సముద్రంలో మునిగిన ఓడలో అట్టడుగున 60 గంటలు ఎలా బతికాడు... చివరికి ఏమైంది?

హారిసన్ ఒకేన్

ఫొటో సోర్స్, DCN GLOBAL

ఫొటో క్యాప్షన్, సముద్రం అడుగున మునిగిన బోటులో హారిసన్ మూడు రోజులు గడిపారు

హారిసన్ ఒకేన్, తాను ప్రయాణిస్తోన్న నౌక మునిగిపోవడం మొదలైన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేరు.

ఈ ఘటన జరిగినప్పుడు ఆయన వయస్సు 29 ఏళ్లు. నైజీరియన్ అయిన హారిసన్, జాస్కన్-4 అనే ఒక టగ్‌బోట్‌లో వంటమనిషిగా పనిచేసేవారు. జాస్కన్ -4 బోట్, నైజీరియా తీరానికి 32 కి.మీ దూరంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఏదో లోపం కారణంగా బోల్తా పడింది.

‘‘ఓడ ఎడమవైపుకు ఒరిగినప్పుడు, నేను బాత్రూంలోకి వెళ్లి తలుపు మూసేసి టాయ్‌లెట్ మీద కూర్చున్నా’’ అని బీబీసీ రేడియో ప్రోగ్రామ్ అవుట్‌లుక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.

ఓడ మునగడం చాలా వేగంగా జరిగిపోయింది. దీంతో ఓడలో ఉన్న 13 మంది సిబ్బందిలో ఎవరూ కూడా డెక్ మీదకు చేరుకోలేకపోయారు. క్షణాల్లోనే ఓడ మొత్తం నీళ్లతో నిండిపోయింది.

‘‘లైట్లు ఆరిపోయాయి. అందరూ అరవడం నాకు వినిపించింది. నేను ఎలాగోలా బాత్రూం తలుపు తెరిచి బయటకు రాగలిగాను. కానీ, నాకు అక్కడ ఎవరూ కనిపించలేదు. నీళ్లు బలంగా నన్ను ఓడలోకి ఒక క్యాబిన్‌లోకి నెట్టేశాయి. నేను అక్కడే చిక్కుకుపోయాను’’ అని హారిసన్ చెప్పారు.

నీళ్లు అలా నెట్టేయడం కూడా ఆయనకు అదృష్టంగా మారింది. ఓడలోని ఒక గాలి బుడగలోకి నీళ్లు ఆయన్ను నెట్టేశాయి. దీంతో ఆయన ఎవరూ ఊహించలేని ఘనతను సాధించారు. అదేంటంటే, సముద్రం అడుగులో దాదాపు 3 రోజుల పాటు ప్రాణాలతో ఉండగలగడం.

2013 మే 26న జరిగిన ఈ ప్రమాదంలో ఓడలోని మిగతా సిబ్బంది మొత్తం చనిపోయారు.

హారిసన్

ఫొటో సోర్స్, DCN GLOBAL

ఫొటో క్యాప్షన్, 2013 మే నెలలో హారిసన్‌ను డైవర్లు రక్షించారు

అనుభవలేమి

జాస్కన్-4లోని తోటి సిబ్బంది తరహాలో హారిసన్‌కు ఓడ ప్రయాణంలో పెద్దగా అనుభవం కూడా లేదు.

తనకు జాస్కన్‌లో ఉద్యోగం వచ్చేంతవరకు తానెప్పుడూ ఓడలో అడుగు కూడా పెట్టలేదని బీబీసీతో హారిసన్ చెప్పారు.

హారిసన్ అంతకుముందు ఒక హోటల్‌లో హెడ్ చెఫ్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు.

ఓడలో చెఫ్‌గా పనిచేస్తే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆలోచనతో ఆయన ఉద్యోగం మారారు.

‘‘నీళ్లంటే నాకు ఇష్టమున్నప్పటికీ, ఓడలోకి ఎక్కిన మొదటి క్షణం నుంచి నాకు కళ్లు తిరగడం మొదలైంది. వాంతులు అయ్యాయి. మూడు రోజుల పాటు ఒంట్లో ఓపిక లేదు. అయినప్పటికీ వంట చేస్తూనే ఉన్నాను. మూడు రోజుల తర్వాత అంతా సర్దుకుంది. తర్వాత నేనెప్పుడూ సముద్ర ప్రయాణంతో ఇబ్బంది పడలేదు’’ అని ఆయన తెలిపారు.

