మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా రివ్యూ: అనుష్క గ్లామర్, నవీన్ కామెడీ మిక్చర్ వర్కవుట్ అయిందా?

ఫొటో సోర్స్, @MsAnushkaShetty
- రచయిత, సాహితీ
- హోదా, బీబీసీ కోసం
వీర్యదానం, కృత్రిమ గర్భధారణ నేపథ్యాలలో ఇప్పటికే కొన్ని చిత్రాలు వచ్చాయి. క్రాంతి కుమార్ దర్శకత్వంలో వచ్చిన 'తొమ్మిది నెలలు' సరోగసి నేపథ్యంలో సాగుతుంది.
బాలీవుడ్ ‘విక్కీ డోనర్’ విజయవంతమైన తర్వాత ఇలాంటి కథలు మరింతగా పెరిగాయి. కృతి సనన్ జాతీయ అవార్డు అందుకున్న 'మిమి' చిత్ర నేపథ్యం కూడా ఇలాంటిదే.
ఈ మధ్యకాలంలో వచ్చిన 'స్వాతిముత్యం'కు మూలం కూడా వీర్యదాన నేపథ్యమే.
ఇప్పుడు దాదాపు ఇలాంటి నేపథ్యంలోనే అనుష్క, నవీన్ పొలిశెట్టి జంటగా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' వచ్చింది.
మరి ఈ చిత్రం ఎలాంటి వినోదాల్ని, భావోద్వేగాలని పంచింది ?
పెళ్లి వద్దు.. కానీ తల్లి కావాలి.. ఎలా ?
అన్విత( అనుష్క) లండన్‌లో ప్రముఖ మాస్టర్ షెఫ్. ఉద్యోగం, తల్లి (జయసుధ) తప్పితే తనకి మరో ప్రపంచం లేదు. అన్వితకి పెళ్లి చేయాలని తల్లి చాలా ప్రయత్నాలు చేస్తుంది.
కానీ, అన్వితకి ప్రేమ, పెళ్లిపై నమ్మకం, ఇష్టం రెండూ ఉండవు. చివరి రోజుల్లో ఒక తోడు కావాలని ఎంత చెప్పిన అన్విత వినదు.
అన్విత తల్లి ప్రాణాంతకమైన జబ్బుతో బాధ పడుతుంటుంది. చివరి రోజులు భారత్‌లో గడపాలని కోరుతుంది. తల్లితో పాటు భారత్ వస్తుంది అన్విత.
కొద్దిరోజులకే అన్విత తల్లి చనిపోతుంది. ఐతే ఆమె చనిపోతూ చెప్పిన మాటలు అన్వితని ఆలోచనల్లో పడేస్తాయి. దీంతో తనకి తోడుగా ఓ బిడ్డ కావాలనే నిర్ణయానికి వస్తుంది.
పెళ్లి, శారీరక సంబంధం లేకుండా కృత్రిమ గర్భధారణతో బిడ్డని పొందాలని చూస్తుంది.
తనకు కావాల్సిన లక్షణాలతో వున్న వీర్యదాత కోసం వెదుకుతున్న అన్వితకు స్టాండప్ కమెడియన్ సిద్ధూ (నవీన్ పొలిశెట్టి ) పరిచయం అవుతాడు.
తర్వాత ఈ ఇద్దరి ప్రయాణం ఎలా సాగింది ? అసలు పెళ్లి, ప్రేమ అంటే అన్వితకు ఎందుకు ఇష్టం లేదు ? తన గతం ఏమిటి ? సిద్ధూతో ప్రయాణం ఆమెలో ఎలాంటి మార్పులు తెచ్చాయి ? అనేది మిగతా కథ.

ఫొటో సోర్స్, @MsAnushkaShetty
కొంత కామెడీ.. మరికొంత బోరింగ్...
పెళ్లి కాకుండా తల్లి కావాలనే ఆలోచనే విచిత్రంగా ధ్వనించవచ్చు. ఈ మాట కొందరికి విడ్డూరంగానూ అనిపించవచ్చు.
ఇలాంటి అంశాన్ని తీసుకున్న దర్శకుడు.. దాన్ని సున్నితమైన రొమాంటిక్ కామెడీ చిత్రంగా మలిచే ప్రయత్నం చేశాడు.
లండన్‌లో మొదలైన కథ ఇండియాలో ల్యాండ్ అవుతుంది. ఐతే ఈ ప్రయాణం కాస్త నెమ్మదిగా, ఊహకు ముందే అందిపోతుంటుంది.
ప్రచార చిత్రాలలో ఈ సినిమా కథ గురించి ముందే చెప్పారు.
జీవితంలో పెళ్లి చేసుకోకూడదనే ఆలోచన ఉన్న ఓ అమ్మాయి తల్లి అవ్వడం కోసం ఓ అబ్బాయి సాయం తీసుకుంటుందని ప్రచార చిత్రాలు చూసిన వారికి ముందే అర్ధమైంది.
ఇలాంటప్పుడు కథని వీలైనంత తొందరగా మొదలుపెట్టాలి. కానీ అసలు కథకు రావడానికి చాలా సమయం తీసుకున్నాడు దర్శకుడు.
దీంతో ఆ ప్రయాణం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఐతే కథానాయకుడు నవీన్ పొలిశెట్టి తెరపైకి రావడంతో కథలో అసలు హుషారు వస్తుంది.
తన స్టాండప్ కామెడీతో నవ్వించడంతో పాటు ఆఫీస్‌లో, ఇంట్లో అతని తీరు కూడా వినోదాన్ని పంచుతుంది.
సిద్ధూ, అన్విత కలిసిన తర్వాత ఇందులో అసలు కథ మొదలౌతుంది.

