చెమట ఆరిపోకముందే వారికి జీతాలు, బకాయిలు చెల్లించాలని కోరుతూ పోరాడుతున్నాం” అని ఆయన అన్నారు.

"హెచ్‌ఈసీ ఉద్యోగుల పిల్లలను స్కూలు నుంచి పంపించేశారు. రేషన్ షాపుల్లో వారికి బియ్యం ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వ విధానం వల్ల హెచ్‌ఈసీ కష్టాలు ఎదుర్కొంటోంది. ఈ సంస్థను కొంత మందికి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 48 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు వాటి జాబితాను నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది” అని కాంగ్రెస్ సీనియర్ నేత సుబోధ్ కాంత్ సహాయ్ అన్నారు.

“దేశాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న సంస్థ ఇది. దీన్ని పెట్టుబడిదారులకు అప్పగించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. కంపెనీని కాపాడేందుకే పోరాటం” చేస్తున్నామన్నారు జేఎంఎం కేంద్ర ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య.

ఉద్యోగుల సమస్యలు

ఫొటో సోర్స్, ANAND DUTT

జీతం ఎందుకు రావడం లేదు?

ఆగస్టులో జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ హెచ్ఈసీ ‌కార్మికుల సమస్య గురించి భారీ పరిశ్రమల శాఖను ప్రశ్నించారు.

ఆయన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ‘‘హెచ్‌ఈసీ కంపెనీ చట్టం కింద నమోదైన స్వతంత్ర సంస్థ దాని ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి నిధులను అదే సమకూర్చుకోవాలని చెప్పింది.”

హెవీ ఎలక్ట్రికల్ కార్పోరేషన్ నిరంతర నష్టాల వల్ల ఇబ్బందులు పడుతోంది.

హెచ్ఈసీకి ఐదేళ్ల నుంచి నష్టాలు వస్తున్నాయని కేంద్ర పరిశ్రమల శాఖ తన సమాధానంలో పేర్కొంది.

ప్రభుత్వ లెక్కల ప్రకారం హెచ్ఈసీకి 2018-19లో రూ.93.67 కోట్లు, 2019-20లో రూ.405.37 కోట్లు, 2020-21లో రూ.175.78 కోట్లు, 2021-22లో రూ.256.07 కోట్లు, 2022-23 సంవత్సరంలో రూ. 283.58 కోట్ల నష్టాలు వచ్చాయి.

అంటే గత ఐదేళ్లలో సంస్థ టర్నోవర్ 356.21 కోట్ల రూపాయల నుంచి 87.52 కోట్ల రూపాయలకు తగ్గింది. 2018-19లో కంపెనీ తన సామర్థ్యంలో 16 శాతాన్ని ఉపయోగించుకుంది. అయితే 2022-23 సంవత్సరపు ఆడిట్ నివేదిక ప్రకారం, ప్రస్తుతం కంపెనీ తన సామర్థ్యంలో 1.39 శాతం మాత్రమే ఉపయోగిస్తోంది.

ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు హెచ్‌ఈసీకి తక్షణం దాదాపు 153 కోట్ల రూపాయలు అవసరం. ఇది కాకుండా, విద్యుత్ బిల్లు మరియు సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ బకాయిలు చెల్లించడానికి మరో 125 కోట్ల రూపాయలు కావాలి.

హెచ్‌ఈసీ ఆఫీసర్స్ అసోసియేషన్ చెబుతున్న దాని ప్రకారం చూస్తే సంస్థకు రెండు వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి.

ఉద్యోగులు

ఫొటో సోర్స్, ANAND DUTT

హెచ్ఈసీ నష్టాల్లో ఎందుకు నడుస్తోంది?

సంస్థకు నాలుగేళ్లుగా శాశ్వత ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లేరు. యంత్రాలను ఆధునీకరించలేదని హెచ్‌ఈసీ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రేమశంకర్ పాసవాన్ చెప్పారు.

“మా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నళిన్ సింఘాల్ ప్రధానంగా భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన హెచ్‌ఈసీకి ఇన్‌ఛార్జ్ సీఎండీ. ఆయన రాంచీకి నాలుగేళ్లలో నాలుగు సార్లు మాత్రమే వచ్చారు’’ అని ప్రేమశంకర్ పాసవాన్ అన్నారు.

“ఇక్కడ మూడు ప్లాంట్లు ఉన్నాయి. హెవీ మెషిన్ బిల్డింగ్ ప్లాంట్ (హెచ్‌ఎంబీపీ), హెవీ మెషిన్ టూల్స్ ప్లాంట్ (హెచ్‌ఎంటీపీ), ఫౌండ్రీ ఫోర్జ్ ప్లాంట్ (ఎఫ్‌పీపీ) ప్రాజెక్ట్ డివిజన్. ఈ మూడు యూనిట్లకు డైరెక్టర్లుగా ఉన్న వారు మూడు ప్లాంట్లు అందుకున్న ఆర్డర్లు, పనిని సమన్వయం చేస్తారు.”

