‘‘నేను శవాల్లో అందాన్ని వెదికేవాడిని’’

ఫొటోగ్రఫీ

ఫొటో సోర్స్, HERITAGE ART/GETTY

    • రచయిత, ప్రమీలా కృష్ణన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హెచ్చరిక: ఈ కథనంలో మృతదేహాలు ఫొటోలు ఉంటాయి.

‘‘శవాన్ని కుర్చీలో కూర్చోబెట్టి, అది కదలకుండా పట్టుకోవడం నా పని. తర్వాత ఫొటోగ్రాఫర్ ఫొటో తీసేటప్పుడు మృతదేహాం కళ్లు తెరిచి ఉన్నట్లు కనిపించేందుకు కంటి రెప్పలు ఎత్తి పట్టుకోవాలి’’ అని వృత్తిలో తన మొదటి రోజు అనుభవం గురించి రవీంద్రన్ చెప్పారు.

ఈ పని చేసినప్పుడు రవీంద్రన్ వయస్సు 14 ఏళ్లు. అది 1972వ సంవత్సరం. రవీంద్రన్ తండ్రి శ్రీనివాసన్ ఒక ఫొటో స్టూడియోను నడిపేవారు. రవీంద్రన్ చేత శ్రీనివాసనే ఈ పని చేయించారు.

9 ఏళ్ల వయస్సులో రిచర్డ్ కెన్నడీకి కూడా ఇలాంటి భయానక అనుభవమే ఎదురైంది.

మృతదేహాన్ని కూర్చోబెట్టిన కుర్చీ వెనకాల తెల్లటి వస్త్రాన్ని ఒక తెరలా పట్టుకోవాల్సిందిగా రిచర్డ్‌కు చెప్పారు.

‘‘భయంతో వణికిపోయా. ఆ రోజు రాత్రి అసలు నిద్రపోలేదు. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. శవాలకు సంబంధించిన పీడకలలు వచ్చేవి. అది చాలా భయానకం’’ అని బీబీసీకి రిచర్డ్ తెలిపారు.

తమ తండ్రులకు ఫొటో స్టూడియోలు ఉండటంతో రవీంద్రన్, రిచర్డ్‌ ఇద్దరూ ఫొటోగ్రఫీ రంగంలోకి దిగారు. వారిద్దరూ కలిసి వెయ్యికి పైగా మృతదేహాల ఫొటోలు తీశారు.

తమిళనాడులో చనిపోయిన వారి ఫొటోలు తీయడంలో ప్రసిద్ధి చెందిన ఫొటోగ్రఫర్లలో వీరిద్దరూ ఉన్నారు.

తమ అసాధారణ పని గురించి బీబీసీతో వీరిద్దరూ మాట్లాడారు. 1970, 1980లలో ఈ పనికి మంచి జీతం వచ్చేది.

రిచర్డ్ కెన్నడీ

ఫొటో సోర్స్, RICHARD KENNEDY

ఫొటో క్యాప్షన్, రిచర్డ్ కెన్నడీ

భయంతో పోరాటం

కొన్ని దశాబ్దాల క్రితం వరకు తమిళనాడులోని చాలా కమ్యునిటీలలో ఫొటోలు తీస్తే మనిషి ఆయుష్షు తగ్గుతుందనే అపోహ ఉండేది. అందుకే, చనిపోయిన తర్వాతే ఫొటోలు తీసుకునేవారు.

చెన్నైకి 400 కి.మీ దూరంలో ఉండే కరైకుడికి చెందినవారు రవీంద్రన్. టీనేజర్‌గా ఉన్నప్పుడు ఈ పని చేయడం ఆయనకు చాలా కష్టంగా ఉండేది. కానీ, స్కూల్‌కు వెళ్లడం ఇష్టం లేకపోవడంతో స్కూల్ తప్పించుకునేందుకు సాకుగా ఈ పని చేయడం మొదలుపెట్టారు.

‘‘కొన్ని నెలల శిక్షణ తర్వాత, శవాల ఫొటోలు తీయడానికి ఒక్కడినే వెళ్లాను’’ అని ఆయన చెప్పారు.

