డీజే: డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటుతో యువకుల మృతికి భారీ శబ్దాలే కారణమా? చెవికి, గుండెకు సంబంధం ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
కొద్ది రోజుల కిందట తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో 18 ఏళ్ల యువకుడు డ్యాన్స్ చేస్తూనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు అతను చనిపోయాడు.
వారం కిందట అనంతపురం జిల్లా ధర్మవరంలో వినాయకుడి మండపం ముందు డ్యాన్స్ చేస్తూ ప్రసాద్ (23) అనే యువకుడు గుండెపోటుతో కుప్పకూలి, మృతి చెందాడు.
తాజాగా మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా పరిధిలో ఇద్దరు యువకులు గుండెపోటుతో మరణించారు.
సాంగ్లీ జిల్లాలో ఈ ఇద్దరు యువకుల మృతికి డీజే సౌండ్ కారణమని తేలింది. ఆ శబ్ధం ఎక్కువగా వినడం వల్ల అది గుండెపై ప్రభావం చూపిందని, అందుకే చనిపోయారని నిపుణులు అంటున్నారు.
అలా ఎలా జరుగుతుంది? అందరికీ ఇలాగే అవుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
70 డెసిబుల్స్ దాటితే ఏమవుతుంది?
“మన చెవులు 70 డెసిబుల్స్ వరకు శబ్దాలను తట్టుకోగలవు. అయితే 80 నుంచి 100 డెసిబుల్స్‌కు నిరంతరం వింటే వినికిడి లోపం ఏర్పడుతుంది" అని చెవి, ముక్కు, గొంతు నిపుణుడు అశోక్ పురోహిత్ చెబుతున్నారు.
“100, 120 డెసిబుల్స్ మధ్య శబ్దాలకు చెవిపోటు వస్తుంది, తల తిరుగుతుంది. అంతేకాదు ఈ ధ్వని గుండెకు అనుసంధానమై ఉన్న కర్ణికను ప్రేరేపిస్తుంది. ఇది గుండెపోటుకు దారి తీస్తుంది’’ అని వైద్య నిపుణుడు అశోక్ చెప్పారు.
బహిరంగ సభల్లో పాల్గొని చెవి సమస్యతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఇటీవల పెరుగుతోందని ఆయన అంటున్నారు.
“సెప్టెంబర్ 26న చెవిలో సమస్యతో 18 మంది నా వద్దకు వచ్చారు. వారిలో ఎక్కువ మంది పార్టీల కార్యకర్తలు లేదా ఊరేగింపుల్లో పాల్గొన్నవారే ఉన్నారు'' అని అన్నారు.
“శబ్ద కాలుష్యం మనిషి ఆరోగ్యానికి హానికరం. ఇది ధమనుల్లో అధిక రక్తపోటు(ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్)కు దారితీస్తుంది. దీనివల్ల గుండెపై ఒత్తిడి పెరగడం, గుండెపోటు లేదా పక్షవాతం వంటివి వచ్చే ప్రమాదం ఉంది" అని కార్డియాలజిస్ట్ తుకారాం ఔటీ చెప్పారు.
“శబ్ద కాలుష్యం వల్ల రక్తపోటు పెరగడం, హృదయ స్పందన రేటు పెరగడంతోపాటు హార్మోన్ స్థాయుల్లో మార్పులూ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ శబ్దం నిరంతరం వినడం ప్రాణాపాయం" అని వైద్యుడు హెచ్చరిస్తున్నారు.
మానసిక ఆరోగ్యానికీ దెబ్బే
"పెద్ద శబ్దం కారణంగా వినికిడి లోపం ఏర్పడుతుంది. అది చెవిలోని కణాలను దెబ్బతీస్తుంది. వినే సామర్థ్యాన్నీ ప్రభావితం చేస్తుంది" అని చెవి-ముక్కు-గొంతు స్పెషలిస్ట్ నీతా గాడే చెప్పారు.
“దీని ప్రభావం ఎక్కువ కాలం ఉండే ప్రమాదం కూడా ఉంది. దానికి ప్రభావితమైన వారి చెవులలో తేనెటీగలు సందడి చేయడం, ఈల వినిపించడం వంటివి జరుగుతుంటాయి. 'టిన్నిటస్' అని పిలిచే ఈ పరిస్థితి తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఉంటుంది" అని నీతా గాడే అంటున్నారు.
ఇలాంటి వినికిడి లోపం, దాని సంబంధిత సమస్యలకు నివారణ మార్గాలూ ఉన్నాయని ఆమె తెలిపారు.
డీజే శబ్దం తీవ్రతలో పరిమితిని పాటించడం అవసరమని నీతా సూచించారు.
భారీ శబ్దాల వల్ల మనిషి శరీరమే కాదు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
"ప్రతి ఒక్కరూ సంగీతానికి ప్రాధాన్యం ఇస్తారు, ఎంత సౌండ్‌లో వినాలో ఎంపిక చేసుకునే అవకాశం అందరికీ ఉంది. కానీ డీజే డాల్బీ మ్యూజిక్‌లో అలాంటి సదుపాయం ఉండదు ” అని సైకియాట్రిస్ట్ శుభాంగి గార్గానిస్ అంటున్నారు.
"డీజే మ్యూజిక్ వినడం వల్ల సామాన్యులు చిరాకు పడతారు. ఇది వారి నిద్రకు భంగం కలిగిస్తుంది. వారి మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది" అని శుభాంగి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- వినోద్ కాంబ్లీ 60 వేల మంది ప్రేక్షకుల ముందు ఏడ్చేశాడు, ఎందుకు?
- ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు: నాలుగేళ్లలో రెండు సార్లు కొత్త సిలబస్, ఇప్పుడు ‘ఐబీ’.. మరి టీచర్ల సంగతేంటి?
- డెంగీ రెండోసారి వస్తే మరింత ప్రాణాంతకమా? అంత మంది చనిపోతున్నా ఈ వైరస్‌కు సరైన టీకా ఎందుకు రాలేదు?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















