మహిళ దేహాన్ని నోట కరుచుకుని కనిపించిన 13 అడుగుల భారీ అలిగేటర్

అధికారులు పట్టుకున్న అలిగేటర్

ఫొటో సోర్స్, cbs

ఫొటో క్యాప్షన్, 13 అడుగుల భారీ అలిగేటర్
    • రచయిత, అండ్రీ రోడన్ - పాల్
    • హోదా, బీబీసీ న్యూస్

అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక మహిళ మృతదేహాన్ని నోట కరుచుకున్న స్థితిలో 13 అడుగుల భారీ అలిగేటర్ కనిపించింది.

శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో లార్గో నగరంలోని చెరువులో మహిళ మృతదేహం కనిపించినట్లు తమకు సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు.

చెరువులో ఉన్న అలిగేటర్ ను గుర్తించి, చంపినట్లు, దాని నోటి నుంచి మృతదేహం అవశేషాలను సేకరించినట్లు పినెల్లాస్ కౌంటీ అధికారులు తెలిపారు.

ఆ మృతదేహం 41 ఏళ్ల సబ్రినా పెచ్కందిగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు

అదే ప్రాంతానికి చెందిన జమార్కస్ బుల్లార్డ్ తన జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళ్తున్న సమయంలో అలిగేటర్ ను చూసినట్లు తెలిపారు. ఆ సమయంలో అలిగేటర్ నోటిలో ఉన్న శరీరాన్ని చూసి మొదట మనిషి బొమ్మ అనుకున్నాని తెలిపారు.

“ఆ అలిగేటర్ నోట్లో ఉన్నది బొమ్మ అనే అనుకున్నాను. కానీ అది మొండెం అని అర్థం అవగానే, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చాను” అని ఫాక్స్ 13 న్యూస్ మీడియాతో చెప్పారు.

“నా జీవితంలో అదే మొదటిసారి అలిగేటర్‌ను చూడటం. తెలుపు రంగులో పాలిపోయి ఉన్న మొండాన్ని అది నోట కరుచుకుని మళ్లీ నీటి లోపలికి వెళ్లిపోయింది. నేను చూసింది నిజమేనా అనే సందేహం కలిగింది” అని 10 టంపా బే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

సబ్రినా పెచ్కం ఆ చెరువుకు దగ్గరిలోని నిరాశ్రయులు ఉండే క్యాంప్ సైట్‌లో నివసించే వారు. ఆమె కుటుంబం ఆర్థిక సహాయం కోరుతూ ఫండ్ రైజింగ్ మొదలుపెట్టారు.

లార్గోలోని చెరువు

ఫొటో సోర్స్, Google

ఫొటో క్యాప్షన్, అలిగేటర్ ను పట్టుకున్న ప్రాంతం

సబ్రినా పెచ్కం కూతురిగా పేర్కొంటున్న బ్రూనా డోరిస్, జరిగిన ఘటన గురించి ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు.

“మా అమ్మ రాత్రి సమయంలో క్యాంప్ సైట్ కు వెళ్తున్నప్పుడో, వస్తున్నప్పుడో ఆ అలిగేటర్ నీటిలో నుంచి వచ్చి దాడి చేసి ఉంటుంది. ఇది దారుణమైన ఘటన. ఎవరికీ ఇలాంటి చావు రాకూడదు” అని ఆమె రాసుకొచ్చారు.

అధికారులు ఆపరేషన్ నిర్వహించి చెరువులోని అలిగేటర్ ను చంపి, బయటకు తీశారు. దాని నోటి నుంచి మహిళ మృతదేహ అవశేషాలను సేకరించారు.

అధికారులు, మీడియా సిబ్బంది మధ్యన రోడ్డు పక్కన భారీ అలిగేటర్ పడి ఉన్న దృశ్యాలు న్యూస్ ఫుటేజీలో కనిపించాయి..

వైద్యులు సబ్రినా పెచ్కం మరణం వెనక ఉన్న కారణాన్ని తెలుసుకునే పనిలో ఉన్నారు.

చెరువులో చిన్న చిన్న మొసళ్లను చూశామని, కానీ అంతభారీ అలిగేటర్ చూడటం ఇదే తొలిసారి అని ఆ ప్రాంతంలో నివసించేవారు చెప్పారు.

10 టంపా బే న్యూస్ మీడియాతో అదే ప్రాంతంలో నివసించే జెన్నిఫర్ డీన్ మాట్లాడారు.

“ఇది చాలా భయానక ఘటన. నా పిల్లలు ఈ చెరువు మీదుగానే రాకపోకలు సాగిస్తుంటారు. నేను ఇదివరకు నాలుగైదు మొసళ్లను చూశాను కానీ ఇంత పెద్ద అలిగేటర్‌ను మాత్రం చూడలేదు” అన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్లోరిడాలో 85 ఏళ్ల మహిళ 10 అడుగుల భారీ అలిగేటర్ చేతిలో ప్రాణాలు కోల్పోయారు.

తన పెంపుడు కుక్కపై అలిగేటర్ దాడికి ప్రయత్నించిన సమయంలో కుక్కను కాపాడటానికి వెళ్లి ఆమె ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)