క్రిప్టో కరెన్సీలో సునీల్ కావూరి పెట్టిన రూ.17 కోట్లు క్షణాల్లో ఎలా మాయమయ్యాయి? అవి తిరిగి వస్తాయా?

సునీల్ కావూరి
ఫొటో క్యాప్షన్, సునీల్ కావూరి
    • రచయిత, జ్యో టైడీ
    • హోదా, సైబర్ కరస్పాండెంట్

కింగ్ ఆఫ్ క్రిప్టోగా పిలిచే సామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్ పై నమ్మకంతో FTX సంస్థలో పెట్టుబడి పెట్టి తాను రూ.17.45 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాని సునీల్ కావూరి అన్నారు.

31 ఏళ్ల సామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్ స్థాపించిన FTX సంస్థ పతనం అయింది. పెట్టుబడుల మళ్లింపు, వినియోగదారుల నిధుల దుర్వినియోగంతో కలిపి మొత్తం ఏడు అభియోగాలపై విచారణను ఎదుర్కొంటున్నారు బ్యాంక్మన్ ఫ్రీడ్.

సంస్థ దివాలా తీయడంతో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది వినియోగదారులు తమ డబ్బును పోగొట్టుకున్నారు. వారంతా తమ సొమ్మును తిరిగి తీసుకోవడం కోసం న్యాయ పోరాటానికి సిద్ధం అవుతున్నారు. అలాంటి వారిలో సునీల్ కావూరి ఒకరు.

యూకేలోని డెర్మీస్షైర్‌లో నివసించే సునీల్ కావూరి తన జీవితకాల సంపాదన రూ. 17.44 కోట్లు సంస్థలో పెట్టాడు. గతేడాది నవంబర్ నుంచి సంస్థ ఆర్థికంగా దివాలా తీసిందన్న వార్తలు వినిపించాయి.

అయితే సంస్థ పూర్తిగా దివాలా తీసే క్షణం ముందు వరకు కూడా సామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్ ఆ పరిస్థితిని మొత్తం చక్కదిద్దుతాడనే సునీల్ కూడా నమ్మారు. కానీ పరిస్థితి మారిపోయింది.

స్వతహాగా ఇన్వెస్టర్, ట్రేడర్ అయిన సునీల్ కావూరి FTX పతనం వలన తాను ఎంత బాధపడుతన్నదీ వివరించారు.

తన అకౌంట్లో ఉన్న డబ్బును విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తే విత్ డ్రా సేవలు సస్పెండ్ అయినట్లు స్క్రీన్ పై కనిపించిన మెసేజ్‌ను చూసి తాను షాకయ్యానని అన్నారు.

“24 గంటలూ కంప్యూటర్ దగ్గరే కూర్చుని ఆ వెబ్ పేజీని రిఫ్రెష్ చేస్తూ, నా డబ్బును విత్ డ్రా చేయడానికి ప్రయత్నించాను. అదేపనిగా FTX సిబ్బందికి ఈమెయిల్స్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ ఫలితం లేదు. నా సేవింగ్స్ మొత్తం కోల్పోయానని నాకు అర్థమైంది. చాలా బాధపడ్డాను.” అన్నారు.

సామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్
ఫొటో క్యాప్షన్, FTX సంస్థ ఫౌండర్ బ్యాంక్మన్ఫ్రీడ్

వంద దేశాల్లో 90 లక్షల మంది కస్టమర్లు

కస్టమర్లు డిజిటల్ వాలెట్స్ రూపంలో దాచుకునే సదుపాయం కల్పించింది FTX క్రిప్టో కరెన్సీ స్టాక్ ఎక్స్చేంజ్. క్రిప్టో సంబంధిత సేవలు సురక్షితంగా అందించే క్రిప్టో ఎక్స్చేంజ్ సంస్థగా ప్రచారం చేసుకుంది.

అనధికారిక బ్యాంక్‌లా మారి క్రిప్టో కాయిన్స్ ట్రేడ్ చేసేందుకు వీలు కల్పించింది. అంతే కాకుండా బిట్ కాయిన్ల రూపంలో డబ్బు దాచుకునేందుకు వీలుగా డిజిటల్ వాలెట్ సేవలు కూడా అందించింది.

