'సనాతన ధర్మమే అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మహాత్మాగాంధీకి స్ఫూర్తినిచ్చింద'న్న మోదీ మాటల్లో నిజమెంత?

మహాత్మాగాంధీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మయురేశ్ కొన్నూర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సనాతన ధర్మంపై నెలకొన్న వివాదంపై మౌనం వీడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గురువారం మధ్యప్రదేశ్‌‌ పర్యటనలో భాగంగా జరిగిన బహిరంగ సభలో మహాత్మాగాంధీని ప్రస్తావిస్తూ ఈ అంశంపై మోదీ మాట్లాడారు. ''అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి సనాతనధర్మమే ఆయనకు స్ఫూర్తి'' అని మోదీ అన్నారు.

అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మహాత్మాగాంధీకి సనాతన ధర్మమే స్ఫూర్తి అని మోదీ చేసిన వ్యాఖ్యలు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు పూర్తిగా విరుద్ధం.

సనాతన ధర్మం వివాదాన్ని మహాత్మాగాంధీకి ముడిపెట్టడం ద్వారా ప్రధాని మోదీ ఈ విషయాన్ని రాజకీయంగా ప్రాధాన్యతాంశంగా మార్చారు. దీంతో సనాతన ధర్మం కులవివక్షకు కారణమైందా? లేక సామాజిక సంస్కరణలకు కారణమైందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

'క్యాస్ట్ ప్రైడ్ : బ్యాటిల్ ఫర్ ఈక్వాలిటీ ఇన్ హిందూ ఇండియా' (కుల అహంకారం : హిందూ భారతంలో సమానత్వం కోసం యుద్ధం ) పుస్తక రచయిత మనోజ్ మిట్టా ఈ విషయంపై మాట్లాడారు.

ఇలాంటి మూస సిద్ధాంతాలను ఎదుర్కోవడానికి మహాత్మాగాంధీ తనను తాను సనాతనవాదిగా చెప్పుకున్నారని ఆయన అన్నారు. కానీ, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడడానికి మహాత్మాగాంధీ సనాతన ధర్మం నుంచే స్ఫూర్తి పొందారని చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు.

అంటరానితనానికి వ్యతిరేకంగా 19020లో నాగ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించడంలో మహాత్మాగాంధీ కీలకపాత్ర పోషించారని మనోజ్ మిట్టా తెలిపారు.

"సమాజంలోని ఒక వర్గాన్ని అంటరానిదిగా మార్చడాన్ని గాంధీ తప్పుబట్టారు"

అంటరానితనానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేసిన ఆ చారిత్రాత్మక తీర్మానం ''హిందూమతం అంటరానితనం నుంచి విముక్తి పొందేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలని హిందూ సమాజానికి నాయకత్వం వహిస్తున్న వారికి విజ్ఞప్తి చేస్తున్నాం'' అనే మాటలతో ప్రారంభమైంది.

ఆ సమయంలో ప్రబలంగా ఉన్న కుల వివక్ష అనే భయంకరమైన సామాజిక దురన్యాయాన్ని వ్యతిరేకించేలా ఆ తీర్మానం ఉంది.

''సమాజంలోని అణగారిన వర్గాలతో వ్యవహరించే విధానాన్ని సంస్కరించేందుకు సహకరించాలని మతపెద్దలకు కాంగ్రెస్ గౌరవపూర్వకంగా విజ్ఞప్తి చేస్తోంది'' అనే మాటలతో తీర్మానం ముగిసింది. సమాజంలో మార్పులకు సహకరించాలని కోరింది. ఇది అప్పటి భయంకరమైన కులవివక్షకు అద్దం పడుతోంది.

అంటరానితనంపై మహాత్మాగాంధీ ఆలోచన చాలా స్పష్టమైనది. కానీ, తన రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం కుల వ్యవస్థ అంటే వర్ణ వ్యవస్థ అనే గాంధీ విశ్వసించారని మనోజ్ మిట్టా గాంధీ ఆధారాలతో రుజువు చేశారు.