హోటల్లో వందల మందికి వంట చేయాల్సి వచ్చేదని, ఓడలో కేవలం 12 మందికి మాత్రమే వంట చేయాల్సి ఉండటంతో ఆ ఉద్యోగం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని ఆయన చెప్పారు.

అనుభవం లేకపోయినా, సముద్రం మీద ఓడలో జీవించడానికి హారిసన్ భయపడలేదు.

‘‘అక్కడి వాతావరణం నచ్చడంతో నాకు ఓడలో ఉండటం సంతోషంగా అనిపించింది. అక్కడ చాలా ప్రశాంతంగా, నిశ్శబ్ధంగా ఉంటుంది’’ అని ఆయన చెప్పారు.

నీళ్లలో ఓడ అటూ ఇటూ కదులతున్నప్పుడు గిన్నెలు, కుండలు కింద పడిపోకుండా వాటన్నింటినీ తాళ్లతో కట్టడం అలవాటు చేసుకున్నారు.

ఓడ మునిగిపోతుందనే పీడ కల కూడా ఆయన్ను భయపెట్టలేకపోయింది.

‘‘నిద్రలేవగానే ఆ కలను తల్చుకొని నేను నవ్వాను. ఓడ మునిగి నేను చనిపోవడం నిజం కాదన్నమాట అని అనుకున్నా’’ అని హారిసన్ అన్నారు.

జాస్కన్ 4
ఫొటో క్యాప్షన్, ఎయిర్ పాకెట్ ప్రదేశంలోనే హారిసన్ చిక్కుకుపోయి ప్రాణాలతో బయటపడగలిగారు

జాస్కన్-4 మునక

2013 మే నెలలో జాస్కన్-4లో హారిసన్ పని చేయడం మొదలుపెట్టారు. ఓడ గురించి ఆయనకు తెలియనప్పటికీ, అందులోని ఇతర సిబ్బందితో హారిసన్‌కు స్నేహం ఉంది.

‘‘మేం స్నేహితులం. చాలా సన్నిహిత స్నేహితులం. వారంతా నన్ను తల్లిలా భావించేవారు. వారి బాధలు, ఆలోచనలు నాతో పంచుకునేవారు. వారికి సహాయం చేయడానికి నాకు తోచిన సలహాలు నేను ఇచ్చేవాడిని’’ అని హారిసన్ చెప్పారు.

మే 25న తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అప్పుడు ఒక ఆయిల్ ట్యాంకర్‌ను టగ్‌బోట్‌లోకి ఎక్కించేందుకు చాలా కష్టపడ్డారు.

ఎప్పటిలాగే ఉదయం నిద్రలేచిన హారిసన్ అందరికీ వంట చేసేందుకు ఓడలోని కిచెన్‌లోకి వెళ్లారు. అప్పుడే అంతా ఒక్కసారిగా మారిపోయింది.

ఓడ మునిగిపోయినప్పుడు కలిగిన అనుభూతి ఆయనకు ఇంకా గుర్తుంది.

‘‘అది చాలా త్వరగా పడిపోతోంది. నాకు చాలా భయం వేసింది. అందులోని వారంతా అరుస్తున్నారు, ఏడుస్తున్నారు. అప్పడు సమయం తెల్లవారుజామున 4:50 గంటలు అవుతుంది. నా సహచరుల్లో కొంతమంది ఇంకా పడుకునే ఉన్నారు. సహాయం కోసం కొందరు అరుస్తున్నారు. ఓడలోని కొత్త ప్రదేశాల్లోకి నీళ్లు వెళ్లినప్పుడు అక్కడ గాలి బుడగల శబ్ధం రావడం, తర్వాత కాసేటికే నిశ్శబ్ధంగా మారడం నేను విన్నాను’’ అని హారిసన్ గుర్తుచేసుకున్నారు.

