మొఘల్ చక్రవర్తి అక్బర్‌పై బీజేపీ విధానం మారిందా, ప్రశంసల వెనక ఆంతర్యం అదేనా?

మొఘల్ సామ్రాజ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొఘల్ పాలకుల చరిత్రను బీజేపీ తొలగిస్తోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
    • రచయిత, దీపక్ మండల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జీ20 సదస్సు సందర్భంగా మోదీ ప్రభుత్వం ప్రచురించిన మ్యాగజైన్‌లో భారతదేశ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ప్రయాణాన్ని క్లుప్తంగా వివరించారు.

'ఇండియా: మదర్ ఆఫ్ డెమోక్రసీ' పేరిట ప్రచురితమైన ఈ మ్యాగజైన్‌లో భారతదేశ ప్రాచీన నాగరికత, ప్రజాస్వామ్య సంప్రదాయాలు, మతాలు, సాధువులు, విశ్వాసాలు, గొప్ప వ్యక్తులు, పాలకుల గురించి ప్రభుత్వం ప్రస్తావించారు.

రామాయణం, రాముడు, మగధ సామ్రాజ్యాధినేత అజాతశత్రువు, మొఘల్ చక్రవర్తులు, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ భారతదేశ ప్రధాన మంత్రులందరి ప్రస్తావన అందులో ఉంది.

అందులో మొఘల్ చక్రవర్తి అక్బర్‌ గురించి పరిచయం చేస్తూ ఆయన ప్రజాస్వామ్య ఆలోచనలు ఇతరులకు భిన్నంగా ఉండేవని, ఆధునిక యుగానికి దగ్గరగా ఆయన ఆలోచనలు ఉండేవని అందులో రాశారు.

''పరిపాలనకు మతంతో సంబంధం ఉండకూడదు, అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి'' అని ఈ మ్యాగజైన్‌లో అక్బర్ గురించి రాశారు. మూడవ మొఘల్ చక్రవర్తి అక్బర్ ఇలాంటి ప్రజాస్వామ్య విధానాలనే అనుసరించారు. ఆయన ప్రపంచ శాంతి కోసం సుల్హ్-ఇ-కుల్ సూత్రాన్ని ప్రతిపాదించారు. ఇది మతవివక్షకు వ్యతిరేకంగా రూపొందించిన సూత్రం.

అక్బర్ దాతృత్వం, మత సహనం, ఆయన పాలనలో ప్రజాస్వామ్య స్వభావం గురించి మ్యాగజైన్‌లో రాసిన విషయాలపై చాలా చర్చ జరుగుతోంది.

మొఘల్ సామ్రాజ్యం

ఫొటో సోర్స్, Getty Images

మ్యాగజైన్‌లో ఏముంది?

జీ20 సదస్సు సందర్భంగా విడుదల చేసిన మ్యాగజైన్‌లో అక్బర్‌‌ను ప్రజాస్వామ్యవాది, సహనశీలి, మతవివక్షను వ్యతిరేకించిన చక్రవర్తిగా వివరించారు.

అక్బర్ సహా మొఘల్ పాలకులపై బీజేపీ నేతలు ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉండేవారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం అక్బర్ గురించి మ్యాగజైన్‌లో ఇలా ప్రస్తావించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

దీని ద్వారా ప్రభుత్వం ఏదైనా రాజకీయ సందేశం ఇవ్వాలని అనుకుంటోందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

''ఎన్నికలు దగ్గరకి వస్తున్నాయి. అందుకే మైనార్టీలకు సందేశం ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అది కూడా ప్రపంచ నేతల ముందు. అందువల్ల అక్బర్‌ను శాంతికాముకుడిగా, ప్రజాస్వామ్యవాదిగా అభివర్ణిస్తోంది. ఇస్లాం ప్రధాన మతంగా ఉన్న తుర్కియే సహా చాలా ఆఫ్రికన్ దేశాలు జీ20 సదస్సుకు విచ్చేశాయి. అందుకే మ్యాగజైన్‌లో ముస్లిం చక్రవర్తిపై ప్రశంసలు చేసి ఉండొచ్చు'' అని సీనియర్ జర్నలిస్ట్ శరద్ గుప్తా అభిప్రాయపడ్డారు.