1924-25 నాటి వైకోమ్ తిరుగుబాటుకు గాంధీ మద్దతు ఇచ్చారు. ఎందుకంటే, ఈ తిరుగుబాటు కేవలం ఆలయంలోకి ప్రవేశం కోసం కాదు, అణగారిన వర్గాల ప్రజలు ఆలయాలకు వెళ్లేందుకు ఎలాంటి అడ్డంకులూ ఉండకూడదని డిమాండ్ చేసింది.

మహాత్మాగాంధీ

ఫొటో సోర్స్, Getty Images

గాంధీ, మాల్వియా వాగ్వాదం

''1932లో జరిగిన పూనా ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత, దళితులకు ఆలయ ప్రవేశ హక్కు కల్పించాలనే విషయంలో మహాత్మాగాంధీ దృక్పధం మారిపోయింది.

ఈ ఒప్పందం ప్రకారం, అణగారినవర్గాల ప్రజలు ప్రత్యేక ఎన్నికల వ్యవస్థపై తమ హక్కును వదులుకున్నారు. అది ఆయన సుదీర్ఘ పోరాటం చేసి సాధించిన హక్కు.

అందుకు ప్రతిఫలంగా అణగారిన వర్గాల కోసం ఏదైనా చేయాలని గాంధీ భావించారు'' అని మనోజ్ మిట్టా అభిప్రాయపడ్డారు.

ఆ తర్వాత నుంచి అణగారిన వర్గాల ప్రజల కోసం మహాత్మాగాంధీ స్వరం పెంచారు. దళితులకు ఆలయ ప్రవేశం ఆయా దేవాలయాల నియమాల ప్రకారం అమలు చేయాలి. స్థానిక భక్తుల అభిప్రాయ సేకరణ ద్వారా అది జరగాలి.

కానీ, దానిని దళితులకు హక్కులు కల్పించే అంశంగా పరిగణించకూడదని ఆయన చెప్పారు.

''దళితులకు ఆలయ ప్రవేశం కల్పించే సంస్కరణకు గాంధీ మద్దతు ఇచ్చినప్పుడు మదన్‌మోహన్ మాల్వియాతో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆలయ ప్రవేశం విషయంలో ప్రభుత్వ జోక్యాన్ని మాల్వియా వ్యతిరేకించారు.

అయితే, గాంధీ మద్దతు ఇచ్చిన బిల్లులోనూ తుది నిర్ణయం హిందూ అగ్రవర్ణాల చేతుల్లోనే ఉంది. అయినా, 1933 జనవరి 23న మదన్‌మోహన్ మాల్వియా వారణాసిలో సనాతన్ ధర్మ మహాసభ ఏర్పాటు చేసి ఆ బిల్లును వ్యతిరేకించారు'' అని మనోజ్ మిట్టా చెప్పారు.

ఉదయనిధి స్టాలిన్

ఫొటో సోర్స్, UDHAY/X

చర్చకు దారితీసిన ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు

తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి, సమానత్వానికి వ్యతిరేకమని ఆయన అన్నారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వ్యాధులతో పోల్చారు.

ఉదయనిధి వ్యాఖ్యలతో బీజేపీ, ప్రతిపక్ష నేతల మధ్య రాజకీయ రగడ మొదలైంది. ఇది సనాతన ధర్మం కుల వ్యవస్థకు ప్రతీకా? అది సమానత్వానికి విరుద్ధమా? అనే ప్రశ్నలను లేవనెత్తాయి.

సనాతన ధర్మం గురించి జరుగుతున్న ఈ వివాదంపై సీనియర్ భాషావేత్త, ఆంత్రోపాలజిస్ట్ డాక్టర్ గణేశ్ నారాయణ్‌దాస్ దేవి (జీఎన్ దేవి) మాట్లాడారు. కాలక్రమేణా సనాతన ధర్మం అనే భావన మారుతూ వచ్చిందని ఆయన చెప్పారు.

