శరీరం హాయిగా, చల్లగా ఉండాలంటే ఎలాంటి బట్టలు వేసుకోవాలి?

దుస్తులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లూసీ షరీఫ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వాతావరణ మార్పుల కారణంగా వేడి గాలులు తరచూ వీస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో శరీరం చల్లగా, ఆరోగ్యంగా ఉండేందుకు మనం ఎలాంటి బట్టలు వేసుకుంటున్నామనేది చాలా ముఖ్యం.

సరైన బట్టలు వేసుకుంటే ఇళ్లలో వాడుకునే ఏసీల ఉష్ణోగ్రతను రెండు డిగ్రీల సెల్సియస్ పెంచుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అంటే దానర్థం ఏసీల ఉష్ణోగ్రత పెంచినపుడు కూలింగ్ తగ్గుతుంది.

అంటే దీర్ఘ కాలంలో విద్యుత్ వినియోగం కూడా బాగా తగ్గుతుంది. దానివలన హరితవాయు ఉద్గారాలు తగ్గుతాయి. డబ్బు కూడా ఆదా అవుతుంది.

రంగు, డిజైన్‌లకు ప్రాధాన్యం

బట్టల రంగు విషయానికొస్తే సాధారణంగా చాలా మంది వేసవిలో తెల్లరంగు బట్టలు వేసుకుంటారు. ఎందుకంటే తెలుపు రంగు సూర్యకాంతి కిరణాలను రిఫ్లెక్ట్ చేస్తుంది. కానీ నలుపు రంగు కాంతి కిరణాలను శోషించుకుంటుంది.

మరింత లోతుకు వెళితే విషయం సంక్లిష్టంగా మారొచ్చు. బట్టల ఫిట్టింగ్, వాటి మందం గురించి మాట్లాడుకోవాలి. శరీరంపైన బట్టలకు సూర్యుడి కిరణాల ద్వారా వేడి తాకుతుంది.

మరోవైపు శరీరంలోంచి కూడా వేడి విడుదలవుతుంది. ఈ స్థితిలో తెలుపు రంగు బట్టలు శరీరంలోని వేడిని తిరిగి వెనక్కు రిఫ్లెక్ట్ చేస్తాయి.

అరేబియన్ ద్వీపకల్పం, పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికా ఎడారి ప్రాంతాల్లోని సంచార ఆదివాసి తెగలు పొడవాటి తెల్ల, నల్ల దుస్తులు ధరిస్తారు. వాటిపైన 1980లో ఒక అధ్యయనం నిర్వహించారు.

తెలుపు, నలుపు దుస్తులు ధరిస్తున్న ఆదివాసుల్లో వేడికి గురవుతున్న తీరు ఒకలానే ఉందని ఆ అధ్యయనంలో తెలిసింది.

నల్లటి దుస్తులు

ఫొటో సోర్స్, Getty Images

ఇదెలా సాధ్యం?

నలుపు రంగు దుస్తులు వేడిని శోషించుకోవడంలో మేలైనవి. అచ్చం ఒక రేడియేటర్‌లా పనిచేస్తాయి. శరీరంలోంచి విడుదలయ్యే వేడినీ పీల్చుకుంటాయి. దీనివల్ల కూడా శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గి చల్లబడుతుంది.

అయితే పొడవాటి నల్లటి దుస్తులు లూజుగా వేసుకోవడంలోనే అసలు రహస్యముంది.

ముఖ్యంగా గాలులు వీస్తున్న సమయంలో లూజు దుస్తుల కారణంగా శరీరానికి, దుస్తులకు మధ్యలోని ఖాళీ స్థలం వేడిగా మారుతుంది. ఇక్కడ గాలి ఒక ప్రవాహంలా పైకి లేస్తుంది. దీనినే చిమ్నీ ఎఫెక్ట్ అంటారు. దీని కారణంగా చల్లదనం ఏర్పడుతుంది.

మండే ఎడారుల్లో శరీరం చుట్టూ వేలాడే దుస్తుల్లోకి ప్రవేశించే వేడి తెలుపు అయినా, నలుపు అయినా ఒకలానే ఉంటుందని 1980 అధ్యయనం చెబుతోంది. నలుపు దుస్తులు పీల్చుకునే వేడి శరీరానికి చేరే లోపే మాయమైపోతుందని అధ్యయనంలో పేర్కొన్నారు.

అంటే వేసుకునే బట్ట రంగు కన్నా దాని ఫిట్టింగ్ కీలకంగా మారింది. మీరు ఒకవేళ శరీరాన్ని పట్టి ఉండే బట్టలు ధరించాలనుకుంటే తెలుపు రంగు మేలు.