ఫొటో సోర్స్, @MsAnushkaShetty
ప్రేమలో అపార్ధం... హాస్యం
డ్రామాని పండించే మార్గాలు చాలా వుంటాయి.
పాత్రల అపార్థంతో కూడా డ్రామా కామెడీ పండుతుంది. ఇందులో హాస్యం డ్రామా పండించడానికి.. ఇదే మార్గం ఎంచుకున్నాడు దర్శకుడు.
అన్విత పాత్ర చాలా క్లారిటీగా వుంటుంది. చూస్తున్న ప్రేక్షకులు, తెరపై అన్విత.. క్లారిటీగా వుంటారు.
పాపం.. ఇందులో సిద్ధూకి మాత్రం అసలు విషయం తెలీదు. దాదాపు ఈ మిస్ కమ్యునికేషన్‌తోనే చాలా వరకూ సన్నివేశాలు నడిపారు.
తన అవసరం కోసం అన్విత సిద్ధూకి దగ్గరవ్వడం, హోటల్‌లో షో పెట్టిస్తానని చెప్పడం, సిద్ధూ గురించి ప్రతి విషయం ఆసక్తిగా తెలుసుకోవడంతో అన్విత అంటే సిద్ధూకి ప్రేమ పుట్టేస్తుంది.
తనకంటే వయసులో పెద్ద అమ్మాయి అయినా పర్లేదని సిద్ధూ ఇచ్చే కొన్ని రిఫరెన్స్‌లు నవ్విస్తాయి.
అయితే అపార్థపు డ్రామాని సాగదీశారు. విరామానికి ముందు అసలు విషయం సిద్ధూకి తెలుస్తుంది.
ఐతే దర్శకుడు ఆ పాత్రని ఇంకో అపార్థం వైపు నెట్టేస్తాడు.
అన్విత శారీరక సంబంధం లేకుండా బిడ్డని పొందే ప్రక్రియని ఆశ్రయిస్తుంది.
తనపై ప్రేమ లేదని తెలుసుకున్న సిద్ధూ.. శారీరకంగా కోరుకుంటుందేమో అని మళ్ళీ అపార్థం చేసుకుంటాడు.
అలా విరామానికి ముందు తర్వాత కూడా ఒక మిస్ కమ్యునికేషన్, మిస్ అండర్ స్టాండ్‌తోనే డ్రామా అంతా నడపడంతో ఒక దశలో విసుగొచ్చేస్తుంది.
పైగా ఈ ప్రేమకథలో పెద్దగా సంఘర్షణ కూడా వుండదు.
ఈ ఇద్దరూ కలిస్తే బావుంటుందనే భావన ప్రేక్షకుల్లో కలిగించడంలో దర్శకుడు మరింతగా కథ కథనంపై దృష్టి పెట్టాల్సిందనిపించింది.

ఫొటో సోర్స్, @MsAnushkaShetty
క్లైమాక్స్‌లో సంఘర్షణ ఉందా ?
అసలు జీవితంలో తనకు ప్రేమ, పెళ్లి వద్దు అనుకునే అమ్మాయి.. ప్రేమ, పెళ్లిలోని సంతోషాన్ని తెలుసుకోవడమనే మార్పు సహజంగా వుండాలి.
కానీ, ఇందులో ఆ మార్పు కృతిమంగా అలాగే ఊహకు అందినట్లే వుంటుంది. ప్రేక్షకుడు ఏదైతే ఊహిస్తాడో సరిగ్గా అదే జరిగితే అది బలహీనమైన ముగింపే అవుతుంది.
పైగా లండన్‌లో అన్విత జాడ కోసం సిద్ధూ తిరగడం, చివరికి ఓ బజ్జి తిని ఇది అన్విత చేసిందే అని తెలుసుకోవడం.. పాత ట్రీట్‌మెంట్‌లా అనిపిస్తుంది.
అన్విత గతం కూడా ఇందులో కీలకం. ఐతే ఆ గతం కూడా కాస్త రొటీన్‌గానే వుంటుంది.
తల్లితండ్రులు విడిపోయారని చిన్నప్పటి నుంచి ఆ బాధని మోసిన అన్విత.. తన జీవితంలో అలాంటివి ఉండకూదని ప్రేమ పెళ్లి వద్దు అనుకుంటుంది.
ఇలాంటి పాత్రలు తెరపై ఇదివరకే వచ్చాయి. ఐతే అన్వితలో వచ్చిన మార్పుని, సిద్ధూపై వున్న ప్రేమని సహజంగా సన్నివేశాల ద్వారా చెప్పుంటే ఆ ప్రభావం వేరుగా వుండేది.
చివర్లో ఒక పాటతో చెప్పే ప్రయత్నం ఆకట్టుకోలేకపోయింది.

