భారత్ సరిహద్దుల్లో అణ్వాయుధాలను పోగేస్తున్న పాకిస్తాన్.. వాటిని ఎంత దూరం నుంచి ప్రయోగించవచ్చు?

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలోని ప్రముఖ అణు శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం, పాకిస్తాన్ వద్ద ప్రస్తుతం 170 అణ్వాయుధాలు (వార్‌హెడ్స్) ఉన్నాయి.

వాటిని ప్రత్యేక మిలిటరీ బేస్‌లలో భద్రపరిచారు.

ఇలాగే పాకిస్తాన్ అణ్వాయుధాలను పెంచుకుంటూ పోతే 2025 నాటికి అవి 200కు చేరే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 11న విడుదల చేసిన అటామిక్ సైంటిస్ట్స్ బులెటిన్‌‌లో అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే షార్ట్, లాంగ్ రేంజ్ క్షిపణుల(మిస్సైల్స్)ను దేశంలోని ఏయే ప్రాంతాల్లో భద్రపరిచారనే వివరాలు ఉన్నాయి.

అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలిగిన మిస్సైల్స్, అందుకోసం ఉపయోగించే మొబైల్ లాంచర్లను ఇస్లామాబాద్‌కు పశ్చిమం వైపున ఉన్న కాలా చిట్టా దహర్ పర్వత ప్రాంతంలోని నేషనల్ డిఫెన్స్ కాంప్లెక్స్‌లో అభివృద్ధి చేస్తున్నారు.

ఈ కాంప్లెక్స్ రెండు భాగాలుగా ఉన్నట్లు శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయి. పశ్చిమ ప్రాంతంలో మిస్సైల్స్, రాకెట్ ఇంజిన్లను అభివృద్ధి చేయడం, వాటిని ఉత్పత్తి చేయడంతోపాటు, పరీక్షిస్తున్నారు.

ఫతే జంగ్‌కి ఈశాన్యంగా రోడ్డు మార్గంలో వెళ్లే ట్రాన్స్‌పోర్టర్ ఎరెక్టర్ లాంచర్ల(టీఈఎల్‌) ఆధారాలను గుర్తించారు.

2023లో బయటికి వచ్చిన ఫోటో ప్రకారం, నాస్ర్, షాహీన్ -1 వంటి బాలిస్టిక్ మిస్సైల్స్ (ఖండాంతర క్షిపణులు)‌, బాబర్ క్రూయిజ్ మిస్సైల్‌‌ వంటి వాటిని లాంచ్ చేసేందుకు అవసరమైన ట్రాన్స్‌పోర్టర్ ఎరెక్టర్ లాంచర్స్(టీఈఎల్) ఛాసిస్‌లు ఇక్కడ ఉన్నాయి.

బాలిస్టిక్ మిస్సైల్స్

పాకిస్తాన్ వద్ద ప్రస్తుతం అణ్వాయుధ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణులు 6 ఉన్నాయి. తక్షణం ఉపయోగించేందుకు అవి సిద్ధంగా ఉన్నాయి.

వాటిలో షార్ట్ రేంజ్ అబ్దాలీ(హత్ఫ్-2), ఘాజ్నవి (హత్ఫ్-3), షాహీన్-I/A (హత్ఫ్-4), నస్ర్ (హత్ఫ్-9), మీడియం రేంజ్‌లో ఘౌరీ (హత్ఫ్-5), షాహీన్ -2 (హత్ఫ్-6) ఉన్నాయి.

అణ్వాయుధ సామర్థ్యం కలిగిన మరో రెండు బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నారు. అవి షాహీన్-3, మిర్వ్‌డ్ అబిల్.

అబ్దాలీ, ఘౌరీ, షాహీన్-2, అబాబిల్ మినహా అన్ని అణ్వాయుధ క్షిపణులను 2021లో జరిగిన పాకిస్తాన్ డే పరేడ్‌లో ప్రదర్శించింది.