ఉపరితలానికి 30 మీటర్ల లోతులోని సముద్రపు అడుగుకు ఓడ పడిపోయిప్పుడు అందులో హారిసన్ మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. ఓడలోని ఒక చిన్న ప్రదేశంలో ఆయన చిక్కుకున్నారు. ఆయన నడుం వరకు నీళ్లు ఉన్నాయి. అక్కడంతా చాలా చల్లగా, చీకటిగా ఉంది.

ఎవరైనా వచ్చి తనను రక్షిస్తారేమో అని ఆయన అనుకున్నారు. కానీ, రెండు రోజులు గడిచినా ఎవరూ రాలేదు.

లైఫ్ జాకెట్‌కు కట్టి ఉన్న ఫ్లాష్‌లైట్‌ ఆయన కంటబడింది. దాన్ని తీసుకొని అక్కడి నుంచి బయటపడే దారి కోసం నీటిలో ఈదుతూ వెదికారు. కానీ, ఆయన దారిని కనుగొనలేకపోయారు. తర్వాత ఫ్లాష్‌లైట్ కూడా పని చేయకపోవడంతో ఆయన పూర్తిగా చీకట్లోనే ఉండిపోయారు.

ఓడ మునుగుతున్న సమయంలో తనకు తగిలిన గాయాల మీద చర్మాన్ని నీటిలోని చేపలు తినడాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను కేవలం బాక్సర్ మాత్రమే ధరించి ఉన్నట్లు చెప్పారు.

‘‘నా భార్య, తల్లి నాకు గుర్తుకొచ్చారు. ప్రార్థనా గీతాలు పాడుతూ సమయం గడిపాను’’ అని హారిసన్ తెలిపారు.

60 గంటలు అలాగే నీటిలో గడిచిపోయాయి. ఆహారం, నీరు లేకుండా గడిపారు. గాలి బుడగలోని ఆక్సీజన్‌తో ఆయన బతకగలిగారు.

హారిసన్

ఫొటో సోర్స్, DCN GLOBAL

ఫొటో క్యాప్షన్, భయపడిన తర్వాత హారిసన్ చేతిని నికోలస్ పట్టుకోవడం అండర్‌వాటర్ కెమెరాలో నిక్షిప్తం అయింది

భయంతో వణికిపోయిన డైవర్

మరోవైపు, కుటుంబాలకు ఓడలోని సిబ్బంది అందరూ మరణించారని సమాచారం అందింది. మృతదేహాలను వెలికి తీసేందుకు జాస్కన్-4 యాజమాన్య కంపెనీ ‘వెస్ట్ ఆఫ్రికన్ వెంచర్స్’ నిపుణులను నియమించింది.

డచ్ డ్రైవింగ్ కంపెనీ ‘డీసీఎస్ గ్లోబల్’కు చెందిన వ్యక్తికి ఈ బాధ్యతలను అప్పగించింది.

డీసీఎన్ గ్లోబల్ కంపెనీ ముగ్గురు డైవర్లను మునిగిపోయిన ఓడ వద్దకు పంపింది. డైవర్ల పనిని సముద్ర ఉపరితలం నుంచి కెమెరా ద్వారా సూపర్ వైజర్ సమన్వయం చేసుకుంటారు.

ఒక ప్రెజరైజ్డ్ చాంబర్‌లో డైవర్లను సముద్రపు అడుగుకు తీసుకెళ్లారు.

డైవర్లు ఓడ తలుపులను బద్ధలు కొట్టడాన్ని హారిసన్ విన్నారు. వెంటనే వారికి వినిపించేలా ఆయన ఉన్న క్యాబిన్ గోడలను బాదడం మొదలుపెట్టారు.

‘‘నేను చాలా నిస్సహాయంగా ఉన్నా. ఆ ఎయిర్ బబుల్‌లోని ఆక్సీజన్ దాదాపు అంతా అయిపోయింది. నాకు శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది’’ అని హారిసన్ చెప్పారు.

మొదటగా నీళ్లలో ఫ్లాష్‌లైట్ ప్రతిబింబాన్ని హారిసన్ చూశారు. ‘‘ఆ ఫ్లాష్‌లైట్ వెలుతురు ఎక్కడ నుంచి వస్తుందో తెలుసుకోవడం కోసం నీళ్లలో నేను ఈదుతూ వెళ్లాను. అక్కడే నాకు నీటి బుడగలు కనిపించడంతో డైవర్లు వచ్చి ఉంటారని నేను ఊహించాను’’ అని హారిసన్ అన్నారు.

