‘టమోటా సాగుతో కోట్ల రూపాయలు వచ్చాయంటే మేం కూడా పంట వేశాం. తీరా చూస్తే..’

టమోటా రైతు
ఫొటో క్యాప్షన్, రామ్మూర్తి, రైతు
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం...

దాదాపు నెలన్నర కిందట టమోట ధరలు మండిపోయాయి. కేజీ రూ.200 నుంచి రూ. 300 వరకు పలికింది. కొన్నిచోట్ల అంతకన్నా ఎక్కువకు కూడా అమ్ముడైంది.

టమోటా పంటతో కోటీశ్వరులైన రైతులు... దొంగతనానికి గురైన టమోట ట్రక్కుల కథలు, సరుకుకు కాపాలాగా బాడీ గార్డ్స్‌ను ఏర్పాటు చేశారన్న వార్తలను కూడా చూశాం.

ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా ఆ పరిస్థితి తలకిందులైంది. కిలో రెండు మూడు రూపాయలకు పడిపోవడంతో టమోటాలను రోడ్ల పక్కన పడేయటం, పశువులకు పెట్టడం వంటి ఘటనలు కనిపించాయి. కోత కూలీ కూడా రావడం లేదని కొందరు పొలంలోనే పంటను వదిలేస్తున్నారు.

మార్కెట్‌కు పంపిస్తే రవాణా చార్జీలు కూడా రావని మరికొందరు రోడ్డు పక్కన పడేస్తున్నారు.

కొందరు కోట్లు సంపాదిస్తున్నారనే ఉద్దేశంతో ఇతర రైతులు భారీగా టమోటాను సాగు చేస్తుండటమే దీనికి కారణమని స్వయంగా రైతులే చెబుతున్నారు.

టమోటా ధరలు
ఫొటో క్యాప్షన్, టమోటా ధరలు బాగా పడిపోయాయి.

‘కోట్లు సంపాదించారు అంటే పంట వేశాం’

కూలీలు, తోటకు కొట్టే మందుల ధరలు కూడా పెరగడంతో టమోటా రైతులకు పంట భారంగా మారిందని చిత్తూరు జిల్లా ఎడమవారిపల్లెకు చెందిన రామ్మూర్తి అనే రైతు ఆందోళన వ్యక్తం చేశారు.

‘‘గత 30 ఏళ్లలో మొన్న వచ్చిన ధరలను ఎన్నడూ చూడలేదు. టమోటాలతొ కోట్లు సంపాదించారు అంటే ఈ పంట వేశా. కానీ కాయ కోతకొచ్చేసరికి రేటు పడిపోయింది. ఇప్పుడు కిలో రూ.5 అలా పోతోంది. బాక్స్ ధర రూ.150 ఉంది. బాక్స్ రూ.600 నుంచి రూ.700కు అమ్మితే గిట్టుబాటు అవుతుంది. అంతకంటే తక్కువ అయితే నష్టమే. మందులు, కూలీ రేట్లు ఎక్కువ. ఇంతకుముందు ఒకసారి పురుగు మందు కొట్టేవాళ్లం, ఇప్పుడు పదిసార్లు కొట్టాల్సి వస్తోంది. కాయ కోయడం ప్రారంభించాక రూ.70 వేల విలువైన మందులు వాడాను. చివరకు గిట్టుబాటు కాదని తోటలోనే పంటను వదిలేశా” అని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, ‘టమోటా సాగుతో కోట్ల రూపాయలు వచ్చాయంటే పంట వేసి దారుణంగా దెబ్బతిన్నాం’

చినగొట్టిగల్లు మండలానికి చెందిన రైతు జనార్దన్‌ది కూడా అదే పరిస్థితి.

“మనిషికి రూ.300 కూలీ. మార్కెట్‌కు తీసుకెళ్లడానికి బాక్సుకు రూ.25 పడుతుంది. మా పంటకు మార్కెట్లో బాక్స్ రూ.30 నుంచి రూ.40 అంటున్నారు. వచ్చేది బాడుగకే సరిపోతుంది. అందుకే తోటలోనే వదిలేశాం. కోసిన వాటిని పారబోశాం’’ అని జనార్దన్ ఆవేదన వ్యక్తం చేశారు.

