‘సిల్క్ స్మిత ఎప్పుడూ గ్లామరస్‌గా నటించాలని అనుకోలేదు, కానీ..’

సిల్క్‌ స్మిత
ఫొటో క్యాప్షన్, సిల్క్‌ స్మిత
    • రచయిత, విక్రమ్ రవిశంకర్, హేమ రాకేష్
    • హోదా, బీబీసీ కోసం

"ఆమె సావిత్రిని ప్రేమించింది. సావిత్రిలా నటించాలనుకుంది. అంతే కానీ గ్లామరస్‌గా నటించాలని అనుకోలేదు” - సిల్క్‌స్మిత గురించి తమిళ వెటరన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ హేమ మాలిని చెప్పిన మాటలివి.

1970ల్లో భారతీయ సినిమాల్లో ఒక ట్రెండ్‌గా స్థిరపడింది క్లబ్ డాన్స్. దక్షిణాది సినిమాలో క్లబ్ డ్యాన్స్‌తో పేరు తెచ్చుకున్న నటీమణులు జయమాలిని, అనురాధ, డిస్కో శాంతి. ఈ జాబితాలో ఇంకా చాలా మంది ఉన్నారు.

వీరు తెరపైన కనిపించినప్పుడల్లా థియేటర్లలో ఈలల మోత మోగేది. ‘‘ఇదేంటి.. సగం సగం బట్టలేంటి '' అని ముఖం చిట్లించిన మహిళలు కూడా ఉన్నారు.

అయితే మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా మెచ్చిన అందం, నటన, డాన్స్ మాత్రం సిల్క్ స్మితవే.

కుర్రకారు గుండెలను కొల్లగొట్టిన నటిగా గుర్తింపు పొందిన సిల్క్‌ స్మిత అసలు పేరు విజయ లక్ష్మి.

ప్రత్యేక గీతాలు, చిన్న, పెద్ద పాత్రలతో వెండితెర మీద రెండు దశాబ్దాల పాటు వెలుగులీనిన సిల్క్‌స్మిత అనుమానాస్పద పరిస్థితుల మధ్య ఆత్మహత్య చేసుకున్నారు.

తమిళ సినిమాల్లో సిల్క్ స్మితకు గొంతు ఇచ్చిన డబ్బింగ్ ఆర్టిస్ట్ హేమమాలిని, ఆమె గురించి వివిధ ఆసక్తికర అంశాలను బీబీసీతో పంచుకున్నారు.

హేమమాలిని, డబ్బింగ్ ఆర్టిస్ట్
ఫొటో క్యాప్షన్, తమిళ డబ్బింగ్ ఆర్టిస్ట్ హేమమాలిని

సిల్క్ స్మిత ప్రత్యేకం

“డబ్బింగ్ ఆర్టిస్ట్ కావడం చాలా ప్రత్యేకం. చాలా మంది హీరోయిన్లకు నేనే డబ్బింగ్ చెప్పాను. తమిళంలో అంబికా, రాధ, సుమలత, తెలుగులో మాధవితో పాటు ఇతర భాషల్లోనూ వాయిస్ ఇచ్చాను. కానీ అందరి కంటే సిల్క్‌స్మిత ప్రత్యేకం” అని హేమమాలిని చెప్పారు.

“ ఓ నటికి టచప్ గర్ల్‌గా ఉన్న విజయలక్ష్మి అనే అమ్మాయిని నటిని చేసాడు నటుడు విను చక్రవర్తి. ఆ టచప్‌ గర్ల్ ఎవరో కాదు.. సిల్క్ స్మిత. వండిచక్రం సినిమాలో చిన్న పాత్రతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టారామె. నా గొంతు ఆమెకు సరిపోతుందని విను చక్రవర్తి నన్ను పిలవలేదు. హస్కీగా మాట్లాడాలని చెప్పారు. నేను సిల్క్‌ స్మితను చూసినప్పుడు ఆమె చాలా ఆకర్షణీయంగా కనిపించారు. ఆమె హస్కీగా మాట్లాడితే ఎలా ఉంటుందో అని ప్రయత్నించి డబ్బింగ్ చెప్పాను” అని ఆమె సిల్క్‌ స్మితతో తన పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు.

