పెదకాపు-1 రివ్యూ: పచ్చని సీమలో నెత్తుటి రాజకీయం

ఫొటో సోర్స్, Twitter/Dwarakacreations
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద.. వీటిలో ఏ సినిమా చూసినా శ్రీకాంత్ అడ్డాల స్టైల్ ఏమిటో అర్థమైపోతుంది. కుటుంబ బంధాలు, మంచితనం, సమాజంపై ఓ సానుకూల దృక్పథం ఇవన్నీ కనిపిస్తాయి.
శ్రీకాంత్‌కు `క్లాస్` దర్శకుడన్న స్టేటస్ కలిగించాయి. సడన్‌గా `నారప్ప`తో శ్రీకాంత్ అడ్డాలలోని రెండో కోణం బయటకు వచ్చింది. రా అండ్ రస్టిక్ సినిమాల్ని కూడా ఆయన తీయగలడనిపించింది. అయితే అది రీమేక్ సినిమా. ఆయనదైన భావజాలం కాదు. కానీ దాన్ని ఒడిసిపట్టుకొన్నారు. `పెదకాపు` మాత్రం ఆయన కథే, రీమేక్ కాదు!
ట్రైలర్, టీజర్ చూసినప్పుడు `శ్రీకాంత్ అడ్డాల తన పరిధిని, పరిమితిని దాటుకొని వచ్చి తీసిన సినిమా ఇది` అని స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మరి.. `పెదకాపు` ఎలా ఉన్నాడు? శ్రీకాంత్ అడ్డాలలోని మరో కొత్త కోణాన్ని ఈ కథ బయటపెట్టిందా? లేదా?

ఫొటో సోర్స్, Twitter/Dwarakacreations
వర్గ పోరాటం
1982 నాటి కథ అది. అప్పుడే తెలుగుదేశం పార్టీ పుట్టింది. ప్రతీ నియోజకవర్గంలోనూ రాజకీయ పరంగా ప్రకంపనలు మొదలయ్యాయి. గోదావరి జిల్లాల్లోని లంక గ్రామంలోనూ అదే పరిస్థితి.
అక్కడ సత్య రంగయ్య (రావు రమేష్), బయన్న(నరేన్) అనే ఇద్దరి వర్గాలు ఉంటాయి. ప్రతీ ఎన్నికల్లోనూ వాళ్ల మధ్యే పోటీ.
వీరిద్దరి మధ్యా సయోధ్య కుదిర్చి.. వీళ్లలో ఒకరికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడానికి ఆ పార్టీ ఇన్‌ఛార్జ్ (నాగబాబు) శతవిధాలా ప్రయత్నిస్తుంటాడు. సత్య రంగయ్య కోసం పెదకాపు (విరాట్ కర్ణ) తన అన్నతో కలిసి పనిచేస్తుంటాడు.
తనని అవమానించాడన్న కోపంతో బయ్యన్న కొడుకుని దారుణంగా చంపేస్తాడు సత్య రంగయ్య. అయితే ఆ నేరాన్ని తన మీద వేసుకొని జైలు పాలవుతాడు పెదకాపు అన్నయ్య.
అయితే జైలుకెళ్లిన అన్నయ్య కనిపించకపోయేసరికి సత్య రంగయ్యపైనా, బయన్నపైనా ఎదురు తిరుగుతాడు పెదకాపు. ఆ తర్వాత ఏమైంది? ఓ సామాన్యుడి తిరుగుబాటు ఏ రూపాన్ని సంతరించుకొంది? అదే ఊర్లో ఉన్న అక్కమ్మ (అనసూయ) కథేమిటి? ఈ ఊరి రాజకీయాన్ని తను ఏ రూపంలో మలుపు తిప్పింది? ఈ ప్రశ్నలకు సమాధానం.. పెదకాపు.
ఎన్నో పాత్రలున్నాయి కానీ..
ఓ చిన్న పాప ఎపిసోడ్‌తో ఈ కథని చెప్పడం ప్రారంభించాడు శ్రీకాంత్ అడ్డాల. ఓ పదేళ్ల పాపకు.. అప్పుడే పుట్టిన పసికందు దొరుకుతుంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ పాపని తీసుకొని ఎవరికైనా అమ్మేద్దామని ఊర్లోకి వస్తుంది.