నస్ర్, ఘౌరీ, షాహీన్ - 1A, బాబర్ - 1A, రాద్ - 2 మిస్సైల్స్‌ను 2022లో పరేడ్‌లో పాకిస్తాన్ ప్రదర్శించింది. గత రెండు దశాబ్దాలలో రోడ్డుపై నుంచి ప్రయోగించగలిగే బాలిస్టిక్ క్షిపణుల కోసం లాంచర్లను విస్తృత స్థాయిలో అభివృద్ధి చేసింది.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

న్యూక్లియర్ మిస్సైల్స్ ఎక్కడ ఉన్నాయ్?

పాకిస్తాన్‌‌లో 8 లేదా 9 న్యూక్లియర్ మిస్సైల్స్ స్థావరాలు ఉన్నాయని, వాటిలో బాబర్, ఘాజ్నవి, షాహీన్ -1, నస్ర్ వంటి షార్ట్ రేంజ్ మిస్సైల్స్‌ భద్రపరిచిన 4,5 స్థావరాలు భారత్ సరిహద్దుల్లో ఉన్నాయని అటామిక్ సైంటిస్ట్స్ బులెటిన్ పేర్కొంది. సరిహద్దుకు దగ్గర్లోనే ఆ స్థావరాలు ఉన్నాయని తెలిపింది.

దేశంలోని ఇతర ప్రాంతాల్లో 3, 4 స్థావరాలు ఉన్నాయని, అక్కడ మీడియం రేంజ్ మిస్సైల్స్ అయిన షాహీన్ -2, ఘౌరీ వంటి మిస్సైల్స్‌ ఉన్నాయి.

అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న మిస్సైల్స్‌ స్థావరాలు పాకిస్తాన్‌లో ఎన్ని ఉన్నాయో కచ్చితంగా చెప్పలేమని నివేదికలో పేర్కొన్నారు.

అయితే, అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న మిస్సైల్స్‌ కోసం కనీసం ఐదు స్థావరాలు ఉన్నాయని వాణిజ్య ఉపగ్రహాల (కమర్షియల్ శాటిలైట్స్) చిత్రాలు చూపిస్తున్నాయి.

అయినప్పటికీ, 2016 నుంచి ఇప్పటి వరకూ వీటి సంఖ్యలో పెద్దగా మార్పు లేదని నివేదిక చెబుతోంది.

ఈ ఐదు క్షిపణి స్థావరాల జాబితా ఇలా ఉంది.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, AFP

ఆక్రో మిలిటరీ బేస్

ఈ బేస్ సింధ్ ప్రావిన్స్‌లో ఉంది. పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌కు ఉత్తరంగా, భారత్ సరిహద్దుకు 145 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది.

ఇక్కడ ఆరు మిస్సైల్ గ్యారేజీలు ఉన్నాయి. వాటిని 12 లాంచర్ల కోసం నిర్మించారు.

2004 నుంచి ఈ బేస్ విస్తరణ కొనసాగుతోంది. వాహనాల రాకపోకలకు సంబంధించిన శాటిలైట్ చిత్రాల విశ్లేషణను బట్టి, అవి బాబర్ క్రూయిజ్ మిస్సైల్‌కి సంబంధించిన ఫైవ్ యాక్సిల్ (ఐదు యాక్సిల్స్) ట్రాన్స్‌పోర్టర్ ఎరెక్టర్ లాంచర్లుగా తెలుస్తోంది.

బాబర్ మిస్సైల్ రేంజ్ 450 కిలోమీటర్ల నుంచి 700 కిలోమీటర్లు. సముద్ర గర్భం నుంచి కూడా వాటిని ప్రయోగించేందుకు వీలుగా లాంచర్‌ను తయారుచేస్తోంది పాకిస్తాన్.

గుజ్రావాలా మిలిటరీ బేస్

పాకిస్తాన్ మిలిటరీకి చెందిన భారీ మిలిటరీ కాంప్లెక్స్ ఈ గుజ్రావాలా బేస్. ఇది పంజాబ్ ప్రావిన్స్‌కి ఈశాన్య దిశలో సుమారు 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ బేస్ ఉంటుంది.

అక్కడి నుంచి భారత్ సరిహద్దు 60 కిలోమీటర్లు.

