గుడిలో పూజారులుగా ఎస్సీ, బీసీ మహిళలు... చరిత్రను తిరగ రాస్తున్నారు

మహిళా పూజారి
    • రచయిత, ప్రభాకర్ తమిళరసు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తొలిసారి ముగ్గురు బ్రాహ్మణేతర మహిళలు అర్చకత్వం కోర్సును పూర్తి చేసి మహిళా పూజారులు అయ్యేందుకు అర్హత సాధించారు.

తమిళనాడు చరిత్రలో మహిళలు అర్చకత్వం కోర్సును పూర్తి చేయడం ఇదే మొదటిసారి.

2021లో ఏర్పాటైన డీఎంకే ప్రభుత్వం, అన్ని కులాలకు చెందిన వారు పూజారులు అయ్యేలా కొత్త పథకాన్ని వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పింది.

అందులో భాగంగా, విద్యార్థులు నిరుడు తమిళనాడులోని ''అర్చకార్ అండ్ ఒధువర్''( అర్చకత్వం ) శిక్షణ కేంద్రాల్లో నమోదు చేసుకుని, అభ్యాసం పూర్తి చేశారు.

ఇందులో ఉత్తీర్ణత సాధించిన 98 మందికి సర్టిఫికెట్లు అందజేశారు. వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. త్రిచి (తిరుచ్చి)లోని శ్రీరంగంలో ఉన్న అర్చక పాఠశాలలో వైష్ణవ సంప్రదాయంలో ఆ ముగ్గురూ కోర్సు పూర్తి చేశారు.

తమిళనాడులో శిక్షణ పొందిన తొలి మహిళా పూజారులు వీరు. అర్చకత్వ కోర్సును పూర్తి చేసి జూనియర్ వైష్ణవ పూజారులుగా అర్హత సాధించి, క్షేత్రస్థాయిలో శిక్షణకు సిద్ధమైన ఈ ముగ్గురు మహిళా పూజారులతో బీబీసీ మాట్లాడింది.

మహిళా పూజారులు

ఫొటో సోర్స్, Getty Images

మొదటిసారి ఏదైనా సవాలే

''ఏదైనా పనిని పనిని మొదటిసారి ప్రారంభించినప్పుడు సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ కారణంతో మేం దేన్నీ వదులుకోలేం'' అంటూ రమ్య తన అనుభవాలను పంచుకున్నారు.

కడలూర్ జిల్లా ఫెతక్కుడికి చెందిన 23 ఏళ్ల రమ్య మ్యాథ్స్ సబ్జెక్ట్‌తో బీఎస్సీ పూర్తి చేశారు.

''దేవుడిపై భక్తి ఎప్పుడూ ఉంటుంది. అయితే, కాలేజీలో చదువుతున్నప్పుడు నా స్నేహితురాలు కృష్ణవేణి ద్వారా ఈ కోర్సు విషయం తెలిసింది. నేను వెంటనే ఇంట్లో చెప్పాను. ఇంట్లో వాళ్లు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు'' అని రమ్య తెలిపారు.

ఆమెకు తల్లిదండ్రులు, బంధువుల నుంచి మద్దతు లభించినప్పటికీ, ఆమె ప్రయత్నాలను కొందరు వ్యతిరేకించారు.

''ఏదో ఒకటి మాట్లాడేవారిని మనం ఆపలేం. మొదట్లో నేరుగానే తమ అసహనం ప్రదర్శించేవారు. కానీ, ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని నాకు తొలిసారి తెలిసింది. అయితే, వీటన్నింటినీ సులువుగా అధిగమించేందుకు అర్చక పాఠశాల ఉపాధ్యాయులు సహకరించారు'' అని రమ్య చెప్పారు.

మహిళలు పూజారులు కావాలని అర్చక పాఠశాల ఉపాధ్యాయులు ప్రోత్సహించారని రమ్య చెప్పారు. ''మాతో కలిసి చదువుకున్న విద్యార్థులు ఎవరూ కూడా భయపడింది లేదు. మమ్మల్ని తోటివిద్యార్థుల్లా చూసేవారు. అదే ధైర్యాన్నిచ్చింది'' అని రమ్య అన్నారు.

బాగా వెనకబడిన తరగతి (ఎంబీసీ)కి చెందిన రమ్య తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. శిక్షణ పూర్తయ్యాక వారికి ప్రభుత్వ ధర్మాదాయ శాఖలో ఉద్యోగాలు వస్తే బయటి సమాజం నుంచి వచ్చే విమర్శలకు సమాధానం ఇచ్చినట్టవుతుందని ఆమె అన్నారు.

''మేం గర్భగుడిలోకి వెళ్తున్నందుకు గర్వంగా ఉంది. కేవలం ఉద్యోగం, ఆర్థిక ప్రయోజనం కోసమే ఈ శిక్షణ పూర్తి చేయలేదు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తే మంచిది. ఆలయాల్లో అందరికీ అవకాశం కల్పించడం సమాజంపై మంచి ప్రభావం చూపుతుంది'' అని ఆమె అన్నారు.

