క్రికెట్ వరల్డ్ కప్-1996: ఈడెన్ గార్డెన్స్‌లో వేలాది మంది ప్రేక్షకుల ముందు వినోద్ కాంబ్లీ ఎందుకు ఏడ్చారు... శ్రీలంక చేతిలో భారత్ అప్పుడు ఎలా ఓడిపోయంది?

వినోద్ కాంబ్లీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

1996 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా బెంగళూరులో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో భారత్ తలపడింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఎక్కిన మత్తు, నాలుగు రోజుల తర్వాత జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓడిపోయేంత వరకూ దిగలేదు.

ఒక పెద్ద మ్యాచ్‌ గెలిస్తే ఇక మిగిలిన విషయాలన్నింటినీ తేలికగా తీసుకునే అలవాటు టీమిండియాకు ఉందని భారత జట్టు కోచ్ అజిత్ వాడేకర్‌‌కు తెలుసు.

''ఒకసారి మ్యాచ్ గెలిచిన తర్వాత విమానంలో అందరం జోకులేసుకుంటూ ఉన్నసంగతి నాకు గుర్తుంది'' అని సంజయ్ మంజ్రేకర్ తన ఆటోబయోగ్రఫీ 'ఇంపర్ఫెక్ట్‌'లో రాశారు.

ఆరోజు సాయంత్రం హోటల్‌లో జరిగిన టీమ్ మీటింగ్‌లో ''మీరేమనుకుంటున్నారు? మీరేమైనా టోర్నమెంట్ గెలిచారా? విమానంలో ఏం చేశారు? అసలిదేం ప్రవర్తన అంటూ కోచ్ వాడేకర్ మాపై విరుచుకుపడ్డారు'' అని రాశారు.

సంజయ్ మంజ్రేకర్

ఫొటో సోర్స్, HARPER SPORTS INDIA

శ్రీలంకకు ఫస్ట్ బ్యాటింగ్ ఇవ్వాలని నిర్ణయం

శ్రీలంకతో సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు కూడా వాడేకర్ అదే మూడ్‌లో ఉన్నారు. టీమ్ మీటింగ్‌లో మాత్రమే ఆయన మాట్లాడుతున్నారు. ఆ తర్వాత కెప్టెన్ అజారుద్దీన్ కొద్దిగా మాట్లాడేవారు.

ఆ మీటింగ్ గంటసేపు జరిగితే, శ్రీలంక ఓపెనర్లు రమేశ్ కలువితరణ, జయసూర్యలను ఎలా నిలువరించాలనే దానిపైనే 50 నిమిషాలు చర్చ జరిగింది.

కొద్దిరోజుల కిందట దిల్లీలో ఇండియాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో వాళ్లిద్దరూ బాగా ఆడారు. ఇండియా విధించిన 272 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు.

వాళ్ల బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉండడంతో మనోజ్ ప్రభాకర్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయాల్సి వచ్చింది. అదే ఆయన కెరీర్‌ ముగిసేందుకు నాంది పలికింది.

మ్యాచ్ ‌కోసం కోల్‌కతా వెళ్లినప్పుడు, ఆస్ట్రేలియా నుంచి మట్టి తెప్పించి ఈడెన్ గార్డెన్స్ పిచ్ తయారు చేశారని భారత జట్టుకు చెప్పారు. అది ఆస్ట్రేలియన్ ఈడెన్ గార్డెన్ పిచ్‌లాగే కనిపించింది.

''ఆ పిచ్ చూసిన తర్వాత ఒకవేళ మనం టాస్ గెలిస్తే ముందు ఫీల్డింగ్ చేయాలని అనుకున్నాం. తన టార్గెట్‌ను శ్రీలంక జట్టు విజయవంతంగా ఛేదించుకుంటూ రావడమే అందుకు కారణం.

శ్రీలంక ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్లు సనత్ జయసూర్య , రమేష్ కలువితరణ మొదటి బాల్ నుంచే విధ్వంసకర బ్యాటింగ్‌‌తో శ్రీలంకకు మంచి ప్రారంభం ఇవ్వడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. లీగ్ మ్యాచ్‌లో వాళ్లు మనల్ని ఓడించారు. ముందుగా వాళ్ల వికెట్లు పడగొట్టి వాళ్లను ఒత్తిడికి గురిచేయాలి అనుకున్నాం'' అని సచిన్ తెందూల్కర్ తన ఆటోబయోగ్రఫీ 'ప్లేయింగ్ ఇట్ మై వే'లో రాశారు.

