డెంగీ రెండోసారి వస్తే మరింత ప్రాణాంతకమా? అంత మంది చనిపోతున్నా ఈ వైరస్‌కు సరైన టీకా ఎందుకు రాలేదు?

డాక్టర్ సౌమ్య స్వామినాథన్
ఫొటో క్యాప్షన్, డాక్టర్ సౌమ్య స్వామినాథన్
    • రచయిత, ప్రమీల కృష్ణన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రెండు నెలలుగా భారత్‌లోని అన్ని రాష్ట్రాల్లో డెంగీ జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. బాధితుల సంఖ్య నాలుగు లక్షల పైనే.

డెంగీ కారణంగా గడిచిన రెండేళ్లలో దాదాపు 600 మందికిపైగా చనిపోయారు.

ఒకవైపు కేసుల సంఖ్య పెరుగుతుంటే, మరోవైపు డెంగీకి వ్యాక్సీన్ కోసం జరుగుతున్న ప్రయోగాలు విఫలమవుతున్నాయి. దీంతో మరణాలను నివారించడం పెద్ద సవాల్‌గా మారిందని నిపుణులు చెబుతున్నారు.

ఈడిస్ ఈజిప్టి అనే దోమ కారణంగా డెంగీ వ్యాధి సోకుతుంది. ఈ దోమ కలుషిత నీటిలో కంటే నిల్వ ఉన్న నీటిలోనే ఎక్కువగా ఉంటుంది. దోమల నివారణ, వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే డెంగీ నుంచి కాపాడుకోవచ్చని భారత వైద్య శాఖ సూచిస్తోంది.

డెంగీకి వ్యాక్సీన్ కనుక్కోవడంలో ఎదురవుతున్న సవాళ్లేంటి? ఔషధాలు ఎందుకు విఫలమవుతున్నాయనే విషయాలు తెలుసుకునేందుకు నిపుణులను బీబీసీ సంప్రదించింది.

అలాగే, డెంగీ నివారణపై జర్నల్స్‌లో ప్రచురితమైన అధ్యయనాల నుంచి కూడా సమాచారం సేకరించింది.

డెంగీ

ఫొటో సోర్స్, Getty Images

కరోనా కన్నా డెంగీ ప్రమాదకరం: సౌమ్య స్వామినాథన్

మేం మొదట డాక్టర్ సౌమ్య స్వామినాథన్‌ను కలిశాం. ఆమె కరోనా సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ సైంటిస్ట్‌గా ఉన్నారు.

కరోనా వైరస్ కంటే డెంగీ వైరస్ ప్రమాదకరమని ఆమె చెప్పారు. ఎందుకంత ప్రమాదకరమైనదంటే, ఇప్పటి వరకూ డెంగీ నివారణకు వ్యాక్సీన్ అందుబాటులో లేకపోవడమేనని ఆమె అన్నారు.

''డెంగీ వైరస్ నాలుగు రకాలు. వాటిని డెంగీ 1, డెంగీ 2, డెంగీ 3, డెంగీ 4లుగా వ్యవహరిస్తారు. ప్రతి సంవత్సరం వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వైరస్ రకాలు ప్రభావం చూపిస్తాయి. ఒక రకం డెంగీ వైరస్ సోకితే మరో రకం డెంగీ వ్యాక్సీన్ పనిచేయదు.''

''నాలుగు రకాల వైరస్‌లకూ ఒక సురక్షితమైన టీకా రావాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఒకే వ్యాక్సీన్ కనుక్కోవడం సాధ్యం కావడం లేదు. ఎందుకంటే, ప్రతి సంవత్సరం వేర్వేరు దేశాల్లో, ఒకటి కంటే ఎక్కువ రకాల డెంగీ వైరస్‌లు కనిపిస్తున్నాయి'' అని సౌమ్య చెప్పారు.

''2015లో కనిపెట్టిన డెంగీ వ్యాక్సీన్ విఫలమైంది. నాలుగు రకాల వైరస్‌లపై ఒకే ఇంజెక్షన్ ప్రభావవంతంగా పనిచేయలేకపోయింది'' అని అమెరికాలో ఔషధ రంగ నిపుణులు కె.ముత్తుమణి చెప్పారు.