టమాట ధరలు
ఫొటో క్యాప్షన్, చిత్తూరు జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి

డిమాండ్‌కు మించి సరఫరా: ఉద్యానశాఖ అధికారి

సరఫరాకు తగిన డిమాండ్ లేకపోవడం వల్ల ప్రస్తుతం టమోటా ధర బాగా పడిపోయిందని చిత్తూరు జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి అన్నారు.

‘‘ధరలు పెరగడం చూసి, ఇతర రైతులు బాగా సంపాదిస్తున్నారనే వార్తలు విని చాలా మంది టమోటా పంట సాగు చేస్తున్నారు. ఇలా వేసిన పంట భారీగా మార్కెట్లోకి రావడం వల్ల డిమాండుకు మించి టమోటా సరఫరా అవుతోంది. అందువల్ల రేట్లు పడిపోతున్నాయి’’ అని మధుసూదన్ రెడ్డి వివరించారు.

ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో డిమాండుకు తగిన సరఫరా లేకపోవడంతో చిత్తూరు జిల్లాలో 30 కేజీల క్రేట్ దాదాపు రూ.4 వేలు పలికిందని, అప్పుడు కిలో టమోటా దాదాపు రూ.150 వరకూ వచ్చిందని ఆయన చెప్పారు. అది చూసే చాలా మంది రైతులు టమోటా వేశారని తెలిపారు.

నారు తెచ్చి, సాగు చేస్తే రెండు నుంచి మూడు నెలల్లోపు టమోటా పంట చేతికి వస్తుందని రైతులు చెప్పారు.

టమాట ధరలు
ఫొటో క్యాప్షన్, టమాట తోట

ఎప్పుడు సాగు చేస్తే మంచి ధరలు వస్తాయి?

‘‘సంవత్సరం పొడవునా టమోటా సాగు చేసే చిత్తూరు, అన్నమయ్య జిల్లాలతోపాటు కర్ణాటకలోని కోలారు, చిక్‌బళ్లాపూర్ లాంటి ప్రాంతాల్లో కూడా పంట వేశారు. దీనికి తోడు జూన్, జులైలో ఖరీఫ్ సీజన్లో టమోటా సాగు దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా అనుకూలంగానే ఉంటుంది. ఫలితంగా ఎక్కడికక్కడ సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. ఈ పంట అంత మార్కెట్‌లోకి వస్తుండటం వల్ల ధరలు పడిపోతున్నాయి’’ అని ఆయన వివరించారు.

ధరలు పెరిగినపుడు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం, పడిపోతే పంటను ఆపివేయడం వంటివి చేయకూడదని మధుసూదన్ రెడ్డి అన్నారు.

‘‘ఏటా వేసవిలో టమోటాను ఎవరు సాగు చేస్తారో వారికి కచ్చితంగా మంచి ధరలు వచ్చే అవకాశం ఉంది. ధరలు పెరిగిన సమయంలో భారీ విస్తీర్ణంలో పంట వేయకండి. తక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకోండి. రేటు తక్కువగా ఉన్నప్పుడు కూడా కొంత విస్తీర్ణంలో పంటను వేసుకోవాలి. ఇది సీజనల్ క్రాప్ కాబట్టి, మార్కెట్ ట్రెండ్‌ను గమనిస్తూ పంటను వేసుకోవాలి. అలా చేస్తేనే రైతులకు లాభసాటిగా ఉంటుంది’’ అని ఆయన సూచించారు.

టమాట ధరలు
ఫొటో క్యాప్షన్, టమాటాలను మేస్తున్న పశువులు

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు పెట్టడం మేలన్న నిపుణులు

టమోటా దిగుబడి ఎక్కువ వచ్చినపుడు వాటితో కొన్ని ఉత్పత్తులు తయారు చేస్తే రైతులకు భరోసా లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ రైతు సమాఖ్య సలహాదారు మాగంటి గోపాల్ రెడ్డి అన్నారు.