శ్రీలంక

ఫొటో సోర్స్, Getty Images

పిచ్‌ను అంచనా వేయలేకపోయారా?

ఇండియా టాస్ గెలిచి శ్రీలంకకు బ్యాటింగ్‌ ఇచ్చింది. మొదటి ఓవర్‌లోనే ఓపెనర్లు ఇద్దరినీ పెవిలియన్‌‌కు పంపించడంతో భారత్ జట్టు ఆనందానికి హద్దుల్లేవు.

''శ్రీనాథ్ బౌలింగ్‌లో థర్డ్ మ్యాన్ దగ్గర కలువితరణ ఇచ్చిన క్యాచ్ నేను అందుకున్నా. జయసూర్య ఇచ్చిన క్యాచ్‌ను వెంకటేష్ ప్రసాద్ ఒడిసిపట్టుకున్నారు. ఆ తర్వాత ఏం చేయాలో మాకు తోచలేదు. మహాభారతంలో అభిమన్యుడిలా పద్మవ్యూహంలోకి ఎలా వెళ్లాలో తెలుసు కానీ, ఎలా బయటికి రావాలో ప్లాన్ చేసుకోలేదు'' అని సంజయ్ మంజ్రేకర్ తన పుస్తకంలో రాశారు.

ఆ తర్వాత మా ఫోకస్ మ్యాచ్ నుంచి పక్కకుపోయింది. ఆ అవకాశాన్ని సరిగ్గా వాడుకున్న అర్వింద్ డిసిల్వా 47 బంతుల్లో 66 పరుగులు చేశారు. మహానామా కూడా 58 పరుగులు చేసి శ్రీలంక ప్రారంభంలో కోల్పోయిన పరుగులను భర్తీ చేశారు. ఇన్నింగ్స్ చివరికి వచ్చే సరికి రణతుంగ 35 పరుగులు, తిలకరత్నే 32 పరుగులు, చమిందా వాస్ 22 పరుగులు చేయడంతో శ్రీలంక 251 పరుగులకు చేరింది.

అప్పుడు సచిన్ తెందూల్కర్ బౌలింగ్‌కి వచ్చారు. పిచ్‌ను అంచనా వేయడంలో విఫలమయ్యామని ఆయనకు అర్థమైంది.

''బంతి ఆగకుండా బ్యాట్స్‌మెన్ వైపు దూసుకెళ్తోంది. పిచ్ పైభాగం బలంగా కనిపిస్తున్నప్పటికీ, కింద భాగంలో మట్టి సరిగ్గా పరుచుకోలేదు. ఈ పిచ్ 50 ఓవర్లు పూర్తయ్యే వరకూ పటిష్ఠంగా ఉండేలా లేదని అర్థమైంది. అలాంటి పరిస్థితిలో శ్రీలంకను సాధ్యమైనంత తక్కువ పరుగులకు పరిమితం చేయడం ముఖ్యం. అయినప్పటికీ వాళ్లు 50 ఓవర్లలో 251 పరుగులు చేయగలిగారు. చివరకు ఆ టార్గెట్ మాకు భారంగా మారింది'' అని సచిన్ తన పుస్తకంలో రాశారు.

275 నుంచి 280 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అయితే పిచ్‌ని చూశాక 220 పరుగులు సరిపోతాయని అనిపించిందని ఆ తర్వాత రణతుంగ చెప్పారు. బౌలింగ్‌‌కు వచ్చినప్పుడు, పిచ్‌ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానని సచిన్ తెందూల్కర్ కూడా అనుకున్నారు.

సచిన్

ఫొటో సోర్స్, Getty Images

సచిన్ ఎలా ఔటయ్యారు?

అందరి కళ్లూ సచిన్ తెందూల్కర్‌పైనే ఉన్నాయి. భారత్‌కు మంచి ఆరంభం ఇస్తారని ఎదురుచూసిన వారిని ఆయన నిరాశపర్చలేదు. స్పిన్ పిచ్ మీద 65 పరుగులు చేసిన సచిన్, అనూహ్యంగా 98 పరుగుల వద్ద స్టంపౌట్ అయ్యారు.