అంటే డైరెక్టర్ స్థాయిలో జరగాల్సిన పనికి సీఎండీ వద్దకు వెళ్లాల్సిందే. ప్రొడక్షన్‌ దెబ్బతినడానికి ఇదే ప్రధాన కారణమని ప్రేమశంకర్ పాసవాన్ చెప్పారు.

చంద్రయాన్ -3

ఫొటో సోర్స్, ANI

ఆధునిక యంత్రాలు లేకపోవడం పెద్ద సమస్య

“ హెచ్‌ఈసీలో 6,000 టన్నుల హైడ్రాలిక్ ప్రెస్ ఉంది. ఇదంతా పాడైంది. దీని నుంచి రక్షణ రంగానికి అవసరమైన పరికరాలు తయారు చేస్తారు. బాబా అటమిక్ రీసర్చ్ సెంటర్ నుంచి అణు రియాక్టర్ కోసం సంస్థ వద్ద ప్రస్తుతం 300 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్‌ ఉంది”.

"ఈ ఆర్డర్‌ను మేము ప్రైవేట్ కంపెనీ ఎల్ అండ్ టీకి ఇచ్చాము. మా హైడ్రాలిక్ ప్రెస్ బావుంటే, ఎల్ అండ్ టీకి ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము లాభం వైపు వెళ్ళేవాళ్ళం" అని ఆయన చెప్పారు.

హెచ్‌ఈసీ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ రామశంకర్ ప్రసాద్ దీని వెనుక ఉన్న మరో కారణం గురించి వివరించారు. “కంపెనీ దగ్గర బల్క్ ఆర్డర్లు తక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు, లాంచ్‌ప్యాడ్‌నే తీసుకుంటే.. అది ఒక్కటే నిర్మిస్తే అంతగా లాభం ఉండదు. ఒకటి కంటే ఎక్కువ నిర్మిస్తే సంస్థకు లాభం. ఎందుకంటే మరిన్ని తయారు చేయాలంటే మెషినరీని తెచ్చుకోవచ్చు. కొంచెం ఎక్కువ ఖర్చు పెడితే మరింత ఆదాయం వస్తుంది”.

“మేము పరికరం కోసం తయారు చేసిన అచ్చు పదేళ్ల తర్వాత మళ్లీ అవసరం అవుతుంది. అయితే ఆ సమయానికి అది పాడైపోతుంది. ఇప్పుడు యాభై ఏళ్లుగా ఓ యంత్రంతో పని చేస్తున్నప్పుడు... మరో యాభై ఏళ్ల తర్వాత కూడా అది పని చేస్తుందా... అంటే లేదని చెప్పాలి. అందుకే మెషీన్ల తయారీలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం అవసరం” అని రామ శంకర ప్రసాద్ చెప్పారు.

ప్లాంట్

ఫొటో సోర్స్, ANAND DUTT

“1958 డిసెంబర్ 31న యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా, చెకోస్లోవేకియా సహకారంతో హెచ్‌ఈసీని నిర్మించారు. అప్పట్లో ఏర్పాటు చేసిన యంత్రాలు ఇప్పటికీ మార్చలేదు. మారుతునన్న సాంకేతికతకు అనుకూలంగా సిద్ధం కాలేదు’’ అని రామశంకర్ ప్రసాద్ అన్నారు.

సమస్యల పరిష్కారం కోసం సంస్థ అధికారుల సంఘం ప్రతినిధి బృందం ఈ ఏడాది ఫిబ్రవరి 7, జూన్ 26న భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేతో సమావేశం అయ్యింది.

కంపెనీని మళ్లీ గాడిలో పెట్టేందుకు వీలుగా శాశ్వత సీఈవో, డైరెక్టర్లతో పాటు కంపెనీకి 3వేల కోట్ల రూపాయల కోట్ల గ్రాంట్ ఇవ్వాలని ప్రతినిధి బృందం కేంద్రమంత్రిని అభ్యర్థించింది. అందుకాయన సానుకూలంగా స్పందించారని సంఘం తెలిపింది.

మోదీ ప్రధాని కాక ముందు హెచ్ఈసీ ఫ్యాక్టరీ విస్తరణ కోసం గట్టిగా వాదించారు.