ఆయన బయోఫార్మాస్యూటికల్ కంపెనీలో ప్రిన్సిపల్ రీసర్చ్ ఆఫీసర్‌గా పనిచేశారు.

డెంగీ

ఫొటో సోర్స్, Getty Images

తొలి టీకా వివాదాస్పదం

ఫ్రెంచ్ కంపెనీ సనోఫి పాస్టర్ డెంగ్‌వాక్సియా పేరుతో తొలి టీకా తీసుకొచ్చింది. 2015లో ఈ ఇంజెక్షన్‌ మెక్సికోలో క్లినికల్ ట్రయల్స్‌‌కి ఆమోదం పొందింది. ఈ ఔషధాన్ని 9 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు వారికి మాత్రమే ఉపయోగించాలని సనోఫి పాస్టర్ తెలిపింది.

ఈ ఔషధం ఎలా వాడుకలోకి రాకుండా పోయిందో ముత్తుమణి వివరించారు.

''2015 తర్వాత రెండేళ్లలోనే చాలా దేశాల్లో ఈ డెంగ్‌వాక్సియా వాడుకలోకి వచ్చింది. అయితే, కొన్ని నెలల్లోనే ఈ వ్యాక్సీన్ సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తాయి.

కొన్ని దేశాల్లో నాలుగు రకాల డెంగీ వైరస్‌ల కంటే ఎక్కువ వేరియంట్లు కనిపించాయి. దీంతో అది ప్రభావవంతంగా పనిచేయడం లేదని తేలింది.

దానికితోడు చిన్నపిల్లలతో పాటు వయసు పైబడిన వారు ఉపయోగించకూడదని చెప్పడంతో అది మరుగునపడిపోయింది'' అని ఆయన చెప్పారు.

2017లో ఫిలిప్పీన్స్‌లో స్కూల్ పిల్లలకు డెంగ్‌వాక్సియా వేశారు. కొద్దివారాల తర్వాత వారిలో డెంగీ లక్షణాలు కనిపించాయి.

ఈ వ్యాక్సీన్ కారణంగా 130 మంది చిన్నారులు చనిపోయినట్లు అదే ఏడాది ఫిలిప్పీన్స్‌ వైద్య శాఖ తెలిపింది. ఆ తర్వాత ఇతర దేశాల్లో ఈ టీకా వినియోగం వివాదాస్పదంగా మారింది.

దీంతో థాయిలాండ్, బ్రెజిల్, ఎల్ సాల్వడార్, పరాగ్వే, గ్వాటెమాల, పెరూ, ఇండోనేషియా, ఇతర దేశాల్లో క్రమంగా ఈ టీకాను నిలిపివేసినట్లు సైన్స్ జర్నల్‌ తెలిపింది.

డెంగ్యూ

ఫొటో సోర్స్, Getty Images

రెండోసారి సోకితే ముప్పు ఎక్కువ

ఇతర వైరస్‌లకు, డెంగీ వైరస్‌కు చాలా తేడా ఉందని, చాలా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావొచ్చని డాక్టర్ సౌమ్య చెప్పారు.

ఒకసారి డెంగీ నుంచి కోలుకున్న వ్యక్తికి మరోసారి డెంగీ వైరస్ సోకితే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉందన్నారు.

''ఒకసారి వైరస్‌ సోకి, దాని నుంచి కోలుకుంటే మరోసారి అదే వైరస్ సోకినా అప్పటికే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే, డెంగీ విషయంలో అలా జరగదు. రెండోసారి డెంగీ సోకితే, మొదటిసారి కంటే ప్రాణాంతక పరిస్థితి ఎదురుకావొచ్చు. ఎందుకంటే, మొదటిసారి ఒక వేరియంట్ సోకి, రెండోసారి మరో వేరియంట్ సోకవచ్చు. అది ప్రమాదకరంగా మారుతుంది. అందువల్ల శరీరంలో ఒక వేరియంట్‌కి వ్యతిరేకంగా వృద్ధి చెందిన రోగనిరోధక శక్తి, రెండోసారి సోకిన వేరియంట్‌పై పనిచేయడం అనుమానమే'' అని ఆమె చెప్పారు.