కొన్ని రకాల బట్టలతో పాటు క్రీడాకారులు ఎక్కువగా వాడే పోలో టీ షర్టులు శరీరానికి పట్టి ఉండకుండా సులభంగా పైకి తీసేయగలరు. కొన్ని రకాల బట్టలు బాగా పట్టి ఉండి తీసేటపుడు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

డ్రెస్

ఫొటో సోర్స్, Getty Images

బట్ట రకం ముఖ్యం

మీరు ఏ రకం వస్త్రం వాడుతున్నారనేదే కీలకమని స్టైలిస్ట్, ఫ్యాషన్ రైటర్ హీథర్ న్యూబెర్జర్ చెబుతున్నారు. గాజ్, షిఫాన్ రకం బట్టలు వేసుకున్న వారితో పోల్చి చూస్తే పెద్ద సైజు డెనిమ్ జంప్‌సూట్ వేసుకున్నపుడు ఎక్కువ వేడిగా అనిపిస్తుందన్నారు.

ఇక ఫిట్టింగ్ విషయానికొస్తే, తక్కువ బరువుండే కాటన్, సిల్క్ బట్టలు, అల్లికలతో తయారైన బట్టల కంటే కాస్త లూజుగా అనిపిస్తాయి.

వాతావరణం తేమగానూ, పొడిగానూ ఉన్నపుడు, శరీరం నుంచి విడుదలయ్యే చెమట వెంటనే గాలిలోకి ఆవిరైపోవాలి. అయితే, అధిక చెమటతో నానిపోయిన బట్టలోంచి తడి ఎటూ వెళ్లడానికి వీలుండదు.

‘’ఎప్పుడైనా సరే నీటి ఆవిర్లు బట్టలోంచి వాతావరణంలోకి వెళ్లిపోయేందుకు సహకరించే దుస్తుల రకాలు వేసుకోవడం మంచిది. అప్పుడే చెమట తేలికగా ఆవిరైపోతుంది’’ అని సౌత్ ఈస్ట్రన్ లూసియానా యూనివర్శిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ ర్రెట్ అల్లేన్ చెబుతున్నారు.

చెమటను వదిలించుకునే బట్టలు కొత్తగా వస్తున్న క్రీడాకారులు ఎక్కువగా వాడుతున్నారు. కానీ కాటన్ దుస్తులు ఈ పనిని అంత బాగా చేయలేకపోతున్నాయి.

అలానే శరీరం నుంచి విడుదలయ్యే ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్‌‌ను కొంత స్థాయి వరకూ బట్టలు పట్టి ఉంచుతాయి. దీని వల్ల చలి వాతావరణంలో శరీరం వెచ్చగా ఉంటుంది. అయితే ఇది వేడి వాతావరణంలో అనుకూలమైన వస్త్రధారణ కాదు. కాబట్టి ఊపిరి సలపనిచ్చే బట్టలు వేసుకోవడమే మంచిది.

కోటింగ్ లేని కాటన్, లైనెన్, నైలాన్, పాలిస్టర్ – ఇవన్నీ కూడా గాలి మంచిగా ఆడే బట్టల రకాలు. అంటే దానర్థం ఈ బట్టలు వేసుకున్నపుడు చెమట, వేడి అనేవి ఈ బట్టలోంచి తేలికగా వెళ్లిపోతాయి. చెమటను పీల్చుకునే బట్టతో పోల్చితే ఇవి కొంచెం భిన్నంగా ఉంటాయి.

కాటన్, పాలిస్టర్‌ బట్టలు ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్‌ను దాదాపు 99 శాతం పీల్చేసుకుంటాయి. అలానే ఈ బట్టల్లోంచి కంటికి కనిపించే కాంతి 30 నుంచి 40 శాతం వెళ్లిపోతుంది. ఈ కాంబినేషన్ కారణంగా శరీర ఉష్ణోగ్రత వేగంగా పెరిగి, వెచ్చగా మారుతుందని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు చెబుతున్నారు.

దుస్తులు

ఫొటో సోర్స్, Getty Images

కాటన్, నైలాన్, మెరినో వూల్ బట్టలు

ఇక శరీరాన్ని చల్లబరచడంలో చెమట కీలక పాత్ర పోషిస్తుంది. కాటన్ తేమను పీల్చుకుంటుంది. కానీ ఆ కాటన్‌లోని తడి త్వరగా పోదు.

కాబట్టి శరీరంలోంచి చెమట ఎక్కువగా బయటికొచ్చినపుడు కాటన్ బట్టలు తడిగా మారిపోతాయి. అప్పుడు అవి సౌకర్యంగా ఉండవు.

మరోవైపు లైనెన్ బట్టల్లో పెద్దగా ఉండే ఫైబర్ల కారణంగా గాలి మంచిగా వీస్తుంది కానీ కాటన్ మాదిరే బట్టకు పట్టిన తడి త్వరగా పోదు.

