రైలు ప్రమాదాలు: బాధితులకు పరిహారాన్ని 10 రెట్లు పెంచిన రైల్వే బోర్డు.. నిబంధనలు ఇవీ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
రైలు ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పది రెట్లు పెంచుతూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు సెప్టెంబర్ 18వ తేదీనే రైల్వే బోర్డు ఓ సర్క్యులర్ ఇచ్చినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.
ఆ రోజు నుంచే పెంచిన పరిహారం అమల్లోకి వస్తుందని తెలిపింది.
రైల్వే బోర్డు ఇంతకుముందు చివరిసారిగా 2012-13 సంవత్సరంలో రైలు ప్రమాద బాధితులకు ఇచ్చే పరిహారాన్ని పెంచింది. మళ్లీ పదేళ్ల తర్వాత ఇప్పుడు దీనిని పెంచింది.

ఫొటో సోర్స్, ANI
బాలాసోర్ ప్రమాద ఘటన తర్వాత..
ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జూన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం తర్వాత రైల్వే శాఖ ఇచ్చే పరిహారం విషయంలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది.
రైల్వే శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తూ- ప్రమాదంలో చనిపోయిన ప్రయాణికులకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేలు ఇచ్చినట్లు తెలిపింది.
దీంతో రైల్వే శాఖ ఇచ్చే పరిహారాన్ని సవరించాలనే డిమాండ్ వినిపించింది.
తాజాగా రైల్వే బోర్డు పరిహారం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/SCR
పరిహారం చెల్లింపు ఎలా ఉంటుంది?
కాపలాదారు ఉన్న (మ్యాన్డ్) లెవల్ క్రాసింగ్ వద్ద జరిగే ప్రమాదాలతోపాటు రైలు ప్రమాదాల్లో(1989 రైల్వే చట్టం సెక్షన్ 124 ప్రకారం) వ్యక్తులు ప్రాణాలు కోల్పోతే రైల్వే బోర్డు ఇప్పటివరకు రూ.50 వేల పరిహారం అందిస్తూ వస్తోంది. దీన్ని రూ.5 లక్షలకు పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
రైలు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడితే గతంలో రూ.25,000 ఇచ్చేవారు. ఇప్పుడది రూ.2.5 లక్షలకు పెంచారు.
స్వల్ప గాయాలైతే రూ.5 వేలు ఇస్తుండగా, రూ.50 వేలకు పెంచారు.
అనుకోకుండా జరిగే ప్రమాదాలకూ పరిహారం ఇవ్వనున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది.
‘‘ఉగ్రదాడుల్లో బాధితులకు రూ.1.50 లక్షలు, హింసాత్మక ఘటనలకు గురైతే రూ.50 వేలు, దోపిడీకి గురైతే రూ.5 వేలు చొప్పున అందిస్తాం’’ అని నోటిఫికేషన్లో రైల్వే శాఖ పేర్కొంది.
‘‘ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవసరంగా రూ.50 వేలు అందిస్తారు. మిగిలిన మొత్తాన్ని చెక్ లేదా ఆర్టీజీఎస్, నెఫ్ట్ లేదా ఇతర ఆన్‌లైన్ పద్దతుల్లో అందిస్తాం’’ అని రైల్వే శాఖ ఉత్తర్వుల్లో ప్రకటించింది.
ఆసుపత్రిలో ఎప్పటివరకు చెల్లిస్తారు?
రైలు ప్రమాదాల్లో గాయపడి 30 రోజులకు మించి ఆసుపత్రిలో ఉంటే రోజుకు రూ.3 వేల చొప్పున పరిహారం అందిస్తారు. దీన్ని ప్రతి పది రోజులకోసారి లేదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలో అందిస్తారు.
అనుకోకుండా జరిగే ప్రమాదాల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే ఆరు నెలల కాలానికి రోజుకు రూ.1,500 చొప్పున అందిస్తారు. దీన్ని పది రోజులకోసారి లేదా డిశ్చార్జి సమయంలో ఇస్తారు.
ఆరు నెలల తర్వాత కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంటే, మళ్లీ గరిష్ఠంగా ఐదు నెలల కాలానికి రోజుకు రూ.750 చొప్పున అందిస్తామని రైల్వే శాఖ ప్రకటించింది.
ఆయా ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వ్యక్తులకు గరిష్ఠంగా 12 నెలల కాలానికి పరిహారం అందిస్తారు. గాయాల తీవ్రతను రైల్వే డాక్టర్ నిర్ధారించాల్సి ఉంటుంది.
ఎవరికి వర్తించదు?
ఎవరైనా రైల్వే నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించి, ప్రమాదానికి గురైతే పరిహారం ఇవ్వరు.
పట్టాలు దాటడం, ప్లాట్ ఫారాల మధ్య దాటుకుని వెళ్లడం తదితర విషయాల్లో ప్రమాదానికి గురైతే పరిహారం రాదని రైల్వే బోర్డు ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాపలాదారులేని (అన్-మ్యాన్డ్) క్రాసింగ్ వద్ద జరిగే ప్రమాదాలకూ పరిహారం వర్తించదు.
రైల్వేలో ఉండే ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్ (ఓహెచ్ఈ) విద్యుత్ వ్యవస్థ కారణంగా ప్రమాదానికి గురైతే పరిహారం ఇవ్వరు.
రైలు ప్రమాద బాధితులు ఇన్సూరెన్స్ పొందడం ఎలా?
గత జూన్ లో ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం తర్వాత రైల్వే ప్రయాణికుల ఇన్సూరెన్స్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
ఆ సందర్భంగా, రైలు ప్రయాణంలో ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎలా, దాన్ని ఎలా పొందవచ్చనే అంశాలపై బీబీసీ రాసిన కథనం ఇక్కడ చదవండి: రైలు ప్రమాదాల్లో చనిపోయినా, గాయపడినా ఇన్సూరెన్స్ పొందడం ఎలా?
ఇవి కూడా చదవండి
- మహిళా రిజర్వేషన్ బిల్లు: పార్లమెంటు ఆమోదించింది... కానీ, అమలయ్యేది ఎప్పుడు?
- మహిళలు, బాలికలు దుస్తులు ‘సరిగా’ ధరించకపోతే పదేళ్ల జైలు.. వివాదాస్పద బిల్లుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం
- మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎదురయ్యే అడ్డంకులు ఇవే...
- కాంగ్రెస్ 6 గ్యారెంటీలు: కర్ణాటక ఫార్ములా తెలంగాణలో నడుస్తుందా?
- హైదరాబాద్ సంస్థానం భారత్లో ఎలా అంతర్భాగమైంది? నిజాం ఎందుకు లొంగిపోయారు? చరిత్ర ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