అదెలా జరిగిందో ఆయన వివరించారు. ''18వ శతాబ్దం ప్రారంభంలో బెంగాల్ రీజియన్‌లో ఓ చర్చ మొదలైంది. ఈ చర్చలో రెండు వాదనలున్నాయి. ఒకవైపు నూతన వర్గం, రెండోవైపు సనాతన మద్దతుదారులు. ఇంగ్లిష్‌ చదువులు కావాలని, సతీసహగమనం, బాల్యవివాహాల వంటి ఆచారాలను రద్దు చేయాలని నూతన వర్గం డిమాండ్ చేసింది. ఈ సంస్కరణలన్నీ సమాజాన్ని కలుషితం చేస్తాయని సనాతన మద్దతుదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు'' అని జీఎన్ దేవి చెప్పారు.

''ఈ చర్చ బెంగాల్‌లో మూడు దశాబ్దాల పాటు కొనసాగింది. ఆ తర్వాత అక్కడ పునరుజ్జీవ యుగం ప్రారంభమైంది. అందువల్ల, 18వ శతాబ్దంలో సనాతన అనే పదాన్ని ప్రాచీన సంప్రదాయాలకు ప్రతీకగా ఉపయోగించగా, ఆ తర్వాతి కాలంలో వివిధ రకాల సంప్రదాయాలు అందులో కలిసిపోయాయి. వాటిలో వేదాలు, ఉపనిషత్తులు, మతగ్రంథాలు, మతానికి సంబంధించిన అన్ని రకాల ఆచారాలూ ఉన్నాయి'' అని ఆయన అన్నారు.

సనాతన సంప్రదాయాలు సుమారు 15 వందల ఏళ్ల నాటివని జీఎన్ దేవి తెలిపారు. కానీ, సనాతన అనేది ఏదో ఒక సంప్రదాయాన్నీ, లేదంటే ఎవరో ఉపదేశించినదాన్ని ప్రతిబింబించదు.

అయితే, 18వ శతాబ్దంలో ఈ సంప్రదాయాలలో ఒకటైన కులవ్యవస్థ ప్రస్తావన ప్రాచుర్యంలోకి వచ్చింది. అది సనాతన ధర్మంతో గట్టిగా ముడిపడిందని జీఎన్ దేవి చెప్పారు.

కుల వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

19, 20వ శతాబ్దాల్లో కుల వ్యవస్థ కల్లోలం

ఉదయనిధి స్టాలిన్ ప్రకటనతో సనాతన ధర్మంపై ఈ చర్చ మొదలైంది. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి, సమాన హక్కులకు వ్యతిరేకమని ఆయన అభిప్రాయపడ్డారు.

19, 20వ శతాబ్దాల్లో సంస్కరణోద్యమాలు బలోపేతం అవుతున్న సమయంలో తమను తాము సనాతనవాదులుగా, సంస్కర్తలుగా చెప్పుకునే కొన్ని సమూహాలు ఏర్పడ్డాయి. డాక్టర్ గణేశ్ దేవి విశ్లేషణ ప్రకారం, ఈ ఆధునిక యుగంలో జరుగుతున్న చర్చలలో ప్రధాన సమస్య కులవ్యవస్థ, అది సృష్టించిన అసమానత్వమని అర్థమవుతోంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు అనేక ప్రాంతాల్లో, వివిధ రకాల ప్రయత్నాలు జరిగాయి.

చెన్నైకి చెందిన వి.గీత సామాజిక కార్యకర్త, రచయిత్రి కూడా. ఆమె సామాజిక ఉద్యమాల చారిత్రక నేపథ్య పరిశోధనలో నిపుణులు. ''నిజానికి సనాతన ధర్మం అనేది కుల ఆధారిత వ్యవస్థ. ఇది కులవ్యవస్థ లేకపోయినా మనుగడలో ఉండే మతం లేదా విశ్వాసం కాదు. అంటే, సనాతన ధర్మానికి కులవ్యవస్థకు సంబంధం లేదని చెప్పలేం'' అని ఆమె అన్నారు.

''సనాతన అంటే సత్యాన్ని వ్యవక్తపరచడం. సనాతనం అంటే అంతం లేనిది. శాశ్వతమైనది. ప్రాచీన హిందూ సంప్రదాయాలు అనుసరించడం ఎక్కువ కావడం, ఆ ఆచారాలపై ఆసక్తి పెరగడంతో 19వ శతాబ్దంలో సనాతన అనే భావన బలోపేతమయ్యింది. దేశవ్యాప్తంగా సనాతన ధర్మ సభలు ఏర్పాటయ్యాయి'' అని గీత వివరించారు.

