తల్లి 27 ఏళ్లు దాచిన రహస్యం డీఎన్ఏ పరీక్షతో బయటపడింది, అప్పుడు ఏమైంది?

ఫొటో సోర్స్, BBC/NINE LIVES MEDIA
- రచయిత, షో లీ
- హోదా, బీబీసీ త్రీ
ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ శివారు ప్రాంతంలోని చిన్న పట్టణం రోచ్‌డేల్‌లో పెరిగిన లూక్ డేవిస్ తనను ఎప్పుడూ విభిన్నంగా భావించేవారు.
''నేను గే అని నాకు అర్థమవడం మొదలైన తర్వాత దాని వల్లే ఈ సమస్య అనుకున్నా'' అని ఆయన అన్నారు.
అయితే, 18 ఏళ్ల వయసులో తన తల్లిదండ్రులు లిజ్, గ్యారీ వద్దకు వచ్చేసిన తర్వాత ఎప్పటిలాగే భిన్నంగా ఉన్నానని అనిపించడంతో, లూక్ తనను తాను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టారు.
అలాగే, తన శరీరాకృతి గురించి కూడా చాలా మంది చెబుతుండేవారు.
ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు అక్కడి మేనేజర్ వర్కింగ్ క్లాస్, గే, మిక్స్‌డ్ రేస్ వంటి వారిని తాను గతంలో కలిసినట్లు లూక్‌తో అన్నారు.
లూక్ ఇద్దరు తెల్లజాతి బ్రిటిష్ తల్లిదండ్రుల వద్ద పెరిగారు. కానీ జరుగుతున్నవి చూసి ఆయనలో గందరగోళం మొదలైంది.
చివరికి, తన శరీరాకృతి గురించి తెలుసుకునేందుకు డీఎన్ఏ టెస్ట్ సాయపడుతుందని భావించారు. 2019 జనవరిలో లూక్ డీఎన్ఏ టెస్టు చేయించుకోవడంతో ''రెప్పపాటులో ఆయన జీవితం మారిపోయింది.''
ఆ తర్వాత మూడేళ్లలో తన గురించి, తన కుటుంబం గురించి తెలిసిన ప్రతీదీ మారిపోయింది. ఇప్పుడు ఆయన బీబీసీ త్రీ 'స్ట్రేంజర్ ఇన్ మై లైఫ్'లో తన ప్రయాణాన్ని వివరించారు.

ఫొటో సోర్స్, BBC/NINE LIVES MEDIA
నిద్రలేని రాత్రులు
డీఎన్‌ఏ టెస్టు చేయించుకోవడం ఇప్పుడు చాలా సులభమని యాన్సెస్ట్రీ యూకేలో జెనెటిక్ జియాలజిస్ట్ లారా హౌస్ చెప్పారు. ఒక ట్యూబ్‌లో ఉమ్మివేసి దానిని పంపిస్తే, ఫలితాలు ఆన్‌లైన్‌లో వచ్చేస్తాయని ఆమె అన్నారు.
ఈ డీఎన్‌ఏ టెస్టు రెండు రకాల ఫలితాలు ఇస్తుందని లారా చెప్పారు. ఒకటి జాతికి సంబంధించినది. అంటే, ఒకే తరహా డీఎన్‌ఏ కలిగిన జనాభాతో పోలికను తెలియజేస్తుంది. అలాగే, డేటాబేస్‌లో ఉన్న ఇతర వ్యక్తుల డీఎన్‌ఏలతో సారూప్యాలను విశ్లేషిస్తుంది.
ఫలితాల కోసం ఎదురుచూస్తూ నిద్రలేని రాత్రులు గడిపానని లూక్ చెప్పారు. కానీ, ఆ తర్వాత వచ్చే మార్పులకు ఆయన సిద్ధం కాలేదు.
27 ఏళ్ల వయసున్న లూక్‌కి తాను మిక్స్‌డ్ రేస్ (మిశ్రమ జాతి) అని తెలిసింది. తన అసలు తండ్రి ఆఫ్రికన్ అండ్ పోర్చుగీస్ జాతికి చెందినవారని డీఎన్‌ఏ టెస్టులో తేలింది.