దీనికి 100 దేశాలకు చెందిన 90 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. సంస్థ పతనం కావడంతో లక్షల మంది తమ డబ్బుని కోల్పోయారు. వాలెట్లలో ఉన్న డబ్బును విత్ డ్రా చేసుకునే వీలు లేకుండా పోయింది. ఇలా ఎక్కువ మొత్తంలో నష్టపోయిన వారిలో సునీల్ ఒకరు.

సునీల్ కావూరి
ఫొటో క్యాప్షన్, సునీల్ కావూరి

న్యాయ పోరాటం...

కొన్ని సంవత్సరాలుగా తాను దాచుకున్న డబ్బంతా ఇందులోనే పెట్టినట్లు సునీల్ తెలిపారు.

నష్టపోయిన బాధితులందరినీ కలుపుకుని తమకు రావలసిన డబ్బు కోసం సంస్థపై న్యాయపరంగా పోరాటానికి దిగారు సునీల్.

అమెరికా, కెనడా, అర్జెంటినా, దుబాయ్, తుర్కియే, హాంకాంగ్, చైనా, సింగపూర్ దేశాల్లోని బాధితులకు న్యాయపరమైన పోరాటానికి కావల్సిన సహాయం అందిస్తున్నారు. వారంతా సునీల్‌ను ‘FTX క్రెడిటార్ చాంపియన్’గా పిలుచుకుంటున్నారు.

ఆయన మాట్లాడుతూ, “చాలామంది కొన్ని వేలరూపాయలు నష్టపోతే, మరికొంత మంది లక్షలు, నాలాంటి వారు కోట్ల రూపాయలు నష్టపోయారు. తుర్కియేకి చెందిన వ్యక్తి అంతా కోల్పోయి, కేవలం 50 వేల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్‌తో మిగిలారు. కొరియాలో మరొక వ్యక్తి విపరీతమైన ఆందోళనతో ఆసుపత్రిలో చేరారు” అంటూ డబ్బులు కోల్పోయిన వారి పరిస్థితిని వివరించారు.

గతేడాది నవంబరులో న్యూస్ సైట్ ‘కాయిన్ డెస్క్’ FTX సంస్థతోపాటు, అనుబంధ సంస్థ అయిన అలమెడా రీసెర్చ్ ఆర్థిక పరిస్థితిపై జరిపిన దర్యాప్తుకు సంబంధించిన వివరాలు బయటపెట్టడంతో సంస్థ పతనం మొదలైంది.

కథనాలతో ఆందోళన చెందిన వినియోగదారులు ఒక్కసారిగా తమ డబ్బును విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నించడం, నిధుల లేమితో సంస్థ దివాలా తీసింది.

సామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్ పై మనీ లాండరింగ్, కుట్ర, మోసం వంటి ఏడు అభియోగాలను మోపారు.

అయితే తాను ఏ తప్పూ చేయలేదని, న్యాయపరంగా పోరాటం చేస్తానని సామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్ అన్నారు.

అయితే సంస్థకు చెందిన మిగిలిన ఎగ్జిక్యూటివ్‌లు సంస్థలో తప్పు జరిగిందని, తమ సంస్థ 40 బిలియన్ డాలర్ల నుంచి దివాలా స్థితికి ఎలా చేరిందో తెలిపే అధారాలు ఇస్తామని ఇప్పటికే అంగీకరించారు.

సామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్ తల్లిదండ్రులు

ఫొటో సోర్స్, Getty images

ఫొటో క్యాప్షన్, సామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్ తల్లిదండ్రులు బార్బరా ఫ్రీడ్, జోసెఫ్ బ్యాంక్మన్

సామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్ వాదన..

FTX సంస్థలోని వినియోగదారులు, ఇన్వెస్టర్లను మోసం చేసి, ఆ నిధులను సామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్ సొంతానికి వినియోగించుకున్నారనేది ప్రధానమైన ఆరోపణ.