ఫొటో సోర్స్, @MsAnushkaShetty
అనుష్క, నవీన్ .. ఇద్దరూ అదరహో!
ఇది అన్విత కథ. ఆ పాత్రలో అనుష్క హుందాగా చేసింది. తన అనుభవం జోడించి పాత్రకు న్యాయం చేసింది.
నిజానికి కొంచెం అటు ఇటు జరిగినా అడల్ట్ టోన్‌లోకి మారిపోయే పాత్రది. కానీ అనుష్క ఆ పాత్రని ఎంతో సమన్వయంతో పండించింది.
తెరపై చాలా అందంగా కనిపించింది. క్లైమాక్స్‌లో భావోద్వేగాలు పలికించి తీరు ఆకట్టుకుంటుంది.
జాతిరత్నాలు తర్వాత నవీన్ నుంచి వచ్చిన సినిమా ఇది.
సిద్ధూ పాత్రలో చాలా సహజంగా కనిపించాడు. తన కామెడీ టైమింగ్ బావుంది.
సిద్ధూ పాత్రని చాలా లైవ్లీగా చేశాడు. స్టాండప్ కామెడీలో కొన్ని నవ్వులు పండాయి.
అనుష్క లార్జర్ దెన్ లైఫ్ పాత్రలు చేసిన నటి, ఆమె ముందు నటించి కనిపించడం అంత సులువు కాదు.
కానీ, నవీన్ ఈ విషయంలో మార్కులు కొట్టేశాడు. సినిమా అంతా చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు.
తల్లి పాత్రలో చేసిన జయసుధది చిన్న పాత్రే కాని మంచి పాత్ర. ఆమె హుందాగా చేశారు.
బాలకృష్ణ అభిమానిగా నవ్వించారు కూడా. సిద్దు తల్లిదండ్రులుగా చేసిన మురళి శర్మ, తులసి కూడా చక్కటి వినోదం పంచారు.
నాజర్ అభినవ్ గోమతంతో పాటు మిగతా పాత్రలు పరిధి మేర వున్నాయి.

ఫొటో సోర్స్, @MsAnushkaShetty
సంగీతం బలహీనత
రొమాంటిక్ కామెడీలకు పాటలు బావుండాలి. ఇందులో గుర్తుపెట్టుకుని పాడుకునే పాట ఒక్కటీ లేదు.
దాదాపు పాటలన్నీ తేలిపోయాయి. నేపథ్య సంగీతం మాత్రం ఫర్వాలేదని అనిపిస్తుంది.
నీరవ్ షా కెమెరా పనితనం మాత్రం చక్కగా వుంది. విజువల్స్‌ని చాలా ఆహ్లాదకరంగా చూపించారు.
ఎడిటింగ్ ఇంకా పదునుగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.
దర్శకుడు కాన్సప్ట్‌ని బాగానే అనుకున్నాడు. కానీ భావోద్వేగాలు, సహజమైన డ్రామాపై దృష్టి పెట్టుంటే ఫలితం ఇంకా బావుండేది.
‘నన్ను ప్రేమించవా అని అడిగావు కానీ.. నీతో నేను వుంటాను అని అడగలేదు’’ అని మురళిశర్మ చెప్పిన డైలాగు కథలో చక్కగా కుదిరింది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు, జగన్ ఎన్నికల హామీ ఏమైంది?
- వీర్యం, అండాలు లేకుండా తొలిసారిగా పిండం తయారీ...ఐవీఎఫ్ సక్సెస్ రేట్ పెంచవచ్చా?
- ‘‘కెనడా వెళ్తున్నానని చెప్పి హైదరాబాద్ వచ్చేశాడు, నా కొడుకును క్షమించి వదిలేయండి”...భారత్‌కు ఓ పాకిస్తానీ తల్లి వేడుకోలు
- ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ వల్ల దేశంలో రాజ్యాంగ సంక్షోభం వస్తుందా?
- వివాహం: సహజీవనంలో ఉండే మహిళకు చట్టంలో రక్షణ ఉండదా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















