వ్యాధులకు కారణమయ్యే జన్యువులను ఏఐతో గుర్తించగలమా? ‘గూగుల్ డీప్‌మైండ్’ ప్రయత్నాలేంటి?

ఫొటో సోర్స్, GOOGLE DEEPMIND
- రచయిత, పల్లబ్ ఘోష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మనుషుల డీఎన్‌ఏలో వ్యాధులకు కారణమయ్యే మార్పుల్ని కనుక్కునేందుకు గూగుల్‌కు చెందిన సంస్థ డీప్‌మైండ్ కృత్రిమ మేధను ఉపయోగిస్తోంది. వ్యాధి కారక జన్యువుల్లో 89 శాతాన్ని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.
దీని వల్ల వ్యాధి నిర్ధరణలో వేగం పెరగడంతో పాటు మంచి చికిత్సను అందించడానికి వీలవుతుంది. ఇదో “పెద్ద ముందడుగు” అని ప్రముఖ శాస్త్రవేత్త ఒకరు బీబీసీతో చెప్పారు.
“వ్యాధులకు కారణమయ్యే ప్రాంతాల్లో దేన్ని చూడాలనే దానిపై ఈ టెక్నాలజీ వైద్య పరిశోధకులకు సాయం చేస్తుంది” అని యూరోపియన్ మాలిక్యులర్ బయాలజీ లేబరేటరీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ ఇవాన్ బిర్నే చెప్పారు.
మానవ డీఎన్‌ఏ కణజాలంలోని భాాగాల క్రమాన్ని చెక్ చేసేందుకు ఈ సాంకేతికత ఉపయోగ పడుతుంది.
జీవులన్నింటిలోనూ డీఎన్ఏ ఉంటుంది. అడినైన్, సిటోసైన్, గుయనైన్, థైమైన్ అనే నాలుగు రసాయనాలలోని నాలుగు బ్లాకులతో డీఎన్ఏ ఏర్పడింది. మనుషుల్లో పిండం అభివృద్ధి చెందేటప్పుడు ఈ రసాయనాలకు చెందిన మొదటి అక్షరాలను ప్రోటీన్లు ఉత్పత్తి చేసే వాటిగా గుర్తిస్తున్నారు. ఇవే శరీర భాగాల్లోని కణాలు, టిష్యూల అరలను నిర్మిస్తున్నాయి.
అయితే, తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే డిజార్డర్ వల్ల ఈ అక్షరాలు తప్పుడు క్రమంలో వస్తే శరీరంలోని కణాలు, టిష్యూలు సరిగా తయారు కావు. ఇది వ్యాధులకు దారి తీస్తుంది.
నిరుడు డీప్‌మైండ్ సంస్థ రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ శరీరంలోని ప్రొటీన్ల ఆకారాన్ని తయారు చేసింది.
అల్ఫా మిస్సెన్స్ అని పిలిచే కొత్త వ్యవస్థ డీఎన్ఏలోని అక్షర క్రమాన్ని చెబుతుంది. ఆ క్రమం తప్పితే వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.

మానవ డీఎన్ఏలో ఏ ప్రాంతం వ్యాధులకు కారణమవుతుందనేది తెలుసుకోవడానికి జన్యుపరమైన వ్యాధులను అన్వేషించేవారి వద్ద చాలా తక్కువ పరిజ్ఞానం అందుబాటులో ఉంది.
అక్షర క్రమంలో 0.1 శాతం మార్పులు లేదా మ్యుటేషన్లు వ్యాధులకు కారణం కావచ్చని వాళ్లు నిర్ధరించారు.
కొత్త మోడల్ ఆ శాతాన్ని 89%కి పెంచిందని డీప్‌మైండ్‌లో పని చేస్తున్న పుష్మీత్ కోహ్లీ తెలిపారు.
డీఎన్ఏను తయారు చేసే బిలియన్ల కొద్దీ రసాయన బ్లాకుల్లో వ్యాధులకు కారణమయ్యే ప్రాంతాలను శాస్త్రవేత్తలు ఇప్పటివరకు పరిశోధిస్తున్నారు. అయితే ఇప్పుడా పరిస్థితి మారిపోయిందంటున్నారు కోహ్లీ.
"పరిశోధకులు ఇప్పుడు తమకు తెలియని కొత్త ప్రాంతాలపై దృష్టి పెట్టవచ్చు. వ్యాధులకు కారణమయ్యే వాటిని మేం గుర్తించాం” అని ఆయన చెప్పారు.
సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ కొత్త పరిశోధనను ఇంగ్లండ్‌లో నేషనల్ హెల్త్ సర్వీస్‌లో భాగమైన జెనోమిక్స్ ఆఫ్ ఇంగ్లండ్ పరీక్షించింది.
డీప్ మైండ్ కనిపెట్టిన వైద్య పరిశోధన వల్ల ఆరోగ్య విభాగానికి చాలా మేలు జరుగుతుందని జెనోమిక్స్ ఇంగ్లండ్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎల్లెన్ థామస్ చెప్పారు.
“డేటా విశ్లేషణలో కొత్త పరిశోధన కొత్త దృక్పథాన్ని తీసుకు వస్తుంది. జన్యు క్రమాన్ని అర్థం చేసుకోవడంలో ఇది వైద్యులకు, వైద్య పరీక్షలు చేసే వారికి, పేషంట్లకు, వైద్య బృందాలకు ఉపయోగపడుతుంది’’ అని ఆమె చెప్పారు
మాలిక్యులర్ బయాలజీ, లైఫ్ సైన్సెస్‌లో కృత్రిమ మేధ విస్తృతమైన భాగంగా మారుతుందని భావిస్తున్నట్లు ప్రొఫెసర్ బిర్నే చెప్పారు.
"ఇది ఎక్కడ ముగుస్తుందో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం మనం చేసే ప్రతిదాన్ని ఇది మారుస్తుంది" అని అన్నారాయన.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ సంస్థానం భారత్‌లో ఎలా అంతర్భాగమైంది? నిజాం ఎందుకు లొంగిపోయారు? చరిత్ర ఏం చెబుతోంది?
- పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల: ఇంకా పూర్తికాని ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించారా?
- సెప్టెంబర్ 17: అటు అమిత్ షా, ఇటు సోనియా గాంధీ, హైదరాబాద్‌లో ఏం జరగబోతోంది?
- టాలీవుడ్ డ్రగ్స్ కేసు: నటుడు నవదీప్ పరారీలో ఉన్నారా... ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