''ఈ సంస్థలన్నీ పాత, సంప్రదాయ అభిప్రాయాలను అనుసరించడంతో పాటు, ఏదో ఒక రూపంలో కుల ఆధారిత అసమానతలను సమర్థించడం ద్వారా కులవ్యవస్థకు మద్దతు తెలిపేవారు. ఈ సనాతన సభలు హిందూత్వమే అజెండాగా పని చేసేవి. తమను తాము ఇతర మతాలకు విరోధులుగా భావించేవారు. మరీముఖ్యంగా ఉత్తర భారతంలో ఇస్లాం మతంతో అలాంటి భావన ఉండేది. అలాగే, సనాతన అనే భావన కూడా దక్షిణ భారతదేశంలోని కొందరు మేధావి బ్రాహ్మణుల్లో ప్రాచుర్యం పొందింది'' అని చెప్పారు.

''వేద యుగంలో సనాతన ధర్మంలో వర్ణ ఆశ్రమ (వర్ణ వ్యవస్థ) ఏర్పాటైంది. ఈ వర్ణ వ్యవస్థ నేటి కుల వ్యవస్థకు భిన్నంగా ఉండేది. ఆ తర్వాత మధ్యయుగ కాలంలో ఇప్పుడున్న కుల వ్యవస్థ అభివృద్ధి చెందింది'' అని డాక్టర్ గణేశ్ దేవి చెప్పారు.

కుల వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

''కులం, వర్ణం అనే భావనలు రెండూ వేర్వేరు. సనాతన యుగంలో రాసిన ప్రాచీన గ్రంథాల్లో వర్ణానికి ఆమోదం ఉంది. వర్ణం అంటే తరగతి, కులం అని కాదు. వర్ణవ్యవస్థ అనేది కల్పిత ఆధ్యాత్మికత ఆధారంగా సామాజిక వర్గీకరణకు జరిగిన ఒక ప్రయత్నం. అందులో పునర్జన్మ భావన కూడా ఉంది.

కానీ, కుల వ్యవస్థ వృత్తిపై ఆధారపడి ఉంది. అది ఆధ్యాత్మికత ఆధారంగా పెరిగిన భావన కాదు. ఇది వేదాలు, ఉపనిషత్తుల ఆధారంగా ఏర్పడింది కాదు'' అని డాక్టర్ దేవి చెప్పారు.

కుల వ్యవస్థ అభివృద్ధి చెంది సమాజంలో పాతుకుపోవడం అసమానతలకు దారితీసింది. ఇందులో కొన్ని కులాలకు ఉన్నత హోదా కల్పించడం (అగ్రవర్ణాలు), ఇతరులను అణచివేయడంతో కులవ్యవస్థపై వ్యతిరేకత మొదలైంది.

దేశవ్యాప్తంగా సమాన హక్కులు కోరుతూ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. ఉదాహరణకు, మహారాష్ట్రలోని వరకరి సంప్రదాయం ఆధ్యాత్మికత ఆధారంగా సమానత్వాన్ని స్థాపించడానికి ప్రయత్నించింది.

కుల వ్యవస్థపై వ్యతిరేకత 19వ శతాబ్దం నుంచి సామాజిక ఉద్యమంగా మారింది.

మహాత్మాజ్యోతిబా ఫూలే కుల ఆధారిత అసమానతలకు వ్యతిరేకంగా గళం విప్పారు. ప్రత్యమ్నాయంగా సార్వజనిక్ సత్యధర్మని ప్రతిపాదించారు.

డాక్టర్ భీమ్‌రావ్ అంబేడ్కర్ కుల వివక్షకు వ్యతిరేకంగా క్రియాశీలక పోరాటం చేశారు.

వాస్తవానికి, కుల వ్యవస్థకు, కులం పేరుతో జరుగుతున్న వివక్షను తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, సనాతన ధర్మం కుల వ్యవస్థకు మద్దతు ఇస్తుందన్న వాదనలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) ఏం చెబుతుందన్నది మరో ప్రశ్న.

