మీరు నిజంగా రొమాంటిక్ లైఫ్‌లో ఉన్నారా లేక అందరినీ భ్రమల్లో ముంచుతున్నారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆదర్శ రాథోడ్
- హోదా, బీబీసీ కోసం
'బాబు మెసాయో... జిందగీ బడీ హోనీ చాహియే, లంబీ నహీ'
1971లో వచ్చిన బాలీవుడ్ సినిమా 'ఆనంద్'లో రాజేశ్ ఖన్నా చెప్పిన డైలాగ్ ఇది. అంటే, 'ఎంతకాలం బతికామన్నది కాదు. ఎంత బాగా బతికామన్నది ముఖ్యం' అని అర్థం.
ఈ అందమైన జీవితాన్ని ఆస్వాదించాలని ఈ మాట చెబుతోంది.
జీవితంలో ఎదురయ్యే సమస్యలను పక్కనబెట్టి జీవితాన్ని సంతోషంగా, పూర్తిగా జీవించాలని దానర్థం.
అలా ఎప్పుడూ ఉత్సాహంగా, సానుకూల దృక్పథం(పాజిటివిటీ)తో బతకడాన్నే రొమాంటిక్ లైఫ్ అంటారు. ఇంగ్లిష్‌లో 'రొమాంటిసైజింగ్ లైఫ్'.
రొమాంటిక్ లైఫ్ గడపడమనేది కొత్త విషయమేమీ కాదు. కానీ, ఇటీవల కొన్ని సంవత్సరాల నుంచి రొమాంటిసైజింగ్ లైఫ్ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది.
కోవిడ్ మహమ్మారి వంటి ఇబ్బందికర పరిస్థితుల తర్వాత సోషల్ మీడియాలో ఈ ట్రెండ్ బాగా పెరిగిపోయింది.
చాలా మంది తమకు సంతోషం కలిగించిన విషయాలు, వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, రీల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలు ఉద్దేశమేంటి?
రొమాంటిసిజం అనేది అందరికీ ఒకేలా అనిపించదు. నచ్చిన బట్టలు వేసుకోవడం, సరదాగా నడుచుకుంటూ వెళ్లడం, మీకోసం మీరు పూలు కొనుక్కోవడం, నచ్చిన వారితో గడపడం, ఇష్టమైనవి తినడం వంటివి.
''ప్రతిరోజూ ఉండే పరిస్థితులు, ఇబ్బందులను పక్కనబెట్టి ఏదైనా నచ్చినది చేసినప్పుడు నిజంగా సంతోషంగా ఉంటుంది.’’ అన్నారు దిల్లీకి చెందిన లతికా జోషి. అదే తన దృష్టిలో రొమాంటిసైజింగ్ లైఫ్ ఆమె అంటారు.
''ఈ సంతోషం కోసం నేను సైక్లింగ్ లేదంటే యోగా చేస్తా. సినిమా చూస్తా. నచ్చినది తింటా. లేదంటే కొత్త వంటకం ట్రై చేస్తా. ఒక్కోసారి పుస్తకం చదువుకుంటా. లేదంటే స్నేహితులతో మాట్లాడతా. మీతో మాట్లాడడానికి ముందు మంచి కాఫీ చేసుకున్నా.'' అని ఆమె చెప్పారు.
అమెరికాలోని మినెసొటాలో ఉంటున్నారు పూజా సింగ్. ఇండియాలో ఉన్నప్పుడు ఆమె న్యూస్ యాంకర్‌గా పనిచేశారు. ఇప్పుడు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. తన సంతోషకరమైన ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటారు.
''నేను ఎప్పుడూ బిజీగా ఉండడాన్ని ఇష్టపడతా. మా అమ్మాయిల ఆలనాపాలనా చూసుకోవడమంటే నాకిష్టం. సామాజిక కార్యక్రమాలకు, ఇతర కార్యక్రమాలకు వెళ్తుంటా. నచ్చిన వంట చేయడం, పిల్లలను నిద్రపుచ్చిన తర్వాత గ్రీన్ టీ తాగుతూ నా భర్తతో చాట్ చేయడం ఇష్టం. మరో విషయం. నేను కెమెరా నుంచి దూరమయ్యా. అందుకే రీల్స్, సోషల్ మీడియా కంటెంట్ చేస్తుంటా'' అని ఆమె చెప్పారు.