ప్రపంచమే లాక్‌డౌన్‌ అయ్యేలా చేసిన కరోనా వైరస్‌లో కూడా చాలా వేరియంట్లు ఉన్నాయి. అయితే, వ్యాక్సీన్ కనుగొనడంతో దానికి పరిష్కారం లభించింది. కానీ, నాలుగు డెంగీ వైరస్ రకాలు ఎందుకంత ప్రాణాంతకమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

''కరోనా వైరస్‌లో అన్ని వేరియంట్లు ఉన్నప్పటికీ వ్యాక్సీన్ ఎలా పనిచేసిందో ఆశ్చర్యకరం. కానీ, ఏళ్లు గడుస్తున్నా డెంగీకి టీకా రాలేదు. ఇది ప్రకృతి వైపరీత్యం అనుకోవాలి. ప్రతి వైరస్‌‌కి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. కాబట్టి, డెంగీ వైరస్‌పై మరింత పరిశోధన జరిగితే మాత్రమే పరిస్ధితి మెరుగవుతుంది. కరోనా వైరస్ విషయంలో మనం అదృష్టవంతులమని చెప్పాలి. డెంగీ విషయంలో ఇంకా అలా జరగలేదు'' అని ఆమె చెప్పారు.

అంత తేడా ఉండటం వల్లే డెంగ్‌వాక్సియా తర్వాత జపాన్ కంపెనీ ఉత్పత్తి చేసిన వ్యాక్సీన్ కూడా అందుబాటులోకి రాలేదు.

ముత్తుమణి

మరికొన్ని అనుమానాలు

అనేక అధ్యయనాల తర్వాత టకేడా ఫార్మాస్యూటికల్ కంపెనీ 2022లో టీఏకే 003 వ్యాక్సిన్‌ను తీసుకొచ్చింది.

ఈ వ్యాక్సీన్ కూడా విఫలమైంది.

''టీఏకే 003 వ్యాక్సీన్ డెంగీ వైరస్‌లోని మూడు వేరియంట్లపైనే పనిచేస్తోందని, నాలుగో వేరియంట్‌పై ప్రభావం చూపలేకపోయినట్లు క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. కొన్ని లోపాలు, ప్రతికూల ప్రభావం చూపినట్లుగా కూడా ట్రయల్స్‌లో బయటపడడంతో టీకా సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తాయి. దీంతో ఈ టీకాను కూడా నిలిపివేశారు'' అని ముత్తుమణి వివరించారు.

ఆ తర్వాత బ్రెజిలియన్ టీకా బుటాంటన్-డీవీపై సమాచారం సేకరించాం.

సుమారు 16 వేల మందిపై మూడోసారి నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ఈ టీకా 79.6 శాతం ప్రభావవంతంగా పనిచేసినట్లు తేలిందని బ్రెజిల్ ప్రభుత్వం తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. దీంతో ఈ టీకా పనితీరు ప్రశ్నార్థకంగా మారింది.

అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, ప్రపంచవ్యాప్తంగా పేరున్న మెర్క్, గ్లాక్సోస్మిత్‌క్లైన్ వంటి ప్రైవేట్ ఫార్మాస్యూటికల్ కంపెనీలు కూడా డెంగీ వ్యాక్సీన్‌పై అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొన్నాయి.

ఇండియాలోనూ ప్రభుత్వ రంగ సంస్థతో పాటు మరో రెండు ప్రైవేటు కంపెనీలు అధ్యయనాలు కొనసాగిస్తున్నాయి.

డెంగ్యూ

ఫొటో సోర్స్, Getty Images

వైరస్‌లో మార్పులు

డెంగీ వైరస్‌లోని నాలుగు వేరియంట్లపై పనిచేసే వ్యాక్సీన్ లేకపోవడమే ప్రధాన సమస్య. డెంగీ దోమల వ్యాప్తి ప్రమాదకర దశకు చేరుకుంటోంది.

