మహిళలు వాడే ఈ హ్యాండ్ బ్యాగుల ధర కోటి రూపాయలపైనే... వాటికి ఎందుకంత ఖరీదు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నజీష్ జాఫర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎక్కడి నుంచో ఒక కోటి రూపాయలు మీ చేతికి వస్తే ఏం చేస్తారు? ప్లాట్ కొంటామని ఒకరు, ఇల్లు కట్టుకుంటామని ఇంకొందరు, ఏదైనా బిజినెస్‌లో పెట్టుబడి పెడతామని మరికొందరు ఇలా రకరకాల సమాధానాలు చెబుతారు.
అయితే, అంత డబ్బుతో హ్యాండ్‌బ్యాగ్ కొనాలనుకునే ఒక ప్రత్యేక వర్గం ఉంది. వాళ్లు తమ దగ్గర ఉన్న డబ్బుతో హ్యాండ్ బ్యాగులు, అదీ ఖరీదైన బ్యాగులు కొనడానికి ప్రయత్నిస్తుంటారు.
ఒక హ్యాండ్ బ్యాగ్ కొనడానికి కోటి రూపాయలు ఖర్చుపెడతారని తెలిస్తే నాలాగే మీరు కూడా షాక్‌కు గురవుతారు. కానీ, ఇది నిజమే.
హెర్మ్స్, చానెల్, ఫెండి, లూయిస్ విటాన్, మార్క్ జాకబ్స్ ఫ్యాషన్ బ్రాండ్‌ల పేర్లు ఇప్పుడు పాకిస్తానీ సోషల్ మీడియాలో చాలామంది మహిళల ఫొటోలతో చక్కర్లు కొడుతున్నాయి.
ఒక మహిళకు రాజకీయ నాయకుడితో ప్రత్యక్షంగానో, దూరపు సంబంధమో ఉంటే, ఆ వ్యక్తి ఉపయోగించే వస్తువుల ధరలపై ప్రజలకు సహజంగానే ఆసక్తి పెరుగుతుంది.
ఇమ్రాన్ ఖాన్ భార్యకు సన్నిహితురాలిగా భావించే ఫరా ఖాన్ అనే మహిళ ఫొటో ఒకటి ఇటీవల వైరల్ అయ్యింది.
దేశంలో రాజకీయ గందరగోళం ఉన్న సమయంలో ఆమె దుబాయ్‌కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఆమె విమానంలో కూర్చున్న ఫొటో ఒకటి వైరల్ అయ్యింది. అయితే, చాలామంది ఆమె బ్యాగునే చూశారు.
ఆ పర్పుల్ కలర్ లెదర్ బ్యాగ్ ధర పాకిస్తాన్ రూపాయల్లో రూ. కోటికి పైగా పలుకుతోంది.

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
ఈ బ్యాగులు నిజంగా ఖరీదైనవేనా?
ఫ్యాషన్ డిజైనర్, విమర్శకుడు మొహ్సిన్ సయీద్‌తో ఈ విషయంపై మాట్లాడాను. ఈ వాదనను ఆయన ధృవీకరించారు. హెర్మ్స్ బెర్కిన్, ఇంకా అలాంటి అనేక ఇతర బ్రాండ్‌లు తయారు చేసే ఈ ప్రత్యేక బ్యాగ్‌ల ధర ఎందుకు ఎక్కువ? అని సయీద్‌ను అడిగినప్పుడు ఆయన ఇలా సమాధానం చెప్పారు.
''మీరు లగ్జరీ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఇది మామూలు బ్రాండ్‌లాగా ఉండదు. బ్రాండింగ్, మార్కెటింగ్, అమ్మకాలలో వారికి సొంత స్టైల్ ఉంటుంది'' అన్నారు.
ఈ బ్రాండ్లు దశాబ్దాలుగా తమకంటూ ఒక పేరు తెచ్చుకున్నాయి. వీటిలో కొన్నింటికి 150 ఏళ్ల చరిత్ర కూడా ఉంది. వీటి డిజైన్లు హోల్‌సేల్ మార్కెట్ కోసం తయారు చేసినట్లుగా ఫ్యాక్టరీలో తయారు కావు. కస్టమైజ్ చేసిన ఆర్డర్ ప్రకారం చేతితో తయారు చేస్తారు.
అంటే, ఇక్కడ వారి ఐడియాకు కోట్ల విలువ ఉంటుంది. ఇది డిజైనర్ల ఆస్తి.
అలాంటి లగ్జరీ కంపెనీల వెబ్‌సైట్ లేదా అవుట్‌లెట్‌లకు వెళ్లి, ప్రైస్ ట్యాగ్‌ను చూస్తే చాలామంది కొనగలిగేలా ఉండదు. పైగా వీటిలో వాడే మెటీరియల్ నాణ్యమైంది. ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇంకా అద్భుతంగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ బ్యాగులు నిజంగా మొసలి చర్మంతో చేసినవేనా?
''హెర్మ్స్ బెర్కిన్ బ్రాండ్ బ్యాగ్‌లు మొసలి చర్మంతో తయారు చేస్తారు. మరికొన్నింటిని ఆస్ట్రిచ్ పక్షి చర్మంతో రూపొందిస్తారు'' అని మొహ్సిన్ సయీద్ వెల్లడించారు.
''కొన్ని అరుదైన జంతువులు అంతరించిపోకుండా కాపాడుకోవాలి. వాటి చర్మాన్ని చాలా ఖరీదైన విధానంలో ప్రాసెస్ చేస్తారు. మొసళ్లలాంటి జంతువుల చర్మాలకు మామూలుగా మార్కెట్‌కు వెళ్లి రంగులు వేయించుకుని రావడం కుదరదు. అందువల్ల వాటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది'' అని సయీద్ వివరించారు.