లతిక, పూజా మాదిరిగానే మనలో చాలా మంది నచ్చిన పనులు చేసేందుకు సమయం వెచ్చిస్తూ ఉండొచ్చు. అలా ఆనందాన్నిచ్చే పనులను మళ్లీ మళ్లీ చేయడం జీవితాన్ని రొమాంటిసైజ్ చేసుకోవడమే.
ఇలా జీవితాన్ని రొమాంటిసైజ్ చేసుకోవాలన్నది అందరికీ కలిగే సహజమైన కోరికేనని దిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్‌లో సైకాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఇషిత ఉపాధ్యాయ చెప్పారు. ఆమె సైకాలజిస్టుగా కౌన్సిలింగ్ కూడా ఇస్తుంటారు.
''ప్రతి ఒక్కరిలో తమని తాము అర్థం చేసుకోవాలని, తమ భావోద్వేగాలకు తగ్గట్టుగా ఉండాలనే కోరిక ఉంటుంది. జీవితాన్ని రొమాంటిసైజ్‌గా మలుచుకున్నప్పుడు వాళ్లతో వాళ్లు కనెక్ట్ అవుతారు. అప్పుడు జీవితం వారికి మరింత అందంగా కనిపిస్తుంది'' అని ఆమె అన్నారు.
''రొమాంటిసైజ్ అయినప్పుడు మన ఆలోచనలు, ఫీలింగ్స్‌ను మరింతగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తాం. మనం ఏదైనా వదిలేయాలని అనుకున్నప్పుడు.. అది మ్యూజిక్, సినిమా లేదా మరేదైనా కావొచ్చు. అది మీ జీవితంలో ఇష్టమైన దానికోసం ఒకటి వద్దనుకున్నట్టే. రొమాంటిసైజింగ్ ఉద్దేశం ఏంటంటే, మీ జీవితంలో, మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఇష్టమైన వాటి కోసం ప్రయత్నించడమే.'' అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియా ప్రభావం
చాలా మంది స్నేహితులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు సోషల్ మీడియా యాప్‌లలో తమ జీవితాన్ని రొమాంటిసైజ్ చేసుకోవడం చూసుంటాం. సంతోషంగా ఉన్నవి, పాజిటివిటీతో ఉన్నవే అందులో ఎక్కువగా ఉంటాయి.
సోషల్ మీడియాలో మనకు నచ్చినవి చూడడం, వాటిని షేర్ చేయడం ద్వారా పాజిటివిటీ పెరుగుతుందని లతిక జోషి చెప్పారు. కోవిడ్ సమయంలో సైక్లింగ్ చేయడం ప్రారంభించిన తర్వాత చాలా మంది స్నేహితులు కూడా సైకిళ్లు కొనుక్కుని తనను కూడా ట్యాగ్ చేసేవారని ఆమె చెప్పారు.
''తనను అనుసరించేలా చేయాలని అనుకోలేదు. అందుకోసం అది చేయలేదు. నేను ఎంజాయ్ చేస్తున్న వాటిని అందరితో పంచుకోవాలనుకున్నా. వాటి వల్ల ఎవరైనా స్ఫూర్తి పొందితే ఇంకా సంతోషం'' అని ఆమె అన్నారు.
సోషల్ మీడియా వల్ల రొమాంటిసైజింగ్‌లో మార్పులు రావడం మొదలైందని సైకాలజిస్టులు చెబుతున్నారు.
''చాలా మంది సోషల్ మీడియాలో ఏదైనా చూసినప్పుడు అలా మనం ఎందుకు చేయకూడదని అనుకుంటున్నారు. అందులో సమస్యేమీ లేదు. అయితే, సోషల్ మీడియాలో చూసినవన్నీ నిజమేనని అనుకుంటే మాత్రం సమస్యలకు దారితీస్తుంది'' అని దిల్లీకి చెందిన పూజా శివమ్ జైట్లీ చెప్పారు.