శాటిలైట్‌ ఫోటోల్లో కనిపించిన మిస్సైల్ లాంచర్స్ షార్ట్ రేంజ్ మిస్సైల్స్ నస్ర్ కోసం ఉపయోగించేవిగా భావిస్తున్నారు.

నస్ర్ మిస్సైల్ రేంజ్ 60 కిలోమీటర్లు.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఖుజ్దార్

ఈ మిలిటరీ బేస్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని సకర్ పట్టణానికి పశ్చిమంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత్ సరిహద్దుకు దూరంగా ఉన్న స్థావరాల్లో ఇదొకటి.

ఇక్కడ ఆక్రో బేస్ తరహాలో అణ్వాయుధాలు భద్రపరిచేందుకు అండర్‌గ్రౌండ్‌లో గోడౌన్లు ఉన్నాయి.

ఇక్కడ ఘౌరి, షాహీన్ - 2 వంటి అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే మిస్సైల్స్ లాంచర్లు ఉన్నట్లుగా శాటిలైట్ చిత్రాలు చూపిస్తున్నాయి.

పానో అకిల్

భారత సరిహద్దు నుంచి 60 కిలోమీటర్ల దూరంలో, సింధ్ ప్రావిన్స్‌లో ఉన్న ఈ మిలిటరీ బేస్‌లో లాంచర్ల గ్యారేజీలు, ఇతర విభాగాలు కనిపించాయి.

బాబర్, షాహీన్ - 1 మిస్సైల్స్ కోసం ఉపయోగించేవిగా శాటిలైట్ చిత్రాలను బట్టి అర్థమవుతోంది.

సర్గోధా

1983 నుంచి 1990 మధ్య అణు కార్యక్రమాల కోసం కిరాణా హిల్స్‌లోని ఈ భారీ స్థావరాన్ని పాకిస్తాన్ ఉపయోగించింది.

అక్కడ 10 టీఈఎల్ గ్యారేజీలు, రెండు ఇతర గ్యారేజీలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ బేస్‌ను నిర్వహణ కోసం ఉపయోగిస్తున్నట్లు భావిస్తున్నారు.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

నేల పైనుంచి, సముద్రంలో నుంచి..

అమెరికన్ మిస్సైల్ టొమహాక్ లాంటిది బాబర్ (హత్ఫ్-7). ఇది సముద్రంలో నుంచి ప్రయోగించే క్రూయిజ్ మిస్సైల్.

భూ ఉపరితలం పైనుంచి ప్రయోగించే బాబర్-1 మిస్సైల్ రేంజ్ 600 నుంచి 700 కిలోమీటర్లు. అయితే, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వీటి రేంజ్‌ను 350 కిలోమీటర్లుగా అంచనా వేశాయి.

బాబర్-2 మిస్సైల్ రేంజ్ 700 కిలోమీటర్లని పాకిస్తాన్ పేర్కొంది. బాబర్-3 కూడా అదే రేంజ్. అయితే, దీనిని సముద్రంలో నుంచి ప్రయోగించేలా అభివృద్ధి చేశారు.

పాకిస్తాన్‌కి చెందిన మూడు సబ్‌మెరైన్లు (జలాంతర్గాములు) ఖాన్, పాండా, నారంగ్‌ నుంచి వీటిని ప్రయోగించొచ్చు.

కొత్త సబ్‌మెరైన్లను రంగంలోకి దించడంలో కొంత ఆలస్యం జరుగుతున్నప్పటికీ, వాటి నుంచి అణ్వాయుధ సామర్థ్యం కలిగిన బాబర్-3 క్షిపణులను ప్రయోగించే అవకాశం ఉంది.

వీటితో పాటు, బాబర్ క్రూయిజ్ మిస్సైల్‌ తరహాలోనే హర్బాను పాకిస్తాన్ రూపొందిస్తోంది. 2022లో యుద్ధ నౌకల్లో వీటిని మోహరించింది.

ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా లక్ష్యాన్ని ఛేదించగల మిస్సైల్‌గా హర్బాను పాక్ అధికార ప్రతినిధి అభివర్ణించారు. దీని పరిధి 290 కిలోమీటర్లు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)