భర్తను చంపి మురికి నీటి ట్యాంకులో పడేసిన భార్య... తొమ్మిదేళ్ల తర్వాత ఎలా పట్టుబడిందంటే?

పాండ్యన్, సుకాంతి
ఫొటో క్యాప్షన్, శివగంగ జిల్లాలో ఓ ఇంటి మురుగునీటి ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా పుర్రె బయటపడింది
    • రచయిత, తంగదురై కుమారపాండ్యన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మురికినీటి ట్యాంకులో తొమ్మిదేళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఒక వ్యక్తి పుర్రె దొరకడం తమిళనాడులోని శివగంగ జిల్లాలో కలకలం సృష్టించింది.

ఈ అలజడి తగ్గకముందే, 24 గంటల్లోనే పోలీసులు ఆ వ్యక్తి మరణానికి కారణమైన మహిళను గుర్తించారు.

మృతదేహాన్ని మురుగునీటి ట్యాంక్‌లో పడేసిన ఆ మహిళ తొమ్మిదేళ్లుగా అదే ఏరియాలో నివసిస్తుండటం మరో షాకింగ్ విషయం.

దేవకొట్టై ఏరియా గంబర్ వీధిలోని ఒక ఇంటి యజమాని మురుగునీటి ట్యాంకును శుభ్రపరిచేందుకు కొంతమందిని పిలిచారు. మురుగునీటిని తీసే వాహనం సహాయంతో ట్యాంకును ఖాళీ చేస్తుండగా, వారికి ట్యాంకులో పుర్రె తేలుతూ కనిపించింది.

ఇంటి యజమాని వెంటనే మురుగునీటిని బయటకు తీసే పనిని నిలిపేసి, ఈ సమాచారాన్ని దేవకోట నగర్ పోలీసులకు చెప్పారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఇన్‌స్పెక్టర్ శరవణన్ ఆధ్వర్యంలో మురుగునీటి ట్యాంకులో తనిఖీలు చేపట్టారు.

పోలీసులు వచ్చాక, అప్పటివరకు తీసిన మురుగు నీటిని కూడా లారీ నుంచి బయటకు పారబోయడంతో మరిన్ని ఆధారాలు బయటపడ్డాయి.

మురికి నీటి ట్యాంక్ నుంచి మనిషి పుర్రెతో పాటు కొన్ని ఎముకలు లభ్యమయ్యాయి. అంతేకాకుండా చొక్కా, చేతికి కట్టిన తాళ్లు కూడా దొరికాయి.

ఈ ఆధారాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పరీక్షల నిమిత్తం వాటిని భద్రపరిచారు.

పాండ్యన్

పుర్రెతో తనకు ఎలాంటి సంబంధం లేదని యజమాని చెప్పడంతో, ఇరుగుపొరుగు వారిని కూడా పోలీసులు విచారించడం మొదలుపెట్టారు.

ఆ ఇంట్లో ఎనిమిదేళ్ల క్రితం ఒక మహిళ నివసించేవారని పోలీసులకు తెలిసింది. ఆమె ఇరుగుపొరుగుతో ఒకసారి తన భర్త విదేశాలకు వెళ్లాడని చెప్పారు.

కానీ, విదేశాల నుంచి ఆయనెప్పుడూ తిరిగి రాలేదని, విదేశాలకు వెళ్లిన తర్వాత ఆయన్ను ఎవరూ చూడలేదని పోలీసులకు సమాచారం అందింది.

ఇది తెలుసుకున్న పోలీసులు, సదరు మహిళ కోసం వెదకడం మొదలుపెట్టారు.

ఆ మహిళ అదే ఏరియాలో ఉంటున్నట్లు గుర్తించి ఆమెను విచారించడం ప్రారంభించారు.

ఆ మహిళ పేరు సుకాంతి. మొదట ఆమె ఇరుగుపొరుగు వారు చెప్పిన భర్త విదేశాలకు వెళ్లడం అనే కథనే పోలీసులకు చెప్పారు.

తర్వాత, కోయంబత్తూరులో తన భర్త వేరే మహిళతో కలిసి ఉంటున్నారని, తనకు ఖర్చుల నిమిత్తం అప్పుడప్పుడు డబ్బులు పంపిస్తారని అన్నారు.

కానీ, పోలీసులు ఆమె చెప్పిన విషయాలు నమ్మలేదు. సుకాంతి చెప్పిన వివరాలపై విచారణను మరింత తీవ్రం చేశారు. అప్పుడు, పోలీసులకు సుకాంతి కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించారు.

