స్పెర్మ్ సెర్చ్: తండ్రి కావాలనుకునే పురుషుల కలను సాకారం చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం

శుక్రకణం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, గత 40 ఏళ్లుగా సగానికి పైగా తగ్గిపోయిన శుక్రకణాల సంఖ్య
    • రచయిత, కేథరిన్ లథమ్
    • హోదా, టెక్నాలజీ రిపోర్టర్

ప్రపంచంలో పురుషులలో కనీసం 7 శాతం మంది సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నట్లు అంచనా.

అయితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఈ సమస్యకు పరిష్కారం చూపనుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో పనిచేస్తున్న బయో మెడికల్ ఇంజినీర్, నియోజెనిక్స్ బయో సైనెస్స్ మెడికల్ కంపెనీ ఫౌండర్ అయిన డాక్టర్ స్టీవెన్ వసిలెస్క్యూ, ఆయన బృందం కలిసి ఇలాంటి ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని అభివృద్ధి చేశారు.

తాము అభివృద్ధి చేసిన ఏఐ సాఫ్ట్‌వేర్ సంతాన లేమితో బాధపడుతున్న పురుషుల నుంచి సేకరించిన వీర్యం నమూనాలోని శుక్రకణాలను నిపుణులైన వైద్యుల కన్నా 1000 రేట్ల వేగంతో గుర్తిస్తుందని అన్నారు.

తాము అభివృద్ధి చేసిన ఈ సాఫ్ట్ వేర్‌కు ‘స్పెర్మ్ సెర్చ్’గా పేరుపెట్టారు.

నాన్ అబ్‌స్ట్రక్టివ్ అజూస్పెర్మియా (NOA)గా పిలిచే స్థితిలో ఉన్న పురుషులకు ఉపయోగపడేలా ఈ సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

డాక్టర్ స్టీవెన్ వసిలెస్క్యూ, ఆయన బృందం

ఫొటో సోర్స్, DALE GOSS

ఫొటో క్యాప్షన్, ఏఐ సిస్టమ్‌ను అభివృద్ధి చేసిన స్టీవెన్ వసిలెస్క్యూ, ఆయన బృందం

సాధారణంగా ఇలాంటి కేసుల్లో ఎంబ్రియాలజిస్టులు వృషణాల నుంచి కొంత భాగాన్ని ఆపరేషన్ ద్వారా సేకరించి అందులో ఆరోగ్యకరమైన శుక్ర కణం కోసం వెతుకుతారు.

మైక్రోస్కోప్‌లో పరీక్షించినప్పుడు ఆరోగ్యకరమైన శుక్రకణం కనిపిస్తే, దానిని సేకరించి ఫలదీకరణం కోసం అండంలో ప్రవేశపెడతారు.

ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి చాలామంది నిపుణులకు 6 నుంచి 7 గంటల సమయం పడుతుందని.. ఒక్కోసారి పొరపాటు జరిగే ప్రమాదం కూడా ఉందని వసిలెస్క్యూ అన్నారు.

“ఎంబ్రయాలజిస్టులు మైక్రోస్కోపులో చూసినప్పుడు వారికి కణాలన్ని గజిబిజిగా కనిపిస్తాయి” అని అన్నారు.

“ఆ శాంపిల్‌లో రక్తం, ఇతర కణజాలాలు కూడా ఉంటాయి. వాటిలో కేవలం 10 శుక్ర కణాలు మాత్రమే ఉంటాయి. వాటికోసం వెతకడం అంటే గడ్డివాములో సూది కోసం వెతికినట్లే” అని అన్నారు.

ఇందుకు బదులుగా ఆ శాంపిల్ ఫొటోలను ‘స్పెర్మ్ సెర్చ్’ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేయగానే సెకన్ల వ్యవధిలో ఆరోగ్యకరమైన శుక్రకణాలను సాఫ్ట్‌వేర్‌ గుర్తిస్తుందని అన్నారు.

ఈ వేగాన్ని అందుకోవడానికి సాఫ్ట్‌వేర్‌కు డా.వసిలెస్క్యూ అతని బృందం వేలకు పైగా నమూనా చిత్రాలతో శిక్షణ ఇచ్చి అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

ఈ సాంకేతికతపై తాము ప్రచురించిన శాస్త్రీయ పరిశోధన పత్రంలో అనుభవజ్ఞులైన ఎంబ్రయాలజిస్ట్‌తో పోల్చిస్తే స్పెర్మ్ సెర్చ్ సాఫ్ట్‌వేర్‌ 1000 రెట్ల వేగంతో పనిచేసిందని పేర్కొన్నారు.

అయితే ఈ సాఫ్ట్‌వేర్‌ ఎంబ్రయాలజిస్టుల స్థానాలను భర్తీ చేయడానికి రూపొందించలేదని, వారికి సహాయపడేందుకు రూపొందించామని తెలిపారు.

స్పెర్మ్‌సెర్చ్ సిస్టమ్

ఫొటో సోర్స్, NEOGENIX BIOSCIENCES

ఫొటో క్యాప్షన్, శుక్రకణాలను వేగంగా గుర్తించనున్న స్పెర్మ్‌సెర్చ్ సిస్టమ్

యూకేలోని డూండీ యూనివర్సిటీలో రీప్రొడక్టివ్ మెడిసిన్ క్లినికల్ రీడర్ అయిన డా. సారా మార్టిన్ ద సిల్వా వీర్యకణాలను గుర్తించడానికి పట్టే సమయం చాలా కీలకం అని అన్నారు.

