పక్కనోళ్లు తిన్నా, నమిలినా, ఊపిరి పీల్చినా కొందరు భరించలేరు, ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అంజలి దాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మెట్రో, బస్, లేదా ఆటోలో ప్రయాణించేటప్పుడు కొంతమంది హెడ్‌ఫోన్స్ పెట్టుకుని ఉండడం చూసే ఉంటారు.
అలా హెడ్‌ఫోన్స్ పెట్టుకోవడంలో కొత్తేమీ లేదు, ఎవరికి ఇష్టమైనది వారు చేయొచ్చు. కానీ, ఎవరైనా బలవంతంగా హెడ్‌ఫోన్స్ పెట్టుకోవాల్సి వస్తే?
28 ఏళ్ల మార్గట్ నోయెల్ తనకు ఇష్టం లేకపోయినా హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటారు. తనను తాను రక్షించుకోవడానికి.
మార్గట్ నోయెల్ మిసొఫోనియాతో బాధపడుతున్నారు. మామూలుగా చెప్పాలంటే, ఇదొక రుగ్మత. ఇది ఉన్న వారికి సాధారణ శబ్దాలు కూడా చికాకు తెప్పిస్తాయి.
అలాంటి పరిస్థితిలో, వారికి కోపం రావడం, అప్సెట్ అయిపోవడం, భయపడిపోవడం, లేదంటే తీవ్ర ఆందోళనకు గురవుతారు.
మిసొఫోనియాతో బాధపడుతున్న వారు అలాంటి శబ్దాలు విన్నప్పుడు ఇంద్రియాల అనుభూతులను అనుసంధానించే మెదడులోని భాగం చురుగ్గా స్పందిస్తుంది.
ఊపిరి పీల్చుకోవడం, ఆహారం నమలడం, శబ్దం చేస్తూ కాఫీ, టీ తాగడం, పెన్ను కదిలిండచం వంటి చిన్న చిన్న శబ్దాలకు కూడా కొందరు చిరాకు పడడం గురించి మీరెప్పుడైనా చూశారా?
అలాంటి వాళ్లు మిసొఫోనియాతో బాధపడుతున్నారని అర్థం.

మిసొఫోనియా అంటే ఏంటి?
మిసొఫోనియాతో బాధపడుతున్న వారికి తరచుగా కోపం వస్తుంటుంది. ప్రతిదానికీ ఆందోళన, ద్వేషం వంటి భావాలు వ్యక్తం చేస్తుంటారు.
మిసొఫోనియా అనేది నాడీ వ్యవస్థకు సంబంధించిన రుగ్మత. సాధారణ భాషలో దీన్ని శబ్దాలు పడకపోవడం, లేదా శబ్దాలపై ద్వేషం అని కూడా చెబుతారు.
కొన్ని శబ్దాలు విన్నప్పుడు, లేదా మరేదైనా జరిగినప్పుడు మీ సహనం తగ్గిపోతుంది. వెంటనే కోపం వచ్చేస్తుంది. ఆందోళనకు గురవుతారు.
ఒక్క సెకనులో వెయ్యో వంతు కంటే తక్కువ సమయంలోనే ఈ శబ్దాలు మీ మెదడుకు తప్పుడు సంకేతాలు పంపిస్తాయి.
ఈ శబ్దాలను మెదడులోని అప్రమత్తత వ్యవస్థ 'అమిగ్దలా' ప్రమాదంగా భావిస్తుంది. దీంతో అడ్రినల్ గ్రంథులు, కార్టిసాల్ హార్మోన్లు వెంటనే స్పందించేందుకు సిద్ధమవుతాయి.
అయితే, ఈ శబ్దాల వల్ల సాధారణ వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం ఉండదు.
అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్(ఓసీడీ), టిన్నిటస్ (చెవుల్లో వింత శబ్దాలు రావడం), హైపెరాక్యుసిస్ (సాధారణ శబ్దాలు కూడా చాలా పెద్దగా వినిపించడం), ఆటిజం తరహాలో, చిన్నారులు, యువత, వయసు పైబడిన వాళ్లలో ఎంతమంది మిసొఫోనియాతో బాధపడుతున్నారో కచ్చితంగా తెలియదు.
అలాగే, సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్ (ఎస్‌పీడీ) వ్యాధితో బాధపడుతున్న వారిలో ఈ సమస్య చాలా సాధారణం.