ఆ డబ్బులతో విలాసవంతమైన భవనాలు, రాజకీయ విరాళాలకు భారీగా నిధులు వెచ్చించారని విమర్శలు ఉన్నాయి.

అయితే తనపై వచ్చిన ఆరోపణలకు బ్యాంక్మన్ ఫ్రీడ్ గతంలో వివరణ ఇచ్చారు. “నేను ఏ నిధులు దొంగిలించలేదు. వేలకోట్లు దోచుకోలేదు” అని స్పందించారు.

తన అరెస్టుకు ముందు బహమస్‌లో బీబీసీతో సహా మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో బ్యాంక్మన్ ఫ్రీడ్ తాను తీసుకున్న ఆర్థికపరమైన తప్పుడు నిర్ణయాలకు క్షమాపణలు తెలిపారు. అవేవీ తాను ఉద్దేశపూర్వకంగా గానీ, నేరపూరితంగా గానీ చేసింది కాదని అన్నారు.

ఇటీవలే బ్యాంక్మన్ ఫ్రీడ్ తల్లిదండ్రులపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. బ్యాంక్మన్ ఫ్రీడ్ నిబంధనలకు విరుద్ధంగా వారికి నగదు ఇచ్చారని, విలాసవంతమైన ఆస్తులను వారి పేరిట కొన్నారని ఆరోపణలు వచ్చాయి.

కమెడీయన్ ల్యారీ డేవిడ్
ఫొటో క్యాప్షన్, కమెడీయన్ ల్యారీ డేవిడ్

ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా బాధ్యులే....

బ్యాంక్మన్ ఫ్రీడ్ చాలామంది జీవితాలను నాశనం చేశారని సునీల్ అన్నారు. తక్కువ కాలంలో బ్యాంక్మన్ ఫ్రీడ్ ఇంత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సహకరించిన వారందరినీ విమర్శించారు.

FTX సంస్థ చాలా నమ్మకమైనదిగా ఇన్‌ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ప్రచారం చేశారని అన్నారు.

2022లో బ్యాంక్మన్ ఫ్రీడ్ FTX సంస్థ అడ్వర్టయిజ్‌మెంట్లతో అందరి దృష్టిని ఆకర్షించడమే కాక, వేగంగా వృద్ధి చెందింది.

ప్రముఖ కమెడీయన్ ల్యారీ డేవిడ్ FTX సంస్థలో పెట్టుబడులు పెట్టాలని, ‘డోన్ట్ మిస్ అవుట్’ అన్న నినాదంతో ప్రచార చిత్రంలో కనిపించారు.

FTX సంస్థను ప్రమోట్ చేసిన క్రిప్టో ఇన్‌ఫ్లుయెన్సర్లు, సెలబ్రెటీలపై కూడా సునీల్ కోర్టుకెక్కారు. ప్రముఖ వెంచర్ కాపిటల్ సంస్థలు FTX సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టడంతో తనకు కూడా నమ్మకం కుదిరిందని అన్నారు.

ప్రముఖ సంస్థ ‘సీక్వోయా క్యాపిటల్' 213 మిలియన్ డాలర్లు FTXలో పెట్టుబడి పెట్టి, నష్టపోయింది. ప్రస్తుతం సునీల్ తనలాంటి బాధితులను కలుపుకుని న్యాయపరంగా పోరాటం చేస్తున్నారు.

ఇటీవలే సునీల్ భార్య రెండవ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ కొత్త బాధ్యతను స్వీకరించిన సునీల్ తన డబ్బును తిరిగి రాబట్టుకునేందుకు మరింత పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు.

అయితే బ్యాంక్మన్ ఫ్రీడ్ లాయర్లు మాత్రం వినియోగదారులకు డబ్బు తిరిగి ఇచ్చే విషయమై స్పష్టతనివ్వలేదు.

వీడియో క్యాప్షన్, క్రిప్టో కరెన్సీ ఎలా పనిచేస్తుంది? నగదు, క్రిప్టో కరెన్సీ చెల్లింపులకు మధ్య తేడా ఏంటి?

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)