''జయసూర్య తన ఎడమ చేత్తో స్పిన్ బౌలింగ్ చేస్తున్నారు. ఒక బంతి నా ప్యాడ్‌‌కు తగిలి ఆన్‌సైడ్‌లో దూరంగా వెళ్లింది. దీంతో ఒక పరుగు తీయొచ్చనుకుని క్రీజ్‌లో నుంచి బయటికి వచ్చా. తిరిగి చూసేసరికి బంతి వికెట్ కీపర్ కలువితరణ దగ్గరికి వెళ్లింది. పరుగు తీసేందుకు, లేదా క్రీజులోకి వచ్చేందుకు సమయం లేకపోయింది. రెప్పపాటులో అతను స్టంపింగ్ చేశాడు. నేను వెంటనే పెవిలియన్ బాట పట్టాను. థర్డ్ అంపైర్ నిర్ణయం వచ్చేంత వరకు కూడా ఆగలేదు. ఎందుకంటే నాకు తెలుసు, అది ఔట్ అని. తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్‌కు అంత సులువు కాదని పెవిలియన్‌కు వెళ్లేప్పుడు అనిపించింది'' అని సచిన్ తన పుస్తకంలో రాశారు.

సచిన్

ఫొటో సోర్స్, HODDER & STOUGHTON

ఆ నవ్వును మర్చిపోలేను: సంజయ్ మంజ్రేకర్

అప్పటికి సచిన్ తెందూల్కర్, సంజయ్ మంజ్రేకర్ రెండో వికెట్‌కి 90 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. పిచ్ అనుకూలంగా లేదని కూడా ప్రేక్షకులు పట్టించుకోలేదు.

''అజారుద్దీన్‌కు కుమార ధర్మసేన వేసిన బంతి ఆఫ్ స్టంప్‌‌ వైపు పడి, లెగ్‌ సైడ్ వైపు దూసుకెళ్తుండడంతో ఛాతీ ఎత్తులో వికెట్ కీపర్ కలువితరణ అందుకున్నారు. అది వైడ్‌బాల్‌గా అంపైర్ ప్రకటించినప్పటికీ, అప్పుడు ధర్మసేన ముఖంలో కనిపించిన నవ్వును నేను ఎప్పటికీ మరచిపోలేను.

బహుశా, గెలిచేది మేమే. లాహోర్ వెళ్లేది మేమే. ఇండియా ఫైనల్‌కు వెళ్లడం లేదని అతనికి అప్పుడే అనిపించిందేమో. ధర్మసేనతో పాటు శ్రీలంక జట్టులో మరో ఇద్దరు స్పిన్నర్లు ముత్తయ్య మురళీధరన్, జయసూర్య ఉన్నారు. అవసరమైతే అర్వింద్ డిసిల్వా కూడా స్పిన్ బౌలింగ్ చేయగలరు. సచిన్ ఔట్ అయిన తర్వాత మరో ఇద్దరు టాప్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ బాట పట్టారు. అంతా అయిపోతోందని మా మనసుకు తెలుసు'' అని సంజయ్ మంజ్రేకర్ రాశారు.

ధర్మసేన

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కుమార ధర్మసేన

బాటిళ్లు విసిరేసిన ప్రేక్షకులు

పరుగులు చేయకుండానే అజారుద్దీన్ పెవిలియన్‌కి చేరుకున్నారు. జయసూర్య బౌలింగ్‌లో సంజయ్ మంజ్రేకర్ క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఆ తర్వాత అజయ్ జడేజాకి ముందుగా జవగల్ శ్రీనాథ్ క్రీజులోకి వచ్చారు. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ వినోద్ కాంబ్లీ అప్పటికే క్రీజులో ఉన్నారు. అయితే, ఆరు పరుగులకే శ్రీనాథ్ వెనుదిరిగారు.

జడేజా కూడా 11 బంతులు ఆడి ఎలాంటి పరుగులు చేయకుండానే వెనుదిరిగారు. అదే బాటలో నయన్ మోంగియా, ఆశిష్ కపూర్ కూడా ఔటయ్యారు. భారత్ ఇన్నింగ్స్ ముగింపు స్పష్టంగా కనిపించింది.