డబ్బులుంటే ఈ బ్యాగులను ఎవరైనా కొనగలరా?
మీ జేబులో దండిగా డబ్బు ఉందనుకుందాం. లక్ష కాకపోతే పది లక్షల రూపాయలు పోసైనా ఒక బ్రాండ్ బ్యాగ్‌ను కొనాలన్న తపన మీలో ఉందనుకుందాం. సింపుల్‌గా ఆ బ్రాండ్ షాపులకు వెళ్లి, డబ్బులు ఇచ్చి బ్యాగును తీసుకుని రాగలమా? అది అన్ని సందర్భాలలో సాధ్యం కాదు.
హెర్మ్స్ వంటి బ్రాండ్ కావాలంటే మొదట మీరు కంపెనీతో చర్చలు మొదలు పెట్టాలి. సంబంధిత బ్రాండ్ రిప్రజెంటిటివ్‌తో మీ సొంత ఖర్చుతో ఏ ఖరీదైన రెస్టారెంట్‌లోనో టీ లేదా లంచ్‌కు కూర్చోవాలి. మీరు వారి పాత క్లయింట్ కాకపోతే, మీరు కోరుకున్న సరుకు కోసం చాలా నెలలు వేచి చూడాల్సి ఉంటుంది.
అమెరికాకు చెందిన సుప్రసిద్ధ టాక్ షో వ్యాఖ్యాత ఓప్రా విన్‌ఫ్రే ఖరీదైన బ్యాగుల విషయంలో తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు.
2013లో స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరంలో తనకు డిజైనర్ బ్యాగ్‌ను చూపించడానికి సేల్స్ గర్ల్ నిరాకరించిందని ఓప్రా వెల్లడించారు. తాను ఆ బ్యాగ్‌ను కొనలేనన్న ఉద్దేశంతోనే ఆమె తనకు ఆ బ్యాగ్ చూపించలేదని ఓప్రా అన్నారు. ఆ బ్యాగ్ ఖరీదు 38 వేల డాలర్లు. ( సుమారు రూ.28,91,705)
బ్యాగ్‌ను తాకనివ్వలేదని, తనపట్ల వివక్ష చూపించారని ఓప్రా అన్నారు. ఆ తర్వాత విషయం మీడియాలో రావడంతో బ్రాండ్ యజమాని తనకు క్షమాపణలు చెప్పారని ఓప్రా వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్యాగ్ ఏది?
డైమండ్ హిమాలయ బుర్కిన్ అనే బ్యాగ్‌ను అత్యంత ఖరీదైన బ్యాగ్‌గా చెబుతారు. దీని ధర $300,000(సుమారు రూ.2,28,22,350)గా చెబుతున్నారు. 2017 నాటికి ఇది అత్యంత అరుదైన బ్యాగ్ అనిపించుకోవడంతో, వేలంలో $400,000 (సుమారు రూ.3,04,29,800)కి అమ్ముడైంది.
ఒక ప్రత్యేక రకం మొసలి చర్మంతో తయారు చేసిన ఈ బ్యాగ్ తెలుపుతోపాటు, మరికొన్ని ఆకర్షణీయమైన రంగులలో తయారు చేశారు. ఇది తెల్లటి రంగులో హిమాలయాల్లో ఉండే ఒక రకం రాళ్లలాగా కనిపిస్తుంది. దీని హార్డ్‌వేర్‌లో 18 క్యారెట్ల వైట్ గోల్డ్, వజ్రాలు ఉపయోగించారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌లో అంతర్జాతీయ లగ్జరీ బ్యాగులను ఎవరు ఉపయోగిస్తున్నారు?
పాకిస్తాన్‌లో అనేక తరాలుగా ధనవంతులైన ఒక వర్గం ఉందని మొహ్సిన్ సయీద్ అన్నారు. వారి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, వారి వద్ద లక్షల విలువైన బ్యాగులు, నగలు ఉంటాయి.
''వారు తమ సంపదను ప్రదర్శించరు. బంగారు తీగ పల్లూతో కూడిన సాదా తెల్లటి చీరతో, ఇలాంటి విలువైన బ్యాగ్‌లను తీసుకు వెళుతుంటారు. కానీ, అదంతా ప్రదర్శనలాగా ఉండదు. వాళ్లు చాలా గౌరవప్రదంగా కనిపిస్తారు'' అని సయీద్ వివరించారు.
ఇక కొత్తగా సంపద పొందిన రెండో వర్గం వారు ఉన్నారని, వారు కూడా ఇలాంటి లగ్జరీ వస్తువులను కొంటుంటారని, వారిలో కొందరు చైనా కాపీ వస్తువులను కూడా కొంటుంటారని సయీద్ అన్నారు.
ఇక ఈ రెండు వర్గాలు కాక, కేవలం లగ్జరీ వస్తువులపై వ్యామోహం ఉన్న మూడో వర్గం ఉంటుంది. వారు ఈ రెండు వర్గాలను కాపీ కొట్టడం మీదే ఆసక్తి చూపిస్తుంటారని సయీద్ వెల్లడించారు.
మొహ్సిన్ సయీద్‌తో సంభాషణ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఒరిజినల్ స్కిల్స్, హ్యాండీక్రాఫ్ట్‌లనే లగ్జరీ అనుకుంటే, ఈ లగ్జరీ పాకిస్తాన్ వీధుల్లో సమృద్ధిగా ఉంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













