అప్పుడు 7.1 తీవ్రతతో భూకంపం వచ్చినా ఎవరూ చనిపోలేదు, ఇప్పుడు 6.8 తీవ్రతకే ఇంత భారీ విధ్వంసం ఎందుకు జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
మొరాకోలో గతవారం సంభవించిన భూకంపం కారణంగా 2,800 మందికి పైగా చనిపోయినట్లు నిర్ధారించారు.
ఈ భూకంపం 6.8 తీవ్రతతో వచ్చినట్లు చెప్పారు. 2019లో అమెరికాలోని కాలిఫోర్నియాను తాకిన భూకంపం కంటే దీని తీవ్రత తక్కువే.
కాలిఫోర్నియాలో 7.1 తీవ్రతతో భూకంపం వచ్చినప్పటికీ ఎవరూ చనిపోలేదు. మౌలిక సదుపాయాలకు కూడా పెద్దగా నష్టం వాటిల్లలేదు.
మరణాల సంఖ్య, విధ్వంసం పరంగా భూకంపాలను ప్రభావితం చేసే కారకాలు అనేకం ఉన్నాయి. ఇవి చాలా ముఖ్యమైనవి.

ఫొటో సోర్స్, Getty Images
తీవ్రత, వ్యవధి
భూకంపాలను ‘‘మూమెంట్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్’’ (ఎండబ్ల్యూ) మీద కొలుస్తారు. అందరికీ బాగా తెలిసిన రిక్టర్ స్కేల్ స్థానాన్ని మూమెంట్ మ్యాగ్నిట్యూట్ స్కేల్ భర్తీ చేసింది. ప్రస్తుతం రిక్టర్ స్కేల్‌ను పురాతనమైనదిగా, తక్కువ కచ్చితత్వాన్ని సూచించే స్కేలుగా పరిగణిస్తున్నారు.
ఫాల్ట్ లైన్ (భూమి ఉపరితలంపై ఏర్పడిన చీలిక) కదిలిన దూరం, దాన్ని కదిలించిన శక్తి కలయికను భూకంపానికి ఆపాదించిన సంఖ్య సూచిస్తుంది.
సాధారణంగా 2.5 లేదా అంతకంటే తక్కువ స్థాయిలో వచ్చే భూకంపాలను మనం గ్రహించలేం. కానీ, భూకంప లేఖినిలలో వీటిని గుర్తించవచ్చు.
5 వరకు తీవ్రతతో వచ్చే భూకంపాలను మనం అనుభూతి చెందుతాం. అవి స్వల్ప నష్టాన్ని కలుగజేస్తాయి.
మొరాకోలో 6.8 తీవ్రతతో వచ్చిన భూకంపాన్ని ఓ మోస్తరు నుంచి బలమైన భూకంపంగా నిర్వచిస్తారు.
ఈ ఫిబ్రవరిలో 7.8 తీవ్రతతో దక్షిణ తుర్కియేలో వచ్చిన భూకంపాన్ని భారీ భూకంపంగా వర్గీకరించారు.
ఇక భూకంప తీవ్రత 8 దాటితే దాన్ని ‘అతి భారీ’ భూకంపంగా పరిగణిస్తారు. ఈ రకమైన భూకంపం విధ్వంసాన్ని సృష్టిస్తుంది. సర్వం నాశనం చేస్తుంది.
తీవ్రతతో పాటు భూమి ప్రకంపన కాలం వ్యవధి కూడా భూకంప విధ్వంసక శక్తిని బాగా ప్రభావితం చేస్తుంది.
‘‘స్వల్ప స్థాయిలో వచ్చే భూకంపాల ప్రకంపన కాలం మామూలుగా కొన్ని సెకన్లు మాత్రమే ఉంటుంది. ఓ మోస్తరు నుంచి భారీ భూకంపాలు సంభవించినప్పుడు ప్రకంపన కాలం రెండు నిమిషాల పాటు ఉంటుంది. 2004లో సుమత్రాలో వచ్చిన భూకంపం ఇలాంటిదే’’ అని పసిఫిక్ నార్త్‌వెస్ట్ సెస్మిక్ నెట్‌వర్క్ చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
లోతు
భూకంపం పరిమాణం మాత్రమే కాదు, భూమి లోపల భూకంప స్థానం కూడా చాలా ముఖ్యం.
