స్కంద రివ్యూ: బోయపాటి ఎలివేషన్లు, హీరోయిజం మళ్లీ పనిచేశాయా? ఇద్దరు సీఎంలలో ఎవరు గెలుస్తారు?

ఫొటో సోర్స్, Facebook/Srinivasaa Silver Screen
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
ప్రతీ దర్శకుడికీ ఓ బలం ఉంటుంది. బోయపాటి శ్రీనుకీ ఉంది. హీరోని ఆకాశమంత స్థాయిలో చూపించి, తను ఏం చేసినా చెల్లుతుంది అనే స్థాయికి ప్రేక్షకుడ్ని తీసుకెళ్లడం. సదరు ప్రేక్షకుడు అదే భ్రమలో ఉండగానే తాను చెప్పాలనుకొన్న కథని చెప్పేసి ముగించడం ఆయన స్టైల్.
తన గత సినిమాలన్నీ అలానే వర్కవుట్ అయ్యాయి. హీరోయిజం, ఎలివేషన్లు, కాస్త ఎమోషన్.. ఇవన్నీ బోయపాటి సినిమాల ముడి సరుకులు, మూల స్తంభాలు.
ఇలాంటి కథల్లో.. రామ్ పోతినేని కూడా ఫిట్ అవుతాడు. ‘ఇస్మార్ట్ శంకర్’తో అది రుజువైంది. ఆ సినిమా రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
అందుకే వీరిద్దరి కాంబోలో రూపొందిన స్కందపై పెద్ద అంచనాలే ఏర్పడ్డాయి. మరి.. ఈ సినిమా ఎలా ఉంది? బోయపాటి తన బలాన్ని ఎంత వరకు చూపించగలిగాడు?

ఫొటో సోర్స్, Facebook/Srinivasaa Silver Screen
ఇద్దరు ముఖ్యమంత్రుల పగ
ఆంధ్రా సీఎం, తెలంగాణ సీఎం.. ఇద్దరూ మంచి దోస్తులు. కానీ.. ఏపీ సీఎం కూతుర్ని, తెలంగాణ సీఎం కొడుకు పెళ్లి మండపం నుంచి ఎత్తుకెళ్లిపోతాడు. దాంతో స్నేహితుల మధ్య పగ, ప్రతీకారాలూ మొదలవుతాయి.
మరోవైపు.. రుద్రగంటి రామకృష్ణ రాజు (శ్రీకాంత్) అనే ఓ పారిశ్రామిక వేత్త చేయని నేరానికి జైలుకు వెళ్తాడు. కోర్టు తనకు ఉరిశిక్ష విధిస్తుంది.
ఇంతకీ రుద్రగంటి రామకృష్ఱ రాజుని ఎవరి ఇరికించారు? ఆయనను కాపాడడానికి ఎవరొచ్చారు? ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరిపై ఒకరు పగ తీర్చుకున్నారా? ఇవన్నీ తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
కథకు ఆసక్తికరమైన ప్రారంభం ఇచ్చాడు దర్శకుడు. ఇద్దరు సమ ఉజ్జీలు శత్రువులు అయితే.. ఎలా ఉంటుందన్న కోణంలోంచి కథ మొదలెట్టాడు.
మరోవైపు.. రుద్రగంటి రామకృష్ణరాజు కథనీ చెప్పుకొంటూ వెళ్లాడు. మొదటి పావుగంటా హై ఓల్టేజీ సీన్లు,ఎమోషన్లతో సాగుతుంది. అయితే.. ఆ కాసేపూ హీరో కనిపించడు. సదరు పండుగలో దున్నపోతుల పోరాట ఘట్టం నుంచి.. హీరోని ఇంట్రడ్యూస్ చేశాడు. అక్కడి వరకూ కథ మాస్ ఎలిమెంట్స్‌తో నిండిపోతుంది.