గత కొన్నేళ్లుగా బీజేపీ నుంచి భారత పార్లమెంట్‌కు ఎన్నికైన ముస్లిం ప్రజాప్రతినిధులు లేరు.

అందువల్ల, ముస్లింలను విస్మరించడం లేదని అంతర్జాతీయ సమాజానికి చాటిచెప్పేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందా?

జీ20 మ్యాగజైన్‌లో అక్బర్‌‌ను గొప్ప మానవతావాదిగా ప్రశంసించడం ఈ వ్యూహంలో భాగమేనా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

''బీజేపీ నుంచి రాజ్యసభలో కానీ, లోక్‌సభలో కానీ ముస్లిం ప్రజాప్రతినిధులు లేరు. వచ్చే ఎన్నికల్లోనూ ఆ పార్టీ ముస్లింలకు టికెట్లు ఇవ్వకపోవచ్చు. కానీ, జీ20 సదస్సు ఒక అంతర్జాతీయ వేదిక. కాబట్టి అక్కడ అందరినీ కలుపుకుపోతున్నామన్న భావన కల్పించాల్సిన అవసరం ఉంది'' అని శరద్ గుప్తా అన్నారు.

''బీజేపీ ప్రభుత్వం మైనార్టీలను గౌరవించడం లేదని, వారికి సరైన స్థానం కల్పించడం లేదని అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొంటోంది. అందువల్ల జీ20 మ్యాగజైన్‌లో అక్బర్‌ను ప్రశంసించడం ద్వారా అంతర్జాతీయ సమాజం అనుకుంటున్నట్టుగా ఇక్కడ ఏమీ లేదని చూపించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నించింది'' అని ఆయన చెప్పారు.

మొఘల్ సామ్రాజ్యం

ఫొటో సోర్స్, ALEPH

అక్బర్‌కి మినహాయింపా?

ప్రముఖ రచయిత్రి పార్వతి శర్మ 'అక్బర్ ఆఫ్ హిందుస్థాన్' అనే పుస్తకాన్ని రచించారు. అక్బర్‌లోని అన్ని పార్శ్వాలనూ అందులో ఆమె ప్రస్తావించారు.

ఈ నేపథ్యంలో, జీ20 మ్యాగజైన్‌లో అక్బర్‌‌ను ప్రశంసించడాన్ని మీరెలా చూస్తారని బీబీసీ హిందీ ఆమెను సంప్రదించింది.

అందుకు ఆమె బదులిస్తూ ''ముస్లిం లేదా మొఘల్ చక్రవర్తులను విదేశాల నుంచి దండయాత్రలు చేసి వచ్చిన పాలకులగానూ, వారు భారతీయ సమాజానికి చేసింది ఏమీ లేదన్నట్టుగానే బీజేపీ చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జీ20 మ్యాగజైన్‌లో అక్బర్‌ను ప్రశంసించడం కచ్చితంగా వారి భావాలకు విరుద్ధమే'' అని ఆమె అన్నారు.

ప్రాచీన కాలం నుంచి భారతీయ సమాజంలో ప్రజాస్వామ్య విలువల గురించి వివరించేందుకు ఇతర ఉదాహరణలను ప్రస్తావించొచ్చు.

కానీ, ప్రజాస్వామ్య విలువల గురించి చెప్పేందుకు అక్బర్‌నే ఎందుకు ఉదాహరణగా ప్రస్తావించారు?

"ఈ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపై లౌకికవాద ప్రభుత్వంగా, వైవిధ్యాలను గౌరవించేదిగా, అందరినీ కలుపుకుని పోయే ప్రభుత్వంగా తనను తాను చూపించుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. ప్రధాన మంత్రి, లేదంటే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ అధికారి అయినా దీనినే భారతదేశ విశిష్టతగా చెబుతారు. అందరి మద్దతు, అందరి అభివృద్ధి గురించి ఆయన మాట్లాడుతుంటారు.