మొరాకో కేసులో భూకంప కేంద్రం భూమి ఉపరితలానికి 18 కి.మీ లోతులో ఉంది. ఇది ఎవరెస్ట్ ఎత్తు కంటే రెండింతలు ఉంటుంది. అయితే, భౌగోళిక ప్రమాణాల ప్రకారం దీన్ని లోతుగా పరిగణించరు.
‘‘ఈ భూకంపం చాలా తక్కువ లోతులో వచ్చింది. అంటే భూకంపం కారణంగా పుట్టిన శక్తిని, కంపనాలను చెదరగొట్టేందుకు పైన భూమి చాలా తక్కువగా ఉంది. భూకంపం వచ్చినప్పుడు కంపనాలు చాలా శక్తిమంతంగా వచ్చి ఉండొచ్చు’’ అని బీబీసీతో పోర్ట్స్‌మౌత్ యూనివర్సిటీలో వోల్కనాలజిస్ట్, జియోలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ కర్మెన్ సోలానా చెప్పారు.
సెప్టెంబర్ 11న అంటే సోమవారం ఇండోనేసియాలోని మారుమూల మలుకు ప్రావిన్సులో 6.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీని కేంద్రం భూఉపరితలానికి 168 కి.మీ లోతున ఉంది. ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదు.
సమయం
మొరాకోలో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11:11 గంటలకు భూకంపం వచ్చింది. భూకంపం ప్రాణాంతకంగా మారడంలో ఈ అంశం కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపి ఉండొచ్చు.
‘‘ప్రజలు నిద్రిస్తున్నప్పుడు చాలా భవనాలు కూలిపోయి ఉండొచ్చు. భూకంపాల సమయంలో ఎక్కువ మంది భవనాలు కూలిపోవడం వల్లే చనిపోతున్నారు. ‘మనుషుల్ని భూకంపాలు చంపవు, కానీ భవనాలు చంపుతాయని’ భూకంప శాస్త్రవేత్తలు చెబుతుంటారు’’ అని డాక్టర్ సోలానా చెప్పారు.
వెలుగు పూట వచ్చే భూకంపాల్లో సాధారణంగా తక్కువ మరణాలు సంభవిస్తాయి.

భవన నిర్మాణం
అత్యంత తీవ్రమైన భూకంపాలను మినహాయించి మిగతా స్థాయిలో వచ్చే భూకంపాలను తట్టుకునేలా ఇళ్లను నిర్మించడం సాధ్యమే. భవనాలు వీలైనంత ఎక్కువగా భూకంప శక్తిని గ్రహించేలా చేయాలి.
యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) ప్రకారం, ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు వచ్చే దేశంగా నిలిచిన జపాన్.. భూకంపాలను తట్టుకుని నిలిచే భవనాలను నిర్మించడంలో గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించింది.
‘‘భూకంపాల నుంచి వచ్చే శక్తినంతటినీ భవనాలు గ్రహించగలిగినప్పుడు అవి కూలిపోవు’’ అని టోక్యో యూనివర్సిటీలోని స్ట్రక్చరల్ ఇంజినీర్, అసోసియేట్ ప్రొఫెసర్ జున్ సాటో చెప్పారు.
సెస్మిక్ ఐసోలేషన్ అనే ప్రక్రియ ద్వారా ఇలా చేయడం సాధ్యమవుతుంది.
ఈ ప్రక్రియలో భూకంపం వల్ల వచ్చే ప్రకంపనలను తట్టుకొని నిలిచేలా భవనాల్లో ఒక రకమైన బేరింగ్‌లు లేదా షాక్ అబ్జార్బర్లు ఏర్పాటు చేస్తారు. కొన్నిసార్లు 30-50 సెం.మీ మందంతో ఉన్న రబ్బర్లను బ్లాకుల్లాగా అమర్చుతారు.
కానీ, ఈ రకమైన బేస్ ఐసోలేషన్ చాలా ఖరీదైనది.
మొరాకోలో అత్యధికంగా భూకంప ప్రభావానికి గురైన ప్రాంతాల్లోని చాలా భవనాలు మట్టి, ఇటుకలు, అడోబ్‌లతో నిర్మించారు. ఇవి తీవ్రమైన భూకంపాలను తట్టుకొని నిలబడలేవు.
