పిల్లల దుస్తులపై స్టాంపులు అంటించి పోస్టులో పార్శిల్...ఎప్పుడు, ఎక్కడ?

పిల్లల పార్శిల్

ఫొటో సోర్స్, GETTY IMAGES

    • రచయిత, వకార్ ముస్తఫా, జర్నలిస్ట్, పరిశోధకులు
    • హోదా, బీబీసీ కోసం...

అప్పట్లో యూరప్ దేశాలకు యూఎస్ మెయిల్ ద్వారానే పార్శిళ్లు పంపే అవకాశం ఉండేది. 1913లో స్థానికంగా పార్శిల్ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలు కూడా ఆ సౌకర్యం పొందాయి.

నగరాల మధ్య ఖరీదైన ప్రయాణాలకు బదులుగా, బటర్, కోడిగుడ్లు, కోళ్లు, కోడి పిల్లలతో పాటు చిన్నపిల్లలను కూడా పార్శిల్ చేసే అవకాశం ఉండేదట.

అవును. మీరు చదవింది నిజమే. అది కేవలం యూఎస్ పోస్టల్ సర్వీస్‌పై ఉన్న నమ్మకంతో మాత్రమే కాదు, చౌకైన పరిష్కారంగా కూడా భావించిన తల్లిదండ్రులు చిన్నపిల్లలను పార్శిల్ చేసేవారు.

నిజానికి కొందరు తల్లిదండ్రులకు రైలు ప్రయాణాలు ఖరీదైనవిగా ఉండేవి. అందువల్ల అతి తక్కువ ధరలకు అందిస్తున్న ఈ సేవలను ఎందుకు ఉపయోగించుకోకూడదని వాళ్లు భావించారు.

జోయ్ సిల్వియా అనే రీసెర్చర్ వెల్లడించినదాని ప్రకారం, అమెరికాలోని ఒహియోకి చెందిన ఒక జంట వారి పసికందును ఒకటిన్నర కిలోమీటరు దూరంలోని అమ్మమ్మ ఇంటికి పంపాలనుకున్నారు.

పోస్ట్‌మ్యాన్ వెర్నాన్ ఆ పసికందును సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చారు. అందుకు ఆ కుటుంబం డిస్కౌంట్ పోగా 15 సెంట్లు మాత్రమే చెల్లించాల్సి వచ్చింది. 50 డాలర్ల బీమా సదుపాయం కూడా ఉంది.

ఈ సంఘటనను న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. బిడ్డను తీసుకెళ్లేందుకు పోస్ట్‌మ్యాన్ వచ్చేప్పటికి అంతా సిద్ధం చేశారు. పోస్ట్‌మ్యాన్ వెర్నాన్ బాలుడిని పోస్టు కార్డుపై ఉన్న చిరునామా ప్రకారం, బాలుడి అమ్మమ్మ లూయిస్ బీగల్ వద్దకు సురక్షితంగా చేర్చినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.

ఈ కథనం ప్రచురితమైన తర్వాత, తాను ఒక బిడ్డను దత్తత తీసుకోవాలని అనుకుంటున్న ఒక వ్యక్తి నుంచి యూఎస్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ఫ్రాంక్ హిచ్‌కాక్‌కు ఒక అభ్యర్థన వచ్చింది.

''పార్శిల్ చేయడానికి నిబంధనలు ఏంటో చెబితే ఆ మేరకు మేం పాపాయిని సిద్ధం చేసుకుంటాం. ఎందుకంటే ఎక్స్‌ప్రెస్ పోస్టు సర్వీసులు అప్పుడప్పుడు దారుణమైన సర్వీసులను అందిస్తున్నాయి'' అని అందులో రాసి ఉంది.

దీనిపై స్పందించిన యూఎస్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటన చేసింది. తేనెటీగలు, కీటకాల వంటివి కాకుండా పోస్టు ద్వారా పంపగలిగిన జీవులను మాత్రమే పోస్టల్ సర్వీసు ద్వారా అందజేస్తామని అందులో పేర్కొంది.

మెయిల్ ద్వారా పిల్లలను పంపడం అధికారికం కాదని తెలిసినప్పటికీ, అనేకమంది తమ పిల్లలను తీసుకెళ్లాలంటూ పార్సెల్‌ రిక్వెస్టులు పెడుతూనే ఉన్నారు.