భారతదేశ వైవిధ్యమే దాని బలం. భిన్నత్వంలో ఏకత్వమనేది మన ప్రత్యేకత అన్నది నిజం. కానీ, ఈ విషయాలను కేవలం అంతర్జాతీయ వేదికలపై మాత్రమే చెబుతున్నారు. దేశీయంగా మాత్రం బీజేపీ విధానాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటాయి'' అని పార్వతి శర్మ చెప్పారు.

''మిగిలిన చక్రవర్తులతో పోలిస్తే అక్బర్‌‌ని మినహాయింపుగా చూస్తారు. చారిత్రక గ్రంథాల్లోనూ, సామాన్యుల ఆలోచనల్లోనూ 'మతోన్మాద' ముస్లిం చక్రవర్తులకు ఆయన మినహాయింపు" అని ఆమె అన్నారు.

మ్యాగజైన్‌లో అక్బర్ అనుసరించిన "ప్రజాస్వామ్య విధానాలు'' మిగిలిన వాటితో పోలిస్తే భిన్నంగా ఉండేవని వివరించారని, ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ వైఖరిలో ఇది అసాధారణంగానే అనిపిస్తోందన్నారు.

మొఘల్ సామ్రాజ్యం

ఫొటో సోర్స్, GETTY IMAGES

సుల్హ్-ఇ-కుల్ అంటే ఏంటి?

''అక్బర్ 50 ఏళ్లపాటు పరిపాలించారు. ఆయన ఆలోచనలు, అనుసరించి విధానాలు, పరిపాలనా శైలి క్రమంగా అందరినీ కలుపుకుని పోయాయి. అన్ని వర్గాల ప్రజలు తమకు అవసరమని వారు నెమ్మదిగా అర్థం చేసుకున్నారు. తన సామ్రాజ్యంలోని అన్ని మతాలు, జాతులను ప్రజలను కలుపుకు పోయేందుకు ప్రయత్నించారు. అందువల్ల, మతపరమైన సహజీవనం, శాంతి అనే సుల్ - ఇ - కుల్ ఆలోచన ఒక్క రోజులో పుట్టలేదు.

అందుకే అక్బర్ ప్రార్థనా మందిరాలకు సంబంధించిన చర్చలు జరిపించారు. వాటిలో పాల్గొనేందుకు అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానించారు. అక్కడ వాటిపై చర్చలు నిర్వహించారు'' అని పార్వతి శర్మ చెప్పారు.

మొఘల్ సామ్రాజ్యం

ఫొటో సోర్స్, Getty Images

మొఘల్‌కి వ్యతిరేకంగా బీజేపీ నేతల ప్రకటనలు

మ్యాగజైన్‌లో అక్బర్ విధానాలను ప్రశంసించినప్పటికీ, మొఘల్ పాలకులపై బీజేపీ నేతలు నిరంతరాయంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు.

''మనకు ఉనికి లేకుండా చేసేందుకు ఆంక్షలు విధించినప్పుడు, మన విశ్వాసాలపై దాడి జరుగుతున్నప్పుడు సంత్ రవిదాస్ గట్టిగా నిలబడ్డారు'' అని గత నెలలో మధ్యప్రదేశ్‌లో జరిగిన సంత్ రవిదాస్ ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

''అవి మొఘల్ ఆధిపత్యం కొనసాగుతున్న రోజులు. ఒకరికి లొంగిపోవడమే అతిపెద్ద పాపం. అలా చేసిన వారు ఎవరి గౌరవాన్ని పొందలేరు'' అన్నారు.

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో గత జూన్‌లో మతపరమైన హింస చెలరేగినప్పుడు తాను ఔరంగజేబ్ వారసుడినంటూ ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ చేసిన ప్రకటన వివాదాస్పదమైంది.

అలాగే, చరిత్రకారులు మహారాణా ప్రతాప్ సింగ్‌కి అన్యాయం చేశారని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అక్బర్‌ను గొప్పవాడని కీర్తిస్తారు, కానీ మహారాణా ప్రతాప్‌ని ఎందుకు అనలేదని ఆయన ప్రశ్నించారు.