మహిళా పూజారి

‘గర్వపడుతున్నా’

రమ్య కాలేజీ స్నేహితురాలు కృష్ణవేణి కూడా అర్చక పాఠశాలలో జూనియర్ వైష్ణవ పూజారిగా శిక్షణ పొందారు.

''మా కుటుంబంలో మా నాన్న, మా తాతయ్య స్థానికంగా ఉన్న ఆలయాల్లో పూజలు చేసేవారు. వాళ్లు పెద్దగా చదువుకోలేదు. అందుకే బాగా చదువుకుని పూజారిగా గర్భగుడిలో అడుగుపెట్టాలని అనుకున్నా'' అని కృష్ణవేణి వివరించారు.

మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డానని, తర్వాత అలవాటైపోయిందని ఆమె చెప్పారు.

''ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ తరగతులు జరిగేవి. కాలేజీ చదువు పూర్తయ్యి ఈ కోర్సులో చేరిన మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డాను. కానీ, అక్కడి ఉపాధ్యాయులు, తోటి విద్యార్థుల ప్రోత్సాహంతో నెమ్మదిగా అలవాటుపడ్డాను. ఇప్పుడు పూర్తిస్థాయిలో పూజారి అయినందుకు గర్వపడుతున్నా'' అని కృష్ణవేణి చెప్పారు.

కడలూర్‌లోని ఫెతుక్కుడికి చెందిన ఆమె క్షేత్రస్థాయి శిక్షణకు సిద్ధమవుతున్నారు.

అయితే, తంజావూరు జిల్లా కొరడచ్చేరికి చెందిన రంజితకు అర్చకత్వం గురించి తెలియదు.

మహిళా పూజారులు

ఫొటో సోర్స్, DIPR

'పెరియాకోయిల్' కోసం ఎదురుచూస్తున్న రంజిత

రంజిత పన్నెండో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. ప్రభుత్వ కళాశాలలో డబ్ల్యూఐఎస్‌సీఓఎం (బ్యాచిలర్ ఆఫ్ విజువల్ కమ్యూనికేషన్)‌ పూర్తి చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేశారు.

''అక్కడ పనిచేస్తున్నప్పుడు ఏ కులానికి చెందినవారైనా పూజారి కావొచ్చని విన్నా. ముఖ్యంగా మహిళలు. వెంటనే అర్చక పాఠశాలలో చేరా. ఒక సంవత్సరం శిక్షణలో చాలా నేర్చుకున్నా. ఇప్పుడు నేను సర్టిఫికెట్ కూడా తీసుకున్నా'' అని రంజిత తన పూజారి ప్రయాణం గురించి చెప్పారు.

క్షేత్రస్థాయి శిక్షణ పూర్తయ్యాక, తంజావూర్ పెరియాకోయిల్ (ఆలయం)లో ఉద్యోగం ఇవ్వాలని అభ్యర్థించినట్లు రంజిత చెప్పారు. ''నేను ఏడాదిగా చదువుకున్నవి అక్కడ ఉపయోగపడతాయి'' అని ఆమె అన్నారు.

''అందరికీ ఆలయ ప్రవేశం లేని పరిస్థితి నుంచి, ఇప్పుడు అందరూ ఆలయంలోకి ప్రవేశించడమే కాదు.. మహిళలతో సహా జ్ఞానం కలిగిన అందరికీ పూజారులు అయ్యే అవకాశం వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి'' అని రంజిత అన్నారు.

రంజిత ఎస్సీ కులానికి చెందిన వారు. తమ కుటుంబంలో మొదటి పట్టభద్రురాలు తన కూతురేనని ఆమె తల్లి ఉమ చెప్పారు.

మహిళా పూజారులు

ఫొటో సోర్స్, Getty Images

గుడికి వెళ్లలేని రంజిత గర్భగుడిలోకి..

రంజిత నిర్ణయానికి తన పూర్తి మద్దతు ఉంటుందని ఉమ చెప్పారు. ''ఇదంతా అవసరమా అని ఊళ్లో జనాలు మాట్లాడుకున్నారు. కానీ, నా కూతురు చదవాలనుకుంది. మేం సరేనన్నాం'' అన్నారు.

ఆమెను చదువుకోవడానికి పంపించామని, వేరేవాళ్ల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఉమ అన్నారు.

ఉమ ఓ వ్యవసాయ కూలీ. తన తోబుట్టువుల సాయంతో రంజిత చదువుకున్నారు.

తన కూతురు అర్చకత్వం కోర్సులో ఉత్తీర్ణత సాధించడం చాలా సంతోషంగా ఉందని ఆమె తండ్రి నటరాజ్ అన్నారు. ''గుడిలో అడుగుపెట్టలేని పరిస్థితుల నుంచి ‘నిమ్న జాతి’కి చెందిన ఓ వ్యక్తి పూజారి కావడం సంతోషం. పెద్ద ఆలయంలో ఉద్యోగం దొరికితే ఆమె కోరిక నెరవేరుతుంది'' అని నటరాజ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)