ఇప్పటి వరకూ ఉష్ణమండల ప్రాంతాల్లో మాత్రమే కనిపించే డెంగీ దోమల వ్యాప్తి, ఇప్పుడు చల్లని వాతావరణం ఉండే కొండప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది.

దాదాపు 5 వేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వత ప్రాంతాల్లోనూ డెంగీ దోమల వ్యాప్తిని చూసి డాక్టర్ సౌమ్య ఆశ్చర్యపోయారు. ఆమె ఇటీవల తమిళనాడులోని నీలగిరి పర్వత ప్రాంతాల్లో పర్యటించారు.

''డెంగీ దోమ సాధారణంగా ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తుంది. అవి చల్లని ప్రాంతాల్లో బతకలేవు. కానీ ఇటీవలి కాలంలో నీలగిరి పర్వతాల వంటి చల్లటి ప్రాంతాల్లోనూ ఈ దోమల వ్యాప్తి కనిపించడం ఆశ్చర్యం. ఇది వాతావరణ మార్పులకు అనుగుణంగా మార్పు చెందడమే'' అని సౌమ్య చెప్పారు.

డెంగీ మాదిరిగానే నిపా వైరస్ వ్యాప్తి కూడా అర్థం కాని విషయం.

నిపా వైరస్ గురించి అడిగినప్పుడు.. '' 2018 కంటే ముందే ఇండియాలో నిపా వైరస్ కేసులు వచ్చాయి. ఆ తర్వాత, ప్రతి సంవత్సరం ముఖ్యంగా కేరళలోని కోజికోడ్ జిల్లాలోనే అవి ఎందుకు నమోదవుతున్నాయో అర్థం కావడం లేదు. అవి సైన్స్‌కి అంతుచిక్కడం లేదు. సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి'' అని సౌమ్య చెప్పారు.

అలాగే, డెంగీ దోమ కూడా కాలానుగుణంగా మార్పులు చెందుతోందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

వీడియో క్యాప్షన్, డెంగీ రెండోసారి సోకితే ఎందుకింత ప్రాణాంతకంగా మారుతోంది?

చికిత్స మార్గాలున్నాయా?

డెంగీ జ్వరానికి వ్యాక్సిన్ కనిపెట్టడంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నట్టే, ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి.

టీకాలు ఏవీ పనిచేయకపోవడంతో స్వీయరక్షణ ఒక్కటే నివారణ మార్గంగా ఎందుకు మారిందని ముత్తుమణిని అడిగాం.

''వ్యాక్సీన్ పరిశోధన ఆర్థిక భారంతో కూడుకున్నది. అందువల్ల తక్కువ ధరలో, అందరికీ అందుబాటులోకి తీసుకురావడం పెద్ద సవాల్'' అని ఆయన చెప్పారు.

డెంగీ నివారణ గురించి మాత్రమే కాకుండా, డెంగీ సోకిన తర్వాత ప్రాణాలు కాపాడుకునేందుకు ఔషధాలు ఉన్నాయా? అని అడిగినప్పుడు.. డెంగీ చికిత్సలో వాడే ఔషధాల గురించి కూడా తక్కువ అధ్యయనాలే ఉన్నాయని ముత్తుమణి చెప్పారు.

డెంగీ సోకిన తర్వాత, ఆ వైరస్ శరీరమంతటా వ్యాపించకుండా, అవయవాలపై ప్రభావం చూపకుండా నిరోధించేందుకు మాత్రల రూపంలో వచ్చిన ఔషధాలు క్లినికల్ ట్రయల్స్‌లో విజయవంతమయ్యాయి.

ఉదాహరణకు, హెచ్‌ఐవీ సోకిన వారు ఆరోగ్యంగా జీవించేందుకు అందుబాటులో ఉన్న ఔషధాలు ఎలా ఉపయోగపడతున్నాయో, అలాగే డెంగీ వచ్చినా ప్రాణాలు పోకుండా కాపాడే ఔషధాలు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ముత్తుమణి బలంగా చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)