అలా ఎందుకు జరుగుతుందో ఇప్పటికీ కచ్చితంగా తెలియదు. అయితే, ఇది మెదడుకు సంబంధించిన వ్యాధి, లేదా సైకోసిస్ (మానసిక వ్యాధి)గా పరిశోధకులు భావిస్తున్నారు.
కింగ్స్ కాలేజీ లండన్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో బ్రిటన్‌లో 18.4 శాతం మందిలో ఇలాంటి లక్షణాలు కనిపించినట్లు గుర్తించారు.
అంటే, దాదాపు ఐదుగురిలో ఒకరు తినేటప్పుడు వచ్చే శబ్దం, చూయింగ్ గమ్ నమలడం, లేదంటే గురక వంటి శబ్దాలు విన్నప్పుడు చిరాకు పడుతున్నారు.
''మిసొఫోనియా బాధితులు ఒంటరిగా ఉన్నట్లు భావిస్తారు. కానీ, అది నిజం కాదు. దీన్ని మనం మరింత అర్థం చేసుకోవాల్సి ఉంటుంది'' అని అధ్యయన రచయిత డాక్టర్ సిలియా విటౌరటౌ చెప్పారు.
భారత్‌లో ఈ మిసొఫోనియాతో ఎంతమంది బాధపడుతున్నారనే కచ్చితమైన సమాచారం లేదు. అయితే, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ నిర్వహించిన ఆన్‌లైన్ అధ్యయనం ప్రకారం, దాదాపు 15.85 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతూ ఉండొచ్చని అంచనా.

మిసొఫోనియా వల్ల కలిగే ఇబ్బందులు
తనకు ఎనిమిదేళ్ల వయసు నుంచి మిసొఫోనియా లక్షణాలు ఉన్నట్లు కెంట్‌కి చెందిన ఒలానా టాన్స్‌లీ హ్యాంకాక్ చెప్పారు.
''శ్వాస తీసుకుంటున్న శబ్దాలు, ఎడిపోయిన ఆకుల శబ్దాలు, పేపర్ వల్ల వచ్చే శబ్దాలు'' అలా అనిపించేవని ఆమె చెప్పారు.
''నాకు అలాంటి శబ్దాలు వినిపించేవని, అప్పుడు వాటిని ఆపడమో, లేదంటే అక్కడి నుంచి వెళ్లిపోవడమో చేసేదాన్ని. సినిమాలకు కూడా వెళ్లేదాన్ని కాదు. కేవలం మూడు నెలల్లోనే ఉద్యోగం మానేశా. అయితే, దానిని ఎలా ఎదుర్కోవాలో క్రమంగా అర్థం చేసుకుని, ఆ తర్వాత నుంచి ఇయర్‌ప్లగ్‌లు పెట్టుకోవడం మొదలుపెట్టాను'' అని ఒలానా వివరించారు.
నిపుణులు ఏం చెబుతున్నారు?
మిసొఫోనియా మీ మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ లక్షణాలు లక్షణాలు ఉన్న పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నప్పుడు శబ్దాలు వినిపిస్తే వారి చదువుపై ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే, వారు స్కూల్‌కి వెళ్లేందుకు పెద్దగా ఇష్టపడరు.
అలాంటి పరిస్థితుల్లో, మరొకరితో సమయం గడపడం కూడా పెద్ద సవాల్‌గా మారుతుంది. వాళ్ల ముందున్న వారి నుంచి వచ్చే ఆ శబ్దాలను వారు భరించలేరు. ఒకవేళ అదే విషయాన్ని అవతలివారికి చెప్పేందుకు ప్రయత్నించినా వారికి దాని గురించి తెలియకపోవడం వల్ల వారు అర్థం చేసుకోలేరు.
అలాంటప్పుడు, ఎదుటి వ్యక్తితో గొడవ జరగడం, శత్రుత్వం ఏర్పడడం కూడా జరగొచ్చు.
అమెరికాలో మిసొఫోనియా నేపథ్యంలో కొనసాగే పోడ్‌కాస్ట్ నిర్వాహకులు అదీల్ అహ్మద్‌కి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. ఆయనకు మిసొఫోనియా సమస్య ఉంది.
''కొన్నిసార్లు మన తల్లిదండ్రుల నుంచి కూడా దూరమయ్యే పరిస్థితులు తలెత్తొచ్చు. ఎందుకంటే, తెలిసో, తెలియకో వాళ్లు చేసే శబ్దాలు మనకు ఇబ్బంది కలిగిస్తున్నాయని వాళ్లు గుర్తించరు'' అని ఆయన బీబీసీతో చెప్పారు.