క్రమంగా చనిపోయిన వారి ఫొటోలు తీయడంలో రవీంద్రన్ నైపుణ్యం సాధించారు.

ఫొటోలు తీసేటప్పుడు మృతదేహం తల కదలకుండా ఉండేందుకు మెడ కింద దిండు పెట్టడం, బ్యాక్‌గ్రౌండ్ సరిగా ఉండేలా చూసుకోవడం వంటి నైపుణ్యాలను ఆయన అభివృద్ధి చేసుకున్నారు.

‘‘నా భయంతో పోరాడాను. నా వృత్తిని ఇష్టపడటం మొదలుపెట్టాను. ఫొటోలలో మృతదేహాలు చక్కగా, సజీవంగా ఉన్నట్లు కనబడేలా చేశాను’’ అని రవీంద్రన్ చెప్పారు.

రవీంద్రన్

ఫొటో సోర్స్, RAVINDRAN

ఫొటో క్యాప్షన్, తండ్రితో రవీంద్రన్

కలచివేసే ఘటనలు

రిచర్డ్ మరింత చిన్న వయస్సులోనే ఈ పని చేయడం ప్రారంభించారు. చెన్నైకి పశ్చిమాన 350 కి.మీ దూరంలో ఉన్న ఏర్కాడ్ హిల్స్‌ ప్రాంతంలో తన తండ్రికి ఈ పనిలో రిచర్డ్ సహాయం చేసేవారు.

ఫొటోగ్రఫీలో ఆయనకు అత్యంత కష్టంగా అనిపించిన పని నవజాత శిశువు మృతదేహాన్ని ఫొటోతీయడం.

‘‘ఆ చిన్నారి తల్లిదండ్రులు కుంగిపోయారు. తల్లి గుండెలవిసేలా ఏడుస్తున్నారు’’ అని రిచర్డ్ గుర్తుచేసుకున్నారు.

ఫొటోగ్రఫర్ వచ్చిన తర్వాత తల్లి ఆ చిన్నారికి స్నానం చేయించి, కొత్త గౌను వేశారు. పౌడర్ రాయడం, బొట్టు పెట్టడం లాంటివి చేశారు.

‘‘ ఆ పాప ఒక బొమ్మలా కనిపించింది. తల్లి ఆ పాపను ఒడిలోకి తీసుకున్నప్పుడు నేను పాప ఫొటోను తీశాను. తల్లి ఒడిలో పాప నిద్రపోతున్నట్లుగా వచ్చింది ఆ ఫొటో. అప్పుడు చాలా ఉద్వేగంగా అనిపించింది’’ అని రిచర్డ్ గుర్తు చేసుకున్నారు.

బిడ్డకు స్నానం చేయిస్తున్న, పూలతో అలంకరిస్తున్న ఫొటోలను కూడా తీశారు.

కొన్ని కుటుంబాలు ఒకటి లేదా రెండు ఫొటోలతో సరిపెట్టుకుంటారు. మరికొన్ని కుటుంబాలు ఎక్కువ ఫొటోలు కావాలని అడుగుతారు.

‘‘నేను స్మశానాలకు కూడా వెళ్లి, మృతదేహాల అంత్యక్రియల క్షణాల ఫొటోలు తీశాను’’ అని రవీంద్రన్ చెప్పారు.

ఫొటోగ్రఫర్లు రాత్రికి రాత్రి ఆ ఫొటోలు ప్రింట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. వారికి ఎక్కువ సమయం ఇవ్వరు. ఎందుకంటే, మరుసటి రోజు నిర్వహించే ఆచారాల్లో మృతుల ఫొటో ఫ్రేమ్ అవసరం ఉంటుంది.

రవీంద్రన్, రిచర్డ్‌లు ఇద్దరూ బ్లాక్ అండ్ వైట్ కెమెరాల్లోనే ఫొటోలను తీసేవారు.

వీరి కస్టమర్లు ఎక్కువగా హిందూ, క్రిస్టియన్ కుటుంబాల వారే. ఫ్రేమ్ కట్టించిన మృతుల ఫొటోలను కొన్ని కుటుంబాల వారు తమ ప్రార్థనా గదిలో పెట్టుకునేవారు.