ఫొటో సోర్స్, Facebook/Srinivasaa Silver Screen
ఇద్దరు సీఎంలలో పైచేయి ఎవరిది?
శ్రీలీల పరిచయం, తనని హీరో కాలేజీలో `యావరేజ్` అంటూ టీజ్ చేయడం.. ఇవన్నీ సరదాగానే సాగిపోయాయి. ఇద్దరు ముఖ్యమంత్రులలో ఎవరు ఎవరిపై ఆధిపత్యం చెలాయిస్తారు? చివరికి ఎవరు గెలుస్తారు? అనే ఆసక్తీ మొదలవుతుంది.
సీఎం కూతుర్ని తిరిగి తీసుకొచ్చే మిషన్‌లో ఎవరున్నారు? అనేది ప్రేక్షకుడు పసిగట్టేలోపు, దానికి ఇంకో ట్విస్టు జోడించడంతో విశ్రాంతి ఘట్టానికి కాస్త ఊపొస్తుంది.
ద్వితీయార్ధంలో రుద్రగంటి రామకృష్ణ రాజు కథ మొదలెట్టాడు దర్శకుడు. రామకృష్ణరాజు ఎవరు? అతనికి వచ్చిన సమస్య ఏమిటి? రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తన జీవితంలో ఎలా ఆడుకొన్నారు? ఇవన్నీ సెకండాఫ్ కోసం అట్టిపెట్టారు. అక్కడ ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా కాస్త కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Facebook/Srinivasaa Silver Screen
లాజిక్ ఏది, బోయపాటి?
కమర్షియల్, మాస్ మసాలా సినిమాలకు ఓ వెసులుబాటు ఉంటుంది. లాజిక్కుల్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. `సినిమాలో ఇలాంటివి జరుగుతాయి లెండి` అంటూ లైట్‌గా తీసుకొనే ఛాన్స్ ఉంది. కాకపోతే.. దాన్ని ఆసరాగా చేసుకొని సినిమా మొత్తం లాజిక్ లేకుండా తీయకూడదు. స్కందలో ఇలాంటి సీన్లు చాలా కనిపిస్తాయి.
ఇద్దరు ముఖ్యమంత్రుల్ని ఓ సామాన్యుడు గడగడలాడించడం, సీఎం ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇవ్వడం, ప్రహారీ బద్దలు కొట్టుకొని మరీ ఇంట్లోకి ప్రవేశించి కత్తికో కండ కింద నరుక్కొంటూ వెళ్లడం అతి అనిపిస్తుంది.
సీఎంలు ఇద్దరూ వీధి రౌడీల్లా ఊర్లో కత్తులు పట్టుకొని తిరుగుతుంటే.. ప్రేక్షకులు చోద్యం చూడాల్సిన పరిస్థితి.
సీఎం కూతురైన హీరోయిన్‌ని ఎత్తుకొస్తే తనేమో.. ఆ ఊర్లో ఏదో చుట్టాలింటికి వచ్చినట్టు పొలం గట్టు మీద హాయిగా తిరిగేస్తూ ఉంటుంది. వందలు, వేల మంది... మీద పడిపోతున్నా, వాళ్లందర్నీ హీరో ఒంటి చేత్తో కొట్టేస్తుంటాడు. ఓ బాణం వదిలితే.. కరెంటు వైర్లు తెగిపోయి, అవి కాస్త బాంబుల్లా పేలిపోతుంటాయి.
సీఎం ఇంటి ముందు హీరో కత్తి పట్టుకొని నరుక్కుంటూ వెళ్తుంటే.. పోలీసులు చేతుల్లో తుపాకులు పెట్టుకొని కూడా.. ఆశ్చర్యంగా హీరో వంక చూస్తుంటారు. ఇవన్నీ బోయపాటి సినిమాల్లోనే సాధ్యం అయ్యే మ్యాజిక్కులు మరి!