పిల్లల పార్శిల్

ఫొటో సోర్స్, NATIONAL POSTAL MUSEUM

ఓక్లహమాకి చెందిన ఒక మహిళ తన రెండేళ్ల మనవడిని కాన్సాస్‌లోని వెల్లింగ్టన్‌లో ఉంటున్న ఆ పిల్లాడి అత్త వద్దకు పంపించింది. ''బాలుడిని మెయిల్ చేసినప్పుడు అతని మెడ చుట్టూ ట్యాగ్ వేసి ఉంది. పిల్లాడిని తీసుకెళ్లేందుకు కొన్ని సెంట్లు చెల్లించారు.

అక్కడి నుంచి రైల్వేస్టేషన్‌కు చేరుకోవడానికి ముందు, గ్రామీణ రహదారిలో 40 కి.మీ.ల దూరం ప్రయాణం చేశారు. బాలుడు పోస్ట్‌మ్యాన్‌తో కలిసి ప్రయాణం చేయడంతో పాటు అతనితో కలిసే భోజనం చేశాడు. సురక్షితంగా గమ్యస్థానానికి చేరాడు'' అని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది.

1914 జూన్‌లో మరో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. తన రెండేళ్ల కొడుకును లా పోర్టేలో ఉంటున్న అతని తండ్రి హెన్రీ యూలర్ దగ్గరికి పంపించేందుకు ఒక మహిళ పోస్ట్ చేసింది. అయితే, యూలర్స్ తల్లి ఆ పిల్లాడిని తీసుకునేందుకు నిరాకరించింది. తన కోడలు విడాకులు తీసుకుని వెళ్లిపోయిందని, కేసు కూడా నడుస్తోందని తెలిపింది.

దీంతో చిన్నారి రూరల్ లా‌పోర్టే కౌంటీ పోస్ట్ ఆఫీస్‌లో చిక్కుకుపోయాడు. ''ఆ తర్వాత ఆ పిల్లాడి తల్లి డెడ్‌ లెటర్ ఆఫీస్‌కి వెళ్లాల్సి వచ్చింది. కానీ, యూలర్ వచ్చి బిడ్డను తీసుకెళ్లడంతో ఆ వివాదం ముగిసింది. ఈ ప్రయాణాన్ని బాలుడు బాగా ఆస్వాదించాడు. పోస్ట్‌మ్యాన్ ఫ్రెడ్ ఒక వాహనంలో అతన్ని తీసుకెళ్లారు'' అని స్టార్ రాశారు.

మెయిల్ పార్శిళ్లలో చార్లొట్ మే పీర్ట్సాఫ్ కేసు మరో ప్రముఖ కేసుగా మిగిలింది. దాదాపు 120 కి.మీ.ల మైళ్ల దూరంలో ఉన్న తన అమ్మమ్మ, తాతయ్యల వద్దకు రైల్లో పంపేందుకు 1914 ఫిబ్రవరి 19న బాలిక చార్లొట్‌ని తల్లిదండ్రులు మెయిల్ చేశారు.

''మైళ్ల దూరంలో ఉన్న ఓల్డ్ ఇడాహో పర్వత ప్రాంతంలో ఉంటున్న తన అమ్మమ్మ మేరీని కలుసుకోవాలని చార్లొట్ చాలా కలలు కన్నది'' అని అలెగ్జాండ్రా దెంజర్ అనే వ్యక్తి రాశారు.

కానీ ఆ కల నిజం చేసేంత ఆర్థిక స్తోమత ఆమె కుటుంబానికి లేదు. దీంతో ఇడాహో‌లోని గ్రాంజ్వాల్లేకి పంపించేందుకు సరికొత్త ఉపాయంతో వారు ముందుకొచ్చారు.

కేవలం 53 సెంట్లు విలువైన స్టాంపులను ఆమె కోటుపై అతికించారు. ఎందుకంటే, చార్లొట్ తల్లి సోదరి రైల్‌రోడ్ మెయిల్ సర్వీస్‌లోనే పని చేసేది. ఆమె పూచీకత్తుతో బాలికను మెయిల్ సర్వీస్ ద్వారా అక్కడికి పంపించేందుకు సిబ్బంది అంగీకరించారు.