ఇద్దరు ముస్లిం వ్యక్తుల మృతదేహాలను ఫొటోలు తీసినట్లు రవీంద్రన్ గుర్తు చేసుకోగా, రిచర్డ్‌ ఒక్క ముస్లిం వ్యక్తిని కూడా ఫొటో తీయలేదు.

ఫొటోగ్రఫీ

ఫొటో సోర్స్, RICHARD KENNEDY

పీడకలలు

పోలీస్ శాఖ కోసం కూడా రిచర్డ్ పని చేశారు. అసహజ మరణాలు, నేరం జరిగినప్పుడు బాధితులు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాల్లో ఛిద్రమైన మృతదేహాలను ఆయన తరచుగా ఫొటోలు తీయాల్సి వస్తుండేది.

‘‘అవి మనసును కలచివేసేవి. కొన్నిసార్లు అన్నం సహించకపోయేది. నిద్రపట్టకపోయేది’’ అని రిచర్డ్ చెప్పారు.

ఆయన తీసిన ఫొటోలను కోర్టుల్లో సాక్ష్యాలుగా వాడేవారు. బాధిత కుటుంబాలు పరిహారం పొందేందుకు ఆయన పొటోలు పనికొచ్చేవి.

ఇలాంటి పనికి ఫొటోగ్రఫర్లకు మంచి జీతం లభిస్తుంది. మృతదేహాల ఫొటోలు తీయడానికి ఫొటోగ్రఫర్లు రెట్టింపు డబ్బు డిమాండ్ చేస్తారు. కానీ, ఈ పని వల్ల వారికి మరో తరహాలో నష్టం కూడా కలుగుతుంది.

‘‘చాలా మంది కస్టమర్లు వేరే ఇతర కార్యక్రమాల కోసం ఫొటోలు తీయడానికి నన్ను పిలవడానికి ఇష్టపడరు’’ అని రిచర్డ్ చెప్పారు.

రవీంద్రన్ హిందువు. చావుతో సంబంధమున్న ఏ స్థలాన్ని అయినా ఆయన కుటుంబం అపవిత్రంగా భావిస్తుంది. కాబట్టి ఆయన ఇంట్లోకి లేదా స్టూడియోలోకి వెళ్లాలంటే కచ్చితంగా శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది.

‘‘ప్రతీసారి నేను స్నానం చేయాలి. స్టూడియోలోకి వెళ్లేముందు మా నాన్న నా కెమెరా మీద కూడా కొన్ని నీళ్లు చిలకరించేవారు’’ అని రవీంద్రన్ తెలిపారు.

ఫొటోగ్రఫీ

ఫొటో సోర్స్, RICHARD KENNEDY

ఆనవాయితీ

గతంలో చాలా దేశాల్లో చనిపోయిన వారిని ఫొటోలు తీసే ఆనవాయితీ ఉండేది.

19వ శతాబ్దం మధ్యలో చాలా కుటుంబాలు చనిపోయిన తమ పిల్లలు లేదా బంధువులతో ఫొటోలు తీసుకునేవి.

ఫొటోలు దిగడం ఖరీదైన వ్యవహారంగా ఉన్న ఆ రోజుల్లో, చాలా మంది బతికి ఉన్నప్పుడు తమ పొటోలు తీసుకోలేరు. కానీ, తమ ప్రియమైన వారు చనిపోయిన సందర్భంలో వారి జ్ఞాపకార్థం ఫొటోలు తీసుకునేవారు.

అమెరికాలో మృతదేహాన్ని ఇంట్లో మంచు ఫలకం మీద ఉంచి ఫొటో తీసుకునేవారు.

అంత్యక్రియలకు హాజరు అవ్వలేని కుటుంబ సభ్యులకు, బంధువులకు ఈ ఫొటోలు ఎంతో ముఖ్యం.

విక్టోరియన్ బ్రిటన్‌లో కూడా చనిపోయిన వారిని ఫొటోలు తీయడం చాలా ప్రాచుర్యం పొందింది.