అక్బర్ ఆక్రమణదారుడని, అసలు హీరో మహారాణా ప్రతాప్ అని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక సందర్భంలో అన్నారు. ఈ సత్యాన్ని యువత ఎంత త్వరగా అర్థం చేసుకుంటుందో, చాలా సమస్యల నుంచి దేశం అంత త్వరగా బయటపడుతుందని ఆయన అన్నారు.

2020లో తాజ్‌మహల్‌కి సమీపంలో నిర్మిస్తున్న మొఘల్ మ్యూజియం పేరును ఛత్రపతి శివాజీ మ్యూజియంగా మారుస్తూ 2020లో యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు కూడా ఇచ్చారు. మొఘలులు మన హీరోలు ఎలా అవుతారు? శివాజీ పేరు చెబితో ప్రజల్లో దేశభక్తి, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని ఆయన అన్నారు.

అక్బర్, ఔరంగజేబ్ దేశద్రోహులని, చరిత్ర పుస్తకాల నుంచి వారి పేర్లను తొలగించాలని 2017లో యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ డిమాండ్ చేశారు.

దిల్లీలోని అక్బర్ రోడ్డుకు మహారాణా ప్రతాప్ పేరు పెట్టాలని కేంద్ర మంత్రి వీకే సింగ్ ఒకసారి డిమాండ్ చేశారు. గతంలో ఔరంగజేబ్ రోడ్డును అబ్దుల్ కలాం రోడ్డుగా పేరు మార్చారు.

మొఘల్ సామ్రాజ్యం

ఫొటో సోర్స్, NCERT

చరిత్ర పుస్తకాల నుంచి మొఘలుల పాఠ్యాంశాల తొలగింపు

2023 ఏప్రిల్‌లో 12వ తరగతి చరిత్ర పుస్తకాల నుంచి మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన పాఠ్యాంశాలను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) తొలగించింది.

12వ తరగతి చరిత్ర పుస్తకాన్ని 'థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ' పేరుతో మూడు భాగాలుగా ఎన్‌సీఈఆర్‌టీ ప్రచురించింది.

రెండవ భాగంలోని 9 వ పాఠ్యాంశం 'కింగ్స్ అండ్ హిస్టరీ, మొఘల్ కోర్టు'ను పుస్తకం నుంచి తొలగించారు.

మొఘల్ పాలనకు సంబంధించిన ఈ 28 పేజీల అధ్యాయం ఎన్‌సీఈఆర్‌టీ వెబ్‌‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉన్న చరిత్ర పుస్తకాల్లో లేదు.

ముస్లిం పాలకులను పాఠ్యాంశాల నుంచి తొలగిస్తూ ఎన్‌సీఈఆర్‌టీ తీసుకున్న ఈ చర్యలు భారత చరిత్ర నుంచి మొఘలులను తొలగించే ప్రయత్నంగా పరిగణిస్తున్నారు.

అయితే, విద్యార్థులపై సిలబస్ భారం తగ్గించేందుకే ఆయా పాఠ్యాంశాలను తొలగించినట్లు ఎన్‌సీఈఆర్‌టీ చెబుతోంది.

''మొఘలుల చరిత్రను తొలగించలేదని, విద్యార్థులపై భారాన్ని తగ్గించేందుకు సిలబస్‌లోని కొన్ని భాగాలను తొలగించాం'' అని ఎన్‌సీఈఆర్‌టీ చీఫ్ దినేశ్ సక్లానీ సమర్థించుకున్నారు.

అయితే, ఎన్‌సీఈఆర్‌టీ అందుబాటులోకి తెచ్చిన కొత్త చరిత్ర పుస్తకాల్లో ఈ 28 పేజీల అధ్యాయం లేదు.

వీడియో క్యాప్షన్, జహంగీర్ నుంచి నిజాం రాజుల దగ్గరికి వచ్చిన 12 కేజీల భారీ బంగారు నాణెం ఇప్పుడు ఎక్కడుంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)