ఫొటో సోర్స్, Facebook/Srinivasaa Silver Screen
బూమ్ బూమ్ బ్రాండ్లపై సెటైర్
దర్శకుడు తనకు వచ్చినట్టు స్క్రిప్టు రాసుకొని, నచ్చినట్టు తీశాడని చాలా సందర్భాల్లో అర్థమైపోతుంది. ఎలివేషన్లు కంటే ఎమోషన్లు ముఖ్యం. వాటిని మాత్రం బోయపాటి పట్టించుకోలేదు.
అమ్మానాన్నలతో ఉండాలని విదేశాల్లో కోట్లాది రూపాయల జీతం వదిలేసి హీరో సొంతూరుకి వచ్చేస్తాడు. ఈ సీన్ ఎలివేట్ చేసేటప్పుడు రాసిన డైలాగులు, తీసిన లాజిక్కులు కృతకంగా అనిపిస్తాయి. చాలా సినిమాల్లో ఇలాంటి ఎమోషన్లే చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
తల్లిదండ్రులంటే అంత ఇష్టం ఉంటే, ఉద్యోగం చేయాల్సిన పనే లేదనుకొంటే.. ఆ నాలుగేళ్లు కూడా సొంతూరులోనే, తల్లిదండ్రులతోనే ఉండొచ్చు కదా? అని అడగాలనిపిస్తుంది.
బోయపాటి తీసిన ప్రతీ సినిమాలోనూ ఎక్కడో ఓ చోట పొలిటికల్ టచ్ ఉంటుంది. ఈ సినిమాకీ పాలిటిక్స్‌కీ సంబంధం లేదు కానీ, కొన్ని చోట్ల పొలిటికల్ డైలాగులు వినిపించాయి. ఉచిత పథకాలపై, బూమ్ బూమ్ బ్రాండ్లపై బోయపాటి మార్క్ సెటైర్ వినిపిస్తుంది.
యాక్షన్ సీన్లు మరీ ఓవర్ ది బోర్డ్ అనిపిస్తాయి. మాస్‌కి ఓకే. కానీ కుటుంబ ప్రేక్షకులకు అవి రుచించకపోవొచ్చు.

ఫొటో సోర్స్, Facebook/Srinivasaa Silver Screen
రామ్ ఎలా చేశాడు?
రామ్ పోతినేని క్యారెక్టర్లో చాలా కోణాలున్నాయి. తెలంగాణ యాస ఔపాసన పట్టేశాడు. ఆ యాసలో చెప్పిన ప్రతీ డైలాగ్ `బరాబర్` ఉంది. గెటప్ బాగుంది. యాక్షన్ సీన్లలో ఇరగదీశాడు. క్లైమాక్స్‌లో తనలోని మరో కోణం బయటికొచ్చింది. డాన్సులైతే.. నెక్ట్స్ లెవల్.
శ్రీలీల కూడా డాన్సుల్లో అదరగొట్టింది. అయితే ఆమెకు నటించడానికి పెద్దగా స్కోప్ దొరకలేదు. సెకండాఫ్‌లో తను కనిపించింది కూడా తక్కువే.
శ్రీకాంత్ పాత్ర హుందాగా ఉంది. దగ్గుపాటి రాజా చాలా కాలం తరవాత కనిపించారు. తన క్యారెక్టర్ కూడా పవర్‌ఫుల్‌గా ఉంది.
గౌతమి లాంటి సీనియర్ నటికి ఒకే ఒక్క డైలాగ్ ఇచ్చారు. తెరపై చాలా మంది నటీనటులు కనిపిస్తారు. కేవలం బ్యాక్ గ్రౌండ్ ప్రాపర్టీలా ఉంటారు. ఇద్దరు విలన్లూ రొటీన్‌గా కనిపించారు.
సాంకేతికంగా చూస్తే.. నిర్మాతలు క్వాలిటీ కోసం డబ్బులు వెదజల్లినట్టు అర్థం అవుతుంది. ప్రతీ ఫ్రేములోనూ వందల కొద్దీ ఆర్టిస్టులు కనిపిస్తారు. ఎలివేషన్ల కోసమే కొంత బడ్జెట్ కేటాయించారేమో అనిపిస్తోంది.
యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ సుదీర్ఘంగా సాగాయి. వాటిని బాగానే కంపోజ్ చేసినా, కొన్ని చోట్ల రక్తపాతం ఎక్కువైంది.
ఫొటోగ్రఫీ నీట్‌గా ఉంది. సినిమాని కలర్‌ఫుల్‌గా తీశారు.
డైలాగ్స్‌లో గుర్తు పెట్టుకునేవేం లేవు.
బోయపాటి హీరోయిజాన్ని తప్ప ఎక్కడా ఎమోషన్స్‌ని పట్టుకోలేదు. అఖండలో ఎలివేషన్స్‌తో పాటు ఓ కథ కూడా ఉంటుంది. ఈసారి అది మిస్ అయ్యింది.
లాజిక్ లేని సన్నివేశాలు ఇబ్బంది పెడతాయి. మాస్‌కి ఫైట్స్ కావాలి, ఎలివేషన్లే కావాలి అనుకునేవారికి కూడా `స్కంద` ఓకే అనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి
- డెంగీ రెండోసారి వస్తే మరింత ప్రాణాంతకమా? అంత మంది చనిపోతున్నా ఈ వైరస్‌కు సరైన టీకా ఎందుకు రాలేదు?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