అంటే, తాను ఇప్పటి వరకూ నాన్న అని పిలిచిన గ్యారీ, తన అసలు తండ్రి కాదని నిర్ధరణ అయింది.
''డీఎన్ఏ టెస్టు ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి'' అని లూక్ చెప్పారు.
ఆ తర్వాత కొద్దిరోజులకు లూక్ ఈ విషయం గురించి తన తల్లి లిజ్‌తో మాట్లాడారు. కన్నీళ్లతో ఆ సంభాషణ జరిగిందని ఆయన గుర్తు చేసుకున్నారు.
గ్యారీని కలిసిన కొద్ది వారాల తర్వాత స్నేహితులతో కలిసి విహారయాత్ర కోసం పోర్చుగల్‌కు వెళ్లామని, అక్కడ బార్‌టెండర్ కార్లోస్‌తో శారీరక సంబంధం ఏర్పడినట్లు ఆయన తల్లి చెప్పారు.
ఆమె ఈ రహస్యాన్ని 27 ఏళ్ల పాటు దాచిపెట్టారు.
''ఈ విషయం తెలిసిన తర్వాత చాలా విషయాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే శత్రుత్వంతో కాదు. మనమంతా మనుషులం. మనందరిలో లోపాలు ఉన్నాయి. అలాగే మనం ఏమనుకుంటున్నామో అందరితో పంచుకునే అవకాశం మనందరికీ ఉంది'' అని లూక్ అన్నారు.
అయితే, డీఎన్‌ఏ పరీక్ష ఫలితాలు లూక్‌పై పెను ప్రభావమే చూపాయి. ఆయన తన ఉద్యోగాన్ని వదిలేశారు.
''అనేక మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను'' అని లూక్ చెప్పారు.

జాత్యహంకారం
ఎందుకు తనకు తాను భిన్నంగా భావించేవాడో డీఎన్‌ఏ టెస్టు ఫలితాలతో లూక్‌కి అర్థమైంది. దానితోపాటు మరికొన్ని కొత్త ప్రశ్నలు ఎదురయ్యాయి.
''మీకు ప్రతి సంఘటన, ఇబ్బందికర సంభాషణ గుర్తుంటుంది. అది జాత్యహంకారం అని తెలియకుండా దానివల్ల బాధపడ్డాను'' అని లూక్ చెప్పారు.
చిన్నప్పుడు, ఎవరికైనా తాను రోచ్‌డేల్‌కి చెందినవాడినని చెబితే, వాళ్లు ''కాదుకాదు, మీరు ఎక్కడి నుంచి (స్వస్థలం) వచ్చారు'' అని అడిగేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.
తనకు కొత్త విషయాలు తెలిసి ఆందోళనగా ఉన్న సమయంలోనే తన అసలు తండ్రిని కలుసుకోవాలని అనుకున్నారు లూక్. అయితే, ఆయనకు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి.
తన కుటుంబం కుప్పకూలిపోతుందని ఆయన భయపడ్డారు.
తన తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత, అసలు తండ్రి కార్లోస్‌ని వెతికే పనిలో పడ్డారు. అందుకోసం లారాని సాయం కోరారు.
లారాతో కలిసి తన తాత, లేదా సమీప బంధువులతో తన డీఎన్ఏ సరిపోలుతుందేమోనని దాదాపు 2.3 కోట్ల మంది డీఎన్‌ఏ ఫలితాలున్న ఆన్‌లైన్ డేటాబేస్‌ను విశ్లేషించడం మొదలుపెట్టారు.
అందులో లభించిన సమాచారంతో వెతుక్కుంటూ లూక్ పోర్చుగల్ వెళ్లారు.
''అది చాలా ఉద్విగ్న పరిస్థితి. భావోద్వేగంతో కూడిన సమయం'' అన్నారు.
లారాకి తెలిసిన పోర్చుగీస్ జినియాలజిస్ట్‌ని ఏంజెలా కాంపొస్‌ని లూక్ కలిశారు. కార్లోస్‌ని వెతకడంలో ఆయన సాయం చేశారు.