ఇక మరో రకం మెరినో వూల్ బట్టలు. ఎక్కువగా బయట తిరిగే వారికి ఇవి సౌకర్యంగా ఉంటాయి. గాలి మంచిగా వీస్తుంది. తేమను పీల్చుకుంటుంది. దుర్వాసన కూడా ఉండదు.

నైలాన్, పాలిస్టర్ బట్టలను ఎక్కువగా వేసుకోవడానికి కారణం అవి తేమను పీల్చుకుని త్వరగా డ్రై అయిపోతాయి. కానీ దుర్వాసన ఉంటుంది.

పాలిస్టర్‌తో పోల్చి చూసినపుడు తేమను పీల్చుకుని వాతావరణంలోకి విడుదల చేసే గుణం నైలాన్‌లో ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. కానీ త్వరగా డ్రై అవ్వదు.

నైలాన్, పాలిస్టర్ వంటి సింథటిక్ ఫైబర్లు తడిచినపుడు అసౌకర్యంగా మారతాయి. ఇక మరో అధ్యయనం వెదురుతో చేసిన బట్టలు వేడిని పెద్దగా శోషించుకోకుండా, సౌకర్యానికీ ఇబ్బంది లేకుండా ఉంటాయని సూచిస్తోంది.

మీ శరీరాన్ని నిజంగానే చల్లగా ఉంచుకోవాలంటే అవసరమైనంత సేపు బట్టలు విప్పేయాలని బ్రిటన్‌లోని లాబరో యూనివర్శిటీ ఎన్విరాన్మెంటల్ ఫిజియాలజి అండ్ ఎకనమిక్స్ ప్రొఫెసర్ జార్జ్ హేవెనిత్ చెబుతున్నారు.

శరీరం కాలిపోకుండా బట్టలు రక్షిస్తాయని, కానీ శరీరం చల్లగా ఉండాలంటే నగ్నంగా ఉండటమే మంచి మార్గమని ఆయన చెబుతున్నారు. ఎంత తక్కువ బట్టలు ధరిస్తే అంత ఎక్కువగా చెమట బిందువులు ఆవిరవుతాయని చెబుతున్నారు. కానీ యూవీ కిరణాల నుంచి శరీరాన్ని రక్షించుకోవడం అన్నిటికన్నా ముఖ్యమని కూడా అన్నారు.

కానీ కొన్ని ప్రత్యామ్నాయాలు లేకపోలేదు. శరీరాన్ని చల్లగా ఉంచేందుకు కొత్త మెటీరియల్స్‌తో తయారు చేస్తున్న ఫ్యాబ్రిక్స్ చాలానే మార్కెట్‌లోకి వస్తున్నాయి.

దుస్తులు

ఫొటో సోర్స్, Getty Images

కొత్త సైన్స్

నైకి, అడిడాస్ వంటి స్పోర్ట్స్ కంపెనీలు స్మార్ట్ ఫ్యాబ్రిక్స్ తయారీ కోసం వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నాయి. శరీరాన్ని చల్లగా ఉంచేందుకు ఎలాంటి బట్టల రకాలు మేలు చేస్తాయనే పరిశోధనలో శాస్త్రవేత్తలు కూడా అనేక వనరులను వినియోగిస్తున్నారు.

అలానే బయట వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఫ్యాబ్రిక్ నిర్మాణంలో మార్పులు చేసుకునే విధంగా కోటింగ్ వేసిన సింథటిక్ ఫైబర్లను కూడా అమెరికాలోని మేరీలాండ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అభివృద్ది చేశారు.

మరో శాస్త్రవేత్తల బృందం కొన్ని స్ట్రిప్స్‌తో కుట్టిన బట్టలపైన ప్రయోగాలు చేశారు. అవి చదునుగా మారి వంగే గుణం కారణంగా శరీర ఉష్ణోగ్రతను రెండు డిగ్రీల సెల్సియస్ వరకూ తగ్గిస్తుంది.

వాతావరణం వేడిగా ఉన్నపుడు బట్టల్లోని స్ట్రిప్స్ గాలి దిశలో కాస్త వొంగి, శరీరంలోంచి వచ్చే వేడిని బయటకు వెళ్లిపోయేలా చేస్తాయి.

కాబట్టి మొత్తంగా శరీరాన్ని చల్లగా ఉంచే బట్టలు వేసుకోవడమంటే అంత తేలికైన విషయం కాదు. తెల్లటి టీ షర్టు వేసుకున్నంత మాత్రన ఏమీ అయిపోదు.

సరైన ఫ్యాబ్రిక్, సరైన ఫిట్టింగ్, అప్పుడపుడూ తచ్చాడే నీటి తాకిడితో శరీర ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంటుంది. అలా గదిలో ఏసీ వినియోగాన్ని కూడా తగ్గించవచ్చు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ ‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.)