ఇలాంటి వారిలో ఎక్కువగా ఫైట్ ఆర్ ఫ్లైట్ ( పోరాడా లేదంటే పారిపో) పరిస్థితి కనిపిస్తుందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు డాక్టర్ జేన్ గ్రెగరీ చెప్పారు.
ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే ఎదుటి వారితో గొడవపడడం, లేదంటే అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవడం.
''మిసొఫోనియా ఉన్న వాళ్లు అలాంటి శబ్దాలు విన్నప్పుడు వెంటనే అప్రమత్తమవుతారు. వారిలో కోపం పెరిగిపోతుంది. ఆ శబ్దాలు సాధారణమైనవిగానే అనిపించినా, మిసొఫోనియా రోగులకు మాత్రం అవి చాలా ఇబ్బందికరంగా మారతాయి'' అని న్యూక్యాస్టిల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ సుఖబిందర్ కుమార్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మిసొఫోనియా ప్రధాన లక్షణాలు
మిసొఫోనియాను గుర్తించేందుకు ప్రత్యేకంగా పరీక్ష ఏమీ లేదు. శబ్దాలు విన్నప్పుడు సహనం కోల్పోవడం, ఇబ్బందికరంగా స్పందించడం వంటివి కనిపిస్తాయి.
ఎవరైనా తినడం, నమలడం, శ్వాసం తీసుకోవడం వంటి శబ్దాలు మిసొఫోనియా ఉన్న వారిలో అసహనాన్ని ప్రేరేపిస్తాయి.
తినడం, శ్వాసతీసుకోవడం వంటి సాధారణ శబ్దాలు కూడా వారికి ఇబ్బందికరంగానే ఉంటాయి. కేవలం మనుషుల వల్ల కలిగే శబ్దాలు మాత్రమే కాదు. జంతువులు, ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల వచ్చే శబ్దాల వల్ల కూడా అలా జరగొచ్చు. ఆ శబ్దాలు భరించలేనంతగా అనిపించి అతను అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవాలని అనుకుంటారు.
అందువల్ల ఎప్పుడూ శబ్దాలు చెవులకు తాకకుండా కప్పేసుకుంటారు. అలాంటి శబ్దాలు వచ్చినప్పుడు కోపం రావడంతో పాటు భయాందోళనకు గురవుతారు.
''ఎవరైనా ఏదైనా నములుతున్నా, గురక పెట్టినా నేను భరించలేను. నాకు కోపం వస్తుంది. లేదంటే అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనిపిస్తుంది'' అదీల్ అహ్మద్ చెప్పారు.
''అయితే, ఎవరైనా మా సమస్యను అర్థం చేసుకుంటే సమస్య తీవ్రత కొంచెం తగ్గుతుంది'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నయం చేయొచ్చా?
ఇలాంటి శబ్దాలు మెదడును ప్రేరేపించడాన్ని ఆపేందుకు ఇంకా ఎలాంటి శాస్త్రీయ పరిష్కారం దొరకలేదు.
అయితే, మిసొఫోనియాను నయం చేసేందుకు పరిశోధకులు మానసిక చికిత్సా విధానం కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ)ని ప్రయత్నించారు. అలా ప్రయత్నించిన 90 మంది రోగులలో, 42 శాతం మందిలో మెరుగైన లక్షణాలు కనిపించాయి.
టిన్నిటస్ రీట్రైనింగ్ థెరపీ మరో ప్రత్యామ్నాయం. అయితే, దీనికి ఎలాంటి ధ్రువీకరణలు లేవు.
ఇవి కూడా చదవండి:
- యాంటీ బయాటిక్స్ వేసుకోవడం ప్రమాదకరమా,పేగు మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి?
- ‘సెక్స్ కోరికలు పెంచే ఆ హార్మోన్ తీసుకున్నాక నాకు కొడుకు పుట్టాడు’
- ఆత్మహత్య చేసుకోబోయే ముందు ఏం జరుగుతుంది, ఆ ఆలోచనలను ఎలా పసిగట్టాలి?
- ప్రథమ చికిత్స అంటే ఏమిటి? ఎప్పుడు, ఎలా చేయాలి? ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో ఏమేం ఉండాలి?
- వీర్యం, అండాలు లేకుండా తొలిసారిగా పిండం తయారీ...ఐవీఎఫ్ సక్సెస్ రేట్ పెంచవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