‘‘ఇలా కొన్నేళ్లుగా జరుగుతోంది. అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలి. పంట దిగుబడి ఎక్కువ వచ్చినప్పుడు, సంబంధింత పరిశ్రమల్లో జ్యూస్, వడియాలు, పౌడర్ వంటి వాటిని తయారు చేయొచ్చు. టమోటాలు అందుబాటులో లేనప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు.

చిత్తూరు ప్రాంతంలో టమోటా ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను పెట్టాలని కూడా కోరుతున్నాం. అలాగే రైతులు నష్ట పోకుండా ధరల స్థిరీకరణ దిశగా చట్టం తీసుకురావాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం. అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు’’ అని ఆయన చెప్పారు.

టమోట ధరలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆధునిక పద్ధతులు ఉపయోగిస్తే లాభాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఆధునిక పద్ధతులతో పంట నష్టాన్ని అరికట్టొచ్చా?

అన్ని ప్రాంతాల్లో డిమాండుకు మించి టమోట ఉత్పత్తి ఉందని, మరో రెండు నెలలపాటు దిగుబడి ఇలాగే కొనసాగవచ్చని మధుసూదన్ రెడ్డి తెలిపారు.

‘‘రాబోయే వాతావరణ పరిస్థితులను బట్టి ఈ పరిస్థితి ఇంకా ఎన్ని నెలలు ఉండవచ్చు అనేది చెప్పలేం. వర్షాలు ఎక్కువగా పడితే, పంట కొంత వరకు దెబ్బతింటుంది. అందువల్ల మార్కెట్లోకి వచ్చే కాయ తగ్గుతుంది. అప్పటికీ పంటను కాపాడుకున్న రైతులు ఎవరైనా ఉంటే వారికి మంచి ధరలు వచ్చే అవకాశం ఉండొచ్చు’’ అని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రైతు సమాఖ్య సలహాదారు మాగంటి గోపాల్ రెడ్డి
ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్ రైతు సమాఖ్య సలహాదారు మాగంటి గోపాల్ రెడ్డి

చిత్తూరు జిల్లాలో టమోటా పంటను మల్చింగ్ పేపర్ కింద సాగు చేయడానికి రైతులు అలవాటు పడ్డారని, ఇలాంటి నవీన పద్ధతుల వల్ల వర్షాకాలంలో ఒక మోస్తరు వర్షాలు పడినా పంటను కాపాడుకోగలరని, దీని ద్వారా వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

‘‘చిత్తూరు జిల్లా వరకూ చూస్తే, మొత్తం టమోటా మల్చింగ్ పేపర్ కింద సాగు చేయడం రైతులకు అలవాటైంది. దానికి ఉద్యాన శాఖ కూడా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా, పక్కన అన్నమయ్య జిల్లాల్లో కూడా పేపర్ కింద పూర్తిస్థాయి విస్తీర్ణం సాగు చేసే పద్ధతికి రైతులు అలవాటుపడ్డారు. దాంతో పాటూ డ్రిప్ ఇరిగేషన్ సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కట్టెలు కట్టి మొక్కలు నేల మీద కాకుండా స్టేటింగ్ ఏర్పాటు చేశాం కాబట్టి రాబోయే వర్షాకాలంలో కూడా ఒక మోస్తరు వర్షాలు వచ్చినా చిత్తూరు జిల్లాలో పంట దెబ్బతినకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. కొమ్మలు నేలకు తాకకుండా కాయలు నేలను తాకకుండా జాగ్రత్తలు తీసుకుంటే, దిగుబడి ఇంకొంచెం పెంచుకునే అవకాశం ఉంటుంది’’ అని మధుసూదన్ రెడ్డి వివరించారు.

వీడియో క్యాప్షన్, ఒక్క సీజన్లో టమోటాలు అమ్మి రూ.2.81 కోట్లు సంపాదించిన రైతు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)