ఎంఆర్‌ఐ స్కాన్: మీ కిడ్నీ, మెదడు, ఊపిరితిత్తుల టెస్టుల్లో అసాధారణ ఫలితాలు కనిపించాయా, కారణం ఇదే కావచ్చు...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డొమినిక్ హ్యూస్
- హోదా, బీబీసీ హెల్త్ కరెస్పాండెంట్
దీర్ఘ కాలం పాటు కోవిడ్ లక్షణాలతో జీవిస్తున్న వారిలో, శరీరంలోని ప్రధాన అవయవాలకు నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు ఒక కొత్త అధ్యయనం తెలిపింది.
కోవిడ్‌తో ఆసుపత్రిలో చేరిన వారిలో ఊపిరితిత్తులు, మెదడు, కిడ్నీలు వంటి ప్రధాన అవయవాల్లో కొన్ని అసాధారణ లక్షణాలు కనిపించే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు ఎంఆర్ఐ స్కానింగ్‌లు వెల్లడించాయి.
దీనికి, దీర్ఘకాల కోవిడ్‌కు సంబంధం ఉన్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు.
దీర్ఘకాల కోవిడ్‌కు మరింత మెరుగైన చికిత్సల అభివృద్ధిలో యూకే అధ్యయనం ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు.
కరోనా వైరస్‌తో తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరిన 259 మంది రోగులపై చేసిన ఈ అధ్యయన వివరాలు లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్ వెబ్‌సైట్‌లో ప్రచురితమయ్యాయి.
ఈ రోగులు డిశ్చార్జి అయిన ఐదు నెలల తర్వాత ఎంఆర్‌ఐ స్కాన్ చేయగా, కోవిడ్ లేని 52 మంది వ్యక్తులతో పోల్చినప్పుడు వారి శరీరంలోని ప్రధాన అవయవాల్లో గణనీయమైన తేడాలు కనిపించాయని అధ్యయనంలో పేర్కొన్నారు.
ముఖ్యంగా ఊపిరితిత్తులపై ఎక్కువ ప్రభావం ఉన్నట్లు స్కానింగ్‌లో కనిపించింది. ఊపిరితిత్తుల్లో అసాధారణ లక్షణాలు కనిపించే అవకాశం 14 రెట్లు ఉన్నట్లు రిపోర్టుల్లో తెలిసింది.
మెదడులో మూడు రెట్లు, కిడ్నీల్లో రెండు రెట్లు ఉన్నట్లు వెల్లడైంది. అయితే గుండె, కాలేయ ఆరోగ్యంలో పెద్దగా ఎలాంటి తేడాలు లేవు.
దీర్ఘకాల కోవిడ్ లక్షణాలు ఉన్నవారిలో కొన్ని అవయవాలు చెడిపోయే అవకాశం ఉందని డాక్టర్ బెట్టీ రామన్ అన్నారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన బెట్టీ రామన్, ఈ అధ్యయనానికి ప్రధాన పరిశోధకురాలిగా పని చేశారు.
‘‘కోవిడ్ చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారిలో 5 నెలల తర్వాత వారి ఊపిరితిత్తులు, మెదడు, కిడ్నీలలో అసాధారణ లక్షణాలను గుర్తించాం. కోవిడ్ రాని వారిలో ఇటువంటి లక్షణాలు లేవు’’ అని బెట్టీ చెప్పారు.
‘‘శరీరంలోని ఇతర అవయవాలకు నష్టం కలగడానికి రోగి వయస్సు, కోవిడ్ సోకిన తీవ్రత, కోవిడ్ వచ్చినప్పుడు ఇంకా ఇతర అనారోగ్యాల బారిన పడ్డారా? అన్నవి ముఖ్యమైన అంశాలు’’అని బెట్టీ అన్నారు.

కొత్త చికిత్సలు
కోవిడ్‌తో ఆసుపత్రిలో చేరిన వారిపై వైరస్ చూపించే దీర్ఘకాలిక ప్రభావాలను పరిశీలించే ‘‘పాస్ప్ కోవిడ్ స్టడీ’’ అనే ఒక పెద్ద అధ్యయనంలో ఈ ఫలితాలు ఒక భాగం.
అవయవ నష్టాలకు సంబంధించి ఎంఆర్‌ఐ స్కాన్‌లలో వెల్లడైన లక్షణాలతో సరిపోలే కొన్ని లక్షణాలనే పరిశోధకులు కనుగొన్నారు.
ఉదాహరణకు ఊపిరితిత్తుల్లో అసాధారణ పరిస్థితుల కారణంగా ఛాతీనొప్పి, దగ్గు వంటివి.
దీర్ఘకాల కోవిడ్‌తో ఉన్నవారు ఎదుర్కొంటున్న లక్షణాలన్నీ స్కానింగ్ రిపోర్టుల్లో కనిపించలేదు.
కోవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరిన వారిలో ఒకటి కంటే ఎక్కువ అవయవాల్లో అసాధారణ లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోందని డాక్టర్ రామన్ చెప్పారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా వారు శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలతో వస్తున్నారని తెలిపారు.
‘‘రెండు కంటే ఎక్కువ అవయవాలు ప్రభావితమైన వారిలో తీవ్ర, అతి తీవ్ర మానసిక, శారీరక వైకల్యాలు వచ్చే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది.
ముఖ్యంగా కోవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరిన వారు పల్మనరీ, ఎక్స్‌ట్రా పల్మనరీ (కిడ్నీలు, మెదడు, మానసిక ఆరోగ్యం) ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మా పరిశోధనలో ఈ అంశం వెల్లడైంది’’ అని బెట్టీ చెప్పారు.
లాంగ్ కోవిడ్‌గా పిలుస్తోన్న సిండ్రోమ్‌కు కారణమయ్యే విభిన్న లక్షణాల సమూహాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగమే ఈ పరిశోధన అని లీసెస్టర్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ క్రిస్ బ్రిగ్‌ట్లింగ్ అన్నారు. పాస్ప్ కోవిడ్ అధ్యయనానికి క్రిస్ నేతృత్వం వహిస్తున్నారు.
‘‘కోవిడ్‌తో ఆసుపత్రిలో చేరిన నెలల తర్వాత శరీరంలోని పలు అవయవాల్లో మార్పులు వస్తున్నట్లు ఈ అధ్యయనం నిర్ధరిస్తుంది’’ అని క్రిస్ అన్నారు.
లాంగ్ కోవిడ్ ఎందుకు వస్తుంది? లాంగ్ కోవిడ్‌కు అందించే కొత్త చికిత్సలు, పరీక్షలను ఎలా అభివృద్ధి చేయవచ్చు అనే అంశాలపై పాస్ప్ కోవిడ్ అధ్యయనం జరుగుతోంది.
ఇవి కూడా చదవండి:
- చిత్తూరు: ‘టమోటా సాగుతో కోట్ల రూపాయలు వచ్చాయంటే మేం కూడా పంట వేశాం. తీరా చూస్తే..’
- డిజిటల్ చెల్లింపులతో డబ్బును వృథాగా ఖర్చు చేయడం పెరుగుతోందా?
- మెక్సికో: 'ఏలియన్స్'కు ల్యాబ్‌లో పరీక్షలు, ఫోరెన్సిక్ నిపుణులు ఏం తేల్చారు?
- చంద్రుని మీద టైం ఎంతో చెప్పగలమా...
- జర్మనీ: హిట్లర్ ప్రైవేట్ లైఫ్ గురించి ఆశ్చర్యానికి గురిచేసే నిజాలను బయటపెట్టిన 'వీడియో'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