సిల్క్ స్మిత
ఫొటో క్యాప్షన్, ప్రత్యేక గీతాలతో అలరించిన తార

ఫ్యాషన్‌పై ఆసక్తి

సిల్క్‌ స్మితను తమిళ ప్రేక్షకులకు దగ్గర చేసింది ఆమె కళ్లే కాదు, గొంతు కూడా. సిల్క్‌ స్మిత చేసిన పాత్రల్లో అలాంటి గొంతు అయితేనే సరిపోతుందని దర్శకులు భావించారు.

తాను డబ్బింగ్ చెప్పడానికి వెళ్లినప్పుడు అంతకు ముందు ఆమె చేసిన పాత్ర చూపించి, అలాగే మాట్లాడాలని అడిగేవారని హేమమాలిని చెప్పారు.

సిల్క్ స్మితకు ఫ్యాషన్ అంటే చాలా ఆసక్తి. ఆమె దుస్తులు ఇతర నటీమణుల కంటే భిన్నంగా ఉండేవి.

ఆ సమయంలో నటీనటులు, డ్యాన్సర్లు చిత్రబృందం అందించిన దుస్తులు ధరించడం తప్పనిసరి. కానీ, సిల్క్ స్మితకు మాత్రమే ఆ విషయంలో మినహాయింపు ఉంది. తన దుస్తులను తానే డిజైన్ చేసుకునేవారామె. దీనిని దర్శకులు కూడా ప్రోత్సహించారు.

సిల్క్ స్మిత
ఫొటో క్యాప్షన్, సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన తొలి నాళ్లలో సిల్క్ స్మిత

‘డర్టీ పిక్చర్’‌కు డబ్బింగ్ ఎందుకు చెప్పలేదు?

తమిళంలో సిల్క్ స్మిత నటించిన సినిమాలన్నింటిలోనూ ఆమె పాత్రకు హేమమాలిని డబ్బింగ్ చెప్పినా, సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘డర్టీ పిక్చర్‌’లో మాత్రం సిల్క్ పాత్రకు గొంతు ఇచ్చేందుకు ఆమె అంగీకరించలేదు.

ఈ చిత్రంలో సిల్క్ స్మిత పాత్రను విద్యా బాలన్ పోషించారు.

“డర్టీ పిక్చర్ టీమ్ నన్ను సంప్రదించింది. కానీ అందులో నాకు ఆసక్తి లేదు అని చెప్పాను. ఎందుకంటే ఆ చిత్రంలో నిజం లేదని నేను అనుకుంటున్నాను. సిల్క్ స్మిత వ్యక్తిగత జీవితంలో ఏం జరిగిందో తెలిసిందే. అందుకే వద్దన్నాను. సిల్క్ స్మిత చనిపోయాక ఆమెలాగే డబ్బింగ్ చెప్పమని కొంత మంది హీరోయిన్లు అడిగారు’’ అని హేమమాలిని వివరించారు.

‘‘సిల్క్ స్మితకు నటన ఇష్టం. గ్లామర్ పాత్రలు, ప్రత్యేక గీతాలు, క్లబ్ డాన్సుల గురించి ఏనాడూ ఆలోచించలేదు. ఆమె సావిత్రితో కలిసి నటించాలనుకున్నారు. సావిత్రి కూడా సిల్క్‌స్మితతో కలిసి సినిమాలు చేయాలనుకున్నారు. ఇద్దరూ దక్షిణాది సినిమా మీద ప్రత్యేక ముద్ర వేసినా, అభిమానుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నా.. తమ కోరిక నెరవేరకుండానే చనిపోయారు’’ అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)