ఆ సమయంలో మీజిల్స్, డిప్తీరియా, జ్వరం, రూబెల్లా వ్యాధులు ప్రాణాంతకంగా ఉండేవి. నగరాల్లోని ప్రజలు ఏ సమయంలో చనిపోతారో తెలియని పరిస్థితి. పైగా జీవితకాలంలో ఒక్కసారి కూడా ఫొటోలు దిగకపోవడంతో చనిపోయినప్పడు ఫొటోకు కుటుంబీకులు ప్రాధాన్యం ఇచ్చేవారు.

20వ శతాబ్దం వచ్చే నాటికి ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఈ ఆచారం కనుమరుగైంది.

మెరుగైన ఆరోగ్య వసతుల కారణంగా ఆయుర్దాయం పెరిగింది. కానీ, భారత్‌లోని తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాలతో పాటు వారణాసి నగరంలో ఈ ఆచారం చాలా కాలం కొనసాగింది.

పేయింటింగ్స్‌కు కొనసాగింపుగా ఈ ఫొటోగ్రఫీ వచ్చిందని రిచర్డ్ అన్నారు.

‘‘ఫొటోగ్రఫీ లేని రోజుల్లో పెద్ద భూస్వాములు, ఆర్టిస్టులకు డబ్బులు ఇచ్చి పేయింటింగ్స్ వేయించేవారు. కానీ, ధనవంతులే ఈ పెయింటింగ్స్‌ను పొందగలిగేవారు. పేదలకు కూడా అందుబాటులో ఉండేలా తర్వాత ఫొటోగ్రఫీ వచ్చింది’’ అని రిచర్డ్ చెప్పారు.

రవీంద్రన్

ఫొటో సోర్స్, RAVINDRAN

ఫొటో క్యాప్షన్, రవీంద్రన్

చౌకగా కెమెరాలు

1980ల చివర్లో చౌకగా లభించే కెమెరాలు మార్కెట్లోకి వచ్చాయి. ఎవరైనా వీటిని పొందవచ్చు.

‘‘చాలామంది చిన్న కెమెరాలను కొని, ఫొటోలు తీయడం మొదలుపెట్టారు’’ అని రిచర్డ్ వివరించారు.

మృతదేహాల ఫొటోలకు డిమాండ్ తగ్గిపోవడంతో ఆదాయం కోసం చర్చ్ ఈవెంట్లు, పండుగల సందర్భంగా ఫొటోలు తీయడం మొదలుపెట్టారు రిచర్డ్.

రవీంద్రన్ కూడా స్కూల్ ఈవెంట్లు, పబ్లిక్ ఫంక్షన్లపై దృష్టి సారించారు.

తర్వాత ఆయన వెడ్డింగ్ ఫొటోగ్రఫర్‌గా మారారు.

ఇప్పుడు 60 ఏళ్ల వయస్సులో ఉన్న రవీంద్రన్ మాట్లాడుతూ తమకు ఉపాధి కల్పించిన మృతుల కుటుంబాలకు కృతజ్ఞతలు తెలిపారు. వారి వల్లే చావు భయాన్ని అధిగమించానని అన్నారు. ఆ ఆచారం ఇక ముందు కూడా కొనసాగాలని తాను అనుకోవడం లేదన్నారు.

‘‘నేను చనిపోయిన తర్వాత నా ఫోటోను తీయడం నాకు ఇష్టం లేదు’’ అని రవీంద్రన్ చెప్పారు.

రిచర్డ్ తన తాత మరణం తర్వాత ఆయన ఫొటో తీశారు. ఆయన వద్ద మూడు తరాలకు చెందిన పూర్వీకుల ఫొటోలు ఉన్నాయి. రవీంద్రన్ తరహాలో కాకుండా, 54 ఏళ్ల రిచర్డ్ వద్ద ఇప్పటికీ పెద్ద సంఖ్యలో చనిపోయిన వారి ఫొటోలు ఉన్నాయి.

‘‘మా కుటుంబం ఎప్పుడూ మా పూర్వీకుల ఫొటోలను భద్రపరిచింది. నేను చనిపోయిన తర్వాత కూడా నా ఫొటో తీయాలని నా చిన్నకుమారుడికి చెప్పాను. ఆ ఫొటో నా కుటుంబ వారసత్వంలో భాగం అవుతుంది’’ అని రిచర్డ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)