Early Retirement Plan: 45 ఏళ్లకే ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి మనసుకు నచ్చినట్లు హ్యాపీగా జీవించడం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఐవీబీ కార్తికేయ
- హోదా, బీబీసీ కోసం
ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ రిటైర్ అర్లీ (FIRE) ఉద్యమం గత దశాబ్దకాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన విషయం. చాలా దేశాల్లో 55-60 ఏళ్ల వయసును రిటర్మెంట్ వయసుగా పేర్కొంటారు.
అమెరికా లాంటి దేశాల్లో రిటైర్మెంట్ గురించి పెద్దగా పట్టింపు లేదు. కానీ 40-45 ఏళ్లకే ఆర్థిక స్వావలంబన సాధించి, ఆ తర్వాత ఆదాయం కోసం ఉద్యోగం మీద ఆధారపడకుండా కేవలం తాము మదుపు చేసి ఆర్జించిన మొత్తం ద్వారా, తమ జీవనశైలిని కొనసాగించడం ఈ ఫైర్ సిద్దాంతంలో ప్రధాన అంశం.
పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ పరంగా చూస్తే ఆదాయంలో ఎక్కువ శాతం ఆదా చేయడం, కేవలం పరిమితమైన ఖర్చులతో జీవనం గడపడం లాంటి జాగ్రత్తలు ముందు నుంచే ఉన్నాయి. కానీ, ఈ ఫైర్ సిద్దాంతం వాడుకలోకి వచ్చాక ఆదా చేయడం, భవిష్యత్తులో రాబోయే ప్రతీ ఒక్క ఖర్చు కోసం మదుపు చేయడం లాంటివి ఉద్యమ స్థాయిలోకి వెళ్లాయి.
ఈ విప్లవాత్మక మార్పుకు కారణం ఏమిటి, దీని పర్యవసానాలు సగటు మదుపరుల మీద ఎలా ఉండబోతున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఫైర్ ఉద్యమం ఎలా మొదలైంది?
1980 నుంచీ 2000లోపు పుట్టిన మిలీనియల్స్ ఈ ఫైర్ సిద్దాంతానికి ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. జాకబ్ ఫిస్కర్ రచించిన అర్లీ రిటైర్మెంట్ ఎక్స్‌ట్రీం అనే పుస్తకం ఈ ఫైర్ ఆలోచనలో ఒక మేలిమలుపు.
అలాగే, వికీ రాబిన్ రచించిన 'యువర్ మనీ యువర్ లైఫ్' పుస్తకంలో కూడా ఈ ఫైర్ సిద్దాంతాన్ని చాలా బలంగా సమర్థించారు. ఈ పుస్తకాలే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది ఫైర్ అనుకూల వ్యాఖ్యాతలు తమ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.
దాని ఫలితంగా ఈ సిద్దాంతం పట్ల ఆకర్షితులైన వారు అమాంతం పెరిగారు.
విదేశాలలో 40 ఏళ్ల తర్వాత జీవితం మళ్లీ మొదలవుతుంది అనే భావన బలంగా ఉంది. ఆ ఆలోచనకు ఈ ఫైర్ ఉద్యమం మరింత ఊతం ఇచ్చినట్టుగా ఉంది.
ఎందుకంటే, చాలా మంది 45 ఏళ్లకు తమ ఉద్యోగానికి స్వస్తి పలికి తమకు ఎంతో ఇష్టమైన వ్యాపకం చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఆ వ్యాపకం వల్ల మునుపటి జీతం రాకున్నా తాము అర్జించిన, మదుపు చేయడం వల్ల వచ్చిన మొత్తం తగినంతగా ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందీ రాదు అనే నమ్మకం.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో ప్రాచుర్యం పొందడానికి కారణాలేంటి?
గతంలో అనేకసార్లు చెప్పినట్టు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న తరానికి మునుపటి తరం ఉద్యోగస్థులకు ఎంతో తేడా ఉంది. దశాబ్దాల పాటు ఒకే ప్రభుత్వ ఉద్యోగంలో పని చేసినవారు గతంలో చాలా మంది ఉండేవారు. కానీ, ప్రస్తుతం గట్టిగా ఐదేళ్లు ఒకే సంస్థలో పని చేసినవారు తక్కువగా కనిపిస్తున్నారు.
అలాగే, 60 ఏళ్లు వచ్చి పదవీ విరమణ చేశాక పెన్షన్ సౌలభ్యం ఉండేది. ప్రస్తుతం అలాంటిది లేదు. ఈ కారణాల వల్ల ఉద్యోగం చేసే సమయంలో వీలైనంత ఎక్కువ ఆదాయం ఉండేలా చూసుకోవాలి అన్న ఆలోచన నుంచి ఈ ఫైర్ ఉద్యమం పుట్టింది.
ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాల పనివేళలు కూడా మునుపటిలా కాకుండా షిఫ్ట్ పద్ధతిలో ఉంటున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రాం లాంటి నగరాలలో షిఫ్ట్ సమయాలలో కనిపించే ట్రాఫిక్ జాం దీనికి ఉదాహరణ.
ఈ కారణం వల్ల వయసు ఎక్కువ అయ్యాక ఇదే ఉద్యోగం చేయడం కుదరదు అనే ఆలోచన ప్రస్తుత తరంలో ఎక్కువగా ఉంది. అందువల్ల దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా ఫైర్ సిద్దాంతం పట్ల ఆకర్షితులవుతున్నారు.
దానికితోడు, ప్రస్తుతం పర్సనల్ ఫైనాన్స్ విషయంలో లభ్యమవుతున్న సమాచారం గతంలో లేదు. ఇన్సూరెన్స్ నుంచి రిటైర్మెంట్ ప్లానింగ్ వరకూ అన్ని విషయాల గురించిన ఎంతో సమాచారం చాలా సులభంగా అందుబాటులో ఉంది.