చార్లొట్ సాహసం చాలా ఫేమస్ అయింది. ఆమె ప్రయాణంపై మైకేల్ ఓ టన్నెల్ 'మీలింగ్ మే' అనే పుస్తకాన్ని కూడా రాశారు.

ఈ ఘటన తర్వాత మెయిల్ సర్వీసుల ద్వారా మానవ రవాణాపై యూఎస్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బుర్లెసన్ నిషేధం విధించారు.

పిల్లల పార్శిల్

ఫొటో సోర్స్, Getty Images

అయితే, ఆ ప్రకటన వచ్చిన నెలరోజులకే 14 పౌండ్ల బరువున్న బిడ్డను మేరీల్యాండ్‌లోని క్లియర్ స్ప్రింగ్‌లో ఉంటున్న ఆమె తల్లి ఇంటి నుంచి సుమారు 20 కి.మీ.ల దూరంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి పోస్ట్‌మ్యాన్ బీహెచ్ నైపర్ డెలివరీ చేశారు.

1915 ఫిబ్రవరి 25న ముస్సోరికి చెందిన పోస్ట్‌మ్యాన్ చార్లెస్ హేయ్స్ హెలెన్ అనే బాలికను వాళ్ల అమ్మమ్మ ఇంటికి డెలివరీ చేశారు. అందుకోసం 10 సెంట్లు చార్జ్ చేశారు.

పిల్లలను రైల్లో పంపడం చాలా ఖరీదులో కూడుకున్న వ్యవహారం. కొంతమంది తల్లిదండ్రులకు తమ ఒక రోజు జీతం అందుకోసం వెచ్చించాల్సి వచ్చేది. దాంతో పాటు పోస్టల్ సిబ్బందిపై నమ్మకం కూడా ఈ ధోరణి పెరిగేందుకు కారణమని అలెగ్జాండ్రా దెంజర్ అభిప్రాయపడ్డారు.

తల్లికి ఆరోగ్యం బాగోకపోవడం, పిల్లలను చూసుకునేందుకు ఎవరూ లేని సమయంలో వారిని అమ్మమ్మ, తాతయ్యల వద్దకు పంపేందుకు మెయిల్ సర్వీసులపై ఆధారపడేవారని జోర్డాన్ గాస్పూర్ తెలిపారు.

నేషనల్ పోస్టల్ మ్యూజియం చరిత్రకారుడు నాన్సీ పోప్‌ను గుర్తుచేశారు గాస్పూన్. ''అప్పట్లో రైలు టిక్కెట్ కంటే మెయిల్ సర్వీస్ ధర తక్కువ. అలాగే పిల్లలను ఇతర పార్శిళ్ల తరహాలో కాన్వాస్ సంచుల్లో ఉంచరు. వారిని పోస్ట్ మ్యాన్ పర్యవేక్షించేవారు. తల్లిదండ్రులు, పోస్ట్‌మ్యాన్‌ల మధ్య కూడా నమ్మకం ఉండేది. ఇంట్లో మనిషిలా అనుకునేవారు'' అని ఆయన తెలిపారు.

''ఇది మా బిడ్డను మీరు వెళ్లే దారిలో వదిలేసి వెళ్లు అని పోస్ట్‌మ్యాన్‌ను అడిగినట్టుగా ఉంది'' అని సిల్వియా చెప్పారు.

ఫ్లోరిడాలోని పెన్సకోలాకు చెందిన ఎడ్నా నెఫ్‌ వయసు ఆరేళ్లు. దాదాపు 1100 కి.మీ.ల దూరంలో వర్జీనియాలోని క్రిస్టియన్స్‌బర్గ్‌లో ఉంటున్న ఆమె తండ్రి వద్దకు 1915 మార్చి 27న ఆమెను మెయిల్ ద్వారా పంపారు. అప్పటికి ఆమెకు రైలు ప్రయాణం గురించి పెద్దగా తెలియదు. అయితే, 50 పౌండ్ల బరువు వరకు మాత్రమే పరిమితి ఉంది. ఆమెకు 15 సెంట్ల విలువైన స్టాంపులు అంటించారు.

అలెగ్జాండ్రా దెంజర్ ప్రకారం, పార్శిల్ పోస్ట్ ద్వారా ఒక చిన్నారి ప్రయాణించిన అత్యధిక దూరం ఇదే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)