“ఫలదీకరణం కోసం అండం సిద్ధంగా ఉన్నప్పుడు, శుక్ర కణాన్ని సేకరించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాల్సి ఉంటుంది.. ప్రస్తుతం దీనికి పడుతున్న సమయాన్ని మరింతగా తగ్గిస్తే ప్రయోజనం ఉంటుంది” అని అన్నారు.

గడచిన నాలుగు దశాబ్దాలుగా పురుషులలో వీర్యకణాల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయిందని నివేదికలు చెప్తున్నాయి. మరోవైపు సంతానలేమి కేసులు పెరుగుతున్నాయి.

పురుషులలో సంతానోత్పత్తి తగ్గిపోవడానికి కాలుష్యం, ధూమపానం నుంచి మొదలుకొని సరైన డైట్, వ్యాయామం చేయకపోవడంతోపాటు, తీవ్ర ఒత్తిడి కూడా కారణమే.

ఇంగ్లండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్‌లో సెంటర్ ఫర్ సిస్టమ్స్ మోడలింగ్ అండ్ క్వాంటిటేవ్ బయో మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా. మెయిరిగ్ గాల్లఘర్ వంధ్యత్వ సమస్య ఉన్న పురుషులకు కూడా సాయం చేస్తున్నారు.

నమూనాలోని వీర్యకణం తోకను చూసి ఒక అవగాహనకు రావొచ్చని ఆయన అన్నారు.

“నిమిషం మార్పులోనే ఈ వీర్యకణం పర్యావరణ ఒత్తిడికి లోనైందా?, చనిపోబోతున్నదా? లేదా జీవసంబంధిత ప్రక్రియకు స్పందించగలదా?” అనేది చెప్పొచ్చని అన్నారు.

ఇదిలా ఉండగా వీర్య కణంలోని డీఎన్ఏ స్థితిని గుర్తించడానికి ఉత్తర ఐర్లాండ్ లోని బెల్ఫాస్ట్ కు చెందిన ఎక్సామెన్ సంస్థ ‘సింగిల్ సెల్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్’ అని పిలిచే సాంకేతికతను వినియోగిస్తోంది.

ప్రొఫెసర్ షీనా తన బృందంతో కలిసి 20 ఏళ్లుగా ఈ సాంకేతికతను అభివృద్ధి చేస్తూ వస్తున్నారు.

ప్రొఫెసర్ షీనా బెల్ఫాస్ట్ లోని క్వీన్స్ యూనివర్సిటీలో రిప్రోడక్టివ్ మెడిసిన్ విభాగంలో గౌరవ ప్రొఫెసర్. ఎక్జామెన్ సంస్థ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా పని చేస్తున్నారు. ఆమె ఏఐ సాంకేతికత గురించి స్పందిస్తూ, ఏఐ వినియోగం పట్ల సంతోషంగా ఉందని, అయితే ఔషధాల పరిశోధన విషయం దగ్గరకు వస్తే ఎక్కువ సమయం పడుతుందని అన్నారు.

 డా. మెయిరిగ్ గాల్లఘర్

ఫొటో సోర్స్, MEURIG GALLAGHER

ఫొటో క్యాప్షన్, డా. మెయిరిగ్ గాల్లఘర్

“స్పెర్మ్ సెర్చ్ ఏడుగురిపై నిర్వహించిన ప్రయోగాల అనంతరం ఆ ఫలితాలను రుజువు చేసే దశలోనే ఉంది. ఇప్పుడే దీనిపై ఏమీ చెప్పలేం” అని ఆమె అన్నారు.

ప్రయోగ దశలో ఉన్న దీన్ని పూర్తిగా అభివృద్ధి చేశాక మార్కెట్‌లోకి అందుబాటులోకి రావడానికి రెండు నుంచి ఐదేళ్ల సమయం పట్టొచ్చని ఆమె అన్నారు.

“ఏఐ ప్రయాణం ఇంకా పూర్తిగా మొదలుకాలేదు. ఇంకా చాలా చేయాల్సి ఉంది. తక్కువ మందితో ప్రయోగాలు నిర్వహించినప్పుడు ఏం చేసినా అద్భుతంగా అనిపిస్తుంది. కానీ వాస్తవంలోకి వస్తే అసలు సవాళ్లు తెలుస్తాయి” అని అన్నారు.

అయితే దీనిపై డా.వసిలెస్క్యూ స్పందించారు.

స్పెర్మ్ సెర్చ్ సాఫ్ట్ వేర్ తో నిర్థరణను “చివరి ప్రయత్నం”గా వర్ణించారు.

“ఈ సాఫ్ట్ వేర్ ఎంబ్రయాలజిస్టులు మరింత సమర్థంగా కచ్చితత్వంతో పనిచేయడానికి సహాయపడుతుంది. వారు గుర్తించలేని శుక్రకణాన్ని కూడా సాఫ్ట్ వేర్ తో గుర్తించవచ్చు. ఇది ఎందరో పురుషులకు తండ్రిగా మారాలనే కలను సాకారం చేస్తుంది” అని అన్నారు.

డా.వసిలెస్క్యూ బృందం క్లినికల్ ట్రయల్స్ ను తరువాతి దశకు తీసుకువెళ్లే పనిలో ఉంది.

“గర్భధారణ పరీక్ష మా తరువాత లక్ష్యం” అన్నారు డా. వసిలెస్క్యూ.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ ‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.)