కార్లోస్ పనిచేసిన పాత బార్‌లో ఆయన వివరాలు కనుక్కుని ఆయన్ను సంప్రదించారు. డీఎన్ఏ టెస్టు చేయించుకోవాలని ఆయన్ను అడిగారు.
ఆశర్యం ఏంటంటే, ఆయన లండన్‌లోనే ఉంటున్నారు. డీఎన్‌ఏ టెస్టు చేయించుకునేందుకు సంతోషంగా ఒప్పుకున్నారు.
లూక్ అసలు తండ్రి కార్లోస్ అని డీఎన్‌ఏ ఫలితాలతో నిర్ధరణ అయింది.
''ఆ సమయంలో నాకు రోమాలు నిక్కబొడుచుకున్న ఫీలింగ్ కలిగింది. అదొక మధురమైన జ్ఞాపకం'' అని లూక్ చెప్పారు.

ఫొటో సోర్స్, NICOLAS GUTTRIDGE
''చాలా మంది ఆలస్యం చేస్తారు''
కార్లోస్ ఉత్సాహంగా లూక్‌ను కలిశారు. తన ఇద్దరు పిల్లలను ఆయనకు పరిచయం చేశారు. వాళ్లు తనను సంతోషంగా అంగీకరించినట్టు లూక్‌కు అర్థమైంది.
''కార్లోస్‌ని, నా సోదరులను కలవడం చాలా ఆనందంగా అనిపించింది'' అని లూక్ చెప్పారు.
తన గురించి పూర్తిగా తెలుసుకునేందుకు తన అసలు తండ్రి తరఫు కుటుంబం ఉపయోగపడింది.
తన నాయనమ్మది గినియా బిస్సౌలోని పీసిక్స్ ఐలాండ్. ఆమె ఫోటో తొలిసారి చూసినప్పుడు నల్లజాతీయులతో, తనలో ఉన్న ఆఫ్రికా భావనతో కలిసినట్లు అనిపించింది.
లూక్ ఇకపై తనకు తాను కొత్తగా అనిపించరు.
''నాలో కలిగిన భిన్నమైన భావనలు నన్ను ఉత్తమంగా తయారు చేశాయి'' అని ఆయన వివరించారు.
ఆ తర్వాత తన తల్లిదండ్రులు, అసలు తండ్రి కార్లోస్‌తోనూ లూక్ మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు.
''చాలా మంది తమ అసలు కుటుంబం గురించి తెలుసుకునేందుకు ఆలస్యంగా ప్రయత్నిస్తారు. చివరికి వాళ్లని గుర్తించేప్పటికి వారు చనిపోయి ఉంటారు'' అని లారా అభిప్రాయపడ్డారు.
''ఇరవై ఏళ్ల కిందట మీ అసలు తండ్రి ఎవరని తెలుసుకునే అవకాశం ఉండేది కాదు. ఏమీ చేయలేం కూడా. అయితే, డీఎన్ఏ టెస్టులను విస్తృతంగా నిర్వహిస్తే లూక్ వంటి చాలా మందికి ఉపయోగపడుతుంది'' అని లారా చెబుతున్నారు.
దత్తత రికార్డులు అందుబాటులో లేని దేశాల్లో డీఎన్ఏ టెస్టుల ఫలితాలు తెలుసుకునే అవకాశం ఉందో లేదో తెలుసుకోవాల్సి ఉంటుందని లారా చెప్పారు.
''సొంత కుటుంబ చరిత్ర తెలుసుకునేందుకు అనుమతి ఇవ్వడం కంటే ముఖ్యమైనది ఏముంటుంది'' అని ఆమె అన్నారు.
తన అసలు తండ్రి కోసం అన్వేషణ లూక్‌కు తన గురించి తాను తెలుసుకునేలా చేసింది.
''ఈ మూడేళ్ల ప్రయాణంలో ఎన్నో భావోద్వేగాలను ఎదుర్కొన్నాను. ఈ క్రమంలో నేను ఇలాంటి జీవితం పొందినందుకు చాలా సంతోషపడ్డాను'' అని లూక్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