ఆ పాపని మాస్టర్ (తనికెళ్ల భరణి) అనే ఓ తాగుబోతు కొనుక్కొంటాడు. అక్కడ ఈ కథ ఆపి.. పాతికేళ్ల తరవాత లంక గ్రామంలోని తెలుగుదేశం పార్టీ రాజకీయంతో కథని చెప్పడం ప్రారంభించాడు దర్శకుడు.
జెండా కర్రని పాతడానికి ఓ చెట్టుని నరికే సీన్ నుంచే కథలో ఇంటెన్సిటీ మొదలైపోతుంది. ఊర్లోని రాజకీయం ఎలా ఉంది? ఎవరి ఆధిపత్యం ఎంత? మేకవన్నె పులులెవరు? ఈ కథకు సూత్రధారులెవరు? అనే విషయాన్ని ఒకొక్కటిగా వివరించుకొంటూ వెళ్లాడు శ్రీకాంత్ అడ్డాల.
ఈ సినిమాలో చాలా పాత్రలున్నాయి. చాలా సంఘర్షణలున్నాయి.
పెదకాపు ధైర్యం, అన్నయ్యపై తనకున్న ప్రేమ.. ఊర్లోని రాజకీయాలు, వర్గ పోరాటాలూ ఇలా చాలా విషయాలే చెప్పాల్సి వచ్చింది. అందుకనే ఏ పాత్రనీ పూర్తిగా ఓపెన్ చేయకుండా, ఏ ఎమోషన్‌నీ పూర్తిగా కనెక్ట్ చేయకపోవడంతో అన్నీ మధ్యలోనే వదిలేసిన ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకుడికి.
ప్రతీ పాత్రకూ ఓ ఐడెంటిటీ ఇవ్వడానికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గట్టిగానే ప్రయత్నించాడు. ప్రతీ పాత్రనీ శక్తిమంతంగానే చూపించాలనుకొన్నాడు. నిజానికి ప్రతీ పాత్రనీ ఒకే స్థాయిలో ప్రేమించడం గొప్ప విషయం. అయితే, అక్కడే అసలు సమస్య వచ్చింది.
ఏ పాత్రని ఫాలో అవ్వాలి? ఎవరి ఎమోషన్‌కి దగ్గర అవ్వాలి? అనే విషయంలో ప్రేక్షకుడికే కన్‌ఫ్యూజన్ మొదలైపోతుంది. ప్రతీ పాత్రనీ విడమర్చి చెప్పే ప్రయత్నంలో `లాగ్`కి దారి ఇచ్చినట్లవుతుంది. పెదకాపులో అదే జరిగింది.
ఉదాహరణకు `నాకు అబద్దం చెప్పడంలో ఎలాంటి సంకోచం ఉండదు` అని డైలాగ్ చెప్పి - ఓ అబద్దం చెప్పడం హీరోయిన్ స్టైల్. దాన్ని ఓ మేనరిజం అనుకొంటే.. ఆ మేనరిజంలోనే కాస్త కన్‌ఫ్యూజన్ ఉంటుంది.
ప్రతీ పాత్ర నర్మగర్భంగా మాట్లాడుతుంటుంది. ప్రతీ మాట వెనుక లోతైన భావాలుంటాయి. అయితే.. అవన్నీ సగటు ప్రేక్షకుడి బుర్రకు ఎక్కకపోతే.. తెరపై జరుగుతున్న సంఘర్షణకు ఏమాత్రం కనెక్ట్ అవ్వడు. `పెదకాపు`లోని పెద్ద సమస్యే ఇది.

ఫొటో సోర్స్, Twitter/Dwarakacreations
ఇది శ్రీకాంత్ అడ్డాల సినిమానేనా?
కథ చెప్పే విధానంలో దర్శకుడు అనేక పాత్రల మధ్య నలిగిపోతూ.. కన్‌ఫ్యూజ్ అయ్యాడు. రాజకీయం అంటే.. రక్త పాతం అన్నట్టు చూపించాడు. రాజకీయం అంటే వ్యూహం. ఎత్తుకు పైఎత్తు. ఇది కూడా కథలో అంతర్భాగమైతే బాగుండేది.