సనాతన ధర్మం కుల వ్యవస్థను సమర్థిస్తోందన్న వాదనను ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేబీ హెడ్గేవార్ జీవిత చరిత్ర రచించిన డాక్టర్ రాకేశ్ సిన్హా తోసిపుచ్చారు. ఆయన రాజ్యసభ ఎంపీగానూ పని చేశారు. సనాతన అనేది నిరంతర ప్రగతిశీల ప్రక్రియ. సమానత్వం, సామరస్యం, భిన్నత్వం అనేవి సనాతన ధర్మంలో ప్రాథమిక అంశాలని ఆయన అన్నారు.

''సమాజంలో అనేక వర్గాలు, జీవన విధానాలు, వైవిధ్యాలు నిరంతరం పుట్టుకొస్తూనే ఉంటాయి. దానిని ఎవరూ ఆపలేరు. అందువల్ల, సనాతన ధర్మం, హిందూ మతం మధ్య వ్యత్యాసం ఉందని నిరూపించాలనుకోవడం ప్రాథమికంగా తప్పు. ఎందుకంటే, హిందూమతం, దానికి మూలం సనాతన ధర్మం'' అని రాకేశ్ సిన్హా చెప్పారు.

మోహన్ భగవత్

ఫొటో సోర్స్, Getty Images

ఆర్ఎస్ఎస్ విధానమేంటి?

సమానత్వం అనేది సనాతన ధర్మంలో అంతర్లీనంగా ఉందని రాకేశ్ సిన్హా చెప్పినప్పటికీ, సనాతన ధర్మంపై విస్తృతంగా జరుగుతున్న చర్చ, దానిచుట్టూ ముసురుకున్న వివాదం నేపథ్యంలో కులం అనే వాస్తవాన్ని ఆర్‌ఎస్ఎస్ అంగీకరించినట్లుగా కనిపిస్తోంది.

సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగిన నేపథ్యంలో, నాగ్‌పూర్‌లో సెప్టెంబర్ 7న జరిగిన కార్యక్రమంలో ఆర్‌ఎస్ఎస్ నేత మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

''సాటి మనుషులను రెండు వేల ఏళ్లుగా అణచివేతకు గురిచేశాం. సమాజంలో కొన్ని వర్గాల వారు 2 వేల ఏళ్లుగా అన్యాయానికి గురవుతున్నారు. వారి కోసం ఓ 200 ఏళ్ల పాటు ఒక చిన్న బాధను భరించమని ఇతర వర్గాల వారిని ఎందుకు అడగలేం'' అని ఆయన అన్నారు.

మోహన్ భగవత్ వాదన విరుద్ధమైనదిగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు సుహాస్ పల్షికర్.

''ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించినప్పుడు, ఆ ధర్మం గురించే గొప్పగా మాట్లాడేవారు చాలా ఇబ్బందిపడ్డారు. సనాతన ధర్మానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. అలాగే, కులవ్యవస్థ కారణంగా సమాజంలో ఏర్పడిన అసమానతలను కూడా ఒప్పుకుంటున్నారు. ఈ కులవ్యవస్థకు సంబంధించి వారి వద్ద ఎలాంటి పరిష్కారం లేదు. అందువల్లే, మోహన్ భగవత్ ఒకవైపు కుల ఆధారిత రిజర్వేషన్లను సమర్థిస్తూ, మరోవైపు సనాతన ధర్మానికి కూడా మద్దతు ఇస్తున్నారు'' అని ఆయన వివరించారు.

సనాతన ధర్మంపై జరుగుతున్న ఈ చర్చ త్వరలో మూడు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ, విపక్షాల మధ్య కచ్చితంగా ప్రధాన అంశంగా మారుతుంది.

ప్రధాన మంత్రి మోదీ కూడా ఈ విషయంపై బహిరంగంగానే మాట్లాడారు. ఎన్నికల సభలు, ర్యాలీల్లో ఇప్పుడిదే అంశం ప్రధానంగా మారుతుందని భావిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, రామసేతు: ఇది రాముడి కాలంలో జరిగిన నిర్మాణమేనా, కాదా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)