భారత్ ఓడిపోతోందని ఈడెన్ గార్డెన్స్ ప్రేక్షకుల్లో సహనం నశించింది. భారత్ గెలిచేందుకు ఇక అవకాశం లేదని తేలిపోవడంతో మైదానంలోకి సీసాలు విసిరేయడం మొదలుపెట్టారు. అప్పటికి ఇంకా 15 ఓవర్లు మిగిలి ఉండగా, భారత్ స్కోరు 8 వికెట్ల నష్టానికి 120 పరుగులు.

ప్రేక్షకులను శాంతింపజేసేందుకు రెండు జట్ల ఆటగాళ్లు మైదానంలో నుంచి బయటికి వచ్చేయాలని అంపైర్లు, మ్యాచ్ రిఫరీ క్లైవ్ లాయిడ్ పిలిచారు. అరగంట తర్వాత ఆట తిరిగి ప్రారంభమైంది, కానీ, ముత్తయ్య మురళీధరన్ తన ఓవర్‌లో రెండో బంతి వేయడానికి ముందు, ప్రేక్షకులు మళ్లీ మైదానంలోకి సీసాలు విసిరేయడం ప్రారంభించారు.

బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న శ్రీలంక ఫీల్డర్లు పిచ్ దగ్గరకు వచ్చేంత దారుణంగా పరిస్థితి తయారైంది. కళ్ల ముందే భారత్ ఓడిపోవడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆటను నిలిపివేసి శ్రీలంకను విజేతగా ప్రకటించాలని రిఫరీ నిర్ణయించారు.

అప్పటికి పది పరుగులు చేసిన వినోద్ కాంబ్లీ నాటౌట్‌గా పెవిలియన్‌కు తిరిగివస్తున్నప్పుడు, ఆయన కళ్లలో నుంచి నీళ్లు కారుతున్నాయి. తమ ప్రవర్తన దేశానికి చెడ్డపేరు తెస్తోందని జనాలకు అర్థం కాలేదు. ఈ ఘటన కోల్‌కతా క్రీడా సంప్రదాయానికి పెద్ద దెబ్బ.

ఈడెన్ గార్డెన్

ఫొటో సోర్స్, Getty Images

ఫీల్డింగ్ ఎంచుకోవడమే తప్పు

టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ చేయాల్సిందని భారత ప్రముఖ స్పిన్నర్ ఎరపల్లి ప్రసన్న స్థానిక టెలిగ్రాఫ్ పత్రికలో రాశారు.

మొదట ఫీల్డింగ్‌ చేయాలని తీసుకున్న నిర్ణయం వ్యూహాత్మకంగా తీసుకున్నది కాదు. ఆ తర్వాత కెప్టెన్ అజారుద్దీన్ మీడితో మాట్లాడుతూ శ్రీలంక ఛేజింగ్ చేయడం తమకు ఇష్టం లేదన్నారు.

నవజోత్ సింగ్ సిద్ధు ఒక్కరే ఇండియా మొదట బ్యాటింగ్ చేయాలని అన్నారు. కానీ, అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. గ్రౌండ్స్ మ్యాన్ కూడా మొదట బ్యాటింగ్ చేయాలని సూచించారు. కానీ, ఇండియన్ కెప్టెన్ ఆయన సూచననూ పట్టించుకోలేదు. మొదట ఫీల్డింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

మ్యాచ్ తర్వాత సంజయ్ మంజ్రేకర్, సచిన్ తెందూల్కర్, అజయ్ జడేజా, మరో ఇద్దరు ఆటగాళ్లు ఒక రూంలో సమావేశమయ్యారు.

వినోద్ కాంబ్లీ, క్రిష్ణమాచారి శ్రీకాంత్

ఫొటో సోర్స్, Getty Images

వినోద్ కాంబ్లీ వైపు అజయ్ జడేజా ఎందుకలా చూశారు?

''అప్పుడే వినోద్ కాంబ్లీ గదిలోకి వచ్చారు. ఓడిపోయినందుకు అందరి ముందూ ఏడ్చినందుకు అజయ్ జడేజా అతని వైపు చూశారు. కాంబ్లీ భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోవడం ఆయనకు నచ్చలేదు. అయితే, భారత్‌‌ను గెలిపించే అవకాశం కోల్పోయినందుకు కాంబ్లీ నిరాశ చెందారు'' అని సంజయ్ మంజ్రేకర్ రాశారు.

శ్రీలంక అంతటితో ఆగలేదు. లాహోర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లోనూ విజయం సాధించి మొదటిసారి వరల్డ్ కప్ సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)