`మనిషి మంచోడు - అసలు మనిషంటేనే మంచోడు` అనేలా గతంలో పాత్రలు తీర్చిదిద్దిన శ్రీకాంత్ అడ్డాలనే ఈ సినిమా తీశాడా? అని చాలాసార్లు అనిపిస్తుంటుంది ప్రేక్షకుడికి. ఎందుకంటే.. అడుగడుగునా రక్తపాతమే కనిపిస్తుంది.
గోదావరి వాళ్లంటే మమకారం, చమత్కారం, వెటకారం అనుకొంటారు. శ్రీకాంత్ అడ్డాల కూడా అక్కడ పుట్టినవాడే. కానీ.. ఈ గోదారి కథలో అది మచ్చుకైనా కనిపించదు. గోదావరి ప్రాంతంలో రక్తపాతం ఉండదని కాదు. రాజకీయం లేదని కాదు. కానీ.. అక్కడ మరీ ఇంత క్రూరంగా రాజకీయాలు ఉన్నాయా? ఓ ఇంట్లోకి వందల మంది చొరబడి.. హత్యలు చేశారా? అనే అనుమానాలు అడుగడుగునా వెంటాడతాయి.
సత్య రంగయ్య పాత్ర ఈ కథకు చాలా కీలకం. హీరో ఎదుర్కోవాల్సిన బలమైన శక్తి అది. అంతటి బలవంతుడి ముందు సామాన్యుడు ఎలా నెగ్గుకు రాగలడు? అనే ప్రశ్న ప్రేక్షకుల్లో మెదులుతూ ఉంటుంది. కానీ.. ఆ పాత్రని అర్ధంతరంగా ముగించాడు దర్శకుడు.
హీరోకి చెక్ పెట్టే బలమైన శక్తిని కథలోనే లేకుండా చేశాడంటే.. ఆ తరవాత సత్య రంగయ్య కంటే శక్తిమంతమైన పాత్ర వస్తుందని ఆశిస్తాం. కానీ.. `పెదకాపు`లో అలా ఏం జరగలేదు.
ఎప్పుడైతే... హీరోకి చెక్ పెట్టగల పాత్ర కథలోంచి తప్పుకొందో, అప్పుడు సామాన్యుడు చేసే ప్రయాణంపై ప్రేక్షకులకు ఎలాంటి ఆసక్తీ ఉండదు. పెదకాపు కథలో కనిపించిన మరో బలమైన లోపం ఇది.
పసి పాప కథతో ఈ సినిమా మొదలెట్టాం అని చెప్పుకొన్నాం. ఆ పసి పాప ఎవరు? ఆమె ఈ కథని ఎలా మలుపు తిప్పింది? అనే ఆసక్తిని ఇంట్రవెల్ బ్యాంగ్ లోకి తీసుకొచ్చి ఓ చిన్న జర్క్ ఇచ్చాడు దర్శకుడు. అయితే, ఆ పాత్రని సైతం మధ్యలోనే వదిలేశాడు దర్శకుడు.

ఫొటో సోర్స్, Twitter/Dwarakacreations
శక్తిమంతమైన స్త్రీ పాత్రలు
1980ల నాటి కథలో సైతం.. రాజకీయాలపై బలమైన అవగాహక ఉన్న కొన్ని స్త్రీ పాత్రల్ని తెరపై చూపించడం ఆకట్టుకొంటుంది. అనసూయ పోషించిన అక్కమ్మ పాత్ర ఇందుకు పెద్ద ఉదాహరణ. సత్య రంగయ్య భార్య మాటలు విన్నా.. ఆమె కూడా రాజకీయాన్ని ఔపాసన పట్టిందన్న ఫీలింగ్ కలుగుతుంది.
ఈశ్వరీ రావు ఓ సగటు తల్లిగా కనిపించినా, ఆమె గుండె ధైర్యం, తెగువ ఆశ్చర్యపరుస్తాయి. స్త్రీ పాత్రలకు కావల్సినంత చోటిచ్చి.. వాళ్లనీ శక్తిమంతంతా తీర్చిదిద్దడానికి దర్శకుడు పడిన కృషి అభినందనీయం.