ఉదాహరణకు, ''ఎవరో ఒకరు ఇంటిని అందంగా అలకంరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అది చూసి మన ఇంటిని కూడా అలాగే చేయాలనుకుంటాం. అయితే, వీడియో కోసం ఇంట్లో ఒక భాగాన్ని అందంగా అలంకరించి ఉంటారు. కానీ, ఇల్లంతా అలా అలంకరించాలనుకున్నప్పుడే ఇబ్బంది.'' అని ఆమె వివరించారు.
అంటే, సోషల్ మీడియాలో చూపించేదానికి, వాస్తవిక జీవితానికి తేడా ఉంటుంది. అయితే అలాంటి పోస్టులు టీనేజర్లు, యువతపై చెడు ప్రభావం చూపిస్తాయి. పక్కవారితో తమను పోల్చుకుంటూ ఫ్రస్ట్రేషన్‌కి గురయ్యే అవకాశం ఉంది.
''ఈ పోలిక ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అది అన్ని వయసుల వారిపైనా ఉంటుంది. తమకు తాము ఎందుకూ పనికిరాని వాళ్లం అనుకునే భావన పెరుగుతుంది. వాటి నుంచి ప్రేరణ పొందాల్సింది పోయి, ఆత్మన్యూనతా భావానికి గురవుతారు. పోలిక కారణంగా ఈర్ష్య కలిగే అవకాశం కూడా ఉంది'' అని డాక్టర్ ఇషితా ఉపాధ్యాయ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏదో చూపించుకోవాలనే తాపత్రయం
అది మాత్రమే కాదు, సోషల్ మీడియాలో రొమాంటిక్ వీడియోలు షేర్ చేసినప్పుడు చెడుప్రభావం కలిగే అవకాశం కూడా ఉంది. నిజంగా సంతోషంగా ఉండాల్సింది పోయి, అలా ఉన్నట్లు నటించే అవకాశం కూడా ఉంటుంది.
ఉదాహరణకు ''ఇటీవల విదేశాలకు వెళ్లా. ఒకమ్మాయి అక్కడి అందమైన పరిసరాలను ఎంజాయ్ చేయకుండా, తాను ఎంత ఎంజాయ్ చేస్తున్నానో చూపించాలని రీల్స్ చేస్తూ కనిపించింది'' అని పూజా శివమ్ జైట్లీ వివరించారు.
''అది వాస్తవికతకు దూరంగా వెళ్లడంతో పాటు తమను తాము చూపించుకునే ప్రయత్నం. అంటే, ప్రపంచం ముందు మనం వేరేలా కనిపించడానికి ప్రయత్నిస్తున్నామని అర్థం. మనల్ని ఇతరులు ఎలా చూడాలనుకుంటున్నామో, అలా కాకుండా వారి అభిప్రాయాలు మారిపోయాయనుకోండి. అప్పుడు మనం నిరాశకు గురవుతాం'' అన్నారు.
తన ఫాలోయర్లు తన గురించి ఏమనుకుంటున్నారో అని ఎప్పుడైనా ఒత్తిడికి గురయ్యారా? అని పూజా సింగ్ బధులాను అడిగాం.
అందుకు నవ్వుతూ ''నేను నిజంగా సంతోషంగా ఉన్నప్పుడే రీల్స్ చేస్తాను. రీల్స్‌లో పూజాకి, నిజమైన పూజాకి పెద్దగా తేడా లేదు. ఎవరేమనుకుంటున్నారని నేను పెద్దగా పట్టించుకోను. కానీ, రీల్స్ రికార్డ్ చేశాక పోస్ట్ చేయాలా? వద్దా? అని మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచిస్తా. చాలాసార్లు ఇల్లు చిందరవందరగా ఉందని అనిపిస్తుంది. అయితే, ఎవరైనా ఏదైనా అనుకుంటే అనుకోనివ్వు అని నా భర్త చెప్పారు. అప్పటి నుంచి అలాంటివన్నీ పట్టించుకోవడం మానేశా'' అన్నారు.