పాండ్యన్ చెల్లెలు సుధ
ఫొటో క్యాప్షన్, లావుగా ఉండే తన అన్నను ఒక్కరే ట్యాంకులో వేసే అవకాశం లేదని మృతుడు పాండ్యన్ చెల్లెలు సుధ అనుమానం వ్యక్తం చేశారు

మురికినీటి ట్యాంకులో దొరికిన పుర్రె తన భర్తదే అని ఆమె ఒప్పుకున్నారు. ఆ ఎముకలు, చొక్కా, చేతికి కట్టిన తాళ్లు కూడా తన భర్త మృతదేహానివే అని చెప్పారు.

భర్త మృతదేహాన్ని తానే మురికినీటి ట్యాంకులో పడేసినట్లు సుకాంతి అంగీకరించారు.

ఆమె భర్త మరణించిన రోజు అసలేం జరిగిందో పోలీసులు తెలుసుకున్నారు.

ఈ కేసు గురించి మృతుడు పాండ్యన్ చెల్లెలు సుధతో బీబీసీ మాట్లాడింది.

‘‘మా అన్నను మేం చూసి 8 ఏళ్లకు పైగా గడిచింది. అప్పటినుంచి ఆయన కనిపించట్లేదు. ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆరు నెలల తర్వాత, దేవకోట పోలీస్ స్టేషన్‌లో నేను ఆయన కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాను.

సుకాంతిని పోలీసులు విచారణకు పిలిచినప్పుడు, తన భర్త వేరే మహిళతో కలిసి కోయంబత్తూరులో ఉంటున్నాడని, అప్పుడప్పుడు తనకు డబ్బులు పంపిస్తారని వాంగ్మూలం ఇచ్చారు.

పోలీసులకు సుకాంతి చెప్పిన విషయాలను సుధ ఒప్పుకోలేదు. ఆమెకు ఎప్పుడూ సుకాంతి మీద అనుమానం ఉండేది.

పాండ్యన్ చిన్నాన్న శేఖర్
ఫొటో క్యాప్షన్, పాండ్యన్ చిన్నాన్న శేఖర్

‘‘మా అన్నను వెళ్లేటప్పుడు ఆయనతో పాటు గేటు వరకు వెళ్లింది నేనే. ఆరోజు మా అన్న ధరించిన దుస్తులే మురికి నీటి ట్యాంకులో దొరికిన అస్థిపంజరానికి ఉన్నాయి’’ అని సుధ చెప్పారు.

అన్న చేతికి ఎర్రటి తాడు కట్టి ఉన్నట్లు కూడా ఆమె తెలిపారు. ట్యాంకులో లభించినది తన అన్నయ్య అస్థిపంజరమే అని సుధ ధ్రువీకరించారు.

సుధ తనకున్న మరికొన్ని సందేహాలను కూడా వెలిబుచ్చారు.

‘‘మా అన్న చాలా లావుగా ఉంటారు. ఒక్కరే ఆయనను ఎత్తి, ట్యాంకులో పడేయడానికి అవకాశం లేదు. దీని వెనుక ఇంకెవరు ఉన్నారో పోలీసులు పట్టుకోవాలి’’ అని సుధ కోరారు.

ఈ అంశం గురించి పాండ్యన్ చిన్నాన్న శేఖర్ మాట్లాడుతూ, పాండ్యన్ కనిపించకుండా పోవడంపై తనకూ కొన్ని అనుమానాలున్నాయని అన్నారు.

‘‘పాండ్యన్‌ను సుకాంతి చంపేసి నదిలో పారేసి ఉంటుందని ఆరేళ్ల క్రితమే నేను మా బంధువులకు చెప్పాను. కానీ, నా మాట ఎవరూ వినలేదు. నేను తాగి మాట్లాడుతున్నా అనుకున్నారు.

మురికి నీటి ట్యాంకులో అస్థిపంజరం లభ్యమైనట్లు మా అల్లుడు మాకు చెప్పారు. అక్కడి వెళ్లి చూశాక అది మా పాండ్యన్ అస్థిపంజరమే అని మేం ధ్రువీకరించాం.

ఈ హత్య గురించి విచారించి, నేరస్థులను పోలీసులు అరెస్ట్ చేయాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.