విరాట్ కర్ణకి ఇదే తొలి సినిమా. యాక్షన్ సీన్స్‌లో తన ప్రజెన్స్ బాగుంది. కష్టపడ్డాడు. చాలా సహజంగా నటించాడు. అయితే ఎమోషన్ సీన్స్‌లో డైలాగులు చెప్పేటప్పుడు ఇంకాస్త జాగ్రత్త అవసరం. తొలి సినిమానే కాబట్టి, చిన్నపాటి లోటు పాట్లు సర్దుకుపోవచ్చు.
కథానాయిక ప్రగతి చూడ్డానికి చాలా సహజంగా కనిపించింది. ఆ పాత్రని వెరైటీగా తీర్చిదిద్దే ప్రయత్నంలో దర్శకుడు కన్‌ఫ్యూజన్‌కి గురి చేశాడు.
రావు రమేష్‌కి ఈ సినిమాలో డైలాగులు చాలా తక్కువ. కానీ చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌తోనే భయపెట్టించాడు. తనలోని క్రూరత్వం చూపించగలిగాడు.
నరేన్ నటన సైతం ఆకట్టుకొంది. ఈ సినిమాలో సరికొత్త సర్‌ప్రైజింగ్.. శ్రీకాంత్ అడ్డాల క్యారెక్టర్. కుర్చున్న చోటే కదలకుండా ఉండే పాత్ర అది. అందులో సైతం క్రూరత్వం కనిపిస్తుంది. శ్రీకాంత్ అడ్డాల అంటే ఓ రకమైన ఇమేజ్ మనసుల్లో ముద్రించుకుపోయింది. ఈ పాత్రని చూస్తే అది పెద్ద షాక్ అవుతుంది. అక్కమ్మ పాత్రలో అనసూయ నటన బాగుంది.

ఫొటో సోర్స్, Twitter/Dwarakacreations
ఛోటా కా సత్తా!
విజువల్‌గా పెదకాపు ఉన్నతంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఛోటా కె.నాయుడు ఫొటోగ్రఫీకి పూర్తి మార్కులు పడిపోతాయి. తన విజువల్ సెన్స్ ఈ కథలో మరింత డెప్త్ తీసుకొచ్చింది. తన ఫ్రేమింగ్ సన్నివేశాలకు కొత్త మెరుపులు అద్దింది.
1980ల నాటి కథ ఇది. అప్పటి వాతావరణాన్ని ఒక్క సెట్ కూడా వేయకుండా ప్రతిబింబించారు.
మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా తన శైలికి భిన్నంగా సాగింది. పాటలు వినగానే ఆకట్టుకొనేలా మాత్రం లేవు. శ్రీకాంత్ అడ్డాల మాటలు చాలా గంభీరంగా వినిపించాయి. చాలా సంభాషణల్లో అంతర్లీనమైన కోణం, ఇంకో పార్శ్వం ఉంటాయి. అవి సగటు ప్రేక్షకుడికి అర్థమవ్వడం కష్టమే.
లెక్కకు మించిన పాత్రలు, కథలోని పార్శ్వాలు.. వీటి వల్ల చెప్పాల్సిన పాయింట్ అటూ ఇటు తిరిగి.. క్లైమాక్స్‌లో కానీ తేరుకోలేకపోయింది. ఇంతా చూస్తే.. ఇది కథలో సగమే.`పెదకాపు 2`లో మిగిలిన కథ చూడాలి.
ఇప్పటికి ప్రశ్నార్థకంగా వదిలేసిన పాత్రలు, మధ్యలోనే ఆపేసిన సంఘర్షణలకు... పార్ట్ 2లో సమాధానం దొరుకుతుందేమో చూడాలి.
(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి
- ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు: నాలుగేళ్లలో రెండు సార్లు కొత్త సిలబస్, ఇప్పుడు ‘ఐబీ’.. మరి టీచర్ల సంగతేంటి?
- డెంగీ రెండోసారి వస్తే మరింత ప్రాణాంతకమా? అంత మంది చనిపోతున్నా ఈ వైరస్‌కు సరైన టీకా ఎందుకు రాలేదు?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