అయితే, అందరికీ, అందరితోనూ అలా జరగాలనేమీ లేదు. ''చాలా మంది ఇతరుల అభిప్రాయలు తెలుసుకోవాలనుకుంటారు. అంటే, వారు చేస్తున్న పనికి మద్దతు, ప్రోత్సాహం కావాలని కోరుకుంటారు'' అని ఇషితా ఉపాధ్యాయ అన్నారు.
''నా దగ్గరికి ఒక జంట వచ్చింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయి. వాళ్లు మున్ముందు కలిసి ఉంటారో లేదో తెలియదు. కానీ, ఆమెకు తన భర్తతో కలిసి విదేశాలకు వెళ్లాలని ఉండేది. అలా వెళ్లినప్పుడు భర్తతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. అవి చూస్తే వాళ్లిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారని అనుకుంటారు. కానీ, నిజం వేరు'' అని ఆమె చెప్పారు.
దానర్థం ఏంటంటే, సోషల్ మీడియాలో రొమాంటిసైజింగ్ పోస్టులు చేయడం ద్వారా, కొందరు లేనిది ఉన్నట్టుగా చూపించాలని అనుకుంటున్నట్టుగా కూడా భావించొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
మరేం చేయాలి?
జీవితంలో మనం ఎన్నో సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంటాం. కానీ, సోషల్ మీడియా రొమాంటిసైజింగ్ ట్రెండ్‌లో జీవితంలోని అందమైన, మంచి అనుభవాలే కనిపిస్తాయి.
జీవితంలో మంచీచెడూ రెండూ ఉంటాయి. ఆ రెండింటినీ సమన్వయం చేసుకోవడం ప్రధానమని పూజా శివ జైట్లీ అన్నారు.
''సోషల్ మీడియాను వాస్తవంగా పరిగణించకుండా, కేవలం వినోదాత్మకంగానే చూడాలి. రొమాంటిసైజింగ్ లేదా ఇంకేదైనా ట్రెండ్‌ని ఫాలో అవడం తప్పేమీ కాదు. అయితే మీరు నిజంగా సంతోషంగా ఉన్నారా? లేదా సంతోషంగా ఉన్నట్టు చూపించాలని అనుకుంటున్నారా? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి'' అని ఆమె చెప్పారు.
సోషల్ మీడియాలో రొమాంటిసైజింగ్ వీడియోలు, ఫోటోలను చూడడం తప్పేమీ కాదు. కానీ వాటితో పోల్చుకోవడం సరైనది కాదని నిపుణులు చెబుతున్నారు.
''మనకి నచ్చినట్టుగా జీవించేందుకు ప్రయత్నం చేయాలి. మీకు నిజంగా ఏది సంతోషాన్నిస్తుందో అదే చేయండి. కాకపోతే మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారనే విషయం గుర్తుంచుకోండి. సోషల్ మీడియాలో ఎలాంటివి పోస్టు చేయొచ్చో, ఎలాంటివి చేయకూడదని అనుకుంటున్నారో మీకు మీరే ఒక హద్దును నిర్ణయించుకోండి. అది దాటి వెళ్లొద్దు. ఆ హద్దులు దాటి ఎవరినీ రానీయొద్దు'' అని డాక్టర్ ఇషితా ఉపాధ్యాయ సూచించారు.
ఇవి కూడా చదవండి:
- హెల్త్: 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నారా, అయితే మీరు చేయించుకోవాల్సిన మెడికల్ టెస్ట్‌లు ఇవే
- ఎలా పడుకుంటే మంచిది? ఛాతీలో మంట, మెడ నొప్పి, నడుం నొప్పి తగ్గాలంటే ఏ భంగిమలో పడుకోవాలి?
- రోజూ 4 వేల అడుగులు నడిచినా అకాల మరణాన్ని తప్పించుకోవచ్చా?
- యూటీఐ: మూత్ర సంబంధ వ్యాధులు మహిళలకే ఎందుకు ఎక్కువగా వస్తాయి?
- చేతిలో కొబ్బరికాయ, చెంబులో నీళ్లు భూమి లోపల నీటి జాడను పసిగడతాయా... సైన్స్ ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