పోలీస్ స్టేషన్
ఫొటో క్యాప్షన్, 24 గంటల్లోనే పోలీసులు నిందితురాలిని పట్టుకున్నారు

పాండ్యన్‌ను ఎలా చంపారు?

పాండ్యన్ హత్య గురించి బీబీసీతో పోలీస్ ఇన్‌స్పెక్టర్ శరవణన్ వివరించారు.

మురికి నీటి ట్యాంకు ఉన్న ఇల్లు యజమాని సిరాలన్, చెన్నైలో ఉంటారని ఆయన చెప్పారు.

‘‘సిరాలన్‌కు నాలుగు ఇళ్లు ఉన్నాయి. అందులో మూడు ఇళ్లను అద్దెకు ఇచ్చారు. ఒక ఇంట్లో సుకాంతి, పాండ్యన్ కలిసి నివసించేవారు.

ఆ ఇంట్లో పాండ్యన్ తొమ్మిదేళ్లు ఉన్నారు.

తన భర్త పాండ్యన్ (43) ఒక డ్రైవర్ అని, ఆరు నెలలుగా ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటూ, మద్యం తాగుతూ తనతో తరచుగా గొడవపడేవారని సుకాంతి (39) చెప్పారు.

2014 మే1వ తేదీన పాండ్యన్ హత్య జరిగిన రోజున కూడా సాయంత్రం 6 గంటల సమయంలో భార్య సుకాంతితో పాండ్యన్ గొడవ పడ్డారు. కోపంలో సుకాంతిని కొట్టారు.

దీంతో తమ ఇంటికి సమీపంలోనే ఉన్న తన పుట్టింటికి వెళ్లేందుకు సుకాంతి ప్రయత్నించారు. ఆమె పుట్టింటికి వెళ్లకుండా పాండ్యన్ అడ్డుకున్నారు. అతన్ని తోసేసి సుకాంతి వెళ్లిపోయారు. అయితే, సుకాంతి తోసేయడంతో పక్కనే ఉన్న పిల్లర్‌ను ఢీకొని పాండ్యన్ కింద పడిపోయారు.

పోలీస్ ఇన్‌‌స్పెక్టర్ శరవణన్
ఫొటో క్యాప్షన్, పోలీస్ ఇన్‌‌స్పెక్టర్ శరవణన్

అది తెలియకుండా సుకాంతి పుట్టింటికి వెళ్లిపోయారు. కొన్ని గంటల తర్వాత తిరిగి వచ్చి చేసేసరికి పాండ్యన్ అదే స్థలంలో కదలకుండా ఉన్నారు’’ అని శరవణన్ చెప్పారు.

దగ్గరకు వెళ్లి ముక్కు దగ్గర చేయి పెట్టి చూడగా, తన భర్త చనిపోయినట్లుగా తెలిసిందని సుకాంతి చెప్పారు.

తర్వాత, సమీపంలో ఉన్న మురికినీటి ట్యాంకు మూతను ఎత్తి భర్త మృతదేహాన్ని లోపల వేసి మూతను బిగించినట్లు సుకాంతి వెల్లడించారు.

ఆరు నెలల తర్వాత ఆ ఇంటిని ఖాళీ చేసిన సుకాంతి, బంధువులతో కలిసి టైలరింగ్ షాపు నడిపినట్లు విచారణలో తేలింది.

పాండ్యన్ హత్య

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ కేసులో ప్రధాన నిందితురాలు సుకాంతి, మదురై సెంట్రల్ జైలులో ఉన్నారు

పాండ్యన్-సుకాంతి దంపతులకు 16 ఏళ్ల కూతురు, 10 ఏళ్ల కుమారుడు ఉన్నారు.

‘‘పోలీసు విచారణలో తన భర్తను హత్య చేసినట్లుగా సుకాంతి అంగీకరించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను మదురై సెంట్రల్ జైలుకు తరలించారు. దీనిపై విచారణ కొనసాగుతుంది’’ అని శరవణన్ చెప్పారు.

24 గంటల్లోగా నిందితురాలిని పట్టుకున్న పోలీసులను శివగంగ ఎస్పీ అరవిండ్ అభినందించారు.

‘‘అస్థిపంజరం ఆధారంగా నిందితులను పట్టుకోవడం చాలా సవాలుతో కూడుకున్న పని. దేవకోట పోలీసులు చాలా జాగ్రత్తగా వ్యవహరించి 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు’’ అని బీబీసీతో ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)