2013 ఎన్నికల ప్రచారంలో రాంచీలోని ప్రభాత్ తారా మైదాన్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. “ఒకప్పుడు ఎంతో గర్వించదగిన హెచ్‌ఇసి ఫ్యాక్టరీ ఉన్న భూమిని అభివృద్ధి వారసత్వంగా పరిగణించలేమా? ఈ సంస్థ ఎందుకు నిలబడలేకపోతోంది” అని మోదీ అప్పట్లో ప్రశ్నించారు.

“భారతదేశంలో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు చూడటానికి నష్టాల్లో ఉన్నట్లు కనిపిస్తాయి. అలా కనిపించకపోతే వాటిని అమ్మేసేది ఎలా? వాటికి తాళాలు వేసి వేల మంది ఉద్యోగుల్ని రోడ్డున పడేసేది ఎలా” అని మోదీ నిలదీశారు.

'చంద్రయాన్-3లో హెచ్‌ఈసీ సహకారం లేదు'

చంద్రయాన్-3 ప్రయోగం కోసం లాంచ్‌ప్యాడ్, ఇతర పరికరాలను తయారు చేసే బాధ్యతను హెచ్‌ఈసీకి అప్పగించారా అని ప్రభుత్వాన్ని రాజ్యసభ ఎంపీ పరిమళ్ నత్వానీ ప్రశ్నించారు.

ఈ బాధ్యతలు హెచ్‌ఈసీకి అప్పగించలేదని భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి కృష్ణపాల్ గుర్జార్ బదులిచ్చారు.

అయితే, 2003 మరియు 2010 మధ్య, హెచ్‌ఈసీ మొబైల్ లాంచింగ్ పెడెస్టల్, హామర్ హెడ్ టవర్ క్రేన్, ఈవోటీ క్రేన్, ఫోల్డింగ్ కమ్ వర్టికల్ రీపొజిషనబుల్ ప్లాట్‌ఫాం, క్షితిజ సమాంతర స్లైడింగ్ డోర్లను ఇస్రోకు సరఫరా చేసిందని ఆయన తన సమాధానంలో అంగీకరించారు.

“చంద్రయాన్ -3 కోసం ప్రత్యేక లాంచ్‌ప్యాడ్ నిర్మించవద్దనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సాంకేతికంగా సరైనదే కావచ్చు. కానీ వాస్తవం ఏంటంటే, భారతదేశంలో హెచ్‌ఈసీ తప్ప మరే సంస్థ కూడా లాంచ్‌ప్యాడ్ నిర్మించలేదు” అని హెచ్‌ఈసీలో మేనేజర్‌గా పనిచేస్తున్న పురేందు దత్ మిశ్రా చెప్పారు

“గతంలో హెచ్‌ఈసీ తయారు చేసిన లాంచ్‌ప్యాడ్, ఇతర పరికరాలను చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ప్రయోగాలకు ఉపయోగించారు. అటువంటప్పుడు ప్రభుత్వం చంద్రయాన్ ప్రయోగంలో హెచ్‌ఈసీ ప్రమేయం లేదని చెబుతుంటే బాధగా ఉంది” అని ఆయన అన్నారు.

చంద్రయాన్ 3 ప్రయోగ సమయంలో హెచ్ఈసీ నుంచి ఇద్దరు ఇంజనీర్లు హెచ్ఈసీ ఇస్రోకు అందించిన పరికరాలను అమర్చడానికి శ్రీహరికోట వెళ్లారని ఆయన చెప్పారు.

ప్రభుత్వం ఎందుకు సహాయం చేయడం లేదు?

ఈ కంపెనీని కాపాడి, అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా సాయం అందించలేదా?

తాను ఈ అంశాన్ని భారీ పరిశ్రమల శాఖ దగ్గర తరచూ ప్రస్తావిస్తున్నానని రాంచీ బీజేపీ ఎంపీ సంజయ్‌ సేథ్ చెప్పారు.

“నేను ఈ సమస్య గురించి సంబంధిత మంత్రితో చాలాసార్లు ప్రస్తావించాను. ప్రకాష్ జవదేకర్, అర్జున్ రామ్ మేఘ్వాల్, మహేంద్రనాథ్ పాండే మంత్రులుగా ఉన్నప్పుడల్లా కలిశాను” అని ఆయన చెప్పారు

హెవీ ఎలక్ట్రికల్ కార్పోరేషన్‌ను సజావుగా నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రణాళిక ఉందా అని 2022 జులై 19న సంజయ్ సేథ్ లోక్‌సభలో ప్రశ్నించారు.

దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం తమ వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని స్పష్టం చేసింది.