ఎక్కువ ఆక్యుపెన్సీ ఉన్న ఎత్తైన భవనాలు కూలిపోతే మరణాల సంఖ్య భారీగా పెరుగుతుంది.
భూకంపాలు శక్తిమంతంగా ఉన్నప్పటికీ, ప్రమాణాల ప్రకారం నిర్మించిన భవనాలు దాన్ని తట్టుకొని నిలబడగలవని నిపుణులు అంటున్నారు.
జన సాంద్రత
2021 జులైలో అలస్కా ద్వీపకల్పానికి సమీపంలో 8.2 తీవ్రతతో అతిభారీ భూకంపం సంభవించింది. కానీ, దీని గురించి మీకు గుర్తు ఉండకపోవచ్చు.
అమెరికా చరిత్రలో చిగ్నిక్ భూకంపాన్ని ఏడో అతిపెద్ద భూకంపంగా భావిస్తారు. కానీ, ఈ భూకంపం కారణంగా ఎవరూ చనిపోలేదు, ఎవరికీ గాయాలు కూడా కాలేదు. దీనికి కారణం ఏంటి? ప్రజల నివసించే ప్రాంతాలకు చాలా దూరంగా, భూమికి చాలా లోతులో ఈ భూకంపం సంభవించింది.
దీనికి విరుద్ధంగా 2010 జనవరిలో హైతిలో 7.0 తీవ్రతతో వచ్చిన భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. భారీ ప్రాణనష్టాన్ని కలిగించింది.
ఈ భూకంపం వల్ల 25 వేల మందికిపైగా చనిపోయినట్లు, 3 లక్షల మంది గాయపడినట్లు, 15 లక్షల మంది నిరాశ్రయులుగా మారినట్లు అంచనా వేశారు.
దీని దెబ్బకు అధిక జనసాంద్రత ఉండే రాజధాని నగరం పోర్ట్ ఓ ప్రిన్స్ పూర్తిగా ప్రభావితమైంది. అక్కడ చదరపు కిలోమీటర్‌కు 27 వేల మంది కంటే ఎక్కువగా నివసిస్తారు. అందుకే మరణాల సంఖ్య ఎక్కువగా నమోదైంది.

ఫొటో సోర్స్, Melissa Davis
నేల రకం
మన కాళ్ల కింది నేల ఎంత దృఢంగా ఉందనే దానిపై భూకంపాల నుంచి మనం ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఆధారపడి ఉంటాయి.
నీటి అవక్షేపాల కారణంగా మట్టి వదులుగా ఉంటే భూప్రకంపనలు బలంగా వచ్చినప్పుడు భూమి ఉపరితలం వాటిని తట్టుకొని నిలబడలేదని యూఎస్‌జీఎస్ తెలిపింది.
మామూలుగా ఘన రూపంలో ఉండే మెటీరియల్ ద్రవంగా ప్రవర్తించడం మొదలుపెడితే భూకంపాల వల్ల కలిగే విధ్వంసం బాగా పెరుగుతుందని చెప్పింది.
1964లో జపాన్‌లోని నీగాటలో ఏర్పడిన విధ్వంసం ఇలాంటిదే.
ఇటీవల తుర్కియేలో వచ్చిన భూకంపం కారణంగా 50 వేల మందికి పైగా చనిపోయారు. అయితే, భూకంప కేంద్రానికి కేవలం 80 కి.మీ దూరంలో ఉన్న ఎర్జిన్ నగరం మాత్రం భూకంప ప్రభావం నుంచి తప్పించుకోగలిగింది. ఆ నగరంలోని ఎవరూ చనిపోలేదు. ఒక్క భవనం కూడా కూలిపోలేదు. దాని చుట్టుపక్కల నగరాలు భూకంపం ధాటికి చెదిరిపోయాయి.
ఎర్జిన్ నగరం గట్టి రాతిపొర మీద, కఠినమైన నేల మీద ఉండటం వల్లే భూకంప ప్రభావం నుంచి తప్పించుకోగలిగిందని భౌగోళిక శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ రాతి పొర, కఠిన నేల భూకంప తరంగాలను గ్రహించాయని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అత్యవసర స్పందన
ప్రకృతి వైపరీత్యాలకు సంసిద్ధంగా ఉండటం వల్ల ప్రాణాలను కాపాడొచ్చు. సంసిద్ధంగా ఉండటం చాలా కీలక అంశం.