గతంలో కేవలం కంపెనీల ఏజెంట్ల ద్వారా మాత్రమే మదుపు చేసేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ఇంటర్నెట్ వేదికగా ప్రతీ ఫైనాన్స్ ప్లానింగ్ అవసరానికి ఎంతో సాంకేతిక మద్దతు అందుబాటులో ఉంది.
ఫైనాన్షియల్ ప్లానర్స్ ఎందరో ఉన్నా తమ అవసరాలకు తగినట్టు మదుపు చేసుకుంటున్న వారు కూడా ఎందరో ఉన్నారు. ఇదంతా సాంకేతిక విప్లవం వల్ల వచ్చిన మార్పుగా చెప్పొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
'ఫైర్'లో ప్రధాన అంశాలేంటి?
బీమా: తమ వార్షిక ఖర్చులకు కనీసం ఇరవై రెట్లు జీవిత బీమా ఉండాలి. కుటుంబం మొత్తానికి తగినంతగా ఆరోగ్య బీమా ఉండాలి.
భవిష్యత్ నిధి: ఉద్యోగికి 45 ఏళ్లు వచ్చే సమయానికి తమ కుటుంబ వార్షిక ఖర్చుకు 25 రెట్లు భవిష్య నిధి ఉండటం ఫైర్ సిద్దాంతంలో చాలా ముఖ్యమైన విషయం. ద్రవోల్బణాన్ని అధిగమించేలా ఇలాంటి నిధిని ఏర్పరచుకోవడం ఈ సిద్దాంతానికి కీలకం.
ఆర్థిక లక్ష్యాలు: ప్రతి నెలా ప్రతి ఆర్థిక లక్ష్యానికి తగినంత మదుపు చేయాలి. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపు ఇవ్వకూడదు. ఎలాంటి భావోద్వేగాలకు లోను కాకుండా అన్ని ఆర్థిక లక్ష్యాలను సమానంగా చూడటం పర్సనల్ ఫైనాన్స్ మూలసూత్రం.
ఖర్చుల నియంత్రణ: ఎప్పటికప్పుడు ఖర్చులను లెక్క వేసుకుంటూ ఎక్కువ మొత్తంలో అవుతున్న ఖర్చులను, అనవసర ఖర్చులను తగ్గించుకోవడం ఫైర్ ముఖ్య సూత్రం. నెల జీతంలో ఆదా చేసిన తర్వాత మిగిలిన మొత్తం ఖర్చులకు ఉపయోగించాలి అనేది ఫైర్ ఆదర్శం. కానీ ఇది అన్నివేళలా కుదరదు కనుక ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వలి.
ఫైర్ మీద ఉన్న ప్రధాన విమర్శలు: ఇలా పొదుపుగా జీవించడం వల్ల జీవితంలో ఎంతో ఎంజాయ్ చేసే అవకాశాలను వదులుకోవాల్సి వస్తుంది అనేది ఫైర్ సిద్దాంతం మీద ఉన్న ప్రధాన విమర్శ. కానీ, ఈ విమర్శ పూర్తిగా సహేతుకం కాదు. ఎందుకంటే ఎంజాయ్‌మెంట్ అనేది భావోద్వేగాలపరమైన విషయం. ఆర్థిక విషయాలలో భావోద్వేగాలకు ఎలాంటి స్థానం లేదు.
ఈ సిద్దాంతం కేవలం ఎక్కువ సంపాదన ఉన్నవారికి మత్రమే వర్తిస్తుంది అన్న విమర్శ కూడా ఉంది. ఈ విషయంలో కొంత నిజం ఉన్న మాట వాస్తవం. కానీ, రేపటి అవసరాన్ని గుర్తించి పొదుపు చేయడం మొదలుపెట్టిన వారే ఆర్థికంగా మరో మెట్టు ఎక్కగలరు.
ఫైర్ ఉద్యమం పర్యవసానాలు: ఫైర్ ఉద్యమం వల్ల కలిగిన ఆలోచనతో స్టాక్ మార్కెట్లో మదుపు చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం పెరుగుతున్న మ్యూచువల్ ఫండ్ సిప్ కూడా ఈ ఫైర్ ఉద్యమం నుంచీ పుట్టిన ఆలోచనే. ఇలా మదుపరులు ఎక్కువ కావడం వల్ల సహజంగానే స్టాక్ మార్కెట్ పరుగులు పెడుతోంది. గతంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్ గమనాన్ని శాసించేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.
మదుపు అవకాశాల మీద పెరుగుతున్న ఆదరణతో మోసంచేసేవా ళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. సామాజిక మాధ్యమాలలో తాము ఎంతో అర్జించామని చిన్న మదుపరులను మోసం చేస్తున్న వారి ఉదంతాలు ఇటీవల పెరిగాయి.
ఇలా కూడా చదవండి:
- టర్మ్ ఇన్సూరెన్స్: ఏ వయసులో తీసుకుంటే బెటర్? టర్మ్ పాలసీ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలివీ
- పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుంది? ఎవరెవరు లింక్ చేయాల్సిన అవసరం లేదు
- 5 W's of Financial Planning: ఈ విషయాలు తెలుసుకుంటే మీకు డబ్బు సమస్యలు ఉండవు
- నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 14 లక్షల వరకు ఉపకారవేతనం, ఎలా పొందాలంటే
- మనీ: యూపీఐ, ఓఎల్ఎక్స్, డెబిట్/క్రెడిట్ కార్డ్ మోసాల బారిన పడకూడదంటే ఇలా చేయాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