హెచ్‌ఈసీ సమస్యలపై పోరాడుతున్న కాంగ్రెస్ నాయకుడు సుబోధ్‌కాంత్ సహాయ్ ‘‘నేను భారీ పరిశ్రమల శాఖమంత్రి మహేంద్రనాథ్ పాండేని మూడుసార్లు కలిశాను, అయినా ఎటువంటి సహాయం అందలేదు” అని చెప్పారు.

“హెచ్‌ఈసీని మూసివేస్తే, ఝార్ఖండ్‌లో పెట్టుబడి పెట్టడానికి ఎవరూ రారు. ప్రధాని మోదీ హెచ్‌ఈసీకి సహాయం చేయడం లేదు, అటువంటి పరిస్థితిలో రాష్ట్ర గుర్తింపును కాపాడటానికి ముందుకు రావాలని నేను ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను” అన్నారు సుబోధ్ కాంత్ సహాయ్.

హెచ్‌ఈసీ

ఫొటో సోర్స్, ANAND DUTT

హెచ్‌ఈసీ ఎందుకు ముఖ్యమైనది?

ప్రస్తుతం కంపెనీ మొత్తం వర్క్ ఆర్డర్ విలువ 1,356 కోట్ల రూపాయలు. దీని క్లయింట్‌లలో ఇస్రో, బార్క్, డీఆర్‌డీవో సహా దేశంలోని అనేక పెద్ద ప్రభుత్వ, ప్రభుత్వేతర కంపెనీలున్నాయి. కానీ వర్కింగ్ క్యాపిటల్ లేకపోవడంతో ఇవి పూర్తి కావడం లేదు.

సంస్థ సాధించిన విజయాలను పరిశీలిస్తే, హెచ్‌ఈసీ సూపర్ కండక్టింగ్ సైక్లోట్రాన్‌ను నిర్మించింది. వీటిని అణు శక్తి పరిశోధనలో ఉపయోగిస్తారు.

ఇవి కాకుండా యుద్ధనౌకలలో ఉపయోగించే అధిక ఇంపాక్ట్ స్టీల్‌, ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణంలో ఉపయోగించే ఏబీఏ గ్రేడ్ స్టీల్‌, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ కోసం తక్కువ అల్లాయ్ స్టీల్ ఫోర్జింగ్‌లను తయారు చేసే యంత్రాన్ని హెవీ ఎలక్ట్రికల్ కార్పోరేషన్ అభివృద్ధి చేసింది.

ఇది మాత్రమే కాదు, ఇస్రో కోసం స్పెషల్ ‌ గ్రేడ్ సాఫ్ట్ స్టీల్ తయారు చేసింది. PSLV, GSLV రాకెట్లను ప్రయోగించడానికి మొబైల్ ఫ్లాట్‌ఫామ్‌ తయారు చేసింది. వీటితో పాటు రక్షణ రంగానికి సంబందించి 105 మిల్లీ మీటర్ల ఫిరంగి గన్ బారెల్, టీ72 ట్యాంక్ టరెట్ కాస్టింగ్, ఇండియన్ మౌంటైన్ గన్ మార్క్-2, అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంక్‌కు కవచం స్టీల్ కాస్టింగ్‌లను తయారు చేసింది.

ఇండియన్ నేవీలో జలంతర్గాముల్లో అమర్చే ప్రొపెల్లర్ షాఫ్ట్ అసెంబ్లీ, రాడార్ స్టాక్ అసెంబ్లీ, మెరైన్ డీజిల్ ఇంజిన్ బ్లాక్‌లను హెచ్‌ఈసీ తయారు చేస్తోంది. అలాగే ఇండియన్ నావల్ షిప్ రానా కోసం స్టెర్న్ గేర్ సిస్టమ్, 120 ఎంఎం గన్ బారెల్ PYB మ్యాచింగ్‌ను సిద్ధం చేసింది.

న్యూక్లియర్ గ్రేడ్ స్టీల్‌ను తయారు చేయడం ద్వారా, హెచ్‌ఈసీ అటువంటి సాంకేతికతను కలిగి ఉన్న ప్రపంచంలోని ఆరు దేశాల జాబితాలో భారతదేశానికి స్థానం కలిపించింది.

దేశంలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి హెవీ ఎలక్ట్రికల్ కార్పోరేషన్ చోదక శక్తిగా పని చేస్తోంది. అంటే ఇతర పరిశ్రమలకు అవసరమైన భారీ యంత్రాలు ఇక్కడే తయారు చేస్తున్నారు.

ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి, హెచ్‌ఈసీ దేశంలోని వివిధ పారిశ్రామిక సంస్థలకు 550 వేల టన్నులకు పైగా పరికరాలను తయారు చేసి సరఫరా చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)