జపాన్ పాఠశాలల్లో సంవత్సరానికి రెండు సార్లు భూకంప డ్రిల్స్ నిర్వహిస్తారు.
భూకంపం వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నా లేదా వాహనాల్లో ఉన్నా ఎలా స్పందించాలో పిల్లలకు నేర్పిస్తారు.
అత్యవసర ప్రతిస్పందన బృందాల సామర్థ్యాలను పరీక్షించడం కోసం తైవాన్ దేశవ్యాప్తంగా అత్యవసర డ్రిల్స్‌ను నిర్వహిస్తుంది.
అయితే, చాలా దేశాల్లో ఇలాంటి పనులు చేయరు. ముఖ్యంగా విపత్తులు అరుదుగా వచ్చే దేశాల్లో ఇలాంటి కసరత్తుల జోలికే వెళ్లరు.
విపత్తు సంభవించినప్పుడు అత్యవసర ప్రతిస్పందన బృందాలు ఎంత వేగంగా స్పందించాయి? ఎంత మంది ఆ బృందంలో ఉన్నారనేది కూడా చాలా కీలకం.
ఇటీవలి భూకంపంతో బాగా ప్రభావితమైన మొరాకోలోని మారుమూల ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, శిథిలాలు పోగవడం వల్ల రహదారులు మూసుకుపోయాయి. దీంతో తమకు అత్యవసర సహాయం అందలేదని మొరాకోలోని చాలా గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేశారు.
కొన్ని అంతర్జాతీయ సంస్థలు సహాయం చేయడానికి ముందుకొచ్చినప్పటికీ వాటిని అంగీకరించడంలో ఆలస్యం చేసిందని మొరాకో ప్రభుత్వంపై కూడా విమర్శలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Reuters
ఇతర అంశాలు
భూకంపాలు వచ్చినప్పుడు భవనాలు కూలిపోవడమే మరణాలకు కారణం కాదు.
సముద్ర గర్భంలో వచ్చే భూకంపాలు, తీరప్రాంత ప్రజలకు హాని కలిగిస్తాయి. ఇవి ఘోరమైన సునామీలుగా కూడా మారవచ్చు.
2004లో సంభవించిన సునామీకి హిందూ సముద్రంలో 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపమే కారణం.
భూకంపం, భారీ అలల కారణంగా డజనుకు పైగా దేశాల్లోని సుమారు 2,30,000 మంది మరణించారు. ఆ శక్తిమంతమైన అలలు, హిందూ మహాసముద్రానికి అవతలి వైపు ఉన్న ఆఫ్రికాలోని ప్రాణాలను కూడా తీసుకున్నాయి.
కొండప్రాంతాల్లో భూకంపాలతో కొండచరియలు విరిగిపడతాయి. ఇళ్లను ధ్వంసం చేస్తాయి. సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తాయి.
2015లో నేపాల్‌లో సంభవించిన బలమైన భూకంపం కారణంగా దాదాపు 9 వేల మంది చనిపోయారు.
భూకంప ప్రభావిత ప్రాంతంలో 3,000కు పైగా కొండచరియలు విరిగిపడ్డాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- యాంటీ బయాటిక్స్ వేసుకోవడం ప్రమాదకరమా,పేగు మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి?
- ఇందిరా గాంధీని ఓడించిన 46 ఏళ్ల నాటి ఆ ప్రయోగం, ఇప్పుడు మోదీని ఓడించగలదా?
- చిత్తూరు: భార్యతో ఉన్నప్పుడు పురుషుడు.. బాయ్‌ఫ్రెండ్‌ను కలిస్తే మహిళ
- ‘సెక్స్ కోరికలు పెంచే ఆ హార్మోన్ తీసుకున్నాక నాకు కొడుకు పుట్టాడు’
- భారత్ అనే పేరు ఎలా వచ్చింది... దీని వెనుక దాగిన నీరు, నిప్పుల కథేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)