మృతదేహాలను వెలికి తీయడానికి వెళ్లిన డైవర్లలో నికోలస్ వాస్ హీర్డెన్ ఒకరు. బీబీసీతో ఆయన మాట్లాడుతూ, ఓడలో తనను ఎవరో పట్టుకున్నట్లు అనిపించిన క్షణం తన జీవితంలోనే అత్యంత భయంకరమైనదని చెప్పారు. ప్రాణాలతో ఉన్న హారిసన్‌ను చూడగానే భయంకరమైన ఆ క్షణం కాస్తా సంతోషంగా మారిపోయిందని నికోలస్ చెప్పారు.

హారిసన్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, రెస్క్యూ తర్వాత హారిసన్ మీడియాలో సెలెబ్రిటిగా మారారు

‘‘నేను నికోలస్‌ను ఒకసారి పట్టుకొని పక్కకు జరగాలని అనుకున్నా. ఎందుకంటే ఆయన భయపడతారని నాకు తెలుసు. భయంతో నాపై దాడి చేస్తారేమో అని పక్కకు జరిగాను’’ అని హారిసన్ తెలిపారు.

రెస్క్యూ ఆపరేషన్ ఆరంభంలోనే హారిసన్‌ను ప్రాణాలతో గుర్తించామని నికోలస్ చెప్పారు.

వెంటనే హారిసన్‌కు డైవింగ్ సూట్ అమర్చి, దాన్ని ఎలా వాడాలో వివరించి ఆయనను నెమ్మదిగా మునిగిపోయిన ఓడ నుంచి బయటకు నడిపించారు.

‘‘అంతా బురదతో నిండిపోయింది. అక్కడ ఏమీ కనిపించలేదు’’ అని హారిసన్ చెప్పారు.

ప్రైజరైజ్డ్ చాంబర్‌లోకి వచ్చాక తాను మాత్రమే ప్రాణాలతో ఉన్నానని, మిగతా వారంతా చనిపోయారని తెలుసుకున్న హారిసన్ వెక్కి వెక్కి ఏడ్వటం ప్రారంభించారు.

సముద్రం అడుగున మూడు రోజులు ఉన్న తర్వాత, శరీరంలోని నైట్రోజన్ స్థాయిలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఓడలోని డీకంప్రెషన్ చాంబర్‌లో హారిసన్ మరో మూడు రోజులు ఉండాల్సి వచ్చింది.

ఈలోగా, హ్యారిసన్ బతికే ఉన్నట్లు ఆయన కుటుంబీకులకు చెప్పారు.

మూడ్రోజుల తర్వాత, హెలికాప్టర్‌లో ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అన్ని పరీక్షలు చేశాక ఇంటికెళ్లేందుకు ఆయనకు అనుమతించారు.

ఇంట్లోని సభ్యులతో పాటు, దాదాపు 3 రోజులు సముద్రంలో ప్రాణాలతో బతికి బయటపడ్డాడనే విషయం తెలిసి చాలా మంది ఆయనను చూడటానికి వచ్చారు.

తర్వాత, ఆయన అసాధారణ కథ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసింది.

ప్రమాదం జరిగిన తర్వాత మళ్లీ తానెప్పుడూ నీళ్ల జోలికి వెళ్లనని హారిసన్ ప్రమాణం చేశారు. కానీ, కొంతకాలం తర్వాత ఆయన కారు వంతెన మీద నుంచి సరస్సులో పడిపోయింది. హారిసన్ మళ్లీ ప్రాణాలతో బయటకు రావడమే కాకుండా, ఇతర ప్రయాణీకులను కూడా రక్షించగలిగారు. దాంతో ఆయనొక ఊహించని నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ఆయన ఒక ప్రొఫెషనల్ డైవర్‌గా మారారు.

‘‘ఇది నా విధి. భగవంతుడు నా విషయంలో ఇలాగే జరగాలని అనుకున్నాడు